సమాజం సంఘటిత శక్తిగా నిర్మాణం అయినపుడే దేశం శక్తివంతం అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ ఏలె శ్యాంకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ ‘సార్వజనికోత్సవం’ సభలో శ్యాంకుమార్ ప్రధాన వక్తగా ప్రసంగించారు.
అంతకు ముందు ‘పథసంచలన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు కవాతు నిర్వహించారు. తర్వాత కళాశాల మైదానంలో సార్వజనికోత్సవం జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల అయ్యప్పస్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు రాచ విద్యాసాగర్ గురుస్వామి పాల్గొనగా, ప్రధాన వక్తగా ఏలే శ్యాంకుమార్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ హిందూ సమాజాన్ని సంఘటిత పరిచే పనిచేస్తుందని, సమాజం సంఘటితం అయితేనే శక్తివంతం అవుతుందని, సమాజం శక్తివంతం అయినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు.
హిందూ సమాజం బలహీనమైతే ఈ దేశం కూడా బలహీనమవుతుందని, అందుకే హిందూ సమాజ స్థితిగతులపై ఈ దేశం భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ఇందు కోసమే 92 సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్ సమాజాన్ని సంఘటితం చేసే పని చేస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్ర ఉద్యమంతో పాటు విప్లవాలు, శాంతియుత ఉద్యమాలను చేపట్టిందన్నారు.
మనది అత్యంత శక్తివంతమైన, సంపన్న దేశమని, అత్యంత తెలివి తేటలు, శాస్త్రాలు ఉన్న దేశమని, ఇక్కడి నుండే ప్రపంచానికి భారత దేశం జ్ఞాన బిక్షను ప్రసాదించిందని అన్నారు. అయితే మన అనైక్యత వల్లే భారత దేశం వందలాది సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిందని, ఇలా ఎందుకు జరిగిందో హిందూ సమాజం తెలుసుకోవాలన్నారు.
800 సంవత్సరాలు మొగులాయిలు, 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మనల్ని పాలించారని, అన్నీ ఉన్నా పరాయి పాలనలో, బానిసత్వంలో మగ్గామని అన్నారు. మన దేశానికి వచ్చి పాలించిన వారు సామర్య్థం కలవారు కాదని, మన కన్నా బలహీనులని, మన సమాజంలో కొన్ని బలహీనతలు చోటు చేసుకోవడం వల్లే ఈ పరిణామం ఉత్పన్నం అయిందన్నారు.
మన సమాజంలోనే బలహీనతలు, అవలక్షణాలు, వికృతాలు చేరి మన సంఘటితాన్ని దూరం చేశాయన్నారు. మన సమాజాన్ని, మన దేశాన్ని శాశ్వతంగా పాలించాలని, ఆంగ్లేయులు అనుశాసన రహిత, అసంఘటిత పరిచే చర్యలు చేపట్టారని, ఇందుకోసం మనలో భ్రమలు, అపోహలు నింపారని, మనది దేశం కాదని, రాజ్యాల కూటమి దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారని అన్నారు. అనేక భాషలు, సంస్కృతులు, ఆచారాలు, అలవాట్లతో విభిన్న రకాలుగా ఉన్న మనది దేశం కాదని వాదించారని, ఆర్యు లు ఇక్కడి వారు కారని, మన చరిత్రను వక్రీకరించారని, తప్పుడు సిద్ధాంతాలు ప్రతిపాదించారని, మనది బానిస చరిత్రగా మార్చారని అన్నారు.
(ఆంధ్రభూమి సౌజన్యం తో)