ఆర్ఎస్ఎస్ వంటి జాతీయవాద సంస్థలపై అబద్ధపు ఆరోపణలు చేసి పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్న వారిలో మరొకరు చేరారు. ముస్లిం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు తస్లిమ్ రెహమాన్ పై మహారాష్ట్రలోని థాణెలో పరువు నష్టం కేసు దాఖలయ్యింది. ముంబైకి చెందిన వివేక్ శశికాంత్ చంపార్ నేర్కర్ అనే వ్యక్తి ఈ దావా వేశారు.
ఇటీవల ఒక జాతీయ వార్తా ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థపై అనుచితమైన, అసత్య ఆరోపణలు చేసినట్టు పిటిషనర్ పేర్కొన్నారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రెహమాన్ దేశంలో జరిగిన, జరుగుతున్న తీవ్రవాద దాడులన్నిటి వెనుక ఆర్ఎస్ఎస్ ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే తన ఆరోపణలకు ఆధారమేమిటన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇలా నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేసి ఒక జాతీయ సంస్థ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించినందుకు రెహమాన్ పై కేసు పెట్టినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.
ముస్లిం పోలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడైన తస్లిమ్ రెహమాన్ వృత్తిరీత్యా వైద్యుడు. రాజకీయ అధికారాన్ని సంపాదించుకోవడంలో ముస్లింల వెనుకబాటుతనాన్ని గమనించిన రెహమాన్ 2001లో ముస్లిం పోలిటికల్ కౌన్సిల్ ను ప్రారంభించినట్లు కౌన్సిల్ అధికారిక వెబ్ సైట్ పేర్కొంటోంది. జమైత్ ఏ ఉలేమా హింద్, జమాత్ ఏ ఇస్లామి హింద్, జమైత్ అహ్లె హదీస్ మొదలైన సంస్థలతో కలిసి ఆయన పనిచేస్తున్నారు. ముస్లిం ఉమ్మా (ఐక్యత) కోసం ఈ సంస్థలన్నింటి ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు. అయోధ్యతో సహా వివిధ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా రెహమాన్ ఎప్పుడు వార్తల్లో ఉంటారు.
గతంలో ఆర్ఎస్ఎస్ పై వివాదాస్పద, అసత్య వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు అర్జున్ సింగ్, రాహుల్ గాంధీలు కూడా పరువునష్టం కేసులు ఎదుర్కున్నారు.