– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,
‘సర్వం శివమయం జగత్’ అన్నట్లు అంతా శివస్వరూపమే. బ్రహ్మ, విష్ణువు సహా సురాసురులు, రుషులు మహాదేవుడ్ని ఉపాసించినవారే. క్షీరసాగర మథనవేళ లోకసంరక్షణార్థం హాలాహల స్వీకరణతో గరళకంఠుడిగా ప్రశస్తి పొందిన పరమశివుడిని వేదాలు మహాదేవుడు, మహేశుడు, దేవదేవుడు, అశుతోషుడు అని కీర్తించాయి. శివారాధనకు నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి అని మూడు పర్వదినాలు ఉన్నా మహాశివరాత్రికి మరింత విశిష్టత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘శివ ప్రియాతు దుపాసానార్ధా రాత్రి శివరాత్రి’ (శివునికి ప్రియమైన, శివారాధనకు ఉత్కృష్టమైన రాత్రే శివరాత్రి) అని స్కాంద పురాణం పేర్కొంటోంది. అన్ని శివరాత్రులను ఆచరించాలని శాస్త్రాలు పేర్కొంటున్నప్పటికీ మహాశివరాత్రి జరుపు కోవడంతో అన్నింటి ఫలితం సిద్ధిస్తుందని విశ్వాసం.
కల్యాణప్రదాత, కల్యాణ స్వరూపుడు సదా శివుడిని జ్ఞాననేత్రుడు, సత్వగుణోపేతుడు, ఆది దేవుడు, అమృతమయుడు, ఆనందమయుడు అని వేదాలు శ్లాఘించాయి. భక్తసులభుడు. భక్తులంటే ప్రీతి. శివలింగం మూలం బ్రహ్మ స్వరూపమని, మధ్య భాగం విష్ణుస్వరూపమని, పైభాగం ఓంకార స్వరూప మైన సదాశివ రూపమని చెబుతారు. పంచాక్షరీ స్తోత్రంతో శివలింగపై నీటిని పోసి మారేడు దళం ఉంచితే సకల దేవతలను అర్చించిన పుణ్యఫలం దక్కుతుందని పెద్దల మాట. ‘శివ’ అంటే శంకరుడు అని, ‘రాత్రి’ అంటే పార్వతి అని, వీరిద్దరి కలయికే శివరాత్రి అని ఆధ్యాత్మిక ప్రముఖులు చెబుతారు. వారిద్దరి కల్యాణం జగత్కల్యాణానికి నాంది కావ డంతో ‘శివరాత్రి’మహా పర్వదినంగా అవతరించింది. మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివార్చనలు, శివా రాధనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఆ రోజున అర్చన, ఉపవాసం, జాగరణ అనే పక్రి యలలో శివుడిని అర్చిస్తారు. శివరాత్రి ముందురోజు ఒంటిపూట ఆహారం తీసుకొని, మరుసటి రోజంతా ఉపవాసం, రాత్రి జాగరణ చేస్తూ, శివలింగానికి నాలుగు జాములలో నాలుగు రకాల పూజలు నిర్వహిస్తారు. మొదటి జాములో పాలాభిషేకం, పుష్పార్చన, పులగ•ం నైవేద్యం. రెండవ జాములో పెరుగుతో అభిషేకం, తులసీదళార్చన, పాయసం నైవేద్యం. మూడవ జాములో నెయ్యితో అభిషేకం, మారేడు దళార్చన, నువ్వుల పొడితో నైవేద్యం; నాలుగవ జామున తేనెతో అభిషేకం, నల్లకలువలతో అర్చన, అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. ఇలా ఉప వాస, జాగరణల వల్ల అహంకారం తొలగి నిగ్రహశక్తి పెరుగుతుందని విశ్వాసం. జాగరణ అంటే కేవలం మేలుకొని ఉండడం కాదని, శివపూజ, శివస్తుతి, శివలీలలను వీనుల విందుగా వినడం, అంతరాత్మలో పరమాత్మను దర్శించడమే నిజమైన జాగరణ అని తత్త్వజ్ఞులు చెబుతారు. శివరాత్రి అంటే మంగళ కరమైన రాత్రి. మనసును మంగళకరమైన శివ నామంతో సద్వినియోగం చేసుకోవడమే జాగరణ.
శివుడికి ప్రియమైన, శివారాధనకు ఉత్కృష్టమైన రాత్రే శివరాత్రి (శివప్రియతు దుపాసానార్ధా రాత్రి శివరాత్రి) అని స్కాంద పురాణం పేర్కొంది. ఈ పర్వదినం ఆయనకు అత్యంత ప్రియమైనదే అయినా, నిత్య, పక్ష, మాస, మహాశివరాత్రులు అని శాస్త్రాలు నాలుగు శివరాత్రులను పేర్కొన్నాయి. శివుడిని ప్రతిరోజూ ఆరాధించడం నిత్య శివరాత్రి కాగా, ప్రతి పక్షంలోని చతుర్దశినాటి రాత్రి శివారాధన చేయడాన్ని పక్షశివరాత్రి అంటారు. శివుడికి చతుర్దశి ప్రియ మైనదే అయినా, కృష్ణపక్షంలోని చతుర్దశి మరింత ఇష్టమైనది కనుక దానికి మాసశివరాత్రి అనిపేరు. మాఘ మాసంలోని కృష్ట పక్ష చతుర్దశి మహాశివ రాత్రి. ఆనాడే లింగోద్భవం జరిగినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక కథనం ప్రకారం, తమలో ఎవరు అధికులమని బ్రహ్మ,విష్ణువుల మధ్య ఒకసారి వాగ్వాదం చోటుచేసుకొని, వాదన ముదిరి ప్రళయా నికి దారితీసింది. ఈశ్వరుడు తేజోమూర్తిగా వారిద్దరి మధ్య ఉద్భవించి జ్ఞానోపదేశం చేశారు. అందుకే మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రిని లింగోద్భవ కాలంగా పరిగణించి శివారాధనలు, శివార్చనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మహాశివరాత్రి అంటే ముఖ్యంగా మూడు వ్రతాలతో కూడినది. అవి. అభిషేకం, ఉపవాసం, జాగరణ.
అభిషేకం అంటే…
విష్ణువు అలంకార ప్రియుడు కాగా శివుడు అభిషేకప్రియుడు. ఈ విషయంలో పండిత పామ రులను సమదృష్టితో చూస్తాడంటారు. శుద్ధోదకాన్ని శిరస్సునబోసి, చిటికెడు భస్మాన్ని లింగాకృతిపై చల్లితేనే పరవశించే బోళా శంకరుడు. మహాన్యాస పూర్వక నమకచమకాదులతో ఏకాదశ రుద్రాభి షేకాలు, పంచామృతాభిషేకాలు చేసిన వారినీ, హరహర అంటూ చెంబెడు/గుక్కెడు నీళ్లు పోసి (తిన్నడే అందుకు ఉదాహరణ) మా•రేడు పత్రం సమర్పించిన వారినీ సమాన తృప్తితో కరుణిస్తాడు. అభిషేకం అంటే సర్వ సమర్పణ అని అర్థం. ‘నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేం దుకు యత్నించే దాసానుదాసుడ•నని తనను తాను అంకితం చేసుకోవడం, శరణాగతి కోరడం, భగవంతుడు సృష్టించిన దానిని ఆయనకే పునరం కితం చేస్తున్నట్లు భావన కలిగి ఉండడం అభిషేకమని చెబుతారు.
ఉపవాసం
‘ఉపవాసం’ (ఉప+వసము) అంటే పస్తు ఉండడం అని లౌకిక అర్థంలో స్థిరపడి పోయింది. కానీ ‘ఉప’ అంటే సమీపం, ‘వస’ అంటే ఉండడం అని నిఘంటు అర్ధం. ఎవరి సమీపాన అంటే.. భగవంతుని సమీపంలో అని చెప్పుకోవాలి. ఆయనకు సమీపంలో ఉండడం అంటే భక్తి కలిగి ఉండడమే. అందుకు పస్తులు ఎందుకన్న ప్రశ్న ఎదురవుతుంది. కడుపునిండుగా (తృప్తిగా) ఆహారం తీసుకోవడం వల్ల, అదీ తామస రాజస ఆహారమైతే శరీరానికి బద్ధకం పెరిగి ఆవులింతలతో విశ్రాంతి కోరవచ్చు. బలవం తంగా నిగ్రహించుకోవాలనుకున్నా కష్టసాధ్యమే. బలవంతపు ఉపవాసం కంటే జపము, తపము, సత్ గ్రంథపఠనం, సత్సాంగత్యం శ్రేష్ఠం అని పెద్దల మాట. ‘పరిమితమైన సాత్వికాహారం తీసుకోవడం ఉపవాసంతో సమానం’ అని ‘గీత‘ వాక్కు. ఆధ్యాత్మి కతతో పాటు ఆరోగ్యపరంగా చూసినా ‘లంఖణం పరమౌషధమ్’ అని ఆర్యోక్తి. ఉపవాసంతో ఆరోగ్యం చక్కబడుతుందని అర్థం. వైద్యపరిభాషలో చెప్పుకోవా లంటే, అమిత భోజనం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగి శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఉపవాసంతో ఆ సమస్యను కొంతమేర నివారించ వచ్చని, అయితే దీనిని ఆధ్యాత్మికతతో ముడిపెడితే ఫలితం ఉండవచ్చని వైద్యశాస్త్రజ్ఞుల మాట.
జాగరణ
మంగళకరమైన శివనామంతో మనసును ప్రసన్నంగా ఉంచుకోవవడమే జాగరణ. బలవం తంగా నిద్రను నియంత్రించుకోవడమని జాగరణకు అర్థం మారింది. జన్మనెత్తినప్పటి నుంచి ఇంతవరకు జీవితం ఎలా సాగింది? తెలుసుకున్నది ఎంత? ఎదుర్కొన్న అనుభవాలు, చవిచూసిన అనుభూతులు, వెంటాడిన భయాలు ఏమిటి? నడక, నడత ఎలాం టిది? చేసిన తప్పొప్పులు ఏమిటి? లాంటి అంశాలను జ్ఞాన చక్షువులతో దర్శించి ఆత్మవిమర్శ చేసుకుని మహాశివుడి మన్నింపును కోరడమే జాగరణ అంతరా ర్థమని పెద్దలు చెబుతారు. చేసిన పొరపాట్లకు పశ్చా త్తాపంతో మెలకువగా ఉన్నప్పుడే ‘జాగరణ’మాటకు సార్థకత తప్ప మొక్కుబడిగానో, కాలక్షేపంగానో పరిగణిస్తే వృథా ప్రయాసే అవుతుందంటారు.
క్షీరసాగర మథనంతో పుట్టిన హాలాహలాన్ని లోక సంరక్షణార్థం గళంలో దాచిన శివుడు దాని ప్రభా వంతో కొంతసేపు (మాఘ బహుళ చతుర్దశి) స్పృహ కోల్పోయాడు. పతిదేవుడి తలను ఒడిలో చేర్చుకున్న పార్వతీ విలపిస్తుండగా, దేవదానవులు శోక సంద్రంలో మునిగిపోయారని కథనం ఉంది. ఆయ నకు తిరిగి స్పృహలోకి వచ్చేంతవరకు వారంతా జాగరణ చేశారు. నాటి నుంచి నీలకంఠుడ్ని భక్తి శ్రద్ధలతో అర్చించి, జాగరణ చేయడం ఆనవాయితీ అని పురాణాలు చెబుతున్నాయి.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు
ఏడాది పొడువును భక్తులతో సందడిగా ఉండే దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శివరాత్రి పర్వదినం నాడు భక్తులతో కిటకిటలాడతాయి. శ్రీశైలం (ఆంధప్రదేశ్), రామేశ్వరం (తమిళనాడు), దేవ్‌ఘర్ వైద్యనాథం (జార్ఖంఢ్), ఘృష్ణేశ్వరం (ఎల్లోరా, మహారాష్ట్ర), భీమశంకర్ క్షేత్రం (మహారాష్ట్ర), త్రయంబకేశ్వరం(మహరాష్ట్ర), వారణాశి (ఉత్తర ప్రదేశ్), కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్), ఓంకార్ క్షేత్రం (ఇండోర్/బీహార్), మహాకాలేశ్వర (ఉజ్జయిని/మధ్యప్రదేశ్), సోమనాథ్ (గుజరాత్), నాగేశ్వర్ క్షేత్రం (జామ్‌నగర్/గురాత్) క్షేత్రాలలో దేనినైనా ఆనాడు దర్శించుకోవాలని భక్తులు అత్యధికులు ఆసక్తి చూపుతారు. తమ జన్మరాశులను బట్టి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించు కోవడం శుభప్రదమని శాస్త్ర వచనం. ఆ ప్రకారం, మేషరాశికి చెందినవారు రామేశ్వరం, సోమనాథ్ (వృషభం), నాగేశ్వరం (మిథునం), ఓంకారేశ్వరం (కర్కాటకం), దేవ్‌ఘర్ వైద్యనాథం (సింహం), శ్రీశైలం (కన్య), మహా కాలేశ్వరం (తుల), ఘృష్ణే శ్వరం (వృశ్చికం), వారణాసి (ధనుస్సు), దాక్షారం (మకరం), కేదారేశ్వరం (కుంభం), త్రయంబకేశ్వరం (మీనం)ను దర్శించు కోవాలంటారు.
పంచారామాలు
ఆంధప్రదేశ్‌లోని అమరలింగేశ్వరాలయం (అమరావతి), భీమేశ్వరాలయం (దాక్షారామం), కుమార భీమేశ్వరాలయం (సామర్లకోట), సోమేశ్వరాలయం (భీమవరం), క్షీర రామలింగేశ్వరా లయం (పాలకొల్లు) పంచారామాలుగా పూజలందు కుంటున్నాయి. తారకాసురుడు నేల కూలడంతో అతనిలోని ఆత్మలింగం అయిదు ముక్కలు కాగా, వాటిని దేవతలు ఆయా క్షేత్రాలలో ప్రతిష్ఠించారని చెబుతారు. వీటితో పాటు శ్రీముఖలింగేశ్వరుడు (శ్రీకాకుళం జిల్లా), ముక్తేశ్వరం (పశ్చిమ గోదావరి), కోటప్పకొండ (గుంటూరు), మహానంది, యాగంటి (కర్నూలు), కపిలతీర్థం (చిత్తూరు) తదితరాలు ప్రముఖ శైవ క్షేత్రాలుగా పూజలందుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం, రామలింగేశ్వరస్వామి (కీసరగుట్ట), మల్లికార్జున స్వామి (ఐనవోలు, వరంగల్), రుద్రేశ్వర స్వామి (వేయి స్తంభాల గుడి), రామప్పదేవాలయం (జయశంకర్ భూపాలపల్లి), కొమురువెల్లి మల్లికార్జున స్వామి (కొమురువెల్లి) వంటివి ప్రముఖ శైవ క్షేత్రాలుగా పూజలందుకుంటున్నాయి.
శ్రీశైల ప్రాభవం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవం విశిష్టమైంది. ఇతర జ్యోతిర్లిం గాలలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కల్యాణం సందర్భంగా మల్లికార్జునస్వామికి కాకుండా ఆలయా నికి తలపాగా చుడతారు. అర్చామూర్తి మాత్రమే కాక ఆలయం కూడా స్వామివారి విరాట్ రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. 365 మూరల పొడవు గల తలపాగాను రోజుకొక మూర తయారుచేయడం మరో విశేషం. శివరాత్రి నాటి రాత్రి రుద్రాభిషేకం సమయంలో దీనిని అలంకరిస్తారు. గర్భాలయం శిఖర నుంచి ముఖ మండపం పైన గల నందులను కలుపుతూ ఈ వస్త్రాన్ని అలంకరిస్తారు. భ్రమరాంబ మల్లికార్జునులు నిత్యకల్యాణోత్సవాలు పాగా అలంకరణ తరువాత జరిగే ఉత్సవం ప్రత్యేకమైనదిగా చెబుతారు. గజచర్మధారుడు పట్టువస్త్రాలు, మెడలో రుద్రాక్షలు, తలపై ఒకవైపు నెలవంక, మరోవంక గంగమ్మతో; అమ్మవారు పట్టుచీర, స్వర్ణాభరణాలతో నయనానందకరంగా తయారవుతారు. అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలంలోనే శంకర భగవత్పా దులు శివానందలహరిని రాశారని ప్రతీతి.
‘శివేతి చ శివం నామ యస్య వాచి ప్రవర్తతే
కోటి జన్మార్జితం పాపం తస్యనశ్యతి నిశ్చితమ్!! (శివ అనే మంగళకర నామాన్ని ఉచ్ఛరించేవారి కోటి జన్మాల పాపాలు నశించి తీరతాయి) అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్