Home News ‘సాహిత్య ఉత్సవాల ద్వారానే జాతీయవాద నిర్మాణం’

‘సాహిత్య ఉత్సవాల ద్వారానే జాతీయవాద నిర్మాణం’

0
SHARE
  • వ‌రంగల్‌ లో ఘ‌నంగా జ‌రిగిన ‘ఓరుగ‌ల్లు సాహితీ ఉత్స‌వం’

సాహిత్య ఉత్సవాల నిర్వహణ ద్వారానే యువతలో జాతీయ వాదం నిర్మాణామ‌వుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT), వరంగల్ డైరెక్టర్ ఆచార్య ఎన్.వి. రమణ రావు అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని సామ జగన్మోహన్ స్మారక భవనంలో ఏప్రిల్ 7 శుక్రవారం జాగృతి వార పత్రిక సౌజన్యంతో నిర్వహించిన ఓరుగల్లు సాహితీ ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వాస్తవ చరిత్రకు ప్రస్తుత విద్యా విధానంలో స్థానం లేకుండా పోయిందని దీని ఎన్.సి.ఈ.ఆర్.టి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నదన్నారు. నిట్ వరంగల్ గణితశాస్త్ర ఆచార్యులు, ఉత్సవ సమితి అధ్యక్షులు ఆచార్య జె.వి. రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభ సమావేశంలో ప్రధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జీ పాల్గొని మాట్లాడుతూ నైజాం పరిపాలన కాలంలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం అధోగతిపాలైందన్నారు. తెలుగు, మరాఠీ, కన్నడ భాషల పాఠశాలలను మూసి వేయించి, ఉర్దూ మీడియం పాఠశాలను ప్రారంభించి మన మాతృభాష నుండి మనల్ని నిజాం పరిపాలకులు దూరం చేశారన్నారు. తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి ఆనాడు సమాజంలో ఉన్న సాహిత్యాభిమానులు, విద్యాభిమానులు గ్రంథాలయాలను, తెలుగు పాఠశాలలను ప్రారంభించారన్నారు. అహల్య భాయ్ ఖేల్కర్ విరాళంగా ఇచ్చిన భూమిలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి, తానే ఆ విశ్వవిద్యాలయాన్ని తన సొంత భూమిలో నిర్మాణం చేశానని చెప్పుకున్నారన్నారు. ఆనాడు ప్రారంభించిన ఆ విశ్వవిద్యాలయంలో ఉర్దూ కే పెద్దపీట వేశారన్నారు. సాహిత్య అభిమానులు, విద్యాభిమానులు ప్రారంభించిన పాఠశాలలపై అనేక ఆంక్షలు విధించి వాటిని కూడా నడవకుండా చేసే కుట్ర నిజాం అనుయాయులు చేశారన్నారు. జాతీయవాద భావ పరివ్యాప్తికై ఓరుగల్లు సాహితీ ఉత్సవాల్లాంటి సాహిత్య కార్యక్రమాలు సహకరిస్తాయన్నారు. ప్రారంభ సమావేశంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ వరంగల్ విభాగ్ సంఘచాలక్ ఆచార్య చిలుకమారి సంజీవ పాల్గొన్నారు.

రెండవ సంగోష్టికి సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ వరంగల్ అధ్యక్షులు డాక్టర్ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు అధ్యక్షతన వహించగా శ్రీ వరిగొండ కాంతారావు వక్తగా పాల్గొని ప్రసంగించారు. నైజాం విముక్త పోరాటంలో సారస్వత సామాజిక, రాజకీయాది సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా సాధనా భూతమైనది గ్రంథాలయో ద్యమమే అని ఆయ‌న అన్నారు. నైజాం పరిపాలన కాలములో తెలంగాణలో గ్రంధాలయోద్యమము గనుక జరగకపోయినట్లయితే ఈ ప్రాంతం దక్కనీ పాకిస్తాన్ గా మారి ఉండేదని సురవరం ప్రతాపరెడ్డి గారు అన్నారని ఆయన పేర్కొన్నారు. 1901 లో హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, 1904లో హనుమకొండలో శ్రీ రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం, 1905లో సికింద్రాబాద్ లోఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయాలని స్థాపించారన్నారు. హైదరాబాదులో గ్రంధాలయోధ్యమానికి రావిచెట్టు రంగారావు గారు, నాయిని వెంకట రంగారావు( మునిగాల రాజా వారు), కొమర్రాజు లక్ష్మణరావు( దీవాన్) గారు, ఆదిపూడి సోమనాధ శాస్త్రి గారు, ఆదిరాజు వీరభద్రయ్య గారు మూలకారకులని ఆయన పేర్కొన్నారు. నిజాము నిరంకుశ పరిపాలనను అంతమొందించడానికి ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన ప్రజలు గ్రంథాలయాలను ఏర్పాటు చేసి గ్రంథాలయ ఉద్యమాలను నిర్మించి నిజాముకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ పోరాటాన్ని కమ్యూనిస్టులు ఐజాక్ చేసి సాయుధ పోరాటంగా నిర్మాణం చేసి నిజాం నిరంకుశ పాలనను అంతము చేసింది తామే అని ప్రచారం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మూడవ సంగోష్టికి ఆంధ్రజ్యోతి దినపత్రిక వరంగల్ ఎడిషన్ ఇన్చార్జి శ్రీ శంకర్ రావు శెంకేసి సభాధ్యక్షత వహించగా డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు వక్తగా విచ్చేసి ప్రసంగించారు. నిజాం సంస్థానంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు స్థానం లేదని, అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే తెలుగుకు విలువ లేదని, తెలుగుతోపాటు సంస్థానంలో భాగమైన కన్నడ, మరాఠీ జిల్లాలలో ఆ భాషలకు కూడా గౌరవం లేదన్నారు. సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దిరాజు సోదరులు, దేవులపల్లి రామానుజరావు, వి.హెచ్ .దేశాయ్, ఎం.జె.గోపాల్ నాయుడు ,ఎంపీ .స్వామి, అనంత, వి .భాస్కరరావు ,ఏఆర్వీ. చారి, కేఎస్. వైద్య వంటి వారు నిర్బంధంలోనూ పత్రికా రచనను నిబద్ధతతో నిర్వహించారన్నారు. నైజాం విముక్త స్వాతంత్ర పోరాటంలో పత్రికలు తమ వంతు పాత్రను పోషించాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఓరుగల్లు ఉత్సవ సమితి డాక్టర్ గోపరాజు నారాయణరావు గారిని, శ్రీ శంకర్ రావు గారిని ఘనంగా శాలువా, జ్ఞాపికతో సత్కరించింది.

ఓరుగల్లు సాహితీ ఉత్సవాల సందర్భంగా “నైజాం విముక్త స్వాతంత్ర్య పోరాటం-రజాకార్ల అరాచకాలు” అనే అంశంపై కవితల పోటీని నిర్వహించింది. ఓరుగల్లు సాహితీ ఉత్సవానికి హాజరైన 45 మంది కవులు, కవయిత్రులు శ్రీ అరబిందో సొసైటీ హనుమకొండ, చైర్మన్ శ్రీ వరిగొండ కాంతారావు గారి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని నిజాం నిరంకుశ పాలనలో హిందువులపై జరిగిన రజాకార్ల అరాచకాలపై కవితల రూపంలో గొంతెత్తి పాడుతూ ఉంటే హాజరైన సాహిత్య అభిమానుల కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. చివరలో ఓరుగల్లు సాహితీ ఉత్సవానికి హాజరై కవితా పఠణము చేసిన కవులు, కవయిత్రులందరినీ ఓరుగల్లు ఉత్సవ సమితి సత్కరించింది. ఈ కవితా పోటీల్లో విజ‌యం సాధించిన వారికి సత్కరించి నగదు పురస్కారాన్ని అందజేశారు.

ముగింపు సమావేశానికి కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు హాజ‌రై మాట్లాడారు. కాకతీయుల వైభవోపేతమైన పాలన నుండి నిజాం నిరంకుశ పాలన వరకు సమాజంలో ఎంత అల్లకల్లోలం ఉన్నా ఇక్కడి కవులు, రచయితలు, సాహితీవేత్తలు నిశ్శబ్దంగా కావ్యాలు రాస్తూ, రచనలు చేస్తూ తమ సాహిత్య సాంస్కృతిక ప్రవాహాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తూ, తమ వంతు కృషి చేశారని ఆయ‌న అన్నారు. 1323లో కాకతీయరాజ్య పతనము జరిగిన తరువాత జరిగిన విధ్వంసం గురించి గంగాదేవి అనే కవయిత్రి ఒక కావ్యం రాసి ఆనాటి విధ్వంసకర చరిత్రను గ్రంథస్తం చేసిందన్నారు. అనేక రకాల సంస్కృత, ఆంధ్ర గ్రంధాలు, అనేక రచనలు ఇక్కడ వచ్చాయన్నారు. ఓరుగల్లులోని ఉర్సు గుట్టమీద తెలుగు లిపిలో శిలల మీద కావ్యాలు ఆనాటి కవులు చెక్కారన్నారు. నన్నయ కంటే ముందు కూడా తెలంగాణ ప్రాంతంలో కొన్ని పద్యాలు రచించినట్లు ఆధారాలు దొరికాయి అన్నారు. ఇక్కడ సాహిత్యం, సంస్కృతాంధ్ర సాహిత్యాలు, దృశ్య శ్రావ్య సాహిత్యాలు, అనేక రకాల సాహిత్య మార్గాలు వృద్ధి చెందాయన్నారు. కొంతమంది సాధువులు, సంతులు, భైరాగులు పాటలు పాడుతూ, తత్వాన్ని చెబుతూ సమాజాన్ని మేల్కొల్పారన్నారు. మట్టెవాడకు చెందిన లింగమూర్తి అనే కవి సీతారామాంజనేయ కావ్యాన్ని రాశారన్నారు. గార్లపాటి రాఘవ రెడ్డి గారు రుషి తుల్యులని ఆయన పేర్కొన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో కాళోజీ నారాయణరావు గారు నరసింహావతార కథ చెబుతూ ఆనాటి ఇబ్బందులను ప్రచారం చేశారన్నారు. మన వారసత్వం , పూర్వీకులు మ‌న‌కిచ్చిన సాహిత్య సంప‌ద‌ను నిలబెట్టడానికి ఈ సభ నాంది కావాల‌ని ఆయన అన్నారు.

నాల్గవ సంగోష్టిలో ఆచార్య కొక్కొండ విజయబాబు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు ఆనాటి వైభవోపేతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని అన్నారు. కాకతీయులు తమ సామ్రాజ్యంలో అనేక దేవాలయాలను నిర్మించి సంస్కృతీ పరిరక్షకులుగా కీర్తి గడించారన్నారు. ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవ చక్రవర్తి, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి కాలంలో అనేక దేవాలయాలు నిర్మాణమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు. దేవాలయాల ద్వారా సంగీతం, నృత్యం, శిల్పం, లలిత కళలను ఆనాటి పాలకులు పోషించారన్నారు. ఓరుగల్లు సామ్రాజ్యంలో పాలంపేట, జాకారం, రామానుజాపురం, పిల్లలమర్రి ,నాగులపాడు, పానగల్, కూసుమంచి ,హనుమకొండ, ఓరుగల్లు, గణపురం లాంటి అనేక ప్రాంతాలలో పలు ఆలయాలు నిర్మించారన్నారు. కాకతీయుల కాలం నాడు నిర్మాణమైన ఈ ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం, సమాజంపై ఉందని ఆయన అన్నారు.