పరిపాలనా సంస్కరణల అమలులో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజానీకం తమ కోపాన్ని వెళ్లగక్కెందుకు ఏప్రిల్, 1989లో చైనాలోని బీజింగ్ లో ఉన్న తియనన్మన్ స్క్వేర్ లో ప్రదర్శనలు ప్రారంభించారు. ఉదారవాద కమ్యూనిస్ట్ నాయకుడైన హు యోబాంగ్ మరణానానికి సంతాపం ప్రకటించారు కూడా. ఆ ప్రధర్శన క్రమంగా శాంతియుత నిరసనలుగా చైనాలోని అన్నీ ప్రాంతాలకు విస్తరించాయి. ఈ ప్రదర్శనల్లో ఎక్కువగా విద్యార్ధులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో అవినీతిని అంతం చేయడం, రాజకీయ, ఆర్ధిక సంస్కరణలు వారి ప్రధాన డిమాండ్లు.
వీధుల్లో పది లక్షలమంది ప్రదర్శనకారులు
మే 13న వందలాదిమంది విద్యార్ధి నిరసనకారులు తియనన్మన్ స్క్వేర్ లో నిరాహార దీక్ష చేపట్టారు. కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తమతో చర్చలు జరపాలని పట్టుబట్టారు. దీక్ష చేపట్టిన విద్యార్ధులకు మద్దతుగా పది లక్షలమంది బీజింగ్ వీధుల్లోకి వచ్చారు. వెంటనే పాలనాపరమైన సంస్కరణలు చేపట్టాలని నినాదాలు చేశారు.
సైనిక పాలన విధించారు
మే 19న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నిరసనకారులను కలవడానికి వచ్చారు. అదే రోజు సాయంత్రం విద్యార్ధులు తమ నిరాహార దీక్ష విరమించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరస్తూ ఆ మర్నాడే `అలజడిని కఠినంగా అణచివేయడం’ కోసం బీజింగ్‌లో సైనికపాలన విధించింది ప్రభుత్వం.
ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆ తరువాత కొన్ని వారాలపాటు బీజింగ్ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసన చైనాలోని మిగిలిన ప్రాంతాలకు కూడా పాకింది.
పౌరులపై సైన్యం ప్రతాపం
“సైనిక దళాలు విద్యార్ధులను లక్ష్యంగా చేసుకోవు. ఎట్టి పరిస్థితిలోను అమాయకులైన ప్రజలకు, విద్యార్ధులకు హాని తలపెట్టవు” అని మే1న చైనా అధికారిక వార్తా సంస్థ ప్రకటించింది.
కానీ రెండు రోజుల్లో పరిస్థితి మొత్తం మారిపోయింది. సైనికపాలనను కఠినంగా అమలుచేయడం కోసమంటూ ప్రభుత్వం వేలాదిమంది సైనికులను, వందలాది సాయుధ వాహనాలను తియనన్మన్ స్క్వేర్ కు తరలించింది. బీజింగ్ వీధుల్లో నిరసనకారులను పూర్తిగా తొలగించడమే సాయుధ బలగాల పని. దేశ రాజధానిలో `శాంతిభద్రతలను’ నెలకొల్పడానికే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తియనన్మన్ స్క్వేర్ చేరగానే సైనిక బలగాలు ప్రదర్శనకారులపై విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే కాల్పులు ప్రారంభమయ్యాయి.
“ఆనాటి కాల్పులలో మొట్టమొదట ఒక విద్యార్ధిని బలయ్యింది. ఆమె ముఖం పూర్తిగా రక్తంతో నిండిపోయింది. ఆమెను పక్కన ఉన్న చెట్ల దగ్గరకు తరలించారు. ఆ తరువాత చాటిభాగంలో తీవ్ర గాయమైన మరో విద్యార్ధిని కూడా అక్కడకి తీసుకువచ్చారు.’’ – జాన్ గిట్టింగ్స్, ది గార్డియన్.
సాయుధ బలగాలు నిరంతరంగా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. జనం నలువైపులకు పారిపోతున్నప్పుడు అనేకమంది వీపులో గుళ్ళు దూసుకుపోయి నెలకొరిగారు. అనేకమంది సైనిక వాహనాల కింద నలిగిపోయారు. ఆ కాళరాత్రి ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ కచ్చితమైన లెక్కలు లేవు.
`గాయపడినవారిని మోసుకుని తియనన్మన్ స్క్వేర్ పక్కకు వచ్చాం. అక్కడ సైనికులు శవాలను ప్లాస్టిక్ సంచులలో కుక్కుతూ కనిపించారు. అక్కడ ఎన్ని శవాలు ఉన్నాయో చెప్పలేను…’
`అక్కడ ప్రాణాలతో ఉన్న కొద్దిమంది కూడా ఉన్నారు. వారిని సైనికులు కాళ్లతో తంతున్నారు. అరుపులు, తుపాకి మోత వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడ దాదాపు 200 మంది విద్యార్ధులు ఉన్నారు. జూన్ 9న వారందరినీ బీజింగ్ కు దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతానికి తీసుకువెళ్లి మరణ శిక్ష అమలు చేశారని ప్రజా రక్షణ (పోలీస్) వర్గాల ద్వారా నాకు తెలిసింది. వాళ్ళంతా విద్యార్ధులు, బీజింగ్ పౌరులు.’
ఫిరంగి మనిషి
తెల్ల చొక్కా వేసుకుని, చేతిలో సంచులు పట్టుకున్న ఒక వ్యక్తి మిలటరీ ట్యాంకుల వరుసకు అడ్డుగా నిలబడిన ఫోటో జూన్ 5 నాడు అన్ని విదేశీ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ ఫోటో ఆనాటి ప్రజాస్వామ్య ప్రదర్శనల స్ఫూర్తిని ప్రపంచానికి కళ్ళకు కట్టించింది. ఆ `ఫిరంగి వ్యక్తి’ ఎవరో ఇప్పటివరకు ఎవరికి తెలియలేదు.
ఆ వ్యక్తి ట్యాంకులను ముందుకు కదలనివ్వలేదు. అతని సాహసానికి ఆశ్చర్యపోయిన ఇతర ప్రదర్శనకారులు ట్యాంకులు తొక్కుకుంటూ వెళ్లకుండా అతన్ని పక్కకు లాగేశారు. కానీ నిరాయుధుడైన ఒక వ్యక్తి యుద్ధ ట్యాంకులకు ఎదురు నిలవడం తియనన్మన్ స్క్వేర్ లో జరిగిన శాంతియుత ప్రదర్శనలు, వాటిని క్రూరంగా అణచివేయాలనుకున్న సైనిక చర్యలను చక్కగా తెలియజేసింది.
“మిలటరీ ట్యాంకుల ముందు నిలబడి సామాజిక న్యాయం కోసం అవసరమైతే తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి అసాధారణ ధైర్యాన్ని మనకు ఆ ఫోటో చూపుతుంది”.
`ఫిరంగి వ్యక్తి’ ఫోటోను స్టూవర్ట్ ఫ్రాంక్లిన్ తీశారు.
ప్రదర్శనల తరువాత అణచివేత
సైనికాచర్య ద్వారా తియనన్మన్ స్క్వేర్ ప్రజాస్వామ్య ప్రదర్శనలు అణచివేసిన చైనా ప్రభుత్వం ఆ తరువాత ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొన్నవారిని వేటాడటం మొదలుపెట్టింది. `విప్లవ ద్రోహానికి’ పాల్పడ్డారంటూ వేలాదిమందిని నిర్బంధించి, హింసించి, జైళ్ళలో కుక్కింది లేదా చంపేసింది.
ఎంతమందిని జైళ్ళలో నిర్బంధించారో, ఎంతమందిపై విచారణ సాగించారో, ఎంతమందికి మరణ శిక్ష అమలు చేశారో చైనా అధికారులు ఇప్పటివరకు బయటపెట్టలేదు.
ఈ అమానుషమైన, భయానక దమనకాండకు భయపడి ప్రదర్శనల్లో తమ సన్నిహితులను కోల్పోయినవారు కూడా ఇదేమి అన్యాయమని అడగలేక మౌనం వహించారు. అంతేకాదు చనిపోయిన తమవాళ్ళ గురించి కనీసం బహిరంగంగా మాట్లాడుకోలేని పరిస్థితి. ప్రదర్శనకారులందరిని ప్రభుత్వం `అల్లరిమూకలు’ అని ముద్రవేసింది.
దమనకాండ గురించి మాట్లాడటానికి వీలులేదు
తియనన్మన్ స్క్వేర్ దమనకాండ గురించి చర్చించడంకాని, మాట్లాడటంకానీ చైనాలో నిషేధం. ఎంతమంది చనిపోయారన్నది ప్రభుత్వం ప్రకటించలేదు. నాటి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ సభలు, సమావేశాలు కూడా నిర్వహించడానికి వీలులేదు. అలాంటి ప్రయత్నాలను చైనా ప్రభుత్వం ఏమాత్రం సహించదు. ఎవరైనా ప్రభుత్వ సమాచారాన్ని, వాదనను అంగీకరించవలసిందే.
(Sources: CNN, BBC, The Guardian, New York Times, Washington Post, British and US archives)
This artcie was first published in 2019