Home News మతోన్మాది ఔరంగజేబును సౌమ్యుడుగా వక్రీకరించబడ్డ చరిత్ర మనకొద్దు

మతోన్మాది ఔరంగజేబును సౌమ్యుడుగా వక్రీకరించబడ్డ చరిత్ర మనకొద్దు

0
SHARE

చరిత్ర అనేక పాఠాలు నేర్పుతుంది. నియంతలు, ప్రజా పీడకులకు చరిత్ర పుటల్లో చోటుండవచ్చు. కానీ, వారికి జనహృదయాల్లో మాత్రం స్థానం దక్కదు. తమను మించినవారు లేరని విర్రవీగే పాలకులు మొట్టమొదట ఒంటపట్టించుకోవాల్సిన పాఠమిది! ఔరంగజేబు, దారా షికోవ్‌లు ఇద్దరూ అన్నదమ్ములు. వారు షాజహాన్‌ కుమారులు. పరాయి మతం పొడగిట్టనివాడిగా, భిన్న సంస్కృతులను అణు మాత్రం కూడా సహించలేని నియంతగా ఔరంగజేబు అందరికీ తెలుసు. కానీ, ఆయన తమ్ముడు దారా షికోవ్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నం. భారతీయ బహుళత్వ సంస్కృతిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఆయన- ఇస్లాం, హిందూ మతాల మధ్య సఖ్యత సాధించేందుకు శ్రమించారు. కానీ  కుహనా లౌకికవాదాన్ని పట్టుకువేలాడిన పాలకులు మాత్రం ఔరంగజేబు వంటివారికే పెద్దపీట వేశారు. నియంతల చరిత్రనే ప్రచారంలో పెట్టారు. పాఠ్యపుస్తకాల్లోనూ అలాంటి చరిత్రలనే దట్టించారు. ఫలితంగా జీవితాంతం బహుళత్వ విలువల విస్తరణకు కృషి చేసిన దారా షికోవ్‌ వంటివారు మరుగున పడిపోయారు! ఈ అన్యాయాలను సరిదిద్దాల్సిన బాధ్యత, ఈ తప్పులను మార్చాల్సిన కర్తవ్యం హేతుబద్ధంగా ఆలోచించే ప్రతి ఒక్కరిమీదా ఉంది.

మధ్యయుగానికి సంబంధించిన ఈ చారిత్రక పాత్రలపట్ల వ్యాప్తిలో ఉన్న అభిప్రాయాలను మార్చాల్సి ఉంది. ఇస్లాం, హిందూయిజాలపట్ల ఈ అన్నదమ్ముల దృక్పథాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. హిందువుల దేవాయాలను, పాఠశాలలను కూల్చివేయాలని 1669 ఏప్రిల్‌ 9న ఔరంగజేబు తన గవర్నర్లకు ఆదేశాలు జారీచేశారు. ఆ క్రమంలోనే బెనారస్‌లోని కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని కృష్ణుని ఆలయంతోపాటు సోమ్‌నాథ్‌ దేవాలయంపైనా దాడులు జరిగాయి. ఆ తరవాత పదేళ్లకు అంటే 1679, ఏప్రిల్‌ 2న హిందూ మతస్థులపై అత్యంత అన్యాయమైన జిజియా పన్ను విధించారు. హిందూమతంనుంచి ఇస్లామ్‌లోకి మారినవారికి ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు, జైలు శిక్షలనుంచి మినహాయింపులు ఇచ్చేవారు. 1665లో హిందూ, ముస్లిములకు దిగుమతులపై వేర్వేరు కస్టమ్స్‌ సుంకాలు నిర్ణయించారు. హిందూ వ్యాపారులు అయిదుశాతం, ముస్లిములు 2.5శాతం సుంకం చెల్లించాలని నిర్దేశించారు. 1668లో హిందువుల పండగలన్నింటినీ ఔరంగజేబు నిషేధించారు. 1671లో హిందూ ముఖ్య గుమస్తాలందరినీ తొలగించి, వారి స్థానే ముస్లిం ఉద్యోగులను నియమించారు. ఔరంగజేబు సిక్కులపట్ల మరీ కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు. సిక్కు ప్రార్థనాలయాలను కూల్చివేయాలని ఆదేశించారు. గురు తేజ్‌ బహదూర్‌ సింగ్‌ను బంధించి మత మార్పిడికోసం బలవంతం చేశారు. తీవ్ర హింసలపాలు చేశారు. అందుకు ఆయన సమ్మతించకపోవడంతో పాశవికంగా తల నరికివేశారు. ఆ తరవాత గురు గోవింద్‌ సింగ్‌ నలుగురు కుమారులను చంపించారు. జాదునాథ్‌ సర్కార్‌ అనే చరిత్రకారుడు ఔరంగజేబు వెలువరించిన నిర్ణయాలను, ఆయన జమానాలో చోటుచేసుకున్న ఘటనలను క్రమపద్ధతిలో అక్షరబద్ధం చేశారు.

వివిధ మతాల సారాన్ని తెలుసుకోవడంకోసం తపించిన జిజ్ఞాసువుగా దారా షికోవ్‌ జీవించారు. క్రైస్తవ మతగ్రంథాలతోపాటు హిందూ వేదాంతాన్నీ ఆయన ఔపోసన పట్టారు. సూఫీ తాత్వికుల రచనలను చదివారు. హిందూ పండితుల సహకారంతో ఉపనిషత్తులను ఆయన పర్షియన్‌ భాషలోకి అనువదించారు. మతాల్లోని సార్వత్రిక సత్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించిన దారా షికోవ్‌- హిందూ ముస్లిం మతాల మధ్య సారూప్యతలు ఆవిష్కరించేందుకు కృషి చేశారు. లాల్‌ దాస్‌ అనే హిందూ యోగి, ఫఖీర్‌ సర్మద్‌ అనే ముస్లిం పండితుల వద్ద ఆయన తాత్విక శాస్త్రాన్ని అభ్యసించారు. అయితే షికోవ్‌ పొడగిట్టని ఔరంగజేబు- ఆయనపై మతద్రోహి అన్న ముద్ర వేసి వెలివేశారు. మరణశిక్ష విధించక తప్పదని నాటి మతాధికారులతో తీర్మానింపజేశారు. చివరికి ఔరంగజేబు అమానుషం బారినపడి దారా షికోవ్‌ ప్రాణాలు కోల్పోయారు. మధ్యయుగాలకు చెందిన ఈ నాయకులు పరస్పర విరుద్ధ భావజాలానికి ప్రాతినిధ్యం వహించారు. సుమారు ఏడు దశాబ్దాల క్రితం భారత రాజ్యాంగంలో నిర్దేశించుకున్న సూత్రాల ప్రాతిపదికన చూస్తే ఔరంగజేబుది పూర్తి విరుద్ధ వ్యక్తిత్వం. రాజ్యాంగంలో రాసుకున్న భిన్నత్వంలో ఏకత్వం, సమానతా సూత్రావళికి దారా షికోవ్‌ నిఖార్సయిన ప్రతినిధిగా కనిపిస్తారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉంటే- స్వాతంత్య్రానంతర భారతదేశంలో పాలకులు ఔరంగజేబును ఎందుకు అంతగా నెత్తికెత్తుకున్నారో, ఆయనను ఓ గొప్ప నాయకుడిగా చిత్రీకరిస్తూ పనిగట్టుకుని ఎందుకు ప్రచారం నిర్వహించారో అర్థం కాదు!

నెహ్రూ జమానాలో దిల్లీలోని ఓ ప్రధాన రహదారికి ‘ఔరంగజేబ్‌ మార్గ్‌’గా నామకరణం చేశారు. జీవితాంతం పరమత ద్వేషిగా, నియంతగా బతికిన ఓ వ్యక్తిని అంతగా నెత్తికెత్తుకున్నారంటే ఏమిటి అర్థం? ఆయన విధానాలు ఆదర్శప్రాయమైనవని వారు చెప్పదలచుకున్నారా? మోదీ సర్కారు ఆగమనం తరవాత ఆ తప్పును సరిదిద్దారు.  ఔరంగజేబు పేరిట ఉన్న ఆ రహదారిని 2015లో ‘అబ్దుల్‌కలాం మార్గ్‌’గా మార్చేశారు. మహోన్నత వ్యక్తిత్వానికి, భారతీయ బహుళత్వ విలువలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచిన కలాం పేరును ఆ మార్గానికి ప్రతిపాదించడాన్ని ఎంతోమంది హృదయపూర్వకంగా స్వాగతించారు. మధ్యయుగ నియంతస్వామ్యంనుంచి అబ్దుల్‌ కలాం నమ్మిన మానవీయ విలువల దిశగా దేశాన్ని నడిపించేందుకు ఆ పేరు మార్పు ఓ స్వాగత సూచికగా ఉపయోగపడుతుంది. వలసవాద ప్రతీకలైన కొందరు బ్రిటిషర్ల పేరిట ఏర్పాటైన చిహ్నాల పేర్లను పదుల సంఖ్యలో ఇప్పటికే మార్పు చేసుకున్నాం. కాబట్టి చారిత్రక తప్పిదాలను దిద్దుకోవడం విపరీత చర్యగా ఎవరైనా అభివర్ణిస్తే అది పొరపాటే. దేశానికి ఇప్పుడు కావలసింది అబ్దుల్‌ కలాం విశ్వసించిన విలువలు, సిద్ధాంతాలే!

ఏ సూర్య ప్రకాష్, ప్రసారభారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యం తో)