Home Telugu Articles ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు

ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు

0
SHARE

– డా. శ్రీరంగ గోడ్బోలె

మత నిష్ట కలిగిన ముస్లింకు స్వీయ వివేకం కంటే మతసూత్రాలే ఎక్కువ. ఇస్లాం మత సూత్రాలకు ప్రధానంగా మూడు ఆధారాలు ఉన్నాయి. అవి- ఖురాన్, హదీస్ (మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలు లేదా ఆచరించిన పద్దతులు), సిరా(మహమ్మద్ ప్రవక్త జీవితచరిత్ర) లేదా సున్నా (మహమ్మద్ ప్రవక్త సంప్రదాయం లేదా అనుసరించిన మార్గం). వ్యక్తిగత స్థాయిలోనైనా, సామాజికంగానైనా ఏదైనా ఆలోచన, చర్య నైతికమైనవి, చట్టబద్దమైనవి అవునా, కాదా అన్నది మతగ్రంధమే నిర్ధారిస్తుంది. నిజాయితీ, న్యాయం, మంచితనం, వివేకం, పవిత్రత మొదలైనవాటిని మతగ్రంధమే నిర్వచిస్తుంది, వివరిస్తుంది. ఆ నిర్వచనం, వివరణ ప్రపంచపు ప్రమాణాలకు తగినట్లుగా ఉంటుందని ఏమి లేదు. కొన్నిసార్లు విరుద్ధంగా కూడా ఉండవచ్చును. ఉమ్మా(ముస్లిం వర్గం) ఏ జాతీయతకూ పరిమితమైనది కాదు. ఎందుకంటే ముస్లిం సమూహాన్ని భౌగోళికమైన సరిహద్దుల ఆధారంగా విభజించడాన్ని ఇస్లాం తీవ్రంగా నిరసిస్తుంది. ఏ జాతీయతకు పరిమితంకాని ధోరణి `ప్రపంచ ఇస్లాం అనే రాజకీయ ఉద్యమంగా ఎలా రూపొందిందో గుర్తించడం అంత కష్టమైన పనేమీకాదు. ఆరేళ్లపాటు భారతీయ ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమాన్ని సాగించారంటే దానికి మతపరమైన సమ్మతి తప్పకుండా ఉందని మనం గ్రహించాలి. ఇలాంటి మతపరమైన అంగీకారం, సమ్మతి ఉన్నదంటే ఇలాంటి ఖిలాఫత్ ఉద్యమాలు ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని కూడా గుర్తించాలి.

For regular updates, kindly download the “Samachara Bharati” app at http://www.swalp.in/SBApp or at Google Playstore

 ఇక్కడ `ప్రపంచ ఇస్లాం’(Pan Islam) గురించి రెండు మాటలు. ఈ పదాన్ని మొట్టమొదటసారిగా ఫ్రాంజ్ వాన్ వెర్నర్ (మురాద్ ఎఫన్దీ) తన టర్కీ ప్రణాళికలు (జర్మన్ భాషలో టర్కిస్కోస్కిజెన్), 1877 అనే పుస్తకంలో వాడాడు. ఆ తరువాత ఫ్రాన్స్ కు చెందిన జర్నలిస్ట్ గాబ్రియల్ చార్మెస్ 1881లో ఈ పదాన్ని ఉపయోగించాడు. ఈ పదానికి ఇస్లాంలో సమానార్ధం కలిగిన పదాలు ఇత్తిహాద్ – ఇ – ఇస్లాం, ఇత్తిహాద్ – ఇ – దిన్, ఉహువ్ వెట్ – ఇ – దిన్. వీటిని ఒట్టమాన్ లు, భారత్ లో ముస్లిం పాలకులు, మధ్యాసియా, ఇండోనేషియా పాలకులు తమ ఉత్తరప్రత్యుత్తరాలలో ఉపయోగించేవారు.(లండన్ విశ్వవిద్యాలయానికి మహమ్మద్ నయీమ్ ఖురేషీ సమర్పించిన The Khilafat Movement in India, 1919-1924, అనే పరిశోధన వ్యాసం, పుట. 6). ప్రపంచ ఇస్లాం అనే మాట తరువాత వచ్చినదే అయినా దానికి ఆధారం మాత్రం `ఈ మన ఉమ్మా అంతా ఒకటే. నేనే మీ సంరక్షకుడిని, భగవంతుడిని. కాబట్టి నాకు తప్ప మీరు మరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు’(23:52) అనే ఖురాన్ సందేశంలో కనిపిస్తుంది.

ఇస్లాం చరిత్రలో ఖిలాఫత్

ఉప పాలకుడు లేదా తరువాతి పాలకుడిని ఖలీఫా (వారసుడు, బహువచనం: ఖులాఫా)అని ఖురాన్ 2.30. 4.59.  6.165, 35.39, 38.26 సురాలలో పేర్కొంది. మొట్టమొదటి ముస్లిం పాలకుడు ప్రవక్త మహమ్మద్(570-632). మహమ్మద్ దివ్య సందేశాలను ఇవ్వడం క్రి.శ 610లో ప్రారంభించినా క్రి.శ. 622లో మదీనా పాలకుడు అయ్యాడు. అలా పదేళ్లపాటు ప్రవక్త, పాలకుడు, సైనికాధికారి, న్యాయనిపుణుడు, న్యాయమూర్తిగా అనేక పాత్రలు పోషించాడు. ఖురాన్, ప్రవక్త మహమ్మద్ లు ఖలీఫా కంటే ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇస్లాం ప్రకారం ప్రవక్త మహమ్మద్ ప్రవక్తలందరిలో ఉన్నతుడు(ఖురాన్ 33:40). అలాగే భగవంతుని సందేశకుడిగా అతని స్థానాన్ని ఇంక ఎవరు తీసుకోలేరు. అయితే పాలకుడిగా ఆయన స్థానాన్ని మరెవరైనా తీసుకోవచ్చని ఖురాన్ చెపుతోంది. `ఓ విశ్వాసులరా! దేవుడికి, అతని ప్రవక్తకు, మీలో (పాలన)అధికారం పొందినవారికి విధేయులై ఉండండి(4:59) అని ఖురాన్ చెప్పింది. హదీస్ కూడా పాలకుడిపట్ల చూపవలసిన విధేయత గురించి అనేక చోట్ల చెప్పింది. `ఎవరైతే భూమిపై అల్లా పాలకుడిని అగౌరవపరుస్తాడో అలాంటివారిని అల్లా కించపరుస్తాడు (తిర్మిజీ, అల్ – హదిత్, మిష్కట్ – ఉల్ – మసబి అనువాదం, సంపుటం; 2, ఇస్లామిక్ బుక్ సర్వీస్, ఢిల్లీ, పుట. 560).

 మొదటి ఖలీఫా అయిన అబూ బకర్ ను ఖలీఫతు రసూల్ అల్ – అల్లా (అల్లా సందేశకుడి వారసుడు)అని అన్నారు. మొదటి నలుగురు ఖులాఫా(ఖలీఫా ఏకవచనం; ఖులాఫా బహువచనం)అబూ బకర్(632-634), ఉమర్(634-644), ఉథ్మన్(ఉస్మాన్, ఒట్టమాన్ 644-656), అలీ(656-661)లును ఖులాఫా రషిదున్(సరైన మార్గంలో నడిచే ఖులాఫా)అని సున్నీ ముస్లిములు పిలుస్తారు. ఈ నలుగురూ ప్రవక్త మహమ్మద్ హాషిమైట్ తెగతో పాటు ఇతర తెగలు ఉన్న ఖురాయిష్ వర్గానికి చెందినవారు. వీరి కాలంలో ముస్లిం సైన్యం సస్సానీద్ రాజ్యాన్ని ఓడించింది. బైజాంటిన్ సామ్రాజ్యాన్ని సగానికి పైగా తగ్గించి, దాదాపు నాశనం చేసింది. దక్షిణ, మధ్యాసియాల్లో ఇస్లాం సామ్రాజ్యాన్ని విస్తరించింది. మొదటి నలుగురు ఖలీఫాల కాలాన్ని ఇస్లాం స్వర్ణయుగంగా పరిగణిస్తారు. అయితే విచిత్రంగా ఈ స్వర్ణయుగంలోనే ఈ నలుగురు ఖలీఫాల్లో ముగ్గురు హత్యకు గురయ్యారు. అలీ తరువాత ఖిలాఫత్ ఉథ్మన్ తెగకు చెందిన ఉమయ్యద్ ల చేతిలోకి వెళ్లింది. వాళ్ళు 90 ఏళ్లపాటు ఖలీఫాలుగా వ్యవహరించారు. ఆ తరువాత క్రీ.శ. 750లో ఉమయ్యద్ లను తొలగించి అబ్బాసిద్ లు ఇరాక్ లోని బాగ్దాద్ లో ఖిలాఫత్ ను ఏర్పాటుచేశారు. వివిధ వంశాలకు చెందినవారికి కూడా అధికారం పంచాల్సివచ్చినా 1517లో టర్కీ కి చెందిన ఒట్టమాన్ ఈజిప్ట్ పై దండయాత్ర చేసేవరకు అబ్బాసిద్ లు బాగ్దాద్ ఖిలాఫత్ ను ఏలారు. ఆ తరువాత 1517 నుంచి 1924 వరకు ఖిలాఫత్  ఒట్టమాన్ ల చేతిలోనే ఉంది. ఒట్టమాన్ సామ్రాజ్యం కేవలం మరొక ముస్లిం సామ్రాజ్యం లేదా రాజ్యం మాత్రమే కాదు. అది ఐదు శతాబ్దాలపాటు క్రైస్తవ యూరోపియన్ లకు వ్యతిరేకంగా పొరాడి ఇస్లాంను నిలబెట్టింది. 1453లో సుల్తాన్ మెహ్మెట్ కాన్ స్టాంటిన్ నోపుల్ ను జయించాడు.

ఇస్లామిక్ చరిత్రలో ఖిలాఫత్ గురించి అభూత కల్పనలు

ఒకే ఉమ్మా(ముస్లిం వర్గం) గురించి మతగ్రంధాలు ఎంత చెపుతున్నా, యదార్ధం మాత్రం మరో విధంగా ఉంది. ఇస్లాం చరిత్ర చూస్తే వివిధ ముస్లిం వర్గాలు, సమూహాలు ఎల్లప్పుడు పరస్పరం ఘర్షణ పడుతూనే ఉన్నాయని మనకి తెలుస్తుంది. ప్రతి వర్గం మిగిలినవారంతా మతసూత్రాలను ఉల్లంఘించినవారేనని, తాము మాత్రమే వాటిని తూచ తప్పకుండా పాటిస్తున్నవారమని చెప్పుకోవడం కనిపిస్తుంది. అవిశ్వాసులతో వ్యవహారించవలసి వచ్చినప్పుడు మాత్రమే ఈ ముస్లిం ఉమ్మా గుర్తుకువస్తుంది. అప్పుడు మాత్రమే ఒక మతవర్గంగా ప్రవర్తిస్తారు. ప్రవక్త మహమ్మద్ చనిపోయి రెండు దశాబ్దాలు కాకుండానే ముస్లింలలో షియా వర్గానికి చెందినవారు ఖిలాఫత్ ఎందుకని ప్రశ్నించారు. ఆలీకి ముందున్న వారిని ఖలీఫాలుగా గుర్తించమని తేల్చిచెప్పారు. అలాగే ఖలీఫా ఖురాయిష్ తెగకు చెందివారే ఉండాలా అన్న చర్చ సున్నీలలో మొదలైంది.

క్రీ.శ. 750నాటికి ముస్లిం ప్రపంచం అంతా గుర్తించిన ఖిలాఫత్ ఏది లేకుండా పోయింది. స్వతంత్ర పాలకులు కూడా అమీర్ – ఉల్ – మోమినిన్ (విశ్వాసుల నాయకుడు, సేనాధిపతి), ఖలీఫా వంటి బిరుదులు ధరించడం మొదలుపెట్టారు. ఒక సమయంలో తమకే విశ్వాసుల గుర్తింపు, గౌరవం ఉన్నాయంటూ చెప్పుకున్న ఖలీఫాలు ఏకంగా ముగ్గురు ఉన్నారు. ఇలా `ప్రధాన ఖిలాఫత్ నామమాత్రమైనదే అయినా అల్ – మావర్దీ (974-1058), అల్ – ఘజలి(1058-1111) వంటివారు మాత్రం ఖిలాఫత్ అధికారం ఏమాత్రం తగ్గలేదంటూ ప్రచారం చేస్తూవచ్చారు. సున్నీ ముస్లింలు మాత్రం కైరోలోని అబ్బాసిద్ ఖులాఫా లకు, ఆ తరువాత కాన్ స్టాంటిన్ నోపుల్ లోని ఒట్టమాన్ లకు విధేయంగా ఉన్నారు.

భారత్ లో సుల్తాన్, ఖలీఫాల మైత్రి

క్రీ.శ. 711లో అరబ్ లు సింద్ ప్రాంతంపై దండెత్తిన నాటినుంచి భారత్ కు ఈ ప్రధాన ఖిలాఫత్ అనే కట్టుకధ వినడం అలవాటైపోయింది. మొగల్ పాలనకు ముందు సుల్తాన్ లకు చట్టబద్దమైన ఆమోదం, గుర్తింపు బాగ్దాద్ లోని అబ్బాసిద్ ఖులాఫాల నుంచి, ఆ తరువాత కైరోలోని వారి వారసుల నుంచి లభిస్తుందని నమ్మేవారు. ఘజ్నాకు చెందిన మహమ్మద్(998-1030), షమ్స్ – ఉద్ –దీన్ ఇల్ తుత్ మిష్ (1211-1236), మహమ్మద్ బిన్ తుగ్లక్(1325-1351)వంటి సుల్తాన్ లు ప్రత్యేకంగా ఖలీఫా గుర్తింపు పొందారు. ఢిల్లీ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం పొందిన కొద్దిమంది సున్నీ పాలకులు కూడా అబ్బాసిద్  ఖులాఫా ల పేర్లను తాము విడుదల చేసిన నాణాలపై ముద్రించారు.

 ఖిలాఫత్ కైరో నుంచి కాన్ స్టాంటిన్ నోపుల్ కు మారిన సమయంలోనే భారత్ లో మొగలుల పాలన(1526) మొదలైంది. రెండు సామ్రాజ్యాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు 18వ శతాబ్దం వరకు కొనసాగినా మొగలులు ఇతర స్వతంత్ర రాజుల(షియా పర్షియా) మాదిరిగానే తమది ప్రపంచ ఖిలాఫత్ సామ్రాజ్యం అనే ఒట్టమాన్ ల వాదనను మాత్రం ఎప్పుడు అంగీకరించలేదు. అయితే మొగలుల సామ్రాజ్యం బీటలువారడం మొదలుపెట్టినప్పటి నుంచి వారి ధోరణి కూడా మారింది. 18వ శతాబ్దపు ద్వితీయార్ధం వచ్చేనాటికి భారత్ లో ముస్లింలు మళ్ళీ మెల్లగా ఒట్టమాన్ లకు మద్దతునివ్వడం ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన షా వలీ ఉల్లా అనే సూఫీ తన తాఫీమత్ – ఇ – ఇలహియా అనే గ్రంధంలో టర్కీ సుల్తాన్ ను అమీర్ – ఉల్ – మోమినిన్ అని సంబోధించాడు. ఇక 1789లో టిప్పు సుల్తాన్ ఒట్టమాన్ ల గుర్తింపును పొందే ప్రక్రియను మళ్ళీ ప్రారంభించాడు. ఒట్టమాన్ ఖలీఫా అబ్దుల్ – హమీద్ I నుంచి టిప్పు అదికారిక గుర్తింపు పొందాడు.

భారతీయ ఉలామాల టర్కీ వ్యామోహం

ఒట్టమాన్ ఖిలాఫత్ పట్ల భారతీయ ముస్లింల వ్యామోహం 1840నుంచి పెరిగింది. వలీ ఉల్లా మనవడైన షా మహమ్మద్ ఇషాక్ (1778-1846) ఒట్టమాన్ రాజకీయ విధానాలను సమర్ధించిన బహుశా మొట్టమొదటి భారతీయ అలీమ్(పండితుడు; బహువచనం: ఉలామా)కావచ్చును. అతను 1841లో మక్కాకు వలసపోయాడు. అప్పటి నుంచి ఉలామా అంతా, ముఖ్యంగా వలీ ఉల్లా వర్గానికి చెందినవాళ్ళు, ఒట్టమాన్ ను ప్రపంచ ఖిలాఫత్ గా గుర్తించడం ప్రారంభించారు. 1850 తరువాత సుల్తాన్ లను భారత్ లో ఖలీఫా ప్రతినిధులు అనే ప్రచారాన్ని ఒట్టమాన్ లే ప్రారంభించారు.

 1854లో ప్రారంభమయిన క్రీమియా యుద్ధం (బ్రిటన్, ఒట్టమాన్ టర్కీ, ఫ్రాన్స్ లతో కూడిన కూటమికి, రష్యాకు మధ్య జరిగింది. ఇందులో రష్యా ఓడిపోయింది) భారత్ లోని ముస్లింలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా దేశపు పశ్చిమ ప్రాంతంలో ఉన్నవారు ఆ యుద్ధాన్ని చాలా ఆసక్తిగా గమనించారు. 1858లో ముస్లిం పాలన దాదాపుగా అంతమైనప్పుడు ముస్లింల చూపు కాన్ స్టాంటిన్ నోపుల్ వైపు మళ్ళింది. బ్రిటిష్ అణచివేత, వ్యతిరేకతను ఎదుర్కునేందుకు, తమకంటూ ఒక `కేంద్రాన్ని ఏర్పాటుచేసుకునేందుకు భారతీయ ఉలామా ఒట్టమాన్ ఖలీఫా వైపు చూశారు. రహమతుల్లా కైరన్వి(1818091), హాజీ ఇందాబ్దుల్లా(1817-99), అబ్దుల్ ఘని(1878లో చనిపోయాడు), ఖైరుద్దీన్(1831-1908)లు మక్కాకు వలసపోయారు. అంతేకాదు వారంతా కాన్ స్టాంటిన్ నోపుల్ సందర్శించారు కూడా. వీరేకాదు బ్రిటిష్ వాళ్ళపట్ల విధేయత ప్రకటించిన కరామత్ అలీ జౌన్ పురి (1800-73) కూడా `బ్రిటన్ కు, మా మతాధినేత అయిన టర్కీ సుల్తాన్ కు స్నేహసంబంధాలు ఉన్నాయి అని అన్నాడు.

భారతీయ ముస్లిం మానసంలో ఖిలాఫత్

టర్కీ సుల్తాన్ ల పట్ల ఆరాధనాభావం కేవలం ఉలేమాలకే పరిమితం కాలేదు. అది ముస్లిం పత్రికలతోపాటు సాధారణ ముస్లింలలో కూడా కనిపిస్తుంది. 1850కి ముందు నుంచి ఉన్నా, లేకపోయినా ఆ తరువాత మాత్రం ఈ ధోరణి బాగా కనిపిస్తుంది. 19వ శతాబ్దపు ఆఖరు దశాబ్దాలలో ఈ ప్రపంచ ఇస్లాం ధోరణి బాగా పెరిగింది. 1875 రష్యా, టర్కీల మధ్య యుద్ధం తరువాత ఈ మార్పు వచ్చింది. అలాగే ఇది ఆ తరువాత నాలుగు దబ్దాలపాటు బ్రిటిష్ పాలనలో ముస్లింల వైఖరిని నిర్ధారించింది కూడా. ఆ నాలుగు శతాబ్దాల్లో టర్క్-గ్రీక్ యుద్ధం (1896), ట్రిపోలిపై ఇటలీ దాడి(1911), బాల్కన్ యుద్ధం(1912-14) (Review : The Khilafat Movement : Religious Symbolism and Political Mobilization in India by Gail Minault; Review by Sharif al – Majahid; Pakistan Horizon, Vol. 39, No. 2, 1986, p. 87).

1870నాటి నుంచి ముస్లింలు ఖుత్బ (శుక్రవారం మధ్యాహ్నం చేసే ప్రత్యేక ప్రార్ధనలు)లో ఖిలాఫత్ అల్ – ఇస్లాంకు దీర్ఘమైన ఆయువు, ఐశ్వర్యం, విజయపరంపర దక్కాలంటూ ప్రార్ధించడం ప్రారంభించారు. పత్రికల్లోనూ, బహిరంగంగాను ఖలీఫా కోసం ప్రచారం మొదలుపెట్టారు. (Review : The Khilafat Movement : Religious Symbolism and Political Mobilization in India by Gail Minault; Review by Sharif al – Majahid; Pakistan Horizon, Vol. 39, No. 2, 1986, p. 81). సయ్యద్ అహ్మద్ (1817-98)వంటి మధ్యతరగతి ముస్లిం మేధావులు కేంద్ర టర్కీ ఖిలాఫత్ అనే కల్పనను బాగా ప్రచారం చేశారు.

టర్కీ వ్యామోహపు స్వరూపం

1830 నుంచి భారతీయ ముస్లింలలో టర్కీ అంటే వ్యామోహం పెరగడానికి గల కారణాలను తెలుసుకోవాలంటే మూడు విషయాలను అర్ధం చేసుకోవాలి. మొదటిది, ఈ ప్రపంచ ఇస్లాం అనే భావన పట్ల కేవలం భారతీయ ముస్లింలు మాత్రమే ఆకర్షితులు కాలేదు. 17వ శతాబ్దం మొదటి నుంచి మధ్యాసియా, ఇండోనేషియా, మలేషియాలలో కూడా ప్రపంచ ఇస్లాం పట్ల ఆలోచనలు, ఉద్యమాలు జరిగాయి. రెండవ విషయం, తమ అధికారాన్ని బలపరుచుకునేందుకు, అంతర్గత కలతలను నివారించేందుకు, యూరప్ శక్తుల ఆక్రమణను నిరోధించేందుకు, అరబ్ లు జాతీయవాదాన్ని తిరిగి పెంచకుండా చూసేందుకు సుల్తాన్ అబ్దుల్ అజీజ్(1861-1876), అతని వారసుడు అబ్దుల్ హమీద్(1876-1909) వంటివారు ఈ టర్కీ ఖిలాఫత్ అనే కల్పనను తెరపైకి తెచ్చారు. యూరోప్ శక్తులు కూడా సుల్తాన్ ల ప్రచారానికి సహకరించారు. ఆస్ట్రియా – హంగరీ ఒప్పందం(1908), ఇటలీ(1912), గ్రీస్, బల్గేరియా(1913)వంటి ఒప్పందాల్లో ఖిలాఫత్ ను గుర్తించాయి. మూడవ విషయం, ముస్లిం సమాజాన్ని ఒక తాటిపైకి తేవడం కోసం షియాలు సున్నీలతో కలిసి ఒట్టమాన్ రాజులకు మద్దతు ప్రకటించారు. ఇలా ముస్లింలను ఏకత్రితం చేయడంలో బొహరా నాయకులు బబ్రుద్ధీన్ తయాబ్జీ (1844-1906), మహమ్మద్ అలీ రోగయ్ వంటివారితో కూడిన అంజుమన్ – ఇ – ఇస్లాం (ముంబై), ఆ తరువాత హైదరబాద్ (దక్కన్)కు చెందిన చిరాగ్ అలీ(1844-1895), అమీర్ అలీ (1849-1928), ఆగా ఖాన్ (1877-1957), ఎం. హెచ్. ఇస్ఫాని, మహమ్మద్ అలీ జిన్నా(1876-1948) తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు. (Review : The Khilafat Movement : Religious Symbolism and Political Mobilization in India by Gail Minault; Review by Sharif al – Majahid; Pakistan Horizon, Vol. 39, No. 2, 1986, p. 15)

ఇలా 1919లో ప్రారంభమయిన ఖిలాఫత్ ఉద్యమానికి ఎంతో చారిత్రక నేపధ్యం, భూమిక ఉన్నాయి. అవి భారత్ లో ముస్లిం పాలన కాలానికి చెందినవి. కేంద్ర ఖిలాఫత్ అనే భావనను సుల్తాన్ లు, బాద్షాలు, ఉలమాలు, మేధావులతోపాటు సాధారణ భారతీయ ముస్లింలు కూడా బాగా విశ్వసించారు, ప్రచారం చేశారు. ముస్లిం ప్రపంచం మొత్తానికి చెందిన ఈ నమ్మకం కేవలం భారతీయ ముస్లింలకే పరిమితం కాలేదు. `నాగరిక ప్రపంచంలో హాస్యాస్పదమైనదిగా ముస్తఫా కేమల్ అతతుర్క్ అభివర్ణించిన ఖిలాఫత్ ను రద్దు చేస్తున్నట్లుగా టర్కీ గ్రాండ్ అసెంబ్లీ 1924, మార్చ్ 3న ప్రకటించింది. కాబట్టి ఆ ఖిలాఫత్ ను తిరిగి స్థాపించడం కోసం సాగిన సుదీర్ఘమైన పోరులో ఖిలాఫత్ ఉద్యమం కేవలం ఒక దశ, భాగం మాత్రమే. ముస్తఫా సబ్రి ఎఫెన్దీ(1869-1954), ఆఖరి ఒట్టమన్ షయాఖ్ అల్ – ఇస్లాం(1924), అబు అల్ – అలా మవాదుది(1903-1979), జమైత్ – ఇ- ఇస్లామి(1967), తాకియుద్దీన్ అల్ – నభాని (1909-1979), హిజ్బుల్ – తహ్రీర్ లేదా జోర్డాన్ లో లిబరేషన్ పార్టీ, సయ్యద్ కుద్బ్(1906-66), అబు బక్ర్ అల్ – బాగ్దాద్(1971-2019), ఐసిస్(2014)లు 1924 తరువాత ఖిలాఫత్ గురించి బాగా ప్రచారం చేసి, దానిని సాధించడానికి ప్రయత్నించిన వ్యక్తులు, సంస్థలలో కొన్ని. అలా ఖిలాఫత్ కోసం పోరు సాగుతూనే ఉంది.

(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

“ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర” మొదటి భాగం కోసం క్లిక్ చేయండి