Home News “గిలానీ” మనవడి వద్ద భారీ ఉగ్రవాద కుట్రకు సంబంధించిన కీలక పత్రాలు ల‌భ్యం

“గిలానీ” మనవడి వద్ద భారీ ఉగ్రవాద కుట్రకు సంబంధించిన కీలక పత్రాలు ల‌భ్యం

0
SHARE

-తాడేపల్లి అరవింద్

వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ మనవడైన అనీస్ ఉల్ ఇస్లాంను 2016లో జమ్ము కాశ్మీర్ పర్యాటక శాఖకు చెందిన షేర్- ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC) అనే సంస్థలో పరిశోధన అధికారిగా నియమించారు. ఇటీవల ఈయనను విధుల నుంచి తొలగిస్తూ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్పాటువాద భావజాలం కలిగిన ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వ విధులలోకి అప్పటి ప్రభుత్వం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2016లో ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ కి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో అనీస్ పాత్ర ఉన్నదని తేలింది. ఈ ఉద్యమం హింసకు దారితీసి సుమారు 100 మందిని బలితీసుకుంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి.

CNN News18 అనే వార్తా సంస్థ అనీస్ ఉల్ ఇస్లాంకు సంబంధించిన కీలక పత్రాలను సంపాదించింది. వారి కథనం ప్రకారం… 2016 ఉద్యమం వెనుక జమాత్-ఇ-ఇస్లామీ, అఖిలపక్ష హురియత్, కొంతమంది వేర్పాటు వాదుల హస్తం ఉంది. జమ్మూ కాశ్మీర్ ను భారతదేశం నుండి వేరు చేసి పాకిస్తాన్ లో కలపడం ఈ ఉద్యమం ఉద్దేశం. అనీస్ తండ్రి అల్తాఫ్ అహ్మద్ షా (అల్తాఫ్ ఫంతోష్), తాత సయ్యద్ అలీ షా గిలానీ ఈ వేర్పాటువాద ఉద్యమానికి ముఖ్య సూత్రధారులు. మొదటి నుంచి అనీస్, అతని కుటుంబ సభ్యులు ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యక్షంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనట్టు, పాల్గొనే వారికి సహకరించినట్టు అనేక సార్లు రుజువైంది.

గిలానీ కుటుంబం ఒక ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన కీలక పత్రాల వివరాలు

ఈ పత్రాలలో ఉన్న సమాచారం మేరకు, గిలానీ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వేర్పాటువాద, ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవారు. అనీస్ తండ్రి అల్తాఫ్ అహ్మద్ షా, ఇస్లామీజామాత్-ఇ-తుల్బ స్థాపకుల్లో ఒకరు. ఇది జమాతే ఇస్లామ్ విద్యార్థి విభాగము. దీనికి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చాడు. అతనికి జమాతే ఇస్లామ్ లో ఉన్న సంబంధాలు, పలుకుబడి కారణంగా తెహరిక్ -ఇ- హురియత్ లో కార్యవర్గ సభ్యుడయ్యాడు. ఈ హురియత్ ను నడిపించేది అతని మామ సయ్యద్ అలీ షా గిలానీ. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జరిపిన దాడుల్లో తేలడంతో అల్తాఫ్ ను తీహార్ జైలుకు తరలించారు.

జమాతే ఇస్లామ్ అనే సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ ను పోషించడమే కాకుండా, కాశ్మీర్ లోయలో ఉగ్రవాద చర్యలు కొనసాగడానికి అనేకమంది వేర్పాటువాద నాయకులను తయారు చేసింది. హిజ్బుల్ ముజాహిదీన్ ద్వారా జమాత్ వేర్పాటు వాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, హింసను ప్రోత్సహిస్తూ కశ్మీర్ ను భారతదేశం నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇటీవల లోయలో హింస పెరగడానికి కారణం The resistance front అనే సంస్థ. ఇది లష్కరే తోయిబా శాఖ. లోయలో ఉన్న ఉగ్రమూకలకు కావాల్సిన మౌలిక వస్తువులను, ఆయుధాలను సమకూర్చడానికి జమాత్ హిజ్బుల్ సహకరిస్తాయి. ఇది అక్కడి ప్రజలను బెదిరిస్తూ భయపెడుతూ స్థానికంగా బలాన్ని పెంచుకుంటున్నది.

అనీస్ తాత సయ్యద్ అలీ షా గిలానీ హురియత్ నాయకుడు, పచ్చి వేర్పాటువాది. కేవలం హింసతో మాత్రమే కశ్మీర్ విభజన సాధ్యం అని బహిరంగంగా ప్రజలకు పిలుపునిచ్చాడు. విష పూరిత ప్రసంగాలు, హింసాత్మక ఉద్యమాలు, భారత ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంవల్ల ఇతని పై వందలకొలది ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి. ఎన్నికలను బహిష్కరించాలని, కాశ్మీర్ స్వాతంత్రానికి ఉగ్రవాదమే సరైన మార్గమని అని ప్రజలను రెచ్చగొట్టే వాడు. 2019 ఆగస్టులో 370 అధికరణ రద్దు చేయడంతో పాకిస్తాన్ ఐఎస్ఐ గిలానిని పక్కన పెట్టింది. 2021 సెప్టెంబర్లో గిలానీ మరణించాడు.

ఉగ్రవాద కార్యకలాపాల్లో టర్కీ పాత్ర

గిలానీ మనుమరాలు, అనీస్ సోదరి అయిన రువా షా ఒక పాత్రికేయురాలు. అనేక అంతర్జాతీయ పత్రికలకు వ్యాసాలు, కథనాలు రాస్తుంది. సౌత్ ఆఫ్రికా కు చెందిన “సలాం మీడియా” అనే మాధ్యమంలో రువా షా షొ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది. ఈ కార్యక్రమాల ద్వారా ఆమె భారత ప్రభుత్వం పై బురద జల్లుతూ అసత్య ప్రచారం చేస్తుంది. ఈమె కశ్మీర్లో లో భారత ప్రభుత్వం రక్షణలో పుట్టి, పెరిగి తరువాత టర్కీకి తన మకాం మార్చుకుంది. అక్కడి నుంచే ఆమె దేశ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తోంది.

2015 నుంచి కాశ్మీర్ వేర్పాటువాదులకు దేశ వ్యతిరేక శక్తులకు టర్కీ ఆశ్రయం ఇవ్వడం గమనించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలంన్నింటికీ టర్కీ కేంద్ర బిందువుగా మారింది. తన తమ్ముడు కశ్మీరీ ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తూ సకల సౌకర్యాలు పొందుతున్నప్పటికీ రూవా షా తనని ఎప్పుడు బాధితురాలిగా చెప్పుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది.

నిఘా సంస్థల మౌనం?

ఇటువంటి వేర్పాటువాద భావజాలం కలిగిన కుటుంబ సభ్యులు, వారి వారసులు, అనేక హింసాత్మక ఘటనల్లో పాల్గొని పట్టుబడిన వారు, ఇంత సులువుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలా ప్రవేశించ గలరు? అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరో వీరికి సహకరించి ఉండకపోతే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదు. మరి అప్పటి నిఘా సంస్థలు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు?

ప్రభుత్వ ఉద్యోగంలో చేరకముందు అనీస్, అతని మిత్రబృందం శ్రీనగర్లో డ్రోన్లు తిప్పుతూ వేర్పాటువాదులపై భారత సైన్యం చేస్తున్న దాడులను చిత్రీకరిస్తూ వాటిని ఐ.ఎస్.ఐ కి చేరవేసేవారు. ఈ విషయాలను గమనిస్తే అనీస్, అతని కుటుంబ సభ్యులు దేశ వ్యతిరేక కార్యకలాపాలను తెరచాటుగా కొనసాగిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.

2008లో అనీస్ పాస్పోర్టు సిఫారసుకు రాష్ట్ర నిఘా సంస్థలు (CID) అనుమతించలేదు. అయినప్పటికీ వ్యవస్థలో తనకున్న సంబంధాల కారణంగా హైకోర్టు ఆదేశంతో పాస్పోర్ట్ ను సంపాదించాడు.

SKICC విధుల నుండి తొలగింపు

2016లో అనీస్, షేర్ ఇ కశ్మీరీ న్వెన్షన్ సెంటర్లో పరిశోధన అధికారిగా చేరడం అనేక అనుమానాలకు తావిచ్చింది. బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ వ్యతిరేక ఉద్యమం హింసాత్మకంగా మారడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేర్పాటు వాదులతో ఒప్పందం కుదుర్చుకుని అనీస్ కు గెజిటెడ్ స్థాయి పదవిని కట్టబెట్టింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఉద్యమంలో హింస చెలరేగడానికి ముఖ్య కారణం తహరీక్ – ఇ- హురియత్. దీని నాయకుడైన గిలానీ నే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని అనిస్ కు ఉద్యోగం ఇప్పించి ఉంటాడని పత్రాలు చెబుతున్నాయి.

అనీస్ కు వ్యతిరేకంగా లభ్యమైన కీలక ఆధారాలు గోప్యంగా ఉంచబడ్డాయి. నిజానికి అనీష్ కు ఐ.ఎస్.ఐ కు మధ్య జరిగిన లావాదేవీలను తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉంది. పాకిస్థాన్ పర్యటన పూర్తి చేసిన అనంతరం వెంటనే అనీస్ కు ప్రభుత్వ ఉద్యోగం రావడం కేవలం యాదృచ్ఛికం కాదు. 2005 నుంచి ఖాళీగా ఉన్న పదవిలో పరీక్ష నిర్వహించి, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయకుండా, పిలిచి మరీ అనీస్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ప్రణాళికాబద్ధంగా జరిగిన కుట్ర అని నిఘా సంస్థలు కనుగొన్నాయి.

ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినప్పటినుంచి పరీక్ష నియమావళి ప్రకటించే వరకు అనేక అవకతవకలు జరిగినవి. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. ఉద్యోగులను నియుక్తి చేసే సంస్థ తమ కనీస నియమాలు పాటించలేదు.

ప్రతిభను నిర్ణయించేటప్పుడు ముఖాముఖి మార్కులకు ఎంత వెయిటేజీ ఇవ్వాలి అనేదానిపై చట్టపరమైన ప్రమాణాలు ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘించడం జరిగింది. ముఖా ముఖి మార్కుల వెయిటేజీ ని చట్టవిరుద్ధంగా పెంచి 25 శాతం చేశారు. (20 శాతం ముఖాముఖి 5శాతం పర్సనాలిటీకి)

SKICCలో పరిశోధన అధికారిగా అనీస్ ను నియమించడం సున్నితమైన అంశం. ఈ సంస్థ జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం తరఫున ప్రతిష్ఠాత్మకమైన సమావేశాలను, కార్యక్రమాలను జరుపుతుంది. అయితే ఈ సమావేశాల్లో, అధ్యయన సదస్సులలో ఏ విషయాలను చర్చించారు, ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనేది కూడా సున్నితమైన అంశం. ఇటీవల భారత రాష్ట్రపతి SKICCలో జరిగిన కాశ్మీర్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

ఇటువంటి ముఖ్యమైన ప్రభుత్వ సంస్థలో ఒక పాకిస్థాన్ ఐఎస్ఐ సానుభూతిపరుడిని, దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వ్యక్తిని పరిశోధన అధికారిగా నియమించడం సమంజసమేనా?