అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. ఆ అడవిలోనే చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న తులసి గౌడ అనే గిరిజన మహిళ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. నిత్యం పర్యావరణం కోసం పరితపించే తులసి గౌడను “ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్, “వన దేవత” అని పిలుస్తారు. చెట్లను పెంచడమే కాదు అడవిలో పెరిగే అన్ని మొక్కల గురించి విస్తృతమైన జ్ఞానం ఆమెకు ఉంది. కర్నాటకకు చెందిన 72 ఏళ్ల గిరిజన మహిళ, పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు లభించింది.
కర్ణాటక రాష్ట్రంలోని అంకోలా తాలూకాలోని హొన్నాలి గ్రామానికి చెందిన పద్మశ్రీ తులసి గౌడ. ఆమె 30 వేలకు పైగా మొక్కలు నాటారు. అడవిలోని ప్రతి జాతి చెట్టు తల్లి వృక్షాన్ని గుర్తించడంలో ఆమె ప్రసిద్ధి చెందింది. చదువు లేకపోయినా చెట్ల గురించి ఎంతో అవగాహన ఉంది. చెట్లను ఎప్పుడు నాటాలి.? ఎన్ని నీళ్లు పోయాలి, వాటి ఔషధ గుణాలు ఏంటి అన్న విషయాన్ని సులభంగా చెప్పేస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఆమె విజ్ఙానాన్ని చూసి అబ్బుర పడుతుంటారు. ఇక పర్యావరవేత్తలైతే ఆమెను ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ ఫారెస్ట్’గా పిలుస్తారు.
తులసి గౌడ విత్తన సేకరణలో కూడా నిష్ణాతురాలు. విత్తన సేకరణ అనేది మొత్తం మొక్కల జాతులను తిరిగి పెంచడానికి తల్లి చెట్ల నుండి విత్తనాలను వెలికితీస్తుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ, ఎందుకంటే మొలకల మనుగడను నిర్ధారించడానికి తల్లి చెట్టు నుండి అంకురోత్పత్తి గరిష్ట సమయంలో విత్తనాలను సేకరించాలి. తులసి గౌడ ఈ సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలదు. ఈ విత్తనాల వెలికితీత కర్ణాటక అటవీ శాఖలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
తులసి గౌడ కర్ణాటక అటవీ శాఖలో వాలంటీర్‌గా చేరారు. పర్యావరణ పరిరక్షణలో ఆమె అంకితభావం, నిబద్ధతను గమనించిన ప్రభుత్వం ఆమెకు శాశ్వత ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తోంది. మొక్కల గురించి తనకు ఉన్న జ్ఞానాన్ని యువతతో పంచుకుంటుంది. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ముందుకు తీసుకువెళుతోంది.