Home News ఇంటికి ఒకరి నుంచి ముగ్గురి వరకు భారత సైన్యంలో ఉన్న గ్రామం

ఇంటికి ఒకరి నుంచి ముగ్గురి వరకు భారత సైన్యంలో ఉన్న గ్రామం

0
SHARE

ఆ చిన్న గ్రామాన్ని చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్లు కనిపిస్తుంది… అక్కడి యువకులను చూస్తే వారు దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు..

ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారస పడతాడు… ఆ ఊరిపేరు దేవిశెట్టిపల్లె… ముద్దుగా దేశభక్తి పల్లె అని కూడా పిలవచ్చేమో….

పతోతరగతి ఉత్తీర్ణత సాధిస్తేచాలు…. ఆ గ్రామంలో యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వారి కుటుంబ సభ్యుల  నేపథ్యం…. దేశసేవలో తరించాలన్న యువకుల ఆసక్తి… ఆదిశగా అడుగులు వేసేలా ఉత్సాహాన్నిస్తుంది. ఎక్కువమంది ఆర్మీలో ఉన్నా నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో కూడా ఆ ఊరి నుంచి వచ్చిన వారు కనిపిస్తారు. మొత్తంమీద ఆ గ్రామం త్రివిధ దళాలలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దాంతోపాటు ఏపీˆ, గోవా పోలీసులుగా రాణిస్తున్న వారూ ఇక్కడ ఉన్నారు. సైనికుల గ్రామంగా పేరుతెచ్చుకున్న దేవిశెట్టి పల్లె శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న కుటుంబాల సంఖ్య 120 మాత్రమే. అయితేనేం ఇంటికి ఒకరి నుంచి ముగ్గురి వరకు భారత సైన్యంలో ఉన్నారు. సుమారు 55 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. సుబేదారుగా, నాయక్‌ సుబేదారుగా, హవల్దార్లుగా మరికొందరు పనిచేస్తున్నారు. ఒకరు మేజర్‌గా పనిచేస్తున్నారు. సుమారు 50మందికి పైగా ఆర్మీలో సివిలియన్‌ ఉద్యోగాల్లో ఉన్నారు. నేవీలో ఇద్దరు, ఎయిర్‌ఫోర్సులో ఆరుమంది, గోవా పోలీసులగా నలుగురు, ఆంధ్ర పోలీసుగా ఒకరు, అగ్నిమాకపకశాఖలో ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే గోవాలో పీˆడబ్ల్యూడీ విభాగంలో ఏడు మంది ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు.

బీజం పడింది ఇలా….

గ్రామానికి చెందిన రేనాటి వెంకటసుబ్బయ్య ఉపాధి కోసం 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లారు. అక్కడ ఆర్మీ ఎంపికలు జరుగుతుండటంతో ఆయనా పాల్గొన్నారు. అందులో టెలికం లైన్‌మెన్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామానికి ఆర్మీ దుస్తుల్లో వచ్చాడు. దీంతో ఆవిషయం గ్రామంలోని యువకులను బాగా ఆకర్షించింది. ఆయన ఆర్మీ పరిస్థితులను స్థానికులకు వివరించేవారు. దీంతో గోగుల బాలవెంగయ్య ఆర్మీలో చేరారు. దీంతో ఆయన తమ కుటుంబికులు, బంధువులు, గ్రామస్థులను ఆర్మీలో చేరేలా ప్రొత్సహించారు. ఇలా… ఆర్మీలో కొలువులు సాధించినవారు తమకుటుంబాల్లో పది, ఇంటర్‌ పాసైనవారిని ఆర్మీలో ఉద్యోగాలకు ప్రయత్నించేలా చేయడం, ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది ఆర్మీలో చేరుతున్నారు. మొదట ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ప్రస్తుతం సుమారు 120 మంది వరకు ఆర్మీలో వివిధహోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం త్రివిధదళాల్లో, పోలీసులుగా ఉన్నవారినీ కలిపితే ఈ సంఖ్య 160 వరకు ఉంటుంది. మరో 30 మంది విశ్రాంత సైనికులూ గ్రామంలో ఉన్నారు.

ఆర్మీలో పనిచేయడం దేశభక్తిగా భావించాలి. గ్రామం నుంచి ఎక్కువమంది యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. అందుకు తగినట్లు సూచనలు, సలహాలు తీసుకుని రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమించినట్లే దేశాన్ని ప్రేమించాలి.  దేవిశెట్టిపల్లిలో ఎక్కువమంది ఆర్మీలో పనిచేసేవారు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నందున గ్రామంలోకాని, సీతారామపురంలో ఏటీఎం అందుబాటులో ఉండేలా చూడాలి.
– అనంతు సుధాకర్‌, ఆర్మీ మేజర్‌

మే నెలలో సందడే సందడి…

ఉద్యోగరీత్యా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో విధులు నిర్వహించే వారంతా మే నెల వచ్చిందంటే గ్రామానికి చేరుకుంటారు. సుమారు మూడు నుంచి నాలుగువారాలపాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సెలవులపై వచ్చినపుడే పెళ్లిళ్లు నిశ్ఛయించుకుని ఆదే నెలలోనే వివాహాలు చేసుకుని వెళుతుంటారు.
– మేడెం వెంకటేశ్వర్లు, సీతారామపురం

(ఈ వ్యాసం మొదట 20 ఆగష్టు 2018నాడు ఈనాడులో ప్రచురితమైంది)