చైనాలోని ఉయ్ఘర్ ముస్లింలపై చైనా కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను సంబంధించిన విషయాలను వివరణాత్మకంగా తెలియజేసే ఒక వెబ్ పేజీని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తి చూపడమే ప్రధాన లక్ష్యంగా విడుదల చేసిన ఈ వెబ్ పేజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం నాయకత్వం వహిస్తుందని తెలిపింది.
చైనాలోని జిన్జియాంగ్ లో ఉయ్ఘర్ ముస్లిం మైనారిటీ మహిళలు, పురుషులు, పిల్లలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా చేస్తున్నదౌర్జన్యాన్ని వెబ్ పే జీ వివరిస్తుంది.
ఉయ్ఘర్లు జంజియాంగ్ లో నివసిస్తున్న ఒక టర్కిష్ ముస్లిం జాతి సమూహం. వీరు ప్రధానంగా చైనా పశ్చిమ సరిహద్దు దేశాలైన మంగోలియా, రష్యా, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్ దేశాల సరిహద్దులో నివసిస్తూ ఉంటారు.
అయితే ఈ ముస్లింలపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా విపరీతమైన అణచి వేతకు గురి చేస్తోంది. బలవంతపు జనాభా నియంత్రణ పద్ధతులు, శ్రమదోపిడి, నిర్బంధ శిబిరాల్లో ఏకపక్షంగా నిర్బంధించి వారిని హింసించడం, శారీరక, లైంగిక వేధింపుతో పాటు కుటుంబ విభజన, సాంస్కృతిక, మతపరమైన అణిచివేతకు గురి చేస్తూ మైనారిటీలైన ఈ ముస్లింలపై చైనా ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పదుతుందని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ విషయాలన్నింటినీ ఆ వెబ్ పేజీలో పొందుపరిచింది.
జాతి, మత పరమైన మైనార్టీ వర్గాల సభ్యులను లక్ష్యంగా చేసుకుని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం బలవంతపు శ్రమదోపిడి కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. చైనా అంతటా ముస్లిం మైనారిటీల పై చైనా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోంది..
2017 నుంచి మరీ ఎక్కువగా మైనారిటీలను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని అమెరికా విదేశాంగ ప్రభుత్వం తెలిపింది.
మత స్వేచ్ఛను విస్మరిస్తూ చైనాలోని ప్రొటెస్టెంట్, కేథలిక్కులు, టిబెటన్ బౌద్ధులు, ఉయ్ఘర్లతో సహా అన్ని మతవర్గాలపై తీవ్ర శత్రుత్వాన్ని ప్రదర్శిస్తునందుకు ప్రపంచంలో మత స్వేచ్ఛను ఉల్లంఘించిన వారిలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా ఉందని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది.
జిన్జియాంగ్ నుంచి కీలక ఎగుమతులను
నిరోధించిన అమెరికా:
చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం మానవహక్కులను కాలరాస్తుందన్న కారణంతో చైనా నుంచి ఎగుమతి చేసుకునే వస్తువును నిషేధించడం అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది.
చైనా ప్రధాన పంటలైన పత్తి, టమోటా ఉత్పత్తులను నిషేధించడానికి అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. మానవ అక్రమ రవాణా, బాల కార్మికులు, ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలను నిషేధించడానికి, శ్రమ దోపిడీతో తయారైన వస్తువులను అనుమతించకూడదని అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Source : opindia