Home Rashtriya Swayamsevak Sangh సంఘర్షణలకు సమాధానం – హిందూ చింతన

సంఘర్షణలకు సమాధానం – హిందూ చింతన

0
SHARE

మాఘ బహుళ ఏకాదశి (ఫిబ్రవరి 27) గురూజీ జయంతి

– ‌రమేశ్‌ ‌పతంగే

హిందూ పంచాంగాన్ని అనుసరించి ‘విజయ ఏకాదశి’ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ద్వితీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయ శ్రీ గురూజీ (మాధవరావ్‌ ‌సదాశివ గోల్వాల్కర్‌) ‌జన్మదినం (ఇంగ్లీష్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకారం  ఫిబ్రవరి 19, 1906). హైందవ సంప్రదాయంలో ఈ ‘విజయ ఏకాదశి’కి అత్యంత ప్రాముఖ్యం ఉంది. పౌరాణిక కథల ప్రకారం రావణుడిపై విజయం సాధించటానికి శ్రీరాముడు విజయ ఏకాదశి వ్రతం చేశాడు. ఇంతటి పవిత్రమైన విజయ ఏకాదశినాడే గురూజీ జన్మించారు. తొలుదొల్త ఆ మహా పురుషునికి వినమ్రంగా నమస్కరిస్తున్నాను.

గురూజీ ఒక యతి. యతి సంప్రదాయాన్ని అనుసరిస్తూ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కీర్తి ప్రతిష్టలకోసం ఆయన పాకులాడలేదు. యతులు స్వయంగా తమకు తామే శ్రాద్ధం పెట్టుకుంటారు. గురూజీ అదేవిధంగా చేశారు. విజయాన్ని సాధించటానికే ఆయన జన్మించారు. కనుక ఎవరిమీద ఎవరు విజయం సాధించారనే విషయమై విశ్లేషించాలి. హిందూ సంస్కృతి, హిందూ తత్త్వశాస్త్రం, హిందూ జీవనశైలి కోసం విజయాన్ని సాధించి పెట్టేందుకే గురూజీ జన్మించారు. సర్‌ ‌సంఘ్‌చాలక్‌గా 33 సంవత్సరాల పాటు ఆయన సంపూర్ణ దేశ పర్యటన చేశారు. స్వయంసేవకులను, సమాజాన్ని జాగృత పరుస్తూ వందలాది ప్రసంగాలు చేశారు.

‘మనమంతా హిందువులం, హిందూ అంటే ఏమిటి?’, ‘మన వారసత్వపు ఆలోచనా ధోరణి ఏమిటి?’, ‘మన జీవనశైలి ఎలా ఉంది?’ దీన్ని ఎందుకు ఆచరించాలి? లాంటి అంశాల గూర్చి సూటిగా, స్పష్టంగా, సరళమైన తార్కిక భాషలో విడమర్చి, ఉదాహరణలిస్తూ తన ప్రసంగాల ద్వారా ఆయన సమాజాన్ని జాగృత పరిచారు. ఇదంతా ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనికో కారణముంది, తన ఆత్మని విస్మరించిన, మరచి పోయిన హిందూ సమాజానికి హిందూ సామర్థ్యం, శక్తి ఎంత గొప్పవో గుర్తుచేస్తూ హిందూ సమాజపు శక్తి సామర్థ్యాల ఆధారంగానే హిందూ సమాజానికి విజయాన్ని సాధించి పెట్టాలనేది ఆయన సంకల్పం. వేల సంవత్సరాలపాటు దాస్యంలో మగ్గిపోయిన హిందూ సమాజానికి శక్తి క్షీణించింది. నక్కల గుంపులో పెరిగిన సింహం పిల్లలు తమని తాము నక్కలుగానే భావించసాగాయి. మీరు నక్కలు కాదు, మీరంతా సింహాలు అనే విషయాన్ని హిందూ సమాజానికి గుర్తుచేస్తూ జాగృతపరచే బాధ్యత స్వీకరించి గురూజీ సఫలమయ్యారు. ‘హిందూ సమాజ జాగృతి యజ్ఞం’ చేశారు గురూజీ.

హిందూ సమాజాన్ని జాగృతపరచే కార్యం ఒకవైపు నిర్విఘ్నంగా కొనసాగుతుంటే మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యతిరేకశక్తులు అదేపనిగా బురద చల్లే పని పెట్టుకున్నాయి. తమ తమ ధోరణిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యాన్ని విమర్శించసాగాయి. గురూజీ వ్యాఖ్యలను వక్రీకరించడం మొదలుపెట్టాయి. ముస్లిములకు, ఎస్సీలకు, క్రైస్తవులకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యతిరేకమని విపరీత ధోరణిలో దుష్ప్రచారం చేస్తూ ఈ శక్తులు పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించాయి. ఈ వ్యతిరేక శక్తులు ప్రచురించిన రచనలన్నిటినీ ‘వికృత సాహిత్యం’గా పరిగణించాలి. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యతిరేక శక్తులు రూపొందించిన ఈ వికృత సాహిత్యాన్ని ప్రజలు క్రమంగా ఛీ కొడుతున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యతిరేకశక్తులు చేసే దుష్ప్రచారాన్ని గురూజీ ఎన్నడూ ఖాతరు చేయలేదు, పట్టించుకోలేదు. ఆయన హిందుత్వాన్ని ఔపోసన పట్టిన రుషి. ఆ హిందుత్వ జ్ఞానాన్నే గురూజీ జనానికి పంచిపెట్టారు. హిందుత్వ జ్ఞానం శాశ్వతం, సత్యం అయినందువల్ల ఈ జ్ఞానాన్ని అజ్ఞానంతో ఆక్షేపించేవారు మెల్లమెల్లగా అర్థహీనులవుతున్నారు.

మనమెందుకు హిందూ సంఘటన చేస్తున్నాం? దీని లక్ష్యమేమిటి? అనే విషయాల గూర్చి గురూజీ విస్పష్టంగా ప్రస్తావించారు. ఈ విషయాలను ఆయన సమాజ సమక్షంలో పెట్టిన రోజుల్లోనే ప్రపంచంలోని పలు కొత్త దేశాలు అవతరించాయి. ఈ దేశాలు కేవలం తమ స్వప్రయోజనాలు, స్వార్ధం మాత్రమే చూసుకునేవి. ఎక్కడైతే స్వార్ధం, స్వప్రయోజనాల కోసం పెనుగులాడే ధోరణి ఉంటుందో అక్కడ అశాంతి – అలజడి మరింత తీవ్రమవుతుంది. ఈ కారణంగానే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దానికన్నా మరింత భయంకరంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ప్రపంచంలో ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అణుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచం చూసింది. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధమనేది జరిగితే, ఇందులో కూడా అణుబాంబులను ప్రయోగిస్తే పెద్ద ఎత్తున మానవజాతి వినాశనం జరుగుతుంది. ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పారు గురూజీ.

ఈ సందర్భంలోనే కమ్యూనిస్టులు తమ ఆలోచనా ధోరణిని ప్రపంచం ముందుపెట్టారు. మానవజాతి ఒక్కటే, దాని సుఖమయ జీవితాన్ని గూర్చి ఆలోచిం చాలి. జాతీయవాదమనేది ఒక సంకుచిత భావన. ఆ భావన సంఘర్షణలకు జన్మనిస్తుంది, కనుక జాతీయవాద భావనను విడనాడాలి. ఈ కమ్యూనిస్టు ఆలోచనా ధోరణి జాతీయవాదాన్ని హంతకుడిగా చూపుతూనే, జాతీయవాదులుగా కాకుండా అంతర్జాతీయవాదులుగా మారాలి అని పై పై మాటలు చెబుతుంది. ఆ మాటకొస్తే మన దగ్గర కూడా ‘జై జగత్‌’ ‌నినాదం ఇచ్చారు. మనం విశ్వమానవులుగా రూపాంతరించాలనీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లుగా కాదనీ మానవీయ విలువలు, మానవాధికారాలు గొప్పవని, మన నిబద్ధత వాటిపట్ల ఉండాలని కమ్యూనిస్టులు చెప్పారు.

ఉదాత్తమైన ఆలోచనలు వినసొంపుగా ఉంటాయి. కానీ వీటిని అమల్లోకి తేవటం ఎలాగా? అందుకు ఎలాంటి మార్గాన్ని అవలంబించాలి? ఈ ప్రశ్నలకి ఏ ఇజం (ఆలోచన) వాడైనా తమ తమ ఇజాలకు అనుగుణంగా జవాబులిస్తారు. సైన్యాన్ని రద్దు చేయాలని గాంధీ వాదులంటారు. ప్రజలందరినీ ముసల్మాన్లుగా మార్చేయాలని ఇస్లాంకు చెందిన ముల్లాలంటారు. ప్రజలంతా బాప్టిజమ్‌ ‌తీసుకోవాలని క్రైస్తవులంటారు. ప్రజలంతా కమ్యూ నిస్టులుగా మారాలని కమ్యూనిస్ట్ అం‌టాడు. ఇలా ప్రతి ఇజం వాడు తమ తమ ఇజాలను ప్రపంచ ప్రజల నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

సుదూర గతం వరకు అక్కరలేదు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ప్రచ్ఛన్నయుద్ధం (కోల్డ్ ‌వార్‌) ‌మొదలైంది. కమ్యూనిస్టులు, ప్రజాస్వామిక క్రిస్టియన్‌ ‌కూటమిగా ప్రపంచ విభజన జరిగింది. తమ తమ జీవనశైలులను ప్రపంచం మీద బలవంతంగా రుద్దే ప్రయత్నాలు ఇరువైపుల నుండి ముమ్మరంగా సాగాయి. కొత్త కొత్త సంహారక శస్త్రాల నిర్మాణం / తయారీ కూడా జరిగింది. నేలమీద, నీళ్ల మీద, ఆకాశంమీద, అంతరిక్షంమీద నుంచి కూడా యుద్ధాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. మానవులంతా ఒక్కటే, ప్రపంచంలో సుఖశాంతులు నెలకొనాలంటూ ప్రవచించిన కుహనావాదులే తమ తమ సిద్ధాంతాలను బొందలో పాతిపెట్టేశారు. ఈ కుహనావాదుల ధోరణితో ప్రపంచంలో నెలకొన్న స్థితిని గురూజీ తనదైన భాషా శైలిలో స్పష్టంగా ఈ విధంగా ప్రస్తావించారు.

‘ఇలాంటి సంఘర్షణమయ, సంహారక ధోరణి నుండి ప్రపంచాన్ని గట్టెక్కించేది హిందూ ఆలోచనా ధోరణి మాత్రమే! ఎందుకంటే హిందూ ఆలోచనా ధోరణి మానవుని గురించి పరిపూర్ణంగా ఆలోచి స్తుంది, వివేచిస్తుంది. కేవలం మానవుని గూర్చే కాదు, చిన్న చిన్న జీవజాలమే కాదు సంపూర్ణ ప్రాణికోటి గూర్చి ఆలోచిస్తుంది. ‘సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిత్‌ ‌దుఃఖ భాగ్భవేత్‌’ అని కదా మన ప్రార్థన. పశ్చిమ దేశాల వారి ఆలోచన పలువురికి పలు సుఖాలు అన్నంత వరకూ వచ్చి ఆగిపోతుంది. కానీ మనం, సమస్త విశ్వ శ్రేయస్సుని కాంక్షిస్తూ ప్రార్థిస్తాం. సంత్‌ ‌జ్ఞానదేవ్‌ ‌ప్రార్థన ‘పసాయదాన్‌’‌ని దీనికి పరమోత్కృష్ట మైన ఉదాహరణ అని గురూజీ చెబుతారు.

పలువురికి పలు సుఖాలు అనే పడమటి దేశాల ఆలోచనా ధోరణిలో సుఖం అంటే ఏమిటని గురూజీ ప్రశ్నిస్తారు. పడమటి దేశాల వారి జీవన విధానం వ్యక్తిగత సుఖాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది, ఇంద్రియాలకు ఏవైతే ఇష్టాన్ని కలిగిస్తాయో వాటినే సుఖాలుగా భావిస్తారు వారు. ఇంద్రియ సుఖాలను కలిగించే సాధనాలను తయారుచేయడం, వీటి తయారీకోసం చిన్న చిన్న దేశాల సంపదను కొల్లగొట్టేందుకు కుట్రలు చేయటం, పెట్టుబడులు పెట్టే నెపంతో కబ్జాచేయటం వంటి వాటికి ఈ పడమటి దేశాల వారి ఆలోచనా ధోరణే జన్మనిచ్చింది. స్వంత సుఖాల కోసం ఇతర దేశాలను లూటీ చేయడమనేది రాక్షసులు అవలంబించే మార్గం. రాక్షస గుణాలు ఎలా వుంటాయో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వర్ణించాడని గుర్తుచేశారు గురూజీ. సాధనా సంపత్తులను కబ్జా చేయడానికి పెట్టే పరుగు కారణం గానే ప్రథమ, ద్వితీయ ప్రపంచ మహాయుద్ధాలు జరిగాయి, ప్రచ్ఛన్నయుద్ధం దీనికోసమే. కానీ మన మార్గం అది కాదని గురూజీ చెప్పారు.

మరి, మన మార్గం ఏమిటన్న విషయాన్ని గురూజీ చెబుతూ ఇలా పేర్కొన్నారు – ‘సంపూర్ణ మానవజాతికి సుఖసంతోషాలు కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తారు, ఈ మేరకు మన పూర్వీకులు చైనా, జపాన్‌లే కాకుండా అమెరికా దాకా కూడా వెళ్లారు. దక్షిణ ఆసియా ప్రాంత ప్రజలను మన పూర్వీకులు సంస్కారవంతులుగా తీర్చిదిద్దారు. వారికి మానవ ధర్మాన్ని నేర్పారు. అంతేగానీ వారిని ఎంతమాత్రం దోచుకోలేదు. ఈ కారణంగానే మానవజాతిలోని పలు సమూహాలకు భారత్‌ ‌పట్ల ఆకర్షణ, గౌరవం ఉన్నాయి. భారత్‌ ‌పవిత్ర భూమి అనే భావనతో వారంతా ఇవాళ్టికీ ప్రేమగా చూస్తున్నారు’ అని.

ఇలాంటి మహోన్నత వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి, భద్రంగా చూసుకోవాలి, సమృద్ధి పరచుకోవాలి. ఇది భౌతిక అవసరాల మూట కాదనీ, చైతన్య స్వరూపమైన ఆవిష్కారమని మనిషి గ్రహించాలి. ఈ చైతన్యమే సర్వవ్యాపి, దీన్నే సమస్త జీవసృష్టిలో నింపేసింది. ఇది మానవ సమూహాలన్నిటి లోనూ కనిపిస్తుంది. ఈ చైతన్యంతోనే మనమంతా ముడిపడి ఉన్నాం. ఆఫ్రికా దేశపు నీగ్రో జాతి మనుషులు మనకు మల్లే లేరు, జపనీయులు మన లాగా లేరు, అయితే చైతన్యపరంగా మనమంతా సమానంగా ఉన్నాం, ఇది మన హిందూ ఆలోచనా ధోరణి. పైపైన కనిపించే భేదభావాలు, భేదభావాలు కానేరవు కేవలం విభిన్న రకాలవి. అదంతా పరమేశ్వర నిర్మితం, సృష్టి. వాటిని భద్రపరచాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఏకరూప నిర్మాణమనేది కమ్యూనిజమయితే, క్రైస్తవంలో ఉత్పన్నమైంది ప్రజాస్వామ్యవాద ధోరణి. మనది ఆధ్యాత్మికవాద ఆలోచనా ధోరణి.

కేవలం ఆలోచనలను ప్రతిపాదిస్తే ఎవరూ వినరు, ఆలోచనలు బ్రతకాలి, వాటిని బ్రతికే లాగా చేయాలి. -‘‘ఆలోచనలని మన సామాజిక జీవనంలో జీవించేలా చేయాలి. అందుకే హిందూ సంఘటనం. హిందూ ఆలోచన ధోరణితో జీవిస్తున్న వారంతా ఏకమై సంఘటితంగా నిలబడాలన్నదే సంఘ్‌ ‌లక్ష్యం. ఈ ఆలోచనలతో జీవిస్తున్న సమూహం వున్నది అంటే ఆ ఆలోచనా ధోరణి శక్తిమంతమైనదని అర్థమని గురూజీ చెప్పారు’. ఇలాంటి శక్తిమంతమైన హిందూ సమాజాన్ని నిలబెట్టేందుకు ఆయన తన జీవితాన్ని సమర్పించారు.

దీంతో ఇవాళ ఎలాంటి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి? సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను మనం సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే అనేక విషయాలు అవలోకనమౌతాయి. నిన్నటి దాకా హిందూ శబ్దం వినబడగానే ఏవగించుకున్న పలువురు పెద్ద మనుషులు ఇవాళ ‘నేను హిందువును.. భారత్‌లో హిందూ రాజ్యస్థాపన జరగాల్సిన అవసరం ఉంది’ అని గట్టిగా అంటున్నారు. ‘వై అయామ్‌ ఏ ‌హిందూ?’ అనే పుస్తకాన్ని రాసి శశి థరూర్‌ ఇలాంటి విషయాల్ని చెప్పాడు. ఒక ముస్లిం మౌల్వీకి తన పూర్వజుల అస్తిత్వం ఏమిటన్నది తెలియగానే హిందుత్వాన్ని స్వీకరించాడు. అకడమిక్‌ ‌రంగానికి సంబంధించిన గొప్ప గొప్ప విద్యావేత్తలు, చరిత్రకారులు ఇప్పుడంటున్నారు, ఆర్యుల రాక సిద్ధాంతం పూర్తిగా అసత్యమని. మన వేదాలు జ్ఞాన భాండాగారాలు, మన సంస్కృత భాష, భాషాశాస్త్రం మేరకు చూసినప్పుడు ప్రపంచంలోనే శ్రేష్టమైన భాష అని స్పష్టమౌతోందని వారు చెప్పటం మొదలెట్టారు. వీరిలో అసంఖ్యాకులు ఎన్నడూ కూడా సంఘ శాఖకు వెళ్లనివారే! అకస్మాత్తుగా వీరంతా తమ అస్తిత్వపు అన్వేషణలో ఎందుకు పడ్డట్టు? దీనికి ఒకే వాక్యంలో సమాధానం చెప్పాల్సివస్తే ‘అదంతా గురూజీ తాపసిక రుషి జీవనం వల్లే’ అని చెప్పొచ్చు. తపః ప్రభావ వాతావరణం ఇలాటి స్థితిని నిర్మాణం చేస్తుంది. తపః తరంగాలు ఎప్పుడు, ఎవరి పైన ఎలాటి పరిణామాలను చూపిస్తాయో చెప్పటం కష్టం.

హిందూజాతి లక్ష్యాన్ని సంఘ్‌ ‌స్వయంసేవక్‌ ఆయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వ వేదిక ముందు పెడుతున్నారు. ప్రపంచ ప్రజలంతా ఆయన్ని విశ్వనేతగా అంగీకరించి మమేకం చేసుకున్నారు. నరేంద్ర మోదీతో రష్యా, చైనా, అమెరికా లాంటి రాక్షస శక్తులు లేవు. ప్రపంచానికి అభయమిచ్చే సాంస్కృతిక శక్తులు ఆయనకు తోడుగా ఉన్నాయి. భారత ఆధ్యాత్మిక ఆలోచనా ధోరణిని ఆయన విశ్వ వేదిక పైకి తీసుకెళతారు. గురూజీ కూడా ఆ రోజుల్లో ఇలాంటి ఆలోచనా ధోరణినే ప్రస్తావించేవారు, ప్రతిపాదించేవారు. పరిస్థితులు మారుతుంటాయి, కానీ శాశ్వత సిద్ధాంతాలు ఎన్నటికీ మారవు.

నేటి పరిస్థితులకు అనుగుణంగా గురూజీ ద్వారా ప్రస్తావనకు వచ్చిన శాశ్వత ఆలోచనలని నరేంద్ర మోదీ విశ్వవేదిక ముందుంచారు, ఇవన్నీ ఆచరించ దగ్గవి. శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా ఆత్మతత్వపు వికాసానికి దోహదపడే ‘యోగ’ మార్గాన్ని నరేంద్ర మోదీ విశ్వవేదికపైకి తీసుకెళ్లారు. గత ఏడాది 21 జూన్‌ ‌నాడు 173 దేశాలు ‘అంతర్జాతీయ యోగా దినోత్స’వాన్ని జరుపుకున్నాయి.

మానవజీవనం సుఖమయంగా సాగాలంటే పర్యావరణ సంరక్షణ చాలా అవసరం. పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుం బిగించాలనీ, బొగ్గు, ఖనిజాలు, నూనె వాడకాన్ని తగ్గించాలనీ, అడవులని – జీవసృష్టిని రక్షించాలని విశ్వవేదికలపై నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్‌ ఏమి చేస్తున్నదో, ఆ విషయాన్ని కూడా విశ్వవేదికలపై వివరిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచానికి భారత్‌ ఏ ‌విధంగా సహాయపడగలదో, ఆ విషయం కూడా మోదీ చెబుతున్నారు. విశ్వ మంతా సుఖమయంగా ఉండాలి, దానికోసం సమస్త మానవ జాతికి చక్కటి ఆరోగ్యం చేకూరాలి. కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు పేద దేశాలకు భారత్‌ ‌పెద్ద మనసుతో వ్యాక్సీన్లు, మందులు అందజేసింది. ‘సర్వే సంతు నిరామయాః’ అనే ఆర్యోక్తి మేరకు జీవనాన్ని సాగించాలి.

 విశ్వ సంస్కృతి యుద్ధభాష మాట్లాడుతుంటే, భారతీయ సంస్కృతి మాత్రం సమన్వయ – సామంజస్య భాషనే మాట్లాడుతుంది. ఓర్వలేనితనపు ఆలోచనా ధోరణితోనే తీవ్రవాదం/ఉగ్రవాదం పుట్టుకొస్తుంది. అందుకే ప్రపంచాన్ని కోరుతున్నా ‘బ్రతకండి, బ్రతకనివ్వండి’, ‘ఇతరుల్లోని మంచితనాన్ని వెదకండి’. ఈ మార్గాన్నే అనుసరించమని నరేంద్ర మోదీ అత్యంత గౌరవంగా విశ్వవేదికలపై చెబుతున్నారు. మోదీ శక్తివంతమైన పలుకుల వెనుక హిందూ సమాజం వెన్నుదన్నుగా నిలబడి ఉంది.

1973లో గురూజీ నిర్యాణం చెందారు. అప్పటికే హిందూ జీవన పద్ధతిలో జీవించే ఒక శక్తిమంతమైన తరాన్ని ఆయన తయారుచేశారు.

1973 నుండి 2014 లో ఈ శక్తిమంతమైన తరం చాల తీవ్రంగా విస్తరించింది, విజృంభించింది. మనం సర్వత్రా విజయం సాధించాలి అనే ధ్యేయంతో వేల సంఖ్యలో యువత నడుం బిగించి నిలబడింది. వారంతా వివిధ రంగాల్లో ప్రవేశించారు. ఆ విధంగా హిందూ జీవన దర్శనం ఆధారంగా జాతి పున ర్నిర్మాణ కార్యంలో పాలుపంచుకొని అగ్రేసరుల య్యారు. దీంతో దేశంలో హిందూ ఆలోచనా ధోరణితో జీవనాన్ని సాగించే ఒక బలీయమైన శక్తి నిర్మాణం జరిగింది. రాజకీయరంగంలో ఈ బలీయమైన శక్తికి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

‘ఇక సర్వత్రా విజయమే విజయం’ అని తన చివరి ప్రసంగంలో గురూజీ వ్యాఖ్యానించారు. విజయ ఏకాదశి నాడు జన్మించిన ఈ మహా పురుషుడు చిరకాలం ఈ మహోన్నత దేశానికి విజయాన్ని ఆకాంక్షిస్తూ తన సంపూర్ణ జీవితాన్ని హోమాగ్నికి సమిథలాగా అర్పించారు. తీవ్రస్థాయిలో తపస్సు చేశారు. ఈ తపస్సు పుణ్య ప్రభావమే నేటి జాతి జాగృత భారత్‌!!

వ్యాస‌క‌ర్త‌: కాలమిస్ట్, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంతకర్త

‘‌హిందీ వివేక్‌’ ‌నుంచి

అనువాదం : విద్యారణ్య కామ్లేకర్‌

జాగృతి సౌజ‌న్యంతో…