Home News వైకోమ్‌ సత్యాగ్రహం హిందూ ఐక్యతకు చిహ్నం : నంద కుమార్

వైకోమ్‌ సత్యాగ్రహం హిందూ ఐక్యతకు చిహ్నం : నంద కుమార్

0
SHARE

వైకోమ్‌ సత్యాగ్రహం జాతీయ స్థాయిలో స్వాతంత్య్ర పోరాటానికి శక్తినిచ్చిందని ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్‌ అన్నారు. కొట్టాయంలో వైకోమ్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘‘జాతీయ పునరుజ్జీవనం` వైకోమ్‌ సత్యాగ్రహం’’ అన్న పేరుతో సెమినార్‌ జరిగింది. ఈ సందర్భంగా ప్రఫుల్ల కేత్కర్‌ మాట్లాడుతూ వైకోమ్‌ సత్యాగ్రహం అంతిమ లక్ష్యమేదైతే వుందో దానిని మనం సాధించామా? లేదా? అని ఆలోచించుకోవాల్సిన సందర్భమిది అని అభిప్రాయపడ్డారు. విశ్వహిందూ పరిషత్‌ నేతృత్వంలో జరిగిన రామజన్మభూమి ఆందోళన హిందూ పునరుజ్జీవనోద్యమ చరిత్రలో మరో మైలురాయి అని, హిందువులంతా ఒక్కటేనని, హిందూ సమాజంలో నిమ్న అనేవారే లేరన్న ఆదర్శాన్ని నిలబెట్టిందన్నారు. నిమ్న కులాలు అని పిలవబడే వారే శిలాన్యాస్‌ చేశారని, ఇలాంటివి చేయడం ప్రతి హిందువు యొక్క హక్కు అని స్పష్టం చేశారు. హిందూ వ్యతిరేకులు దేవాలయ పరిపాలన నుంచి వైదొలగిపోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు సీనియర్‌ ప్రచారక్‌, ప్రజ్ఞా ప్రవాప్‌ా జాతీయ కో ఆర్డినేటర్‌ నందకుమార్‌ మాట్లాడుతూ… వైక్కం సత్యాగ్రహం అనేది కేవలం 20 నెలల ఆందోళన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది చాలా భవిష్యత్తు వుందన్నారు. పునరుజ్జీవనం అనేది భారత్‌కి కొత్త భావనేమీ కాదని, భారత్‌ పునరుజ్జీవన భూమే అని నొక్కి చెప్పారు. సమాజ అధర్మమనే తప్పు దారిలోకి జారిపోయినప్పుడు మనల్ని సరైన మార్గంలోకి నడిపించేదే పునరుజ్జీవనం అని అన్నారు. కొందరు పని గట్టుకొని వైకోమ్‌ సత్యాగ్రహానికి, దక్షిణాదికి వున్న బంధాన్ని తెంచేయాలని చూస్తున్నారని, ఇలా చేయడమంటే దక్షిణాదిలో సనాతన ధర్మాన్ని నిర్మూలించే ప్రయత్నమే అవుతుందన్నారు.

దక్షిణాది రాష్ట్రాలు భారత్‌కి సంబంధించినవి కావని ఓ కథనాన్ని దీనిని అడ్డంపెట్టుకని చేస్తున్నారని అన్నారు. రాబోయే తరాలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి కొత్త కొత్త కథనాలు తయారు చేస్తున్నారని, రామస్వామి నాయకర్‌ కేరళీయులను కులతత్వం నుంచి విముక్తి చేశారు లాంటి కథనాలతో తప్పుదోవపట్టిస్తారని ఉదహరించారు.వైకోమ్‌ సత్యాగ్రహం జరిగిన తీరును కానీ, దాని కోసం త్యాగం చేసిన వారిని మరిచిపోయిన శతాబ్ది ఉత్సవాలు మనకు అవసరం లేదని, సత్యాగ్రహంలో పాల్గొన్న వారి సందేశాలను, దాని లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. వైకోమ్‌ సత్యాగ్రహం సామాజిక ఐక్యతకు, సామాజిక ఏకాభిప్రాయానికి, హిందూ ఐక్యతకు చిహ్నమని నంద కుమార్‌ పేర్కొన్నారు.