Home News చారిత్రిక తప్పిదాన్ని సరి చేయటమే ఉమ్మడి పౌర నియమావళా?

చారిత్రిక తప్పిదాన్ని సరి చేయటమే ఉమ్మడి పౌర నియమావళా?

0
SHARE

– రాంపల్లి మల్లికార్జున్

ఉమ్మడి పౌర నియమావళి పై లాకమిషన్ ప్రజల నుండి సంస్థల నుండి అభిప్రాయాలను పంపమని కోరింది. దాంతో దేశమంతా దానిపై చర్చ జరుగుతున్న‌ది. ఆ చర్చ‌లో సమర్ధించేవారు, వ్యతిరేకించేవారు తమతమ వాదనలను వినిపించారు, వినిపిస్తున్నారు. రాజ్యాంగం లో దానిని రాజ్యాంగ విధిగా పేర్కొన్నది. వైవిధ్య భరితమైన భారత్ లో భిన్న మతాల పర్సనల్ లా (స్వంత మతాచారం ప్రకారం శాసనం. వివాహం, ఆస్తుల వారసత్వం మొదలైన కొన్ని వ్యక్తిగత విషయాలకు సబంధించి ఆయా వ్యక్తుల మతాచారం ప్రకారం వర్తించే శాసనబద్ధ గుర్తింపు కలిగిన నియమ నిబంధనలు) లకు బదులు ఒక ఉమ్మడి స్మృతిని అమలుపరచుకోవడమే శ్రేయస్కరమనేది UCCకి మౌలిక ఆధారాంశం. ఏ విధంగా చూసినా సమానత్వం కంటే ఏకత్వాన్ని అమలుపరచడమే సులభం. భారత్ వంటి సువిశాల, వైవిధ్యపూరిత దేశంలో సమానత్వం గురించిన భావనలు తరచు మారిపోతుండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇస్లాం పాలనాకాలంలో లేని ఇటువంటి విషయాలకు మూలాలు బ్రిటిష్ కాలంలో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు  తమ రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసం  చేసిన చట్టాలను మనం మన జాతి ప్రయోజనాల దృష్ట్యా  సరిచేసుకోవటం అవసరం. ఇటువంటి సున్నితమైన విషయాన్ని రాజకీయం చేస్తూ దేశప్రయోజనాలు కన్నా ముస్లింల ప్రయోజనాలే తమకు లాభం అని భావిస్తున్నారు అదే దేశానికీ అసలైన సమస్య.

1)కేరళ మాజీ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ తన ప్రసంగాలలో, రచనలలో  “షరియాను సరిదిద్దడం తక్షణ అవసరం” అని నొక్కిచెప్పారుజ. 1987లో  సిపిఐ(ఎం) పార్టీ కేరళలో  జరిగిన ఎన్నికలలో ముల్లాలు, ముక్రిలకు పెన్షన్ కు వ్యతిరేకంగా, యూనిఫాం సివిల్ కోడ్ కు అనుకూలంగా ప్రజల ముందుకు వెళ్ళింది. దీంతో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఫ్రంట్ నుండి ముస్లింలిగ్ బయటకు వెళ్ళింది.

2) సిపిఐ(ఎం) పార్టీ ఈ మధ్య కాలంలో ముస్లిం లీగ్‌ని కమ్యూనల్ పార్టీగా పేర్కొంటూ దానికి దూరంగా ఉంటున్నది. అదే ఇప్పుడు యూనిఫాం సివిల్ కోడ్ గురించి చర్చ జరుగుతున్న స‌మయంలో యూనిఫాం సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తూ ముస్లింలకు అనుకూలంగా కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎం వి గోవిందన్  తిరువనంతపురంలో  ఈ మధ్య ప్రకట‌న‌లో పేర్కొన్నారు. దీన్ని బ‌ట్టి సిపిఐ(ఎం) పార్టీ ద్వంద్వ వైఖిరి మరోసారి వెలుగులోకి రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.  దానికి కారణం బీజేపీని వ్యతిరేకించేందుకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

3) దేశంలో అనేక ప్రాంతీయ పార్టీ లు బీజేపీని హిందుత్వాన్ని వ్యతిరేకించేందుకు యూనిఫాం సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంలో రాజకీయాల మూల సూత్రాలలో ఇస్లాంకు అనుకూలంగ వ్యూహారచన ఉంటుంది. ఇస్లాం తన వత్తిడితో దేశాన్ని ముక్కలు చేసింది. స్వాతంత్య్రానంతరం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు అనేక ప్రాంతీయ పార్టీ లు అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. అందుకే యూనిఫాం సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్నారు. కానీ యూనిఫాం సివిల్ కోడ్ ఇప్పుడు ఎందుకు తీసుకోని రావాలిసిన అవసరం ఏముంది? రాజ్యాంగం ఏమి చెబుతున్నది, దేశసామాజిక ఐక్యత దృష్ట్యా  ఏ చారిత్రక తప్పిదాన్నిమనం సరిచేసుకోవాలో తెలుసుకొనేందుకు చరిత్రలోకి ఒకసారి తొంగిచూద్దాము.

“షరియత్ అప్లికేషన్ చట్టం 1937” ను  బ్రిటిష్ ప్రభుత్వం ఎవరికోసం చేసింది ?

1. 1857లో లాగా హిందూ ముస్లింలు కలిసి బ్రిటిష్ ప్రభత్వంపై తిరగబడి పోరాటం చేయకుండా ఉండేందుకు, ముస్లింలను తనకు అనుకూలంగా మలచుకొనేందుకు, ముస్లింలు దేశంలో తమ ప్రత్యేకతను ప్రదర్శించుకొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం “షరియత్ అప్లికేషన్ చట్టం 1937” ను భారతదేశంలో తీసుకొచ్చింది, స్వాతంత్రం వచ్చిన తరువాత  కూడా అది ఇంకా కొనసాగుతున్నది.

2. ముస్లింలీగ్ కు వెన్నెముకగా ఉన్న జమీందార్లు, ఇతరుల ఆస్తులను ఇస్లామిక్ షరియత్ నుండి కాపాడేందుకు  ముస్లిం నాయకులు, జిన్నా, ముస్లిం లీగ్, బ్రిటిష్ ప్రభుత్వం ఉమ్మడి వ్యూహంమే  1937 చట్టం.

3. షరియా చట్టం ఆలోచన అకస్మాత్ గా1937లో నే ఎందుకు వచ్చింది? ఇది రెండు ప్రశ్నలకు దారితీసింది 1. ముస్లిం మతంలోకి మారినా  1,000 సంవత్సరాలుగా షరియా చట్టం గురించి  ఆలోచించని వారు తమంతట తాముగా షరియా చట్టాన్ని డిమాండ్ చేశారా? లేక  రెండు శతాబ్దాలకు పైగా భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు హిందూ ముస్లింల మధ్య సంబంధాలను దెబ్బతీసెందుకు చేసారా ? ఈ ప్రశ్నలకు సమాధానాలే వాస్తవాన్ని వెల్లడిస్తాయి.

4. షరియా నుండి వ్యవసాయ భూమిని మినహాయించడం ద్వారా  హిందూ చట్టం ప్రకారం మొత్తం భూమి మగ వారసుల చేతుల్లోనే ఉంటుంది. షరియా ప్రకారం ఆడపిల్లలకు అందులో వాటా లభించదని నిర్ధారిస్తుంది. 1937 చట్టం సాధారణ  ముస్లింలకు షరియా  జిన్నా, జమీందార్లకు హిందూ చట్టం అది.

5. 1937 సంవత్సరం చేయబడిన చట్టం ముస్లిం మతానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. దానితో షరియత్ చట్టం అమలుకు అది వీలు కల్పించింది. మతపరంగా తన ప్రత్యేకతను ఇస్లాం ప్రకటించుకుంది. దాంతో ముస్లిం లీగ్ క్రమంగా ముస్లిం మత పార్టీగా శక్తివంతమైంది. దాంతో కాంగ్రెస్ సంస్థలో పనిచేస్తున్న అనేకమంది ముస్లింలు ముస్లిం లీగ్ పార్టీలోకి వెళ్లిపోయారు. ముస్లింలు శక్తివంతమవుతూ గాంధీజీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ వచ్చారు. ముస్లింలు బ్రిటిష్ వాళ్ళ సహకారంతో మరింత శక్తివంతమై  అంతకు ముందు వరకు హిందూ – ముస్లిం సమాఖ్య ప్రభుత్వం అని మాట్లాడిన ముస్లిం లీగ్ రూట్ మార్చి ముస్లింలకు ప్రత్యేక దేశమని మాట్లాడటం ప్రారంభించింది. 1937 అక్టోబర్  లో చట్టం చేసిన రెండున్నర సంవత్సరాల తర్వాత అంటే మార్చ్ 1940 సంవత్సరంలో లాహుర్ లో జిన్నా దేశ విభజన తీర్మానం చేశాడు. 1947 లో దేశవిభజన జరిగిపోయింది.

ఉమ్మడి  పౌర నియమావళిని  రాజ్యాంగ విధిగా ఎందుకు చెప్పారు ?

రాజ్యాంగంలో 4వ భాగంలోని  ఆర్టికల్ 44లో భారత భూభాగంలో ఉన్న పౌరులందరికీ ఒకే విధమైన పౌర నియమావళి రూపొందించాలని పొందుప‌రిచి ఉంది. దానిలో వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం లాంటి అనేక విషయాలున్నాయి. 1937లో వచ్చిన చట్టం హిందువులు, ముస్లింల మధ్య విభజనరేఖ గీసి అది చివరకు దేశ విభజనకు దారితీసింది. స్వాతంత్రానంతరం కూడా హిందూ, ముస్లింల సంబంధాలు మరింతగా దూరం జరిగింది. కామన్ సివిల్ కోడ్ హిందూ ముస్లింల మధ్య పెరిగిన దూరం తగ్గించడం కోసమే అని రాజ్యాంగ నిర్మాతలు అందరూ చెప్పారు. భారతదేశ ప్రజలకు ఏకరూప పౌర నియమావళి ఆవశ్యకత ఉన్నదని కూడా స్పష్టం చేశారు. 1937 చట్టం చేయకపోయి ఉంటే UCC గురించి మాట్లాడాల్సిన అవసరం బహుశా ఉండక పోయేదేమో. భారతదేశన్ని విభజించిన1937 చట్టం కొనసాగటం దేశ సమైక్యతకు భంగం కాబట్టి UCC  కావాలని స్పష్టం చేశారు. ఆర్టికల్ 44లో పేర్కొన్న 1937 చట్టం దేశాన్ని విభజించి UCC ఆమోదించడం అనేది చట్ట సభ్యుల విచక్షణకు వదిలివేయకుండా దానిని రాజ్యాంగ విధిగా మార్చారు. స్వాతంత్రం వచ్చి నాటి నుండి దీనిని ఎందుకు అమలులోకి తీసుకుని రాలేదని ఈ రోజున దేశ ప్రజలందరూ ప్రశ్నించవలసిన అవసరం ఉంది.

ముస్లింలీగ్ కు సవాలు విసిరినా అంబేద్కర్

షరియా ముస్లింలకు మార్పు లేనిది, ముస్లింలు దానినే పాటిస్తారు కాబట్టి ఉమ్మడి పౌర నియమావళి అవసరం లేదని రాజ్యాంగ సభలో ముస్లింలీగ్ సభ్యులు గట్టిగా వాదించారు. దానిపై అంబేద్కర్ మండిపడ్డారు. 1935 వరకు నార్త్ వెస్ట్ ఫారం టైర్స్ ప్రావిన్స్ లో ముస్లింలు షరియా చట్టాన్ని పాటించలేదని అప్పటివరకు దేశంలో అమలులో ఉన్న చట్టాలనే పాటించారని దానిని మీరు కాదని చెప్పగలరా అని సవాలు విసిరారు.  దేశంలో బ్రిటిష్ పాలన లో ఉన్న మిగిలిన అన్ని ప్రావిన్సెస్ లో  వారసత్వం విషయంలో ఈ దేశంలో పరంపరంపరాగతంగా వస్తున్న చట్టాలనే ముస్లింలు కూడా పాటించారు. ఉత్తర మలబారు తీరంలోని ముస్లింలు అప్పటివరకు హిందూ మురుముక్క దాయం (మాతృ వంశి) చట్టాన్ని అనుసరించారని వివరించారు. రాజ్యాంగ సభలో ఉమ్మడి పౌర నియమావళి రూపకల్పన చేసినవారు ముస్లిం మనోభావాలు గాయపరిచారని ఏ ముస్లిం చెప్పలేదని అంబేద్కర్ వివరించారు. హిందూ ముస్లింలు అందరికీ 1937 అక్టోబర్ వరకు ఈ దేశ పరంపరగా పరంపరాగతంగా ఉన్న సివిల్ కోడ్ మాత్రమే అమలులో ఉన్నది. దానిని తెలుసుకోవాలంటే హిందూ రాజులు పాలించిన అజ్మీర్, మేవార్, ముస్లింలు పాలించిన అయోధ్య వారసత్వం , వారసత్వ దత్తత వీలునామా, మొదలైనవన్నీ హిందువులు ముస్లింలు అందరికీ ఉపయోగంగా ఉండేది. కేరళలోని మోప్లా ముస్లింలపై మరుముక్క దాయం షరియత్ కంటే ఎక్కువ ప్రభావంగా ఉండేది. ఇప్పుడు పాకిస్తాన్ లో భాగమైన పంజాబ్, వాయువ్య ప్రావిన్స్ షరియత్ చట్టంలో  హిందూ ఆచారాలు చాలా ప్రబలంగా ఉండేవి. పాకిస్తాన్ గుండెకాయ లాంటి పంజాబ్ లో  వితంతువు లకు నిర్దిష్టమైన వాటా ఇచ్చింది,  తూర్పు, పశ్చిమ పంజాబ్ లో  ముస్లింలు షరియాకు విరుద్ధంగా దత్తత తీసుకునే ఆచారం అక్కడ న్యాయస్థానాలు గుర్తించాయి . అట్లాగే వీలునామా వ్రాసే ఆచారం కూడా ఉండేది, మద్రాస్ ప్రావెన్సీలోని ముస్లింలు తమ ఆస్తులను ముస్లిములకు మాత్రమే అమ్మాలనే దానిని అక్కడ హైకోర్టు నిరాకరించింది. కలకత్తా మద్రాస్ బొంబాయి ప్రావెన్సుస్ లో ఏ ఆచారాలు స్థానికంగా వాడుకలో ఉండేవో 1937 చట్టం కంటే ముందు ఆ చట్టాలే వాడుతుండేవారు. కుచ్ బీహార్ ముస్లింలు 1980 జూలై 1 వరకు ఆ హిందూ చట్టాల ద్వారా పాలించబడ్డారు. అందులో1980 జులై 1 నుండి మాత్రమే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం షరియా చట్టం దరఖాస్తులు నోటీసుపై చేసింది. 1937  చట్టం ప్రధానంగా రెండు అంశాలను స్పష్టంగా చెప్పింది. మతం మారిన ముస్లింలకు మతపరమైన నియమాలు, సంస్కృతి పరమైన అంశాలు, ఆర్థికం వివాహం విడాకులు మొదలైన విషయాలు,  అయితే మతపరమైన విషయాలు 1937  కంటే ముందు కూడా మతం మారిన వాళ్లు అందరూ వాటిని పాటిస్తూ ఉండేవారు. మారిన మతం నియమాలే  పాటించడం జరిగింది. రెండవ భాగమైన ఆర్థిక,  ఆస్తి హక్కు, వారసత్వం మొదలైనవి దేశమంతా అందరూ 1937 కి పూర్వం వరకు ఈ దేశంలో పరంపరాగతమైన పద్ధతులనే నే పాటించారు అనేది స్పష్టం అవుతుంది.  ఇది హిందూ ముస్లింల కు సామాజికమైన ఆర్థికమైన శక్తివంతమైన వారధిగా  పనిచేసేది.  మతం మారిన ముస్లింలను వారి పూర్వీకులతో ఏకీకృతం చేసింది. 1937 చట్టం తరువాత ముస్లింలు తాము ప్రత్యేకం హిందూ సమాజంతో మాకు సంబంధం లేదు కాబట్టి మతపరమైన సామాజికపరమైన ఆస్తిపరమైన నియమాలు మావే అనేది ఈ దేశ సామాజిక బంధాన్ని విచ్ఛన్నం  చేసింది. హిందూ ముస్లింలు పరస్పర శత్రువులుగా ముస్లింలు చూడటం ప్రారంభించారు.

పాకిస్తాన్ సృష్టి కర్త జిన్నా మూలాలు ఎక్కడ ?

జిన్నా ముస్లింలో ఖోజా తెగకు  చెందినవాడు దానిని వారు ఇస్మాయిలీ అని కూడా పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంథం ఖురాన్ కాదు, హిందువులు చెప్పే దశావతారం. అందులో కృష్ణుడి వరకు ఖోజా ముస్లింలు గుర్తిస్తూ, 10వ అవతారంగా మహమ్మద్ ప్రవక్త అల్లుడు అలీగా చెబుతారు. మతం గుర్తింపు విషయంపై ఆగాఖాన్ కేసు విషయంలో ”కలోనియల్ ఇండియా (పేజ్55) పురోహిత్ . 1886 సంవత్సరం ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పులో గినామ్స్ అని పిలవబడే ఇస్మాయిలీ భక్తి గీతాలు అలీ వారసుడు పీర్ నద్రుద్దీన్ రచనలు, దశావతారాలలో చివరిదిగా అలీని గుర్తించి విశ్వసిస్తారు. అగాఖాన్ కు మహమ్మద్ ప్రవక్తతో సంబంధం నద్రుద్దీన్  ద్వారానే ఉన్నది అని చెప్పబడింది. కాబట్టి అది ఈ దేశ పరంపరాగతమైన హిందూ లానే కానీ షరియత్ కాదు,  అని  తీర్పువచ్చింది, ఈ తీర్పు వచ్చిన పది సంవత్సరాలలోనే జిన్నా పుట్టాడు. ఖోజాలకు  ఖురాన్ పవిత్ర గ్రంథం కాదు దశావతారాలే  జిన్నా కూడా 1937 వరకు హిందూలానే అనుసరించాడు. 1946లో ప్రత్యక్ష చర్యకు పిలుపు నిచ్చినప్పుడు  హిందువులను తమకు బద్ద శత్రువులుగా ప్రకటించాడు.  జిన్నాలాగా ఆగాఖాన్ మనుమడు ముస్లింలీగ్ లో చేరి పాకిస్తాన్ సృష్టిలో ప్రముఖ పాత్ర వహించాడు. ఖోజా ముస్లిం లాగానే కుచ్చి మెమన్ ముస్లింలు ఒక గ్రూపుగా మతం మార్చబడినవాళ్ళు వాళ్ళ తండ్రులు తాతలు హిందూ ఆచారాన్ని పాటించారు.  వాళ్లే  బాంబులు వేసి హిందువులను  చంపారు. 1943  లో 2000 మందిని పొట్టను పెట్టుకున్నారు . ఈ శత్రుత్వాలకు కారణం 1937 చట్టం.

ముగింపు

స్వాతంత్రానంతరం ఆ చట్టం కొనసాగడం ద్వారా విభజన ముందు రోజులల్లో లాగా  హిందూ ముస్లింల సంబంధాలను నాశనం కాకుండా ఉండేందుకు UCC ప్రతిపాదించారు.  రాజ్యాంగ ఆదేశానికి వ్యతిరేకంగా1937  చట్టం కొనసాగుతూ వస్తున్నది.  దేశ విభజనకు కారణమైన ఆ చట్టాన్ని కుహనా లౌకికవాదులు ముస్లిం మతపరమైన హక్కులలో అంతర్భాగం అని మాట్లాడుతున్నారు. UCC అనేది చారిత్రాత్మకమైన ఒక తప్పును సరి చేయడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే 1937  చట్టం దాని దుష్పరిణామాలను ఒకసారి సమీక్షించి జాతీయ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.