
చంద్రయ్య దొర వనవాసీ కోయదొర తెగకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజానుబాహుడు. ఉంగరాల జుట్టు, తల వెనుక జులపాలు కలిగి, ఠీవిగా చింతపిక్క రంగు గుర్రంపై సంచరిస్తూ ఆంగ్లేయులకు, సామాన్య ప్రజలను హింసించేవారికి సింహస్వప్నంగా ఉండేవాడు. మన్యం ప్రజల పక్షాన నిలబడి బ్రిటిషువారిపై తిరుగుబాటు చేసేవాడు. కరువు రోజులలో ప్రజలకు అతడు గంజి సత్రాలు స్థాపించాడు. చంద్రయ్య స్వరాజ్య సమరాన్ని సద్దుమణిగించడానికి కలెక్టర్ ఆయనకు ముఠా పదవి ఇవ్వడానికి ప్రతిపాదించగా అందుకు ఒప్పుకోలేదు. సంస్థానాదీశ పదవిని ఆశ చూపినా చంద్రయ్య దొర ససేమిరా అన్నాడు. స్వరాజ్య సమరంలో అమరుడైనాడు.