Home News గల్వాన్: చైనా దాష్టికానికి భారత పరాక్రమానికి నిదర్శనం

గల్వాన్: చైనా దాష్టికానికి భారత పరాక్రమానికి నిదర్శనం

0
SHARE

జూన్ 15: గల్వాన్ అమర జవాన్ల సంస్మరణదినం

శత్రుదేశంలో ఘర్షణ జరిగిందన్నా లేదా యుద్ధం అన్నా దేశంలో ఒక భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంటుంది. అలాంటి వాతావరణమే 2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ వద్ద దేశమంతటా నెలకొంది. ఈ ఘర్షణలో మన భారత జవాన్లు 20 మంది వీరమరణం పొందారు. అది ఎన్నడూ మరిచిపోని చీకటి రోజు. అసలు ఆరోజు గల్వాన్ లోయలో ఏం జరిగిందో మరోసారి మనం గుర్తు చేసుకుందాం.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌- చైనా సైనికుల మధ్య 2020 మే 05 నుంచి ఘర్షణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీటిని పరిష్కరించుకోవడానికి అదే నెల 6న ఇరు దేశాల సైనికాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. అంతటితో ఆ వివాదం ముగిసిందనే అందరూ అనుకున్నారు. అయితే జూన్ 15 సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మూడు వేర్వేరు ఘర్షణలు జరిగాయి. సైనికాధికారులు, నిపుణులు చెప్పిన దానిప్రకారం .. గల్వాన్‌ లోయలోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ వైపు పెట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద ఏర్పాటు చేసిన శిబిరాలను.. చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు చైనా ధ్వంసం చేసింది. ధ్వంసం చేసిన మరుసటి రోజు పెట్రోల్‌ పాయింట్‌ వద్ద భారత భద్రతా బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్‌ సంతోష్‌ బాబు చైనా సైనిక సిబ్బందితో మాట్లాడారు. అయితే జూన్‌ 14న చైనా ఆ శిబిరాన్ని రాత్రికి రాత్రే మళ్లీ తిరిగి ఏర్పాటు చేసింది చైనా. దీన్ని గమనించిన కల్నల్‌ సంతోష్‌ బాబు జూన్‌ 15న సాయంత్రం 5 గంటలకు వాటిని పరిశీలించేందుకు వెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా ఇలాంటి పరిశీలనలకు మేజర్‌ ర్యాంకు కల్గిన కంపెనీ కమాండర్‌ స్థాయి అధికారులు వెళతారు. అయితే గతంలో అక్కడే కంపెనీ కమాండర్‌గా పని చేసి ఉండడం, అప్పటికే పలుమార్లు చైనా సైన్యంతో మాట్లాడి ఉండడం వల్ల ఈ విషయాన్ని యువ సైనికులకు వదిలివేయరాదని నిర్ణయించి.. తానే స్వయంగా వెళ్లాలని భావించారు కల్నల్‌ సంతోష్‌ బాబు.

చైనా ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించేందుకు రాత్రి 7 గంటలకు 35 మంది బృందంతో వెళ్లారు. అప్పటికి భారత బృందానికి చైనీయులతో ఘర్షణకు దిగాలన్న ఉద్దేశం లేదు. కేవలం శిబిరాలపై ఆరా తీయాలనుకున్నారు. కల్నల్‌ సంతోష్‌ బాబు బృందం చేరుకోగానే చైనా సైన్యం ఘర్షణకు దిగింది. తమ సైన్యం ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశిలించే క్రమంలో మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. సంతోష్‌ బాబు మాట్లాడడం ప్రారంభించగానే.. ఓ చైనా సైనికుడు చైనా భాషలో తిడుతూ కల్నల్‌ సంతోష్‌ బాబును నెట్టివేశాడు. దీంతో ఇరువురికి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. అర గంటపాటు సాగిన ఈ ఘర్షణ తర్వాత సంతోష్‌ బాబు బృందం వెనక్కి వచ్చింది. చైనా మరిన్ని అదనపు బలగాలను రప్పించే అవకాశం ఉందని సంతోష్ బాబు అంచనా వేశారు. ఆ గొడవ జరిగిన కొద్దిసేపటికే గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద మరో ఘర్షణ జరిగింది. అదేంటంటే…సంతోష్‌ బాబు బృందం రాత్రి 9 గంటలకు రెండోసారి తనిఖీకి వెళ్లగా…. ఈ సారి చైనా సైన్యం దాష్టీకానికి తెగబడింది. పెద్ద బండరాళ్లను భారత సైన్యంపైకి విసరడం ఆరంభించింది. వీటిలో ఓ రాయి కల్నల్‌ సంతోష్‌ బాబుకు తగలడంతో ఆయన గల్వాన్‌ నదిలో పడిపోయారు. ఒక్క చోట జరిగిన ఘర్షణ వాస్తవాధీన రేఖ వెంట అనేక ప్రాంతాలకు విస్తరించింది. అన్ని చోట్ల కలిసి ఇరుపక్షాలకు చెందిన 300 మంది సైనికులు పరస్పరం ఘర్షణ పడ్డారు. చైనా సైనికులు రాళ్లు, ముళ్ల కంచె చుట్టిన ఇనుప కడ్డీలతో భారత సైనికులపై దాడి చేశారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ గొడవలో కల్నల్ సంతోష్ బాబు అమరుడయ్యాడు. ఇరుదేశాలు చనిపోయిన తోటి సిబ్బంది మృతదేహాలు తీసుకున్నాయి. గాయపడిన వారిని వెనక్కి రప్పిస్తున్న సమయంలో భారత సైనికులు గాల్లో చైనా డ్రోన్‌ శబ్దాన్ని విన్నారు. అత్యాధునిక కెమెరాలు అమర్చిన ఈ డ్రోన్‌ను.. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు చైనా పంపింది. అప్పటికే ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత సైన్యం.. 16 బిహార్‌ రెజిమెంట్‌, 3 పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన ఘాతక్‌ ప్లాటూన్లు సహా అదనపు బలగాలు కావాలని ఉన్నతాధికారులను కోరింది. ఈ ఘాతక్‌ ప్లాటూన్లను మెరుపు దళాలుగా వ్యవహరిస్తారు. జూన్‌ 15 రాత్రి 11 గంటల తర్వాత ఈ ఘాతక్‌ ప్లాటూన్ల నాయకత్వంలో భారత సైన్యం ఎల్ఏసీ నుంచి చైనా వైపు దూసుకుపోయింది. ఈ క్రమంలో మూడో సారి ఘర్షణ చెలరేగగా… రెండు వర్గాలు మరోసారి రాళ్ల దాడికి దిగాయి.

ఈ దాడిలో గాయపడి అనేక మంది భారత్‌, చైనా సైనికులు ఇరుకైన గల్వాన్‌ నదిలో పడిపోయారు. 5 గంటల అనంతరం పరిస్థితులు మళ్లీ ప్రశాంతంగా మారిపోయాయి. ఆ తర్వాత ఇరు దేశాల సైనిక వైద్య బృందాలు తమ తమ సైనికులను తీసుకువెళ్లాయి. తమ తమ భూభాగంలో పడిపోయిన సైనికులను భారత్‌, చైనా మార్చుకున్నాయి. భారత్‌కు చైనా అప్పగించిన సైనికుల్లో ఇద్దరు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు, ఆరుగురు జవాన్లు ఉన్నారు. అటు ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనా వైపు ఇది రెట్టింపు సంఖ్యలో ఉంది. కానీ ఈ విషయం డ్రాగన్ దేశం తోసిపుచ్చింది. ఈ ఘటన జరిగిన తరవాత దేశంలో పెనుమార్పు వచ్చింది. దేశం మొత్తం మీద చైనా బజార్, చైనా బొమ్మలులాంటి వస్తువులు బహిష్కారం జరిగింది. ఒకవంక చైనా దేశంతో చర్చలు కొనసాగిస్తూనే మరోవంక చైనా దురాగతాన్ని భారత్ ఎండగట్టింది. చైనాకు సంబంధించిన యాప్ లన్నింటినీ భారత్‌లో నిషేధించింది.

గల్వాన్ పోరులో వీరమరణం పొందిన అమరవీరుడు, తెలుగువారైన కల్నల్ సంతోష్ బాబుకు భారత ప్రభుత్వం మహావీరచక్ర పురస్కారాన్నిచ్చి గౌరవించింది. తెలంగాణలో సూర్యాపేట‌లోని కోర్టు చౌరస్తాలో సంతోష్ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంతోష్ బాబుతో పాటు ఈ ఘటనలో అమరులైన జవాన్లకు నివాళిగా వారి కుటుంబాలను కూడా తగురీతిలో గౌరవించారు. ఏపీలోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో నిర్మించిన మోటివేషనల్‌ హాల్‌‌కు సంతోష్ బాబు పేరు పెట్టారు. సంతోష్ బాబు ఇక్కడే చదువుకున్నారు.

చైనాతో శాంతి కోసం భారత ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ… చర్చల సమయంలో మాత్రం డ్రాగన్ వర్గాలు సానుకూలతను నటిస్తూ.. అవి ముగియగానే ఎప్పటిలాగే కుక్కతోక వంకర అన్న రీతిలో కుతంత్రాలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఇది చాలక మన దాయాది పాకిస్తాన్ పాలకులతో చేతులు కలిపి భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు చైనా ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా మన రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ని తనదిగా చెప్పుకుంటూ అక్కడున్న పలు ప్రాంతాలకు పేర్లు మార్చుతూ మరో వివాదాన్ని లేవనెత్తి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే…