దుర్లభం త్రయమేవాత్ర దైవానుగ్రహ హేతవః
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః
సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి మానవజన్మ, మోక్షప్రాప్తి, మహా పురుషుల సాంగత్యం. – ఆదిశంకరాచార్య
మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84 జీవరాశుల గుండా ప్రయాణించి ఎప్పుడో ఒకప్పుడు మానవ శరీరంలో చేరుతుంది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సుఖ శాంతులతో జీవించాలి. అందుకే ఈ ప్రపంచంలోని మేధావులు మానవ సంక్షేమం కోసం అనేక రకాలుగా శోధించారు. అందులో నుండే వివిధ మతాలు, సిద్ధాంతాలు, తత్వాలు, సంపద్రాయాలు పుట్టు కొచ్చాయి.
ధర్మమే శాశ్వతం
ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సిద్ధాంతాలైన కమ్యూనిజం, క్యాపిటలిజం కూడా సుఖశాంతుల కోసం వ్యక్తి స్వేచ్ఛను, భౌతికవాదాన్ని గురించి చెప్పాయి. అయితే అవి విఫలం అయ్యాయి. జీవితానికి సంపదలు, సుఖశాంతులే కాదు, అరుదైన ఈ మానవజన్మకు సార్థకత కావాలి. మానవ జన్మ అరుదైనది కనుక అన్ని సుఖాలు ఈ జన్మలోనే పొందాలని పాశ్చాత్యులు అనుకుంటారు. కానీ మనం
చలం చిత్తం చలం విత్తం చలే జీవన యౌవనే
చలా చలే హి సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః
చిత్తం (మనస్సు), విత్తం (ధనం), యవ్వనం, జీవితం చివరికి ప్రపంచం కూడ శాశ్వతం కాదు. ధర్మం మాత్రమే శాశ్వతం అని భావించాము. అందుకే సంపన్నులను, ధనవంతులను గొప్పవారిగా మనం భావించలేదు. ధనం శాశ్వతం కూడా కాదు. అందుకే అలెగ్జాండర్ ‘తాను మరణించాక, తన శవపేటికకు రెండు రంధ్రాలు చేసి తన ఖాళీ చేతులు బైటికి కనపడే విధంగా ప్రపంచానికి చూపండి’ అన్నాడు’. ‘అంతపెద్ద రాజు అయుండి కూడా మరణించాక ఖాళీ చేతులతోనే వెళుతున్నాడు కానీ, ఒక్క పైసా కూడా పట్టుకుపోవడంలేదు’ అని దానర్థం.
యయాతి అనే రాజు విలాస జీవితం కోసం తన కుమారుని యవ్వనాన్ని కూడా అడిగి తీసుకున్నాడు. కానీ చివరికి ఆనందం పొందలేక పోయాడు. కనుక యవ్వనం కూడా శాశ్వతం కాదు.
జీవితం కూడా బుద్బుధ ప్రాయం. ‘రేపు’ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ధర్మరాజు జీవితంలోని ఒక సంఘటన మనకు అదే చెబుతుంది. తన దగ్గరకు వచ్చిన భిక్షకునికి దానం ఇవ్వడానికి మరుసటి రోజు రమ్మని ధర్మరాజు చెప్పాడు. అది విని భీముడు ఆశ్చర్యపోతాడు. ‘అన్నా ! రేపటి వరకు నీవు మృత్యువును జయించావా?’ అని అడగడంలోని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి.
త్యాగానికి ప్రతీక
అందుకే భారతీయులు భోగమయ జీవనం కోరలేదు. త్యాగమయ జీవనాన్ని స్వీకరించారు. ప్రతి సమాజానికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆంగ్లేయులు క్రమశిక్షణకు, జర్మన్లు యుద్ధ నిపుణతకు ప్రతీకలు. మన భారతీయులు త్యాగం, సమర్పణ భావాలకు ప్రతీకలు. మన జీవన తత్త్వంలోనే త్యాగం, సమర్పణ సహజంగా కనిపిస్తుంటాయి.
న ప్రజేయా న కర్మణా న ధనేన
త్యాగేనైక అమృతత్వ మానశుః
అనేది ఉపనిషత్తు వాక్యం. జీవితం అమృతమయం కావడమంటే, త్యాగ మయం కావడం తప్ప మరేది కాదు.
మన జీవన పరంపర యజ్ఞభావనతో ముడిపడి ఉంది. యజ్ఞం అంటే సమర్పణ. సమ-అర్పణ. ఇతరులకు అర్పించడం. యజ్ఞం అదే నేర్పిస్తుంది. సమిధలన్నింటిని అగ్ని దేవునికి ఆహుతి ఇస్తూ ‘ఇదం న మమ. ఇదం స్వాహా’ ‘ఇది నాది కాదు, ఇది నీకు అర్పిస్తున్నాను) అంటుంటారు.
‘తేన త్యక్తేన భుంజీతాః’ అనేది మన ఉపనిషత్తులలో చెప్పిన మరొక విషయం. ఈ సృష్టి సమస్తం ఈశ్వరత్వం వ్యాపించి ఉన్నది. నాదంటూ ఏమీ లేదు. నాకు అవసరమైనంత మేరకు మాత్రమే నేను అనుభ విస్తాను. అది కూడా త్యాగమయ భావనతోనే. అంతకన్నా ఎక్కువగా స్వీకరించడం తగదు. ఈ త్యాగం, సమర్పణ అనేవి అత్యుత్తమ సంస్కారాలు. హైందవ జీవనంలో అతి సహజంగా ఇవి అలవడేలా వ్యవస్థ రూపుదిద్దుకుంది.
మన దేశంలో అత్యంత విశేషమైనది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. ప్రతి ఒక్కరు ఇంకొకరి సంక్షేమం ఆకాంక్షిస్తారు. తమకు లేకున్నా కుటుంబంలోని ఇతరులు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ”నా ఇల్లు’ నుండి ప్రారంభించి నా బస్తి, నా గ్రామం, నా దేశం, ఈ ప్రపంచం’ అంతా ఒక్కటనే భావన వికసించాలనేది మన ఆకాంక్ష. అందుకే ‘ఈ భూమి అంతా ఒక్కటే కుటుంబం (వసుధైక కుటుంబం)’ అని ధ్యేయవాక్యంగా ఉపయోగిస్తాం.
ధర్మరక్షణార్థం తన వెన్నెముకను ధారపోసాడు ధధీచి. ఒక పక్షి కోసం తన శరీరం మొత్తం అర్పించాడు శిబి చక్రవర్తి. ప్రాణుల బాధలు తొలగించడానికి సర్వస్వార్పణ చేసాడు మహారాజు రంతిదేవుడు. తనదంతా సమర్పించడానికి సర్వదక్షిణ యాగం చేశాడు రఘుమహారాజు. స్వధర్మ సంరక్షణకు రాజ భోగాలను వదిలి అడవులపాలై కష్టాలను సహించాడు రాణాప్రతాప్. సమస్త రాజ్యానికి తాను కేవలం ప్రతినిధిని అని, తన గురువైన సమర్థ రామదాసు రాజు అని ప్రకటించిన ఛత్రపతి శివాజీ, ఐసిఎస్ చదువును స్వతంత్ర సమరం కోసం తృణప్రాయంగా త్యజించిన నేతాజీ, యౌవ్వనాన్ని వందేళ్ళ జీవితంగా భావించి తనను తానుగా అర్పించుకొన్న భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మదన్‌లాల్ ధీంగ్రా, ఖుదిరాంబోసు; అతి పేదరికంలో వైద్య విద్యను చదివి, తన గురించి ఆలోచించ కూండా జీవితాన్ని గంధపు చెక్కలా అరగదీసిన యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్.. ఇలా రాస్తూ పోతే మనదేశంలో ఇటువంటి త్యాగధనుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
అదే హిందుత్వం
స్వభావరీత్యా మనుషుల్ని 4 రకాలుగా భావించవచ్చు. మొదటివారు రాక్షసులు. వీరికి అన్నీ ఉంటాయి. అవి ఇతరులకు ఉంటే సహించలేరు. ఇతరులు ఎదుగు తూంటే పీడిస్తూ ఆనందిస్తారు. రెండవవారు పశుప్రవృత్తి కలిగినవారు. ఈ వర్గంవారు తమకు తాము సంపాదించు కొని జీవిస్తారు. ఇతరుల దగ్గర లాక్కొని తాము బ్రతుకుతూ ఉంటారు. మూడవ వారు మానవులు. తాము జీవిస్తూ ఇతరులకు సహకరిస్తారు. నాలుగవారు నారాయణులు. తమకు ఏమీ లేకున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇతరులకు మేలుచేసి, వారు సుఖంగా ఉంటే వీరు ఆనందిస్తారు.
మనుషులలో రాక్షస, పశు ప్రవృత్తులు ప్రబలకుండా, మానవత్వం వైపు నడిపించి, అక్కడి నుండి నారాయణ స్వరూపులుగా మార్చే ప్రయత్నమే హిందుత్వం.
సమర్పణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ఈ హిందుత్వం ఆధారంగా జాతి వైభవాన్ని పునర్నిర్మాణం చేయడానికి పరిశ్రమిస్తున్నది. అందుకు వ్యక్తి వ్యక్తిని కలిసి, స్వయంసేవకులుగా తయారు చేస్తూ, వారిలో త్యాగం, సమర్పణ భావాలను పెంపొందిస్తున్నది. దానికి మార్గమే గురుదక్షిణ కార్యక్రమం.
వ్యక్తి శాఖకు రావడంతోనే త్యాగం, సమర్పణ అలవడటం ప్రారంభం అవుతుంది. 24 గంటలలో 23 గంటలు తనకు, ఒక గంట సమాజం కొరకు అనే ఈ భావన స్వయంసేవకులను ఎలాంటి త్యాగానికైనా సంసిద్ధం చేస్తుంది. అలా ఒక గంటతో ప్రారంభించి అనేక గంటలు, రోజులు, సంవత్సరాల తరబడి సమాజ సేవలో స్వయం సేవకులు మునిగి తేలుతుంటారు. నవ యువకులు విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి ప్రచారకులుగా పని చేస్తుంటారు. అలా యవ్వనంలో భవిష్యత్ గురించి ఆలోచించకుండా, వివాహం, కుటుంబం వంటి సౌకర్యాలు లేకుండా, ఏ కీర్తినీ ఆశించకుండా, పేరు ప్రతిష్ఠలు కోరకుండా, ఎలా అంటే అలా, ఎక్కడ అంటే అక్కడ పనిచేస్తుంటారు. ఇది ఒక అద్భుతం. వెను తిరుగకుండా సంపూర్ణ జీవితం సమర్పించేవారు కూడా ఉన్నారు. సమాజంలో అన్నింటి మధ్య జీవిస్తూ, సన్యాస జీవితం గడపడంకన్నా త్యాగం ఏముంటుంది ?
అలాగే అనేకమంది గృహస్థు కార్యకర్తలు తమ వృత్తి, వ్యవహారాలు చూసుకొంటూ సమాజం కోసం అధిక సమయం ఇస్తూ పని చేస్తుంటారు. ఎట్టి అవకాశాలు కోరుకోకుండా ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇరుగు పొరుగు వారు అధికంగా సంపాదిస్తూ ముందుకు పోతున్నా వారిని చూసి చలించిపోరు. కుటుంబం కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తూ, గృహస్థాశ్రమాన్ని సమర్థంగా నిర్వహించుకొంటూ, సంఘ కార్యానికి ఏ మాత్రం తగ్గకుండా సమయం కేటాయించి పనిచేసే లక్షలాది కార్యకర్తలు ఉన్నారు.
‘ధనం, సంపద మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కాలం మళ్ళీరాదు’ అనుకొంటూ స్వయం సేవకులు ధనంతోపాటు అత్యంత విలువైన సమయం కూడా సమర్పిస్తారు. సమాజం కోసం తమ ఇష్టాలను పక్కనపెట్టి, నిష్కామంగా సంపూర్ణ మనస్సుతో అన్ని పనులు చేస్తారు. దీనినే తను, మన, ధన సమర్పణ అంటాం.
గురుదక్షిణ
గురుదక్షిణ ఉత్సవం వ్యక్తిలో ఇటువంటి ఉన్నత భావాలు నిర్మాణం చేస్తుంది. ప్రతి సంవత్సరం స్వయంసేవకులు తను, మన, ధన పూర్వకంగా సమర్పణ చేస్తూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత ముందుకెళ్ళామనేది సమీక్షించు కుంటూ ఉంటారు.
గురుదక్షిణ అనేది చందానో, సభ్యత్వమో, దానమో కాదు. అది సమర్పణ. స్వయంసేవకులు దానిని త్యాగం కన్న కర్తవ్యంగా భావిస్తారు. నిరహంకారంతో, నిస్వార్థ బుద్ధితో, నిజాయితీతో, భక్తి శ్రద్ధలతో, పరమ పవిత్ర భగవాధ్వజం ముందు మోకరిల్లి తమను తాము సమర్పించుకుంటారు. ‘పతత్వేష కాయో’ అంటూ చిట్టచివరి శ్వాస వరకు ఈ భాగ్యం కలగాలని కోరుకుంటూంటారు.
స్వయంసేవకులు గురుపూజలో ఇలా ఆకాంక్షిస్తారు..
తన్ సమర్పిత్ మన్ సమర్పిత్
ఔర్ యహ జీవన్ సమర్పిత్
చాహతాహూ దేశ్ కే లియే ఔర్ భీ కుఛ్ దూఁ
ఓ భారతమాత ! నా తనువు, మనస్సు, ధనము మరియు సంపూర్ణ జీవితం నీకే అంకితం. ఓ భగవంతుడా నాకింకా తృప్తి లేదు. ఈ దేశమాతకు ఇవ్వడానికి నాకు మరికొంత ఇవ్వు.
– కాచం రమేష్,
ఆర్.ఎస్.ఎస్. తెలంగాణ ప్రాంత కార్యవాహ
This article was first published in 2020