Home Rashtriya Swayamsevak Sangh స్వామి వివేకానంద దర్శించిన సమైక్య భారత్ – డా మన్మోహన్ జి వైద్య

స్వామి వివేకానంద దర్శించిన సమైక్య భారత్ – డా మన్మోహన్ జి వైద్య

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను `ముస్లిం బ్రదర్ హుడ్’తో పోలుస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంఘాన్ని గురించి, సంఘ జాతీయవాద దృక్పధాన్ని గురించి తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించాయి. మరోవైపు వామపక్షవాదులు, మావోయిస్టులు, క్షుద్ర రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని వ్యతిరేకించే శక్తులకు ఈ వ్యాఖ్యలు సహజంగానే ఆనందం కలిగించాయి.

జిహాదీ ముస్లిం తీవ్రవాదం వల్ల ప్రపంచం ఎంత తల్లడిల్లుతోందో రాహుల్ గాంధీకి తెలియకపోలేదు. అలాగే సమాజహితం కోసం సంఘ్ పనిచేస్తుందని, సమాజంలో సంఘానికి ఆదరణ పెరుగుతోందనే విషయాలు కూడా తెలియకపోలేదు. అయినా ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు?

కారణం ఏమిటంటే సంఘను దూషిస్తే, సంఘకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయ ప్రయోజనం పొందవచ్చని ఆయన సలహాదారులు చెపుతూ ఉంటారు. తెచ్చిపెట్టుకున్న ఆవేశం ప్రదర్శిస్తూ ఇలాంటి ఆరోపణలు చేయడం ఆయనకు నేర్పారు. ఆ ఆరోపణలు చేయడం వరకే ఆయన వంతు, వాటిని నిరూపించడం ఆయన పని కాదు! ఇంతకుముందు ఇలాగే చేసిన ఒక ఆరోపణపై ఒక స్వయంసేవక్ కోర్ట్ లో సవాలు చేస్తే తన వాదనను నిరూపించుకునేందుకు ప్రయత్నించాల్సిందిపోయి అసలు కోర్ట్ కే రాకుండా ముఖం చాటేశారు.

నిజానికి సంఘం పరంపరాగత ఆధ్యాత్మిక, ఏకాత్మ జీవనదృష్టి ఆధారంగా మొత్తం సమాజాన్ని ఒకే సూత్రంతో జోడించే కార్యాన్ని చేస్తోంది. ఇలాంటి సర్వవ్యాపకమైన జీవన దృష్టిని జిహాదీ ముస్లిం బ్రదర్ హుడ్ తో పోల్చడం సకల భారతీయులనేకాక, ఈ దేశపు గొప్ప సంస్కృతిని ఘోరంగా అవమానించడమే. జిహాదీ ముస్లిం మనస్తత్వం, దానివల్ల జరుగుతున్న నష్టం చూస్తే అసలు `బ్రదర్ హుడ్’ అనే పదాన్ని జిహాదీ తీవ్రవాదంతో  జోడించడమే విచిత్రంగా ఉంటుంది. ఈ `బ్రదర్ హుడ్’లో సలాఫి సున్నీ ముస్లిములకు తప్ప ఇతర ముస్లింలకు స్థానం లేదు. ఆ మాటకువస్తే ఇతరులను అసలు `ముస్లిం’ లుగానే పరిగణించరు.

సెప్టెంబర్ 11న స్వామీ వివేకానంద విశ్వవిఖ్యాత చికాగో ఉపన్యాసానికి 125 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆయన తన ఉపన్యాసంలో భారతదేశపు ఏకాత్మ, సర్వాంగీణ జీవన దృష్టి ఆధారంగా విశ్వమంతా ఒక కుటుంబం అనే భావాన్ని అందరి ముందు ఉంచారు. అది కేవలం సిద్దాంతపరమైన భావన కాదు. అది ఆయన సంపూర్ణంగా విశ్వసించిన, ఆయన హృదయం నుండి వచ్చిన విషయం. చికాగో ఉపన్యాసాన్ని `నా అమెరికా సోదర సోదరిమణులారా’ అనే సంబోధనతో ఆయన ప్రారంభించినప్పుడు సభికులంతా ఒక్కసారిగా ఉత్తేజితులయ్యారు. లేచి నిలబడి కొన్ని నిముషాలపాటు వారు చేసిన కరతాళధ్వనులకు  సభాగృహం మారుమోగిపోయింది.

స్వామీ వివేకానంద తన ఉపన్యాసంలో “ఏ ధర్మమైతే ప్రపంచానికి సహిష్ణుత, అన్ని భావాలను గౌరవించడం నేర్పిందో ఆ ధర్మానికి చెందినవాడిగా నేను గర్విస్తాను. సహిష్ణుత మాత్రమేకాదు అన్ని మతాలు సత్యమని మేము అంగీకరిస్తాము. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలవారిని, పీడితులు, శరణార్ధులను అక్కున చేర్చుకున్న దేశానికి చెందినవాడినని గొప్పగా చెప్పుకుంటాను. రోమ్ లో తమ పవిత్ర మందిరం నేలమట్టమైనప్పుడు యూదులు నా దేశానికి వచ్చి శరణు పొందారు. గొప్ప జొరాష్ట్రియన్ జాతికి ఆశ్రయం కల్పించినది కూడా నా దేశమేనని గర్వంగా చెప్పగలను. ఇప్పటికీ నా దేశంలో వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు’’ అని అన్నారు.

స్వామీజీ ఇంకా ఇలా అన్నారు – “మతతత్వం, పిడివాదం, వాటి భయంకరమైన వారసత్వం ఈ సుందరమైన భూమిపై చాలాకాలం రాజ్యం చేశాయి. అవి ఈ భూమిని హింసతో నింపేశాయి. మానవుల రక్తంతో తడిపేశాయి. సభ్యత సంస్కారాలను నాశనం చేశాయి. దేశం మొత్తాన్ని నైరాశ్యంలో ముంచేశాయి. ఈ భయంకరమైన దానవకాండ లేకపోతే మానవ సమాజం ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెందేది.”

డా. అంబేడ్కర్ `థాట్స్ ఆన్ పాకిస్థాన్’ అనే పుస్తకంలో ఇలా అన్నారు – “ఇస్లాం ఒక సంకుచితమైన సమూహం (closed corporation). అది ముస్లిములు, ముస్లిమేతరుల మధ్య తేడాను చూస్తుందన్నది కూడా నిజం.`ఇస్లామిక్ బ్రదర్ హుడ్’ సమస్త మానవాళిని కలుపుకుపోయే `స్వచ్చమైన బంధుభావన’ కాదు. ఇది కేవలం ముస్లిములకు ముస్లిముల పట్ల మాత్రమే ఉండే `బంధుత్వం’. బంధుభావనే అయినా అది కేవలం ముస్లిముల మధ్య మాత్రమే ఉంటుంది.  దాని లాభం కేవలం ఆ సముదాయానికి మాత్రమే పరిమితం. ఆ సమూహం బయట ఉన్నవారిపట్ల నిరాదరణ (contempt), శతృత్వం తప్ప మరేమీ ఉండవు.’’

ముస్లిం బ్రదర్ హుడ్ ప్రపంచమంతటా షరియా రాజ్యాన్ని తేవాలని చూస్తుంటే, సంఘ స్వామీ వివేకానంద ప్రతిపాదించిన `విశ్వబంధుత్వ’ భావనను నెలకొల్పి అందరినీ గౌరవించే హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలని కృషి చేస్తుంది.

జిహాదీ పిడివాద `ముస్లిం బ్రదర్ హుడ్’ కి స్వామి వివేకానంద పేర్కొన్న విశ్వబంధుత్వ(Universal Brotherhood) భావనకు ఎక్కడైనా పోలిక ఉందా? ఇలాంటి ఉన్నతమైన ఆలోచన కలిగి, సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయడానికి కృషి చేసే సంఘ గురించి రాహుల్ గాంధీ పదేపదే ఇలాంటి అసంబద్ధ, ప్రతికూల వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంటారు?

రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ పత్రికా రచయిత కాంగ్రెస్ పార్టీని గురించి ఇలా వ్రాసారు -“అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ఆ పార్టీ తన సైద్ధాంతిక కార్యకలాపాలను కమ్యూనిస్టులకు అప్పగించేసింది (outsourced).’’

ఎప్పుడైతే కాంగ్రెస్ తన సైద్ధాంతిక కార్యకలాపాలను కామ్రేడ్ లకు అప్పగించేసిందో అప్పటి నుంచి ఆ పార్టీ ధోరణిలో అసహిష్ణుత, జాతీయ భావాలపట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నాయి. స్వాతంత్ర్యానికి ముందు రోజుల్లో కాంగ్రెస్ అందరికీ చెందిన సంస్థగా ఉండేది. అందులో హిందూమహాసభ, విప్లవకారులు, అతివాదులు, మితవాదులు మొదలైనవారంతా ఉండేవారు.

కానీ క్రమంగా ఎప్పుడైతే అది రాజకీయ పార్టీగా మారిపోయిందో అప్పటినుంచి అసమ్మతివాదులను పక్కనపెట్టడం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా వివిధ సైద్ధాంతిక ప్రవాహాలకు చెందినవారు అందులో ఉండేవారు. ఒక పక్క నెహ్రూ వంటివారు సంఘను తీవ్రంగా వ్యతిరేకిస్తే, మరోపక్క సర్దార్ పటేల్ వంటివారు కాంగ్రెస్ లో కలవాలంటూ సంఘను ఆహ్వానించేవారు. 1962 చైనా యుద్ధ సమయంలో ప్రాణాలకు తెగించి సంఘ స్వయంసేవకులు సైన్యానికి అన్నిరకాల సహాయసహకారాలు అందించడం చూసి ప్రభావితుడైన నెహ్రూ 1963లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొనాల్సిందిగా స్వయంసేవకులను ఆహ్వానించారు. ఆహ్వానం అందిన తరువాత చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ 3వేల మంది స్వయంసేవక్ లు ఆ పరేడ్ లో పాల్గొన్నారు.

1965 పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు అప్పటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి దేశంలోని ప్రముఖ నాయకులతో అత్యవసర సమావేశం జరిపారు. ఆ సమావేశానికి అర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీని ఆహ్వానించిన ప్రభుత్వం వేరే ప్రాంతంలో ఉన్న ఆయన వెంటనే ఢిల్లీ చేరుకునేందుకు ఏర్పాటు కూడా చేసింది. ఆ సమావేశంలో ఒక కమ్యూనిస్ట్ నేత ప్రధాని శాస్త్రిజీని పదేపదే `మీ సైన్యం ఏం చేస్తోంది?’ అని ప్రశ్నించినప్పుడు శ్రీ గురూజీ `మీ సైన్యం, మా సైన్యమని ఎందుకు అంటున్నారు? మన సైన్యం అనండి. మీరు వేరే దేశానికి చెందినవారా ఏమిటి?’’ అని అడిగారు.

రాజకీయాలను అక్కడికే పరిమితం చేసి అన్ని విషయాలను అందరితో స్వేచ్ఛగా పంచుకునే ధోరణి 70వ దశకం వరకు సాగింది. ఆ తరువాత వామపక్షవాదుల ప్రభావం కాంగ్రెస్ లో క్రమంగా పెరిగింది. ఇతరులను శత్రువులుగా చూడటం, అసహనం పెరిగాయి. బిజెపి మినహా ఇతర అన్ని రాజకీయ పార్టీల సైద్ధాంతిక ధోరణిపై కమ్యూనిస్ట్ ప్రభావం ఇంతో అంతో కనిపిస్తుంది. అందుకనే స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ విలువలు, ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకించడం, వామపక్షాల ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలను సమర్ధించడం వంటివి ఈ పార్టీలు చేస్తుంటాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఎంత విచిత్రంగా తయారయ్యిందంటే సైద్ధాంతిక కార్యకలాపాలను కమ్యూనిస్టులకు అప్పగించిన తరువాత ఆ పార్టీ `శరీరం’లో మావోయిస్ట్ `ఆత్మ’ ప్రవేశించింది. ఎందుకు ఇలా అనిపిస్తోందంటే ఇటీవల సంఘ గురించి రాహుల్ చేసిన అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలను సమర్ధిస్తూ వివిధ పత్రికల్లో వ్యాసాలు వ్రాసిన వారంతా మావోయిస్ట్ మద్దతుదారులు, కమ్యూనిస్ట్ సమర్ధకులే.

మావోయిస్ట్ లు లేవదీసిన అన్ని ఉద్యమాలను కాంగ్రెస్ పూర్తిగా, బహిరంగంగా సమర్ధించిందన్నది నిజం కాదా? `భారత్ తెరే టుక్ డే హోంగే, ఇన్షా అల్లా, ఇన్షా అల్లా, భారత్ కీ  బర్బాది తక్ జంగ్ రహేగీ’ వంటి నినాదాలు, భారత పార్లమెంట్ పై దాడికి ప్రధాన కుట్రదారైన అఫ్జల్ గురు (ఇతనికి శిక్ష యూపీఏ హయాంలోనే ఖరారైంది) కు మద్దతుగా ‘అఫ్జల్ గురు హమ్ షర్మిన్దా హై తెరే కాతిల్ జిందా హై’ వంటి నినాదాలు చేసిన వారిని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే సమర్ధించారు.

సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టి, రాజ్యాంగాన్ని యధేచ్చగా ఉల్లంఘించి హింసను ప్రేరేపిస్తున్నవారిని సమర్ధించినప్పుడు, ఎలాంటి కారణం లేకుండా (unprovoked) ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారికి మద్దతుగా నిలబడినప్పుడు కాంగ్రెస్ పార్టీ శరీరాన్ని ఆక్రమించుకున్న మావోయిస్ట్ ఆత్మ మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

నగర నక్సల్స్ ఎలా సమాజంలో వ్యాపించి ఉన్నారో, వాళ్ళు ఎలాంటి `పేరుప్రతిష్టలు’ సంపాదించారో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలవల్ల ప్రజలకి తెలిసింది. అలాంటి దేశ విద్రోహక శక్తులను కాంగ్రెస్ సమర్ధించడం చూస్తే ఆశ్చర్యం కంటే ఎక్కువగా బాధ కలుగుతుంది. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికి కాంగ్రెస్ గతంలో ఎన్నడూ ఇలాంటి భాషను ఉపయోగించలేదు. దేశంలో అతి పురాతన, దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన, దేశం మొత్తంలో ఎంతోమంది అభిమానులు ఉన్న ఇలాంటి జాతీయ పార్టీ విజాతీయ శక్తుల పక్కన నిలబడటం చాలా విచారించవలసిన విషయం. బహుశా ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు కాబట్టే కాంగ్రెస్ క్రమంగా ప్రజాదరణను కోల్పోతోంది.

125 ఏళ్ల క్రితం సముద్రాలు దాటి వెళ్ళి స్వామి వివేకానంద ఈ సనాతన సంస్కృతి విజయపతాకాన్ని ఎగురవేశారు. కానీ ఇదే దేశానికి చెందిన ఒక నాయకుడు సముద్రాలు దాటి వెళ్ళి అదే భారతీయ సంస్కృతిని `ముస్లిం బ్రదర్ హుడ్’ తో పోల్చి వివేకానందుడిని, భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని అవమానిస్తున్నాడు.

ప్రజాస్వామ్యంలో వివిధ పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చును. కానీ మొత్తం జాతికి సంబంధించిన విషయాలపై రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి పార్టీలన్నీ ఒకటిగా నిలిచినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, అంతర్గత, బాహ్య సమస్యలకు సమాధానాలు అన్వేషించగలుగుతుంది.

– మన్మోహన్ వైద్య,
సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్