Home Telugu Articles వివేకుని మాట భారతి పరమవైభవానికి బాట

వివేకుని మాట భారతి పరమవైభవానికి బాట

0
SHARE

                     –రాంనరేష్ 

(12జనవరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా)

హిందూ సంస్కృతి వైభవాన్ని విశ్వ యవనిక పై ఎలుగెత్తి చాటీన మహామేధావి, ఇనుప కండరాలు ,ఉక్కు నరాలు, వజ్ర కఠోర సంకల్పబలం ఉన్న యువత ఈ దేశానికి కావాలని పిలుపునిచ్చిన ప్రేరణ దాత, గాంధీజీ, ఠాగూర్ ,జగదీష్ చంద్రబోస్, జంషెడ్జీ టాటా వంటి ఎందరో ప్రముఖులకు స్ఫూర్తిప్రదాత,పతితుల బతుకుల దాగిన పరమాత్ముని దర్శించిన వాడు, వసుధైక కుటుంబ భావనను తన మధుర వాక్కులందు వ్యక్తపరచిన వాడు, తన కన్నుల ఇంద్రజాలం తో లోకాన్ని శాసించిన వాడు, తన కంఠమున హిందు దుందుభి మోగించిన వాడు, సంద్రాన్ని అలవోకగా ఈదిన సంకల్పబలం కల్గినవాడు, దేవుడు ఎక్కడున్నాడని పరిశోధించి సాధించిన జిఙాసువు, చిన్ననాటినుండే అందరూ సమానమే అని చాటిన సమరసతావాది, భారత సాంస్కృతిక వారధి,త్యాగ భావనల పునాది,యుగ ప్రబోధ కుడు, విజ్ఙాన చంద్రుడు అతడే మన వివేకానందుడు.

నాడు యువతరాన్ని ఏకతాటిపై నిలిపి వారిలో ఆత్మస్థైర్యం, సేవ, త్యాగ భావనల పునాది వేసిన వివేకుడే నేటికీ ఈ ఆధునిక యుగంలో కూడా లక్షలాది యువకులు నిస్వార్థ బుద్ధితో తమ జీవనకుసుమాలను భరతమాత పాదాల చెంత అర్పించడానికి ప్రేరణదాతగా నిలుస్తున్నాడు. స్వామి వివేకానంద ఈ పేరు వింటేనే  లక్షలాది మందిలో కణకణమూ ఉత్తేజితం అవుతుంది. స్వామి వివేకానందుని సూక్తులు నేటికీ ఎందరెందరినో ప్రభావితం చేస్తున్నాయి. విద్యాలయాలు గ్రంథాలయాలు ఎక్కడ చూసినా మనకు ఆ సూక్తులే  దర్శనమిస్తాయి. నాటి సోదరి నివేదిత మొదలుకుని నేడు కృత్రిమ కాళ్లతో ఎవరెస్టును అధిరోహించిన అరుణిమా సిన్హా లాంటి ఎందరెందరికో సంకల్పబలం అందించిన స్ఫూర్తి ప్రదాత వివేకుడు. అలాంటి వీర విక్రమ సింహుడు 1863జనవరి12 మకరసంక్రాంతి రోజు కలకత్తా నగరంలో భువనేశ్వరి దేవి విశ్వనాథ దత్త దంపతులకు నరేంద్రుడు అనే నామధేయంతో జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్ననాటినుండే దాతృత్వం,నేతృత్వం,కర్తృత్వం,సమరసత,సత్య శోధన,తాత్విక చింతన,ఏకాగ్రత,ధీరోదాత్తత  లాంటి సుగుణాలెన్నో ఈ నరేంద్రునిలో పరిఢవిల్లాయి.

దాతృత్వం
నరేంద్రుడు బాలుడిగా ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో ఆడుకుంటూ బయట చిరిగిన దుస్తులతో ఒక సన్యాసి భిక్ష కోసం వచ్చిన విషయాన్ని గమనించి పరుగున వెళ్ళి తన ఒంటిపైనున్న ధోవతిని విప్పి ఆనందంగా ఇచ్చేస్తాడు. ఇది గమనించిన పెద్దలు ఎవరైనా సన్యాసి, భిక్షకులు తమ ఇంటి వద్దకు వస్తుంటే నరెంద్రున్ని మేడ మీది గదిలో తాళం వేసేవారు.కానీ అతనిలోని దాతృత్వం ఆగలేదు.కిటికీలలోంచి తన చేతికి ఏది దొరికితే అది ఆ భిక్షకుల వైపు వేసేవాడు వాడు.

సమరసత
తండ్రి విశ్వనాథ్ దత్తా పేరొందిన లాయరు కనుక తన దగ్గరికి వచ్చే అతిథులకు బెంగాలీ సాంప్రదాయం ప్రకారం వారికి హుక్కాలు  అందించే వారు ఇలా ఇక్కడ కులాల వారీగా హుక్కాలు  ఏర్పాటు చేయడం గమనించి నరేంద్రుడు ఒక కులం హుక్కాతో ఇంకో కులం వారు పొగ తాగితే ఏమవుతుంది? భగవంతుడు అందరినీ ఒకేలా సృష్టించాడు గదా! అంటూ తాను అన్ని హుక్కాలు  పీలుస్తాడు. హుక్కాలన్నీ ఒకటే వాటిలో ఏ భేదమూ ఎలా లేదో అలాగే మనుషులంతా ఒకటే అని అంటాడు.
మరోసారి తాను చికాగో నుండి వచ్చిన తరువాత మూడు రోజులుగా ఏకధాటిగా ఉపన్యసించడం గమనించిన ఒక చర్మకారుడు మీరు ఆకలితో ఉన్నారు వంట చేసుకోవడానికి సరుకులు ఇస్తాను అంటే నాకు నీ దగ్గర ఉన్న రొట్టె కావాలి అని తీసుకొని తినడం వివేకుని సమరసతకు నిదర్శనం.

జిజ్ఙాస, సత్యశోధన
తోటి పిల్లలు అందరితో కలిసి జామతోటలో ఆడుకుంటున్నప్పుడు తోటమాలి చెట్టుపై బ్రహ్మరాక్షసి ఉన్నదనగానె అందరూ పారిపోతే ఆ బ్రహ్మ రాక్షసి చూడందే నేను చెట్టు దిగననడం నరేంద్రుడి లోని సత్యశోధన నైజాన్ని తెలుపుతుం.ది అదే విధంగా ఇంటికి వచ్చిన పెద్దలను దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడగడం వారిని చూపించమని అడగడం చివరికి రామకృష్ణ పరమహంస ద్వారా కాళికామాత దర్శనం చేసుకోవడం కూడా వివేకుని లోని జిజ్ఙాసకు నిదర్శనం.

ఏకాగ్రత
నరేంద్రుడు ఏకాగ్రతకు మారుపేరు. ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యాన మందిరంలో కి పాము వస్తే అందరూ వెళ్ళిపోయినా ఇతడు నిశ్చలంగా ఉండటం చూసి పాము వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం నరేంద్రుడి ఏకాగ్రతకు నిదర్శనం. అదేవిధంగా లైబ్రరీ లోపల ప్రతిరోజు ఒక గ్రంథాన్ని తీసుకెళ్ళి తిరిగి తెచ్చిచ్చి రెండో రోజు మరో గ్రంథం తీసుకు వెళ్లడం గమనించిన లైబ్రేరియన్ నువ్వు నిజంగా చదువుతున్నావా అని అడిగినప్పుడు మీరు ఏ పేజీలో విశయం అడిగినా చెబుతానని అందులోని విషయాలను చెప్పడం నరేంద్రుడి లోని ఏకసంతాగ్రహి కి నిదర్శనం.

ధీరోదాత్తత
తాను 12 సంవత్సరాల బాలునిగా ఉన్నప్పుడు జట్కా వాన్ని పడవేసి గుర్రము దౌడు  తీసుకుంటే అందులోని యువతి రక్షణ కోసం తాను ఒక్క ఉదుటున లంఘించి గుర్రముపైకెక్కి గుర్రాన్ని దారికి తేవడం నరేంద్రుడి ధీరోదాత్త కు నిదర్శనం. ఈగుణమే  విశ్వమత  మహాసభలకు పయనమైనపుడు నావలొ తన వస్తువువులు విసిరెసిన ఆగ్లెయుని పట్ల, చికాగో విశ్వమత మహాసభలో తనను అవహేళన చేసిన ఇతరుల పట్ల ప్రవర్తించిన తీరు తెల్పుతుంది. సర్వమత మహాసభలో “మీరంతా బావిలొని కప్పలు. మీ మతం ద్వారా మోక్షం వస్తుంది అని అన్య మతాలు పనికిరావనడం వృధా అని మా హిందూ ధర్మం విశాల భావన కలిగి ఉందని” ధైర్యంగా ప్రకటించడం అతని ధీరోదాత్తతకు మచ్చుతునక.

నేతృత్వం
తన గురుదేవులు రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం  సాధన చేసి, కాలినడకన దేశ పర్యటన చేసి దీన, దరిద్ర జనోధ్ధరణకు పూనుకోవడం, అనేకమంది నాస్తికులను ఆస్తికులు గా మార్చడం ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలవడం అతడి నేతృత్వ నైజాన్ని తెలియజేస్తుంది.

చిర స్పూర్తి ప్రదాత
స్వతంత్ర విప్లవవీరుల దగ్గర వివేకుని సాహిత్యం లభించింది అని ఆయనే వారికి స్ఫూర్తినిచ్చిన ట్లు ఆంగ్లేయులు చరిత్రలొ రాశారంటేనె నాటి నుండి నేటి వరకు ఎప్పటికీ ఎన్ని కాలాలు మారినా సర్వమానవాళికి చిర స్పూర్తి ప్రదాత గా నిలిచి ఉంటాడు అని చెప్పవచ్చును.

స్వదేశీ, ఆత్మ నిర్భర భారత స్పూర్తి
“మన సహజ శక్తిని అనుసరించి మనం పెరగాలి. విదేశీ భావ దాస్యం మనకు ప్రయోజనం లేదు. మనల్ని వంకరటింకర మెలితిప్పి విజాతీయ రూపాలు తయారు చేయడం అసాధ్యం. ఇతర జాతుల వ్యవస్థలను నేను నిందించడం లేదు. అవి వారికి శుభప్రదమే కానీ మనకు అనవసరం. నీస్వశక్తి పై నిలబడి చచ్చినమేలే. ప్రపంచంలో పాపం  ఏదైనా ఉందంటే అది దౌర్భల్యమే. ఈ దుర్భలతె  మృత్యువు. ఈ దుర్భలత తొలగించండి. స్థిరత్వం లేని వారు మానవులు కారు.”
అన్న ఇలాంటి వివేకుని వాక్కులే మన స్వదేశీ, ఆత్మ నిర్భర భారత్ కు స్ఫూర్తి వాక్కులు. జంషెడ్జీ టాటా లాంటి వారికి స్వయంగా కర్మాగారం ప్రారంభించమని చెప్పి స్వావలంబన భారతానికి పునాదులు వేశారు వివేకానంద స్వామి.

విద్య
ఈ దేశానికి ఇప్పుడు విద్య విద్య విద్య విద్య ఒక్కటే కావాలి. నేను ఐరోపాలోని అనేక నగరాల్లో సంచరించునపుడు పేద  ప్రజలకు సైతం  అక్కడగల విద్యావసతులను చూశాను. వెంటనే మన దేశ పేద ప్రజల స్థితి తలచి కన్నీరు కార్చాను. ఈబేదానికి కారణం ఏమి అని ఆలోచిస్తే విద్య అని స్పురించింది. ఈ విద్య వల్లే ఆత్మవిశ్వాసం కలిగి వారిలోని ఆత్మ శక్తి జాగృతమై ఉంటుంది కానీ నేడు మనలోని ఆత్మశక్తి క్రమంగా నిద్రాణం అవుతోంది. లేవండి విద్య నేర్చుకోండి. మీ జాతి చరిత్ర తెలుసుకోండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి అని పిలుపునిచ్చారు వివేకుడు.

దేశభక్తి
పాశ్చాత్య లోకం భోగభూమి. నా దేశం యోగ భూమి, పుణ్య భూమి అంటూ విదేశాల నుండి తిరిగి రాగానే కొలంబో రేవు పట్టణం లో భూమిపై ఇసుకలో పొర్లాడటం *the soil of India is my greatest heaven* అని చెప్పడం, విదేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడి దీనస్థితిని తలచి కటిక నేలపై నిద్రించడం వివేకుని ప్రఖర దేశభక్తికి నిదర్శనం.

విశ్వమానవుడు

మీరు మీ దేశాలనుండి బిషప్  లను కాదు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి, మానుండి ఆధ్యాత్మిక చింతనను పొందండి అపుడే తూర్పు పడమర కలిసి విశ్వశాంతి లభిస్తుంది అని చెప్పడం అతని విశ్వమానవ తత్వానికి నిదర్శనం.

కోటానుకోట్ల దేవి దేవతలను పక్కనపెట్టి ఒకేఒక్క దేవతను ఆరాధించాలి ఆమె భరతమాత అన్న వివేకుని బాటలో నడుద్దాం. భారతి పరమవైభవాన్ని సాధిద్దాం.