ఇతిహాస సంకలన సమితి (భారతీయ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్(ICHR), ఆంధ్ర మహిళా సభ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సభ ఆడిటోరియంలో “తెలంగాణ అజ్ఞాత వీరులు” అనే అంశంపై శనివారం (16.07.2022) సెమినార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కెవిఎస్ శర్మ గారు, ఇతిహాస సంకలన సమితి తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ శ్రీ వేముగంటి కిషన్ రావు గారు, ఐసిహెచ్ఆర్ సభ్యులు, ఆంధ్ర మహిళా సభ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీ కె ఝాన్సీ రాణి గారు, ఇతిహాస సంకలన సమితి తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం వీరేందర్ గారు హాజరయ్యారు. కార్యక్రమం కుమారి షోడసి నృత్యంతో ప్రారంభమైంది. శారద గారి బృందం చే వందేమాతర గేయాలాపన అనంతరం అతిధుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ డిగ్రీ కాలేజ్ ప్రధాన అధ్యాపకురాలు ఝాన్సీ రాణి గారు ప్రసంగిస్తూ ఇతిహాస సంకలన సమితి కార్యక్రమం తమ కళాశాలలో జరగడం దైవ నిర్ణయం అని ఇది తమ కళాశాల చేసుకున్న భాగ్యం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఎంతోమంది గొప్ప వ్యక్తులను పరిచయం చేసిందన్నారు. అదేవిధంగా ఆంధ్ర మహిళా సభ అందజేస్తున్న సేవలను గురించి నివేదించారు. ఈ సెమినార్ ద్వారా అసలైన చరిత్ర బయటికి వస్తుందని, చరిత్ర ప్రాధాన్యత మాటలలో వర్ణించలేనిదని అన్నారు. అసలైన చరిత్రలను వెలికి తీయడంలో ఇతిహాస సంకలన సమితి కృషి ఎంతో గొప్పదన్నారు. సమితి మార్గదర్శనం తమ కళాశాలకు అవసరమని ఆమె అన్నారు.
అనంతరం ఆచార్య వేముగంటి కిషన్ రావు గారు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా ఇతిహాస సంకలన సమితి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. చరిత్ర పునర్నిర్మాణంలో సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇందుకోసం ఎంతోమంది విశ్రాంత ఆచార్యులు రీసెర్చ్ స్కాలర్స్ అందిస్తున్న సహకారం అమూల్యమైనదని కొనియాడారు. చరిత్ర పునర్నిర్మాణం కోసం ICHR జాతీయ స్థాయిలో కృషి చేస్తోందన్నారు. 1857 నుండి 1948 వరకు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన ఎంతోమంది అజ్ఞాత వీరుల చరిత్రలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. నారాయణ రావు పవార్, సోయబుల్లాఖాన్, కనకయ్య,మొగులయ్య, మందు మూల నరసింహారావు వంటి వీరులు తెలంగాణ కోసం చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ చొరవ వలన తెలంగాణ విముక్తిని పొందిందని గుర్తు చేశారు.
అనంతరం ప్రొఫెసర్ కెవిఎస్ శర్మ గారు మాట్లాడుతూ అజ్ఞాత వీరులు అనే అంశంతో చాలామంది అసలైన పోరాటయోధుల్ని వెలికి తీసుకురావడం చాలా సంతోషకరమన్నారు. హైదరాబాద్ కి మరాఠ్వాడా ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఒకప్పుడు ఔరంగాబాద్ హైదరాబాద్ స్టేట్ లో భాగమేనని తెలిపారు. మరఠ్వాడాలో, కర్ణాటకలోని నాలుగు జిల్లాలలో విమోచన దినం సెప్టెంబర్ 17న జరుపుకుంటున్నప్పటికీ, హైదరాబాదులో ఎందుకు జరపడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని అనేక ముస్లిం రాజవంశాలు పరిపాలించాయని తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారని తెలిపారు. స్వాతంత్రం కోసం కృషి చేసిన బాల గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సుభాష్ చంద్రబోస్ మొదలైన వీరులను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. 1724 నుండి 1947 వరకు నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ చివరికి సర్దార్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణ స్వాతంత్ర్యాన్ని పొందిందని, ప్రతి గ్రామంలో సర్దార్ పటేల్ విగ్రహాలు ఉండాలని ఆకాంక్షించారు. రవీంద్ర భారతి లో కూడా సర్దార్ పటేల్ విగ్రహం ఉండాలన్నారు.
అనంతరం కె వి ఎస్ శర్మ గారికి నిర్వహకులు సన్మానం చేశారు. ఆ తర్వాత ఇతిహాస సంకలన సమితి భాగ్యనగర్ అధ్యక్షులు సాయి వరప్రసాద్ గారు ముఖ్య అతిథులకు, ఆంధ్ర మహిళా సభ కళాశాల యాజమాన్యానికి, రిసెప్షన్ కమిటీ సభ్యులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం మొత్తం మూడు భాగాలుగా జరిగింది. ఇతిహాస సంకలన సమితి తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షులు ప్రొ: మనోహర రావు గారు సభాధ్యక్షులుగా వ్యవహరించిన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథులుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ రావు గారు, ఆంధ్ర మహిళా సభ కళాశాల డైరెక్టర్ డా. నకులా రెడ్డి గారు, ప్రధాన వక్తగా చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొ.మనోహర రావు గారు మాట్లాడుతూ చరిత్ర పరిశోధనలో విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, ఇతిహాస సంకలన సమితి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో రెండు రోజుల సెమినార్ నిర్వహించడం కోసం అనుమతించాలని వైస్ ఛాన్సలర్ కిషన్ రావు గారిని ఈ సందర్భంగా కోరారు. పత్ర సమర్పణ చేసిన పరిశోధకులు అందరినీ అభినందించారు. ఆంధ్ర మహిళా సభ డైరెక్టర్ నకులా రెడ్డి గారు మాట్లాడుతూ తమ కళాశాలలో సమావేశం నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరిపించాలని కోరారు.
ప్రధాన వక్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు విమోచన కు పూర్వం తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వీరులను స్మరించుకున్నారు. చరిత్ర పరిశోధకులు ప్రతీ అంశాన్ని ఆధారాలతో సేకరిస్తే ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేకుండా ఉంటుంది అని సూచించారు. చరిత్ర అంశాల సేకరణ లో మనం అలసత్వం ప్రదర్శిస్తే తర్వాత తరానికి చరిత్ర అందదని అన్నారు. పరిశోధకులకు కావాల్సిన సమాచారం తమవద్ద దొరికినంత వరకు అందజేస్తానని అన్నారు. వైస్ ఛాన్సలర్ కిషన్ రావు గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా చరిత్రను గౌరవించడమే అన్నారు. చరిత్ర పరిశోధనలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. అసలైన, నిజమైన చరిత్రలపై పరిశోధన జరిపే వారికి పిహెచ్ డి కోర్సులకు అనుమతిస్తామన్నారు.
తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధులు నారాయణరావు పవార్ గారి కుమారుడు సుధాకర్ రావు పవార్ గారిని, పండిత్ ప్రేమ్ కుమార్ గారి కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి గారిని, కప్పలబంధం గ్రామ వీరుడు తల్లపురెడ్డి నర్సిరెడ్డి గారి మనుమడు తల్లపురెడ్డి నర్సిరెడ్డి గారిని సగౌరవంగా సత్కరించారు. భాగ్యనగర ప్రధాన కార్యదర్శి ఇందుశేఖర్ గారి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.