Home Telugu బోనాలకు మహంకాళీ ఆలయం ముస్తాబు

బోనాలకు మహంకాళీ ఆలయం ముస్తాబు

0
SHARE

అదో అపూర్వమైన సామూహిక అర్చన.. సామాజిక బేధం లేని జగన్మాత ఆరాధన.. ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే విశిష్ఠ వేడుక.. వర్షరుతువులో వచ్చే కొత్తనీటి జబ్బుల నుంచి రక్షించాలని మహాశక్తిని కొలుస్తూ ఆనాదిగా వస్తున్న ఆచారం.. ఆ శక్తి ఆరాధనలో ఓ భాగమే తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగ. ఆధ్యాత్మిక భక్తిభావనతో అత్యంత వైభవంగా సాగే ఆషాడ జాతర బోనాల మహోత్సవాలకు సికింద్రాబాద్‌ చారిత్రక శ్రీఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయం ముస్తాబవుతోంది. జులై 9, 10 తేదీల్లో జరిగే ఈ మహోత్సవాలకు పదిరోజులు మాత్రమే మిగిలి ఉంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అటు ఆలయ అధికారులు, ఇటు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక మంత్రి తలసాని ఎప్పటికప్పుడు ఉత్సవాల పనులను అధికారులతో సమీక్షిస్తున్నారు.

మహోత్సవ కళను సంతరించుకున్న దేవస్థానం

బోనాల మహోత్సవాలలో ప్రధాన ఆకర్షణగా రూ.3లక్షలు వెచ్చించి ఆలయానికి పంచరంగులు వేస్తున్నారు. మూడు వారాల కిందట ప్రారంభమైన రంగుల పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ప్రధాన ముఖద్వారానికి మాత్రమే రంగులు వేయాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఆరువేల గోడపత్రికలను నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు. వీటిని ఆలయాలు, రద్దీప్రాంతాలు, బస్టాప్‌లు ఇతర చోట్ల అంటిస్తున్నారు. నగరంలోని ప్రధాన ఆలయాల వద్ద ప్రత్యేక బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటుచేస్తున్నారు. ఆషాడ జాతరకు ప్రత్యేక హుండీలు సైతం ఏర్పాటుచేస్తున్నారు. ఆలయంలో వ్యర్థాలు, అపరిశుభ్ర వాతావరణం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలో ఈవో అన్నపూర్ణ సిబ్బందికి సూచించారు.

రూ..5లక్షలతో పూల అలంకరణ..

ఆలయంలో రూ.5.20లక్షల వ్యయంతో ఆలయాన్ని రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించనున్నారు. ఘటోత్సవంతోపాటు ఈ ఏడాది పూల అలంకరణ ప్రత్యేకంగా నిలవనుంది. మరోవైపు రూ.5.11లక్షల వ్యయంతో చేపట్టిన విద్యుద్దీపాలంకరణతో ఆలయం కళకళలాడనుంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాటా, అంజల థియేటర్‌, మహంకాళీ ఠానా, రాణిగంజ్‌ కూడలి తదితర ప్రాంతాలవారు ఎల్‌ఈడీ ముఖద్వారాలను ఏర్పాటుచేయనున్నారు. బాట నుంచి ఆలయం, రాంగోపాల్‌పేట ఠాణా నుంచి ఆలయం, ఆలయంలోని నలు వీధుల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. మరో రూ.1.52లక్షల ఖర్చుతో క్యూలైన్లలో కోల్‌కత అలకంరణతో భక్తులకు వర్షంలోనూ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులకు ఏర్పాట్లు..

ఆషాడ జాతరలో మూడు శుక్రవారాలు ప్రత్యేకం. రెండో శుక్రవారం ఈనెల30న అమ్మవారి ఆలయంలో శాకాంబరి అలంకరణ జరుగనుంది. అమ్మవారి గర్భగుడితోపాటు ఆలయం పూర్తిగా కూరగాయలతో అలంకరించనున్నారు. సుమారు 4లక్షలకు పైచిలుకు మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారుల అంచనా. జాతరకు ముందుకు రెండురోజుల వ్యవధితో వచ్చే మూడో శుక్రవారాన్ని భక్తులు అత్యంత విశిష్ఠంగా భావిస్తారు. మినీ జాతరగా పిలిచే జాతర ముందు శుక్రవారం సుమారు 6లక్షలమంది హాజరవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటేషన్‌పై ఇతర ఆలయాల నుంచి సిబ్బందిని తీసుకుని సేవలందిస్తున్నారు.

అన్ని ఏర్పాట్లు..: ఈఓ అన్నపూర్ణ

బోనంతో వచ్చే ప్రతి మహిళ, అమ్మవారి దర్శననానికి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనభాగ్యం కల్పించాలన్నదే మా సంకల్పం. ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రి తలసాని ఇప్పటికే రెండు పర్యాయాలు సమీక్ష సమావేశాలు ఏర్పాటుచేశారు. అందరి భాగస్వామ్యంతో ఉత్సవాలు విజయవంతం చేస్తాం.

ఆలయ పరిసరాలను సందర్శించిన డీసీపీ

ఉత్సవాలకు పదిరోజులు మాత్రమే ఉండటం, శుక్రవారం మినీ జాతర ఉండటంతో పోలీసులు బందోబస్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా ఆర్‌డీబీ నిర్మించనున్న క్యూలైన్లపై దృష్టి సారిస్తున్నారు. గురువారం డీసీపీ సుమతి, ఏసీపీ గంగాధర్‌, సీఐ రమేష్‌ ఆలయ ఈఓ అన్నపూర్ణతో కలిసి ఆలయ ప్రధాన ముఖద్వారం వద్ద పరిస్థితిని పరిశీలించారు. ప్రధాన ముఖద్వారం వద్ద చేపట్టాలినవి, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.

(ఈనాడు సౌజన్యం తో)