Home News కుతుబ్ మినార్ వాస్తవానికి ‘విష్ణు స్తంభం’ : VHP అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్

కుతుబ్ మినార్ వాస్తవానికి ‘విష్ణు స్తంభం’ : VHP అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్

0
SHARE

ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన కుతుబ్ మినార్ వాస్తవానికి ‘విష్ణు స్తంభం’ అని విశ్వహిందూపరిషత్ (VHP) అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. 27 హిందూ-జైన దేవస్థానాలను ధ్వంసం చేసిన తర్వాత వాటి నుంచి సేకరించిన వస్తువులతో కుతుబ్ మినార్‌ను నిర్మించారని ఆయన చెప్పారు. హిందువులను అపహాస్యం చేయడం కోసమే అతి పెద్ద నిర్మాణాన్ని జరిపారని బన్సాల్ తెలిపారు.

కుతుబ్ మినార్ ప్రాంగణంలో ధ్వంసమైపోయిన 27 దేవాలయాలను పునరుద్ధరించి ఆ దేవాలయాల్లో మూల విరాట్టులకు పూజలు, ధూపదీప నైవేద్యాలు, కైంకర్యాలను చేపట్టాలని ప్రభుత్వాన్ని VHP డిమాండ్ చేసిన ఒక రోజు తర్వాత బన్సాల్ పై ప్రకటన చేశారు.

ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర మరియు సాంస్కృతి సంస్థ (UNESCO) 1993లో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించిన కుతుబ్ మినార్ ప్రాంగణాన్ని బన్సాల్ సందర్శించారు.

కుతుబ్ మినార్ ప్రాంగణంలో గణేష విగ్రహాలను ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారని నేషనల్ మాన్యుమెంట్ అథార్టీ (NMA) ఛైర్మన్, బీజేపీ నేత తరుణ్ విజయ్ తెలిపారు. ఇదే విషయాన్ని తాను ఒక సంవత్సరం క్రితం ఇదే అంశాన్ని భారత పురాతత్త్వ శాస్త్ర సర్వేక్షణ సంస్థ (ASI) దృష్టికి ఒక లేఖ ద్వారా తీసుకువెళ్లానని, వారి నుంచి ప్రత్యుత్తరం రావాల్సి ఉందని తరుణ్ విజయ్ చెప్పారు.

ఢిల్లీ టూరిజమ్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీలో చివరి హిందూ రాజ్యం అంతరించిపోయిన తర్వాత 27 హిందూ దేవస్థానాలను ధ్వంసం చేసి వాటి శకలాలతో అదే ప్రాంతంలో 73 మీటర్ల ఎత్తయిన కుతుబ్ మినార్‌ను నిర్మించారు. ఇదే విషయాన్ని కుతుబ్ మినార్‌కు తూర్పు వైపు ఉన్న ద్వారంపై రాసి ఉందని టూరిజమ్ వెబ్‌సైట్ పేర్కొంది.