Home Telugu Articles సమతా మూర్తి విగ్రహం సమరసతకు సంకేతం

సమతా మూర్తి విగ్రహం సమరసతకు సంకేతం

0
SHARE

-వకుళాభరణం రాంనరేష్ కుమార్

ముచ్చింతల దివ్యసాకేత క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా…

హైదరాబాద్ లోని శంషాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216అడుగుల రామానుజాచార్యుల భారీ పంచలోహ విగ్రహం ప్రధాని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. దీనికి సమతామూర్తి అని నామకరణం చేశారు.

ఒక మామూలు సన్యాసికి ఇంత భారీ విగ్రహమా?? దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధాని, రాష్ట్రపతి లాంటివారు రావాలా??? అంటే అవుననే చెప్పక తప్పదు. రామానుజులు మామూలు సన్యాసి కానే కాదు.
మనం ఇప్పుడు చెబుతున్న సామాజిక సమరసతకు ఆనాడే బాటలు పరచిన గొప్ప సమరసతా వారధి శ్రీ రామానుజులు.

విశిష్టాద్వైతం బోధించి భక్తి ఉద్యమాన్ని రగుల్కొల్పిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవ సారథి శ్రీరామానుజులు. వీరు పింగళ నామ (కలియుగం శాలివాహన శకం4118, క్రీ.శ.1017) సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పంచమి రోజున కాంతిమతి కేశవాచార్యులకు జన్మించారు. వీరి జన్మస్థలం భూతపురి నేటి శ్రీపెరంబుదూరు (ఇది చెన్నైకి 25కిమీ దూరం). వీరిని ఆదిశేష అవతారం గా భావిస్తారు.

ఆధ్యాత్మిక విప్లవం
బాల్యమునుండే మెండైన ఆధ్యాత్మిక విప్లవ భావాలు వీరి సొంతం. గురువైన యాదవ ప్రకాశకులతో విభేదించి తన విశిష్టాద్వైతమును నెగ్గించుకున్న ప్రతిభాశాలి రామానుజులు. విశిష్టాద్వైతం ప్రకారం కుల భేదం లేకుండా ఎవరైనా శ్రీమన్నారాయణుని పూజించుటకు అర్హులే.

అందరికీ మోక్షం లభించెటట్లైతే నేను నరకానికి వెళ్లడానికి సిద్దం
యుక్తవయసులొ యామునాచార్యుల వద్ద విద్యను అభ్యసించిన అనంతరం మంత్రోపదేశం కోసం తిరుకొట్టియార్ లోని గోష్టీపూర్ణులు అనే గురువును ఆశ్రయిస్తారు. వీరు శ్రీపెరంబుదూరు నుండి తిరుకొట్టియార్ వరకు కాలినడకన రామానుజులవారిని 18సార్లు తన వద్దకు తిప్పుకుని, పరీక్షించి చివరకు ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రోపదేశం, చరమ మంత్ర రహాస్యాల బోధ చేస్తారు. ఈ మంత్రం మోక్షప్రదాయిని కనుక రహస్యంగా ఉంచాలని గొష్టీపూర్ణులు ఆదేశిస్తారు. కానీ దాన్ని గురువునుండి విన్న వెంటనే బయటికి వచ్చి 4అంతస్థులుగా ఉన్న తిరుకొట్టియూరు గుడి గోపురం పైకి ఎక్కి అందరికీ వినబడేట్లు, అందరూ ఉచ్చరించేట్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉచ్చరిస్తారు. వెంటనే పరుగున వచ్చిన గురువు నీవు నరకానికి పోతావేమో అంటే అందరికీ మోక్షం లభిస్తూంటే నేను ఒకడిని నరకానికి వెళ్లడానికైనా సిద్దం అంటారు. ఇంతకన్నా ఆధ్యాత్మిక విప్లవ భావాలకు నిదర్శనం ఇంకేమి కావాలి.

కులం కన్నా గుణం ముఖ్యం
ఈ విషయం భగవద్రామానుజులు తన జీవితంలో అడుగడునా నిరూపించారు. రామానుజుల బాల్యంలో కంచీపూర్ణుడు అనే భక్తుడు రోజూ కాలినడకన కాంచీపురం నుండి శ్రీపెరంబుదూరు మీదుగా ఎక్కడో దూరాన ఉన్న దేవాలయానికీ వెళ్ళి పూజలు చేసి వస్తుండేవారు. ఇది ప్రతిరోజూ గమనించిన రామానుజులు ఒకరోజు కంచీపూర్ణులను ఇంటికి పిలిచి భోజనం పెట్టి కాళ్లు నొక్కడానికి సిద్ధపడతారు. అంతలో కంచీపూర్ణుడు నేను నిమ్న కులస్థుడిని. మీరు నాకాళ్ళు పట్టడం తగదు అంటాడు. అంతలో రామానుజులు భగవంతుని భక్తి శ్రద్ధలతో సెవించేవారు అందరూ తనకు గురు సమానులే అంటూ కంచీపూర్ణుల కాళ్లు పడతారు.

మరొసందర్భం లో… మల్లుడు అనే శిష్యుని తత్వఙ్ఞానిగా చేయడం, తాను ప్రతిరోజూ స్నానం చేసి మెట్లు ఎక్కేటపుడు శిష్యులంతా చూస్తుండగా మూలధనుర్ధరుని భుజం ఆసరాగా చేసుకుని మెట్లు ఎక్కడం, స్వామికి ధరింపజేసే ధోవతిని చక్కగా ఉతికి తెచ్చే చాకలిని శ్రీరంగంలోని గర్భగుడిలోకి తీసుకెళ్ళి రంగనాథుని దర్శనం చేయించడం… ఇలా ఒకటేమిటి.. వారి జీవితంలో అడుగడుగునా సామాజిక సమరసత దర్శనం ఇస్తుంది.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి :-

ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సమాజ పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో , మార్చటమో చేయటం ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.

దేవుడిని పూజించటం , మోక్షాన్ని సాధించటం , మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును కాదనే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే.
ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు , తమకు కీడు జరిగినా , పదిమందికి జరిగే మేలుకై , తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

ఆలయ వ్యవస్థల సశక్తీకరణ
వీరు దేశంలోని శ్రీరంగం, తిరుమల సహా అనేక చోట్ల దేవాలయాలలోని పూజా విధానాలను ఆలయ వ్యవస్థలను సశక్తీకరణ గావించారు. తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా ఏకాంగి వ్యవస్థను ఏర్పరచారు. తర్వాతి కాలంలో ఇదే జియ్యర్ల వ్యవస్థగా మారింది. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని భగవద్రామానుజులే నిర్మించారని ప్రతీతి. నాటి యాదవరాజు అక్కడి ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి దానికి రామానుజపురం అని నామకరణం చేశారు. అదే నేటి తిరుపతిగా మారింది. శ్రీరంగంలో తన జీవితకాలంలో ఎక్కువభాగం గడిపిన భగవద్రామానుజులు శ్రీరంగనాథుని చేరి తనను రప్పించుకొమని ప్రార్థించి 1137వ సంవత్సరం(ఇది కూడా పింగళ నామ సంవత్సరమే) మాఘశుధ్ధ దశమినాడు పరమపదం చేరారు.

రామానుజుని సమతా మూర్తి

రామానుజుల స్పూర్తిని అందరికీ అందించడానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి దివ్య సాకేతం శంషాబాద్ ఆశ్రమంలో 216అడుగుల భవ్య రామానుజుల సమతా మూర్తి నిర్మాణ ప్రారంభం జరుగుచున్నది.
45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో ఈ దివ్యక్షేత్రం. ఆరేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుంది.
1800 కిలోల బరువుతో 216 అడుగుల ఎత్తుతో ఉన్న రామానుజుల పంచలోహ విగ్రహం చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. అక్కడే గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’ నిర్మాణం జరిగింది.

సమతామూర్తి చుట్టూ 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు మనకు ఆలయాలుగా దర్శనం ఇవ్వనున్నాయి.. మధ్యలో భారీ మండపంతో సమతా మూర్తి విగ్రహం ఎదురుగా చక్కగా తీర్చిదిద్దిన కమలంలోనుండి ఆవిర్భవిస్తున్నట్లుగా అగుపించే శ్రీరామానుజుల దివ్యమూర్తిని మనం ప్రతి సాయంకాలమూ దర్శించవచ్చు. చుట్టూగల వాటర్ ఫౌంటెన్ లా నుండి వచ్చే దివ్య జలాలతో వెలిగిపోయే సుందర దివ్యరూపాన్ని కనులారా దర్శించవచ్చు. అదే సమయంలో రామనుజుల కీర్తనలను శ్రావ్యంగా వినిపిస్తాయి. సూర్యాస్తమయం తరువాత రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు. దివ్యక్షేత్రం ఆవరణలో రాజస్థాన్‌లో లభించే పింక్‌ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. కాగా సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. గర్భగుడిలో స్తంభాలపై చెక్కిన ఆకృతులు అలరిస్తున్నాయి. దివ్యక్షేత్రం పనులకోసం 1200 మంది శిల్పులు, ఇతర చేతివృత్తి కళాకారులు నిరంతరం పనిచేసారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు ఆకట్టుకుంటున్నాయి. విభిన్న రంగులతో కూడిన రెండు లక్షల మొక్కలు ఉద్యానవనాల్లో ఉన్నాయి. రాష్ట్రపతి, ప్రధాని రాక నేపథ్యంలో ముచ్చింతల చుట్టు పక్కల రహదారులను పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.

పద్మపీఠంపై పద్మాసనంలో ఆసీనుడిగా త్రిదండ ధారుడై.. ముకుళిత హస్తాలతో దివ్య తేజస్సుతో కూడిన ఆయన మోమును చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది! అన్నీ ఒక్కటే.. అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహం దివ్య కాంతులీనుతోంది.

ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలు జరగనున్న ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు! శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి సంకల్పంతో ముచ్చింతల్‌ దివ్యక్షేత్రంలో పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు పాల్గొన్నారు. ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని వాతావరణ మార్పులను తట్టుకొని వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని పలు భాగాల కోణంలో చూస్తే.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మ పీఠం 27 అడుగులు, శ్రీరామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఈ సమతామూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు వేదికను సిద్ధం చేశారు. ఈ గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు.
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు వస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగశాలల్లో 1035 హోమగుండాలను సిద్ధం చేశారు. హోమంలో రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని దేశీయ ఆవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన రెండు లక్షల కిలోల నెయ్యిని వినియోగిస్తున్నారు. రుత్వికులు హోమాల్లో పారాయణాల్లో పాల్గొంటారు. పండితులు కోటి సార్లు అష్టాక్షరి మహా మంత్రాన్ని జపిస్తారు.
కార్యక్రమాలు ఇలా జరగనున్నాయి…
ఫిబ్రవరి 3న: అగ్ని ప్రతిష్ట, అష్టాక్షరి జపం
5న: ప్రధాని మోదీ రాక, రామానుజాచార్య మహావిగ్రహావిష్కరణ
8, 9 తేదీల్లో: ధర్మసమ్మేళనం
10న: సామాజిక నేతల సమ్మేళనం
11న: సామూహిక ఉపనయనం
12న: విష్ణు సహస్రనామ పారాయణం
13న: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక
14న: మహా పూర్ణాహుతి
భగవద్రామానుజులు ఆచరించి చూపిన సామాజిక సమరసతను అందరమూ పాటిద్దాం అనే సంకల్పం అందరిలో కలగడానికి ఈ సమతామూర్తి స్పూర్తికేంద్రం వేదిక అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి చక్కని అవకాశాన్ని కల్పించిన చిన్నజీయర్ స్వామివారు ఆరామానుజుల సమతా సందేశాన్ని లోకానికి చాటి చరితలో నిలిచిపొనున్నారు.
మనమూ ఆ దివ్యక్షేత్రాన్ని దర్శిద్దాం. సమరసతను ఈ లోకాన చాటుదాం….