విద్యాబుద్ధులు నేర్చుకోవడంలో, వ్యవహారశైలిలోను వైదేహి సేవా సమితి బాలికలు మిన్నగా రాణిస్తున్నారని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని గారు పేర్కొన్నారు. జూన్ 5వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన వైదేహి ఆశ్రమం 29వ వార్షికోత్సవంలో జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఆశ్రమంలోని బాలికలను నిర్వాహకులు తల్లి, తండ్రి, గురువు, దైవంలా చూసుకుంటున్నారని ప్రశంసించారు.
నేటికి సమాజంలో మగపిల్లలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు జడ్జీ తెలిపారు. రాజస్థాన్ లాంటి చోట్ల భ్రూణ హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు లోబడి ఆడపిల్లలకు సమానత్వపు హక్కు సంప్రాప్తించిందని తెలిపారు. బాలికలకు విద్యతోనే ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని, ఆర్థిక స్వావలంబనతో మహిళా సాధికారత సిద్ధిస్తుందని జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని గారు చెప్పారు.
వైదేహి సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న వైదేహి ఆశ్రమంలో ఉంటున్న బాలికలకు అయాచితంగా సేవాభావం అలవడుతుందని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఆశ్రమాన్ని వీడినప్పటికీ సేవాభావాన్ని వీడక సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే ఉత్తమ పౌరులుగా వైదేహి ఆశ్రమంలోని బాలికలు వృద్ధి చెందాలని వారు కోరారు. ఆశ్రమంలో బాలికలకు సంబంధించి న్యాయపరంగా ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని తెలిపారు.
వార్షికోత్సవంలో ప్రధాన వక్తగా పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దక్షిణ మధ్యక్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ మన దేశానికి ధీశక్తి, మనోధైర్యం కలిగిన బాలికలు కావాలని అన్నారు. అలాంటి లక్షణాలతో పాటుగా బాలికలకు విద్యను నేర్పించి, సంస్కారాన్ని అలవరించడంలో వైదేహి ఆశ్రమం అహరహం పాటుపడుతున్నదని చంద్రశేఖర్ జీ తెలిపారు. అమ్మాయిల వైవాహిక జీవితానికి భరోసా ఇచ్చే ఏకైక ఆశ్రమంగా వైదేహి ఆశ్రమం విరాజిల్లుతున్నదని చెప్పారు. వందలాది బాలికలకు వృత్తి విద్యతో పాటుగా సాంకేతిక అంశాల్లో నైపుణ్యాలను పెంపొందించే అతి పెద్ద కేంద్రం త్వరలో ఏర్పాటు కానున్నదని ఎక్కా చంద్రశేఖర్ జీ తెలిపారు.
29 సంవత్సరాల్లో వైదేహి సేవా సమితి సాధించిన విజయాలను, చేరుకున్న లక్ష్యాలను ఒక నివేదిక రూపంలో సేవా సమితి కార్యదర్శి పి. ప్రకాశరావు వివరించారు. సేవా సమితి ఔన్నత్యాన్ని అధ్యక్షులు బి.సుందర్ రెడ్డి వివరించారు. వైదేహి ఆశ్రమాన్ని ముందుకు నడిపించడంలో దాతల అనిర్వచనీయమైన పాత్రను వైదేహి సేవా సమితి కోశాధికారి మురళి తెలిపారు.
పలు రాష్ట్రాల జానపద నృత్యాలతో పాటుగా వైదేహి ఆశ్రమ బాలికలు ప్రదర్శించిన శివతాండవం, సంస్కృతంలో విద్యార్థిని నందిని చెప్పిన కాకమ్మ కథ, నేటి తల్లిదండ్రులు లఘు నాటిక ప్రదర్శన సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కనులపండువగా జరిగిన వైదేహి ఆశ్రమ 29వ వార్షికోత్సవంలో వైదేహి కిశోరీ వికాస్ యోజన అధ్యక్షురాలు కిరణ్మయి, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆశ్రమ కార్యదర్శి రంగనాథం చేసిన వందన సమర్పణతో వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది.