Home News పరమాత్మ తత్వాన్ని మేల్కొలపడమే “మ‌హా శివరాత్రి” విశేషం

పరమాత్మ తత్వాన్ని మేల్కొలపడమే “మ‌హా శివరాత్రి” విశేషం

0
SHARE

మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం
న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు:
చిదానంద రూపశ్శివోహం శివోహం…

అంటూ ఆదిశంక‌రాచార్యులు నిర్వాణ‌ష‌ట్కంలో వ‌ర్ణించారు. దీన‌ర్థం ఏంటంటే నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను, చిత్తమునూ కాను, నేను చెవుల‌నూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐన నాసికనూ కాను, నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుడైన‌టువంటు శివుడ‌ను నేను అని భావం.

పరమ మంగళకరమైనది శివ స్వరూపం. అతన్ని నిరాకారంగానూ, సాకారంగానూ రెండు రకాలుగా ఆరాధిస్తాం. సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మరల్చడమే శివతత్వం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఒక్కసారి కనుక అవగతమైతే గొప్ప యోగి అవతాడనడంలో సందేహమేమీ లేదు. శివుణి సాకార రూపానికి ప్రతిరూపం శివలింగం. ఆ లింగం ఉద్భవించిన రోజే మహాశివరాత్రి.

అసలైతే ప్రతి నెల కృష్ణ చతుర్దశిని ‘మాస శివరాత్రి’ గా శివుడిని ధ్యానిస్తూ జరుపుకుంటాం. కానీ మాఘ‌మాసంలో వ‌చ్చే  కృష్ణ చ‌తుర్ధ‌శిని మ‌హాశివ‌రాత్రిగా శాస్త్రాలు నిర్దేశించాయి.  శివ పర్వాల్లో అత్యంత ప్రధానమైన ఈ మహాశివరాత్రిని ‘శివ ధర్మ వృద్ధికాలం’ అంటారు. సంవత్సరమంతయూ శివపూజ చేయుట‌ వలన ఏ ఫలాన్ని పొందుతామో, అంతటి ఫలముని శివ‌రాత్రి నాడు శివార్చన వలన మ‌నం పొందగలం. ప్రళయకాలంలో బ్రహ్మ, విష్ణువుల కలహాన్ని తీర్చి సాకారరూపమైన లింగ రూపంలో ఆ మహాశివుడు ఉద్భవించిన రోజే మహాశివరాత్రి అని శివమహాపురాణం పేర్కొంటోంది.

‘న రుద్రో రుద్రమర్చయేత్’ అనగా రుద్రుడు కాకుండా రుద్రుని అర్చింపరాదని, సోహం భావముతో శివార్చన చేయాలని అది శంకరాచార్యులు చెప్పారు.  శివ ధర్మాలు ప్రధానంగా అయిదు విధాలు. అవి.. క్రియ, తపస్సు, జపం, ధ్యానం, జ్ఞానం. వీటిని చక్కగా చేస్తే ‘శివయోగి’ అవుతారు. అతడి జన్మ చరితార్థమై, కైవల్యం పొందుతారు.శివలింగాన్ని పూజించడం ఇందులో ముఖ్యం.ఎందుకంటే నిరాకరామైన శివతత్వాన్ని పొందాలంటే సకార రూపంలో ఆరాధించాల్సిందే.

నియమాలతో శరీరాన్ని తగిన విధంగా శోషింపజేయడమే తపస్సు. అందుకు అనుగుణంగా శాస్త్రాల్లో నిర్దేశించిన వ్రతాల్ని ఆచరించాల్సి ఉంటుంది. వీటిలో మహా శివరాత్రి వ్రతం ఉపవాసానికి ప్రత్యేకం. కార్తిక, శ్రావణ మాసాల్లో శివ వ్రతాలకు ‘జాగరణ’ చెప్పలేదు. ‘నక్త’ వ్రతం మాత్రమే చెప్పారు. ఈ మహాశివరాత్రికి ఉపవాసమే ముఖ్యమైనది. అనంతరం- జాగరణం. ఈ రాత్రి మధ్యకాలానికి ‘తురీయ సంధ్య’ అని పేరు. శుద్ధమైన పరమాత్మతత్వానికి సంకేతమిది. ఇది యోగాల్లో ధ్యాన సమాధి స్థితిని తెలియజేస్తుంది. నిత్య సాధనల కంటే- సర్వకాల సాధనలకు సిద్ధి శీఘ్రంగా లభిస్తుంది కాబట్టి, ఈ మహాపర్వంలో శివసాధనకు ప్రాముఖ్యముందని రుషి వాక్యం.

భారతీయ యోగవిద్యలో మంత్ర యోగానికి ప్రాధాన్యమిచ్చారు. ‘యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞం శ్రేష్ఠం’ అని గీతావాక్యం. మానసిక యోగానికి, శారీరక కర్మకు బలమిచ్చే శక్తి జపానికి ఉంది. దాన్ని ‘వాచిక యజ్ఞం’ అంటారు. బుద్ధిని ఏకాగ్రం చేసి, ప్రాణాయామం ద్వారా శుద్ధిని పొంది, హృదయ మధ్యంలోనో భ్రూమధ్యంలోనో శివుణ్ని ధ్యానించాలి. ఓంకారంగా, జ్యోతి స్వరూపుడిగా, స‌గుణాకారుడిగా, నిరాకారుడిగా ఇలా అనేక స్వరూపాల్లో దేనినైనా ధ్యానించవచ్చు.ఈ సాధ‌న‌ని మాన‌వులు నిర్వ‌హిస్తే అత‌డు ప‌రిపూర్ణ శివ‌త‌త్త్వంతో భాసిల్లుతాడు.

ఇక ఉప‌వాసం అంటే కేవ‌లం ఆహారం తిన‌కుండా ఉండ‌డం అని మాత్ర‌మే అర్థం కాదు, .  భక్తి లేకుండా నిరాహారంగా రోజు గడిపివేస్తే అది ఉపవాసం కాదు. జీవాత్మను పరమాత్మ సన్నిధిలోకి తీసుకుని వెళ్ళాలి. అంటే, మన మనస్సు, మాట, చేష్టలు ఆ పరమశివుని కోసమే ఉండాలి. మనస్సులో మరో భావనకు చోటులేకుండా, జీవాత్మ పరమాత్మల ఐక్యవాసమే ఉపవాసం.

మంగళం, శాంతి, శుద్ధం, క్షేమం, మోక్షం, భద్రం- ఇన్ని అర్థాలు ‘శివ’నామానికి ఉన్నాయి. ఈ శివమే స్వరూపంగా, స్వభావంగా కలిగిన పరమాత్మ- శివుడు. శాంతిని, శుద్ధతను, శుభాన్ని తెలియజేసే శబ్దం- ‘శమ్‌’. ఈ శాంతి శుద్ధ శుభాలకు మూలమైనవాడు ‘శంభు. అతడే శివుడు…శివ‌త‌త్త్వం మాన‌వ మేధ‌స్సుకు అంద‌ని విష‌యం. ఆధ్యాత్మిక చింతనతో పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని అంటిపెట్టుకునే కలవరపాట్లు, భ్రమ, భ్రాంతి వదిలి పెట్టి కైవల్య ప్రాప్తికి సాధకుడు చేసే ప్రయత్నమే ‘శివరాత్రి. వక్రమార్గంలో నడిచే మనసును అదుపులో ఉంచుకొని, మనసులో అంతర్లీనమైన పరమాత్మ తత్వాన్ని మేలు కొల్పడమే దీని ఉద్దేశ్యం.  అనగా ఆధ్యాత్మిక పరంగా ఆత్మనివేదనగావించ‌గ‌లిగేలా చేయ‌డ‌మే  శివరాత్రినాడు చేసే నిజ‌మైన‌ దీక్ష. ఆ శివ‌త‌త్త్వాన్ని అర్థం చేసుకుంటూ మ‌నంద‌రిపై కూడా ఆ ఈశ్వ‌రుడి కృప క‌ల‌గాల‌ని వేడుకుంటూ.. ఓం ఇతి శివ‌మ్!