Home News వన సంరక్షణలో టుడూ మహిళలు

వన సంరక్షణలో టుడూ మహిళలు

0
SHARE

టుడూజాతికి చెందిన మహిళ జమునా టుడూ. ఒరిస్సాలో పుట్టిపెరిగి వివాహానంతరం ఈమె ఝార్ఖండ్‌ ముతర్ధం గ్రామంలో స్థిరపడింది. ”వృక్షాలను రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి”అనే విషయం ఆమె మనసులో నాటుకుపోయింది. అందుకే జమునకు చెట్లంటే అమితమైన ప్రేమ. రక్షాబంధన్‌ రోజున సోదరీ, సోదరులకు రాఖీకట్టడం ఒక వంతు అయితే ఈమె చెట్టకు రాఖీలు కట్టి, చెట్లను తన తోబుట్టువులుగా చూసుకునేది.

ఈమె నివసించే ముతర్థం గ్రామపరిసరాల్లో 50 హెక్టార్ల అటవీభూమి ఉన్నది. అక్కడ కలప మాఫియా ఎక్కువ. దానినుంచి ఈ వన సంపదను కాపాడాలని జమున దృఢనిశ్చయానికి వచ్చింది. తాను స్వయంగా రంగంలోకి దిగి 1988లో ”వన సంరక్షణ సమితి” ఏర్పాటు చేసింది. అందులో జమునతోపాటు మరో నలుగురు సభ్యులు చేరారు. ”అటవీ సంపదను కాపాడుకుందాం” అని  ప్రచారం ప్రారంభించింది. మొదట తన గ్రామంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ”చెట్లునరికి వంట చెరకు తెచ్చుకోకపోతే వంట దేనితో చేసుకుంటావు” అని సాటి గ్రామస్థులే ప్రశ్నించారు. అందుకు ఆమె చిన్నచిన్న కొమ్మలను వాడుకొని, పెద్ద చెట్లను వదిలేయాలంటూ చక్కని పరిష్కారం చూపింది. ఆమె సూచన క్రమంగా అందరికీ నచ్చింది.

జమున సారధ్యంలో ప్రస్తుతం 300 మంది పనిచేస్తున్నారు. బృందానికి 30 మంది సభ్యులు చొప్పున 10 బృందాలు ఏర్పాటు అయ్యాయి. అందరూ విల్లంబులు, కర్రలు ధరించి అడవిని సంరక్షించడం కోసం మూడు వంతులుగా గస్తీ తిరగడమే కాదు అవసరమైతే కలపను తరలించే వారితో తలపడేవారు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెట్లను రక్షించేస్థాయికి ఎదిగారు.

అనేక పోరాటలు సాగించిన జమున కలపమాఫియా బెదిరింపులకు భయపడలేదు. తన ఇంటిమీదికి దాడిచేసినా వెనకడుగువేయలేదు. రైల్వేస్టేషన్‌లో దుండగులు జమున ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశారు. అప్పటికీ  ధైర్యంగా తన లక్ష్య సాధనకు అడుగుముందుకు వేసింది. ఆ ధైర్యమే మరెందరికో స్ఫూర్తి అయింది. మనమూ మనకు తోచినవిధంగా చెట్లను రక్షించుదాం.
(లోకహితం సౌజన్యంతో)

(ఈ వ్యాసం మొదట 28 జూలై 2018 నాడు ప్రచురించింది)