ఉగ్రవాద కేసులో నిందితురాలినని తాను ఎన్నికలలో పోటీ చేయడానికి వీళ్లేదని కొందరు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల పట్ల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ లోక్‌సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీచేయనున్న ఆమె పోటీ చేయకుండా నిలువరించడానికి తానేమీ ఉగ్రవాదిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన దారుణాలకుతానొక ప్రత్యక్ష సాక్షిని అని వెల్లడించారు.
“మాలెగావ్ బాంబు దాడుల్లో నా పాత్ర లేదని న్యాయస్థానాలన్నీ క్లీన్‌చిట్ ఇచ్చాయి. ఎన్‌ఐఏ కూడా క్లీన్‌చిట్ ఇచ్చింది. నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. జైల్లో పెట్టి శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. వారు రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారో, నిబంధనల్ని ఏ విధంగా తుంగలో తొక్కిపెట్టి ప్రజలపై ఉక్కుపాదం మోపారో దేశానికి తెలియజేయాల్సిన రోజు ఆసన్నమైంది”అని ఆమె పేర్కొన్నారు.
“నేను ఇవన్నీ చేస్తాననే వారికి గుండెల్లో గుబులు మొదలైంది. అందుకే నేను పోటీ చేస్తున్నా” అని ఆమె ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో అభివృద్ధికి సంబంధించి బిజెపి ప్రస్తావన తీసుకురాకపోవడంపై ఆమెను ప్రశ్నించగా…‘దేశ సరిహద్దులు వద్ద పరిస్థితులు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. శత్రు దేశాలకు బలం చేకూర్చేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఉగ్రవాదులపై, వారి శిక్షణ శిబిరాలపై మెరుపు దాడులు జరిపితే వాటికి ఆధారాలు అడుగుతోంది. అలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలి’ అంటూ బదులిచ్చారు.
ప్రజ్ఞాసింగ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేస్తున్నారు. మొత్తం ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో చివరి నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కంపు మే 23న నిర్వహించనున్నారు.
Source: Nijam