Home News ‘ఇంటలెక్చువల్‌ గూండాయిజం’ ను సహించేది లేదు అట్లే బురద చల్లటము, తోకలు అతికించటమూ చెల్లవు

‘ఇంటలెక్చువల్‌ గూండాయిజం’ ను సహించేది లేదు అట్లే బురద చల్లటము, తోకలు అతికించటమూ చెల్లవు

0
SHARE

‘ఉమ్మెత్తకాయలు తిని చెప్పావా?’ అంటూ చెప్పిన మాటలు ఏబికేగారు తనకు తాను వేసుకోవటం మరింత సముచితంగా ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం జంకటం లేదు. పత్రికల్లో పుటలు నింపటం ఒక తప్పనిసరైన వ్యాపారాంశం కావచ్చు. కాని దానికై బురద చల్లటమూ, తోకలు అతికించటమూ సమర్థనీయం కాజాలవని సాక్షి పత్రిక సంపాదకవర్గం గ్రహించాలని మనవి.

శాస్త్ర పరిశోధనకూ, సత్యాన్వేషణకూ పూర్ణ విరామాలు (పుల్‌స్టాప్స్‌) లేవు. అవి నిరంతరం కొనసాగుతూ ఉండవలసిందే. ఒక నూతనమైన వైజ్ఞానికాంశం వెలుగులోకి వచ్చినపుడు అప్పటివరకు సత్యంగానో, శాస్త్రంగానో చలామణిలో ఉన్నది తప్పుకోక తప్పదు. కాగా సత్యాన్ని ప్రకటించేవారి సంఖ్య ఒకానొక దశలో తక్కువగా ఉండవచ్చు. సత్యంగా ఒక విషయానికి లేబిళ్లు తగిలించి ప్రచారంలో పెట్టే అంశానికి మంది బలమో, ప్రభుత్వంవారి హుకుమో కొంతకాలం ఉంటే ఉండవచ్చు. సినిమా తారల, క్రికెట్‌ యోధుల వంటి ఆకర్షణీయ వ్యక్తుల ఎండార్స్‌మెంట్లు ఉంటే ఉండవచ్చు. అంతమాత్రాన అది మాత్రమే సత్యం, మరేదీ సత్యం కాదనుకోవటం శుద్ధ అమాయకత్వం. అది మాత్రమే సత్యమని నమ్మింప జూడటం, నమ్మని వారికి తోకలు తగిలించటం (జనవరి 23వ తేదీ సాక్షి పత్రికలో సంపాదకీయం ప్రక్కన ప్రచురితమైన ఏబికె ప్రసాద్‌గారి వ్యాసంలోని రేఖాచిత్రం చూడండి) ‘ఇంటలెక్చువల్‌ గూండాయిజం’.

ఇటువంటి గూండాయిజాన్ని పాఠకులు సహించ బోరని హెచ్చరించటం కోసమే కొన్ని విషయాలను మీ ముందు ఉంచవలసి వస్తున్నది.

ఏబికే ప్రసాద్‌గారు చాలా పుస్తకాలు చదివి ఉంటారు. ఎన్ని పుస్తకాలు చదివారో మనకు తెలియదు. కానీ అన్ని పుస్తకాలూ చదివి ఉంటారని, అవన్నీ అవగతం చేసుకున్నారనీ అనుకోలేము గదా! కాబట్టి తమకు తోచిన విషయాలను రాసేటప్పుడు ఒకింత సంయమనం ఉండాలి. అది లోపించటం ఈ వ్యాసంలో కొట్టవచ్చినట్లుగా కనిపించుతుంది. సత్యపాల్‌సింగ్‌ అనే కేంద్రమంత్రి పరిణామ సిద్ధాంతాన్ని ‘ద్వేషించిన’ ఫలితంగానే దానిని ‘ఆడిపోసుకుంటున్నా’రట! డార్విన్‌ పరిణామవాదం చెల్లదని ‘డబాయించేందుకు’ యత్నించారట! డార్విన్‌ పరిణామ వాదాన్ని నిరాకరించటం ఓ ‘వికృత’ సాహసమట! సత్యపాల్‌ కూడా ‘ఆధ్యాత్మిక విలువల చాటున అన్ని రకాల భౌతిక సుఖాలను అనుభవిస్తున్న వారేనట! మన పాఠశాలలు, కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాల నుండి డార్విన్‌ సిద్ధాంతాన్ని తొలగించి వేయాలని అన్నందుకు సత్యపాల్‌సింగ్‌ గారికి ‘పరివార్‌ సిద్ధాంతి’ అని బిరుదునో, హోదానో వ్యాసకర్త ప్రసాదించారు. ఏమిటీ పదజాలం ! చదువుకోనివారు ఉపయోగిస్తే వాచాలత్వం అవుతుందేమో! అయిదు దశాబ్దాల అనుభవమున్న పత్రికా సంపాదకులు ఇలా రాస్తున్నారంటే అది ‘ఇంటెలెక్చువల్‌ గూండాయిజం’ కాక మరేమిటి?

రెండు వందల సంవత్సరాలకు ముందు పాశ్చాత్య ప్రపంచం (క్రైస్తవ ప్రపంచానికి ఇది ఒక ఘనమైన బిరుదు) భూమి బల్లపరుపుగా ఉందనే నమ్మింది. భూమి ఒక గోళమని, సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని చెప్పిన వైజ్ఞానికులకు మరణ శిక్షలు విధించింది. ఆ తర్వాత ఎప్పుడో నూతన దృక్పథాన్ని అలవరచుకొని భూమిని గోళంగా అంగీకరిస్తున్నది. అయితే ఇప్పటికీ భూమి గోళాకారంగా ఉందని చర్చిలో చెప్పరు. (The Two Snuff Boxes) అని ఆంగ్లంలో ఒక పద్యముంది. ‘భూమి ఎలా ఉంటుంది అంటే నా పొడుంకాయలా ఉంటుందని గుర్తుపెట్టుకోండి’ అని విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయుడు సోమవారం నుండి శనివారం వరకు గుండ్రంగా ఉండే పొడుం కాయను, ఆదివారం నాడు పలకలుగా దీర్ఘఘనంగా ఉండే పొడుండబ్బాను ఉపయోగించే వాడని, స్కూలు ఇనెస్పెక్టర్‌ వచ్చి ప్రశ్నించినపుడు విద్యార్థులు భూమి ఆరు రోజులు గూండ్రం గాను, ఆదివారం నాడు పలకల డబ్బాలాగాను ఉంటుందని చెప్పినట్లుగానూ అందులో ఉంటుంది.

తెల్లతోలు ఆంగ్లేయులు మనదేశంలోను, ప్రపంచంలోని మరికొన్ని దేశాలలోనూ వలస పాలన సాగిస్తున్నపుడు ‘సాహెబ్‌ వాక్యం ప్రమాణం’ గా చెల్లుబాటయ్యింది. తెల్లతోలు వాడు ఏమి చెప్పినా, ‘చిత్తం దొరా!’ అంటూ తల ఊపడం మనవారికి అలవాటయ్యింది. అటువంటి రోజులలో డార్విన్‌ పరిణామ సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చింది.

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, భౌతిక, రసాయన శాస్త్రవేత్తలు, ఉద్దండ పరిశోధకులు డార్విన్‌ పరిణామ వాదాన్ని ‘గుర్తించా’రని వ్యాసకర్త అంటున్నారు. గుర్తించటం – అంటే ఏకీభవించటం కాదని మనం గుర్తు చేసుకోవాలి. సృష్టి లేదా ప్రకృతి పరిణామ క్రమాన్ని గురించి మానవాళి పరిశీలనలో ఎన్నెన్ని వివరణలు ఉన్నవో తెలిసీ తెలియని దశలో కొందరు పీఠాసీనులైన మేధావులు డార్విన్‌గారి కృషిని అభినందించి లేదా ప్రశంసించి ఉండవచ్చు. అంతమాత్రాన ‘ఇది తప్ప మరేదీ సత్యం కాదు’ అని వారందరూ అంగీకరించినట్లుగా అనుకోరాదు.

వ్యాసకర్త తన వ్యాసంలో చాలా పిట్ట కథలను, ప్రమాణాలనూ ఉటంకించారు. నేను వారిలాగ, శిక్షణ పొందిన వాడను కాను. ప్రమాణాలను ఉల్లేఖించ టంలో నాకు తర్ఫీదు లేదు. కాని నేను విన్న దానినిబట్టి భారతీయులు సృష్టి వికాసక్రమం గురించి చెప్పుకొనేది ఇలా ఉంటుంది. సృష్ట్యాదియందు ఒకే ఒక పెద్ద జీవకణం ఉండేది. దానికి శక్తి, బుద్ధి, వివేకము, సంకల్పమూ వంటి గుణాలున్నాయి (ఇప్పటి రోబోలకు, కంప్యూటర్‌లకు, రాజనీతి చతురులకు, మానవాళి విధ్వంసకులైన తీవ్రవాదులకూ ఉన్నంత స్థాయిలో ఉండి ఉండవు). ఆ జీవ కణాన్నే తరువాత కాలంలో దైవముగా పిలిచారు. ఆ జీవకణం ‘ఏకో హం; బహుశ్యామ’ అని సంకల్పించినదట! ఒక ముద్దగా ఉన్న నేను వివిధ ఆకృతులు కల్గిన అనేక (బహు) ప్రాణులుగా రూపుదిద్దుకోవాలి అనే కోరిక నుండి సృష్టి పరిణామం ముందుకు సాగుతూ వచ్చింది. భారతీయుల దృష్టిలో దైవం అంటే మరణానంతరం స్వర్గానికో, నరకానికో తీసుకొనిపోయి పడవేసే రవాణా వ్యవస్థ కాదు. మనమూ, మన చుట్టూ ఉన్న మానవాళి, జంతు జాలమూ, వృక్ష జాలమూ, కొండలు, నదులు, సముద్రాలు, ఆకాశం లోని గ్రహాలు, నక్షత్రాలూ అంతా దైవమే. అందుకే గోవు, గంగ, తులసీ మాతగా పిలుస్తున్నాం. సూర్యుడు భగవానుడు. అరుంధతి వందనీయ.

ఆ ఒక పెద్ద జీవకణం-అనేక రూపాలు సంతరించుకొనే క్రమంలో ఏది ముందు, ఏది వెనుక అనేది ఎలా చెప్పగలం? మనకున్న వివేకంతో ఒక మేరకు ఊహించగలం. జల చరాలు, ఉభయ చరాలు, నేలపై నడచిన చతుష్పాదులు, రెండు కాళ్లపై నడుస్తున్న మనిషి, ఆకాశంలో విహరిస్తున్న పక్షులు, రకరకాల యంత్రాలను రూపొందించుకొని, వినియోగించుకొంటున్న ఆధునిక మానవుడు, తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకొంటున్న ఆశపోతు వినియోగదారులు.. స్థూలంగా ఈ పరిణామ క్రమాన్ని నమ్ముతున్న వారూ ఉన్నారు. సర్వసమర్థులైన వారే నిలిచి ఉంటారు. మిగిలినవారు నశించిపోతారు (Survival of the fittest, Natural selection) వంటి సిద్ధాంతాలు, మనకు అబ్బురంగా అనిపించ వచ్చు. కొన్ని రకాల జంతువులు కాలక్రమంలో నశించిపోయాయనీ అనుకోవచ్చు. కాని వేల ఏండ్లు గడిచినా లక్షల రకాల జంతువులు, వృక్షాలు ఇంకా సంతతిని వృద్ధిచేసుకొటూనే ఉన్నవి గదా! ‘విలక్షణత’ అనేది ఈ సృష్టికి సహజ ధర్మం కాకపోతే, కలసి జీవించటం (అందులో ఘర్షణ ఒక మేరకు అనివార్యం అనేది ఒక వికృతమైన అనివార్యం కావచ్చు) అనేది ప్రకృతిసిద్ధ స్వభావం కాకపోతే ఈ సృష్టి, ఈ ప్రకృతి ఇలా కొనసాగటం ఎలా సంభవమవుతున్నది ? తోటి ప్రాణిని ఆదరిస్తూ, కలసి జీవించే గుణానికి ఈ దేశంలో వ్యవహారనామం ధర్మం. జ్యోతిష శాస్త్రాన్ని, బల్లి శాస్త్రాన్ని నమ్మితేనే ఒక వ్యక్తికి ధర్మం పట్ల శ్రద్ధ ఉందనీ, నమ్మకపోతే ధర్మం పట్ల శ్రద్ధ లేదనీ ఎవరూ అనటం లేదు.

విని, అర్థం చేసుకొనేవారి స్థాయిని బట్టి ఒకే విషయాన్ని వివిధ పద్ధతులలో వివరించటం లోకంలో ఉన్న రివాజు. పురాణకథలు ఆ విధంగా రూపుదిద్దు కొన్నవి. స్మృతుల నుండి, పురాణాల నుండి ఎక్కడి నుండో ఒకటి రెండు విషయాలను ఎత్తిచూపి అవి అసంబద్ధంగా ఉన్నవి కాబట్టి భారతీయులు గతంలో సమకూర్చిపెట్టిన జ్ఞాన విజ్ఞానాలను తోసిపుచ్చటం విజ్ఞత కాదు.

దశావతారాల కథలలో పరిణామక్రమం గురించి వివరంగా ఉందని భావిస్తున్న వారెందరో ఉన్నారు. ‘ఏకో హం-బహు శ్యామ’ నుండి మొదలు పెట్టి తరతరాలుగా ఈ దేశంలో విలసిల్లిన జ్ఞానాన్ని మన పాఠశాలలో, కళాశాలల్లో ఎందుకు బోధించుకో రాదు ? (పాఠ్యక్రమం రూపొందించుకొనే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసికొనే ఈ పని చేయాలి) పూర్వాపరాలు ఏవీ చెప్పకుండా ‘కోతి నుండి పుట్టాడు మానవుడు’ అనే అసందర్భమైన రొడ్డకొట్టుడు పాఠాలే ఎందుకు చదవాలి ? (వ్యాసం మధ్యలో వేసిన బొమ్మ సూచించేది ఇదే గదా?)

‘పరివార్‌’ వ్యాప్తిచేస్తున్న మూఢవిశ్వాసాలు ఏవో పరిశోధించి ఏబికే ప్రసాద్‌ గారు ఒక జాబితా తయారు చేస్తే పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాగా తెల్లతోలు డార్విన్‌ని, తెల్లతోలు కార్ల్‌మార్క్స్‌ని పట్టుకొని వేలాడటమే అన్నింటికీ మించిన మూఢవిశ్వాసమని నాబోటి వారికి కల్గుతున్న అభిప్రాయం.

‘ఉమ్మెత్తకాయలు తిని చెప్పావా?’ అంటూ చెప్పిన మాటలు ఏబికేగారు తనకు తాను వేసుకోవటం మరింత సముచితంగా ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం జంకటం లేదు.

పత్రికల్లో పుటలు నింపటం ఒక తప్పనిసరైన వ్యాపారాంశం కావచ్చు. కాని దానికై బురద చల్లటమూ, తోకలు అతికించటమూ సమర్థనీయం కాజాలవని సాక్షి పత్రిక సంపాదకవర్గం గ్రహించాలని మనవి.

– వడ్డి విజయసారథి, 9493173187