Home News విమానాశ్రయంలో జిహాద్ ని ప్రోత్సహించే అరబిక్ గ్రంథం – అధికారులకు ఫిర్యాదు చేసిన ఇమామ్ 

విమానాశ్రయంలో జిహాద్ ని ప్రోత్సహించే అరబిక్ గ్రంథం – అధికారులకు ఫిర్యాదు చేసిన ఇమామ్ 

0
SHARE
జిహాద్ మరియు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే గ్రంథం ఒకటి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించడం కలకలం రేపింది. విమానాశ్రయ లైబ్రరీలో ఉన్న ఈ అరబిక్ గ్రంధాన్ని ప్రముఖ మానవతావాది, ఆస్ట్రేలియాకు చెందిన ఇస్లామిక్ మతగురువు షేక్ మహ్మద్ తాహిది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. షరియా చట్టానికి చెందిన గ్రంథంగా గుర్తించిన విమానాశ్రయ అధికారులు దాన్ని పుస్తకాల జాబితా నుండి తొలగించారు.
విమానాశ్రయ లైబ్రరీలో దొరికిన అరబిక్ గ్రంథంలోని కొన్ని భాగాలు జిహాద్ మరియు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా గమనించిన ఇమామ్ తాహిది ఈ వ్యవహారం మొత్తాన్ని ట్విట్టర్ లైవ్ వీడియో ద్వారా అధికారులకు చేరవేశారు. అందులోని భాగాలూ చదవడం వల్ల  తీవ్రవాదం పట్ల ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని తాహిది తెలిపారు. విమానాశ్రయాల వంటి సున్నిత ప్రాంతాల్లో ఇటువంటి గ్రంథాలు ఉంటడం తీవ్రమైన భద్రతా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని తాహిది తెలిపారు. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని వివరించారు. తాహిది తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వీడియో అప్లోడ్ చేసిన కొంతసేపటికే విమానాశ్రయ అధికారులు ఆ పుస్తకాన్ని తొలగించినట్టు సమాధానం ఇచ్చారు.
ఇరానియన్ సంతతికి చెందిన మతగురువు మహ్మద్ తాహిద్ 1995 సంవత్సరంలో తనకు 12 ఏళ్ల వయసులోనే ఇరాక్ నుండి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు.
అడిలైడ్ నగరంలో నివసించే తాహిది ప్రపంచవ్యాప్తంగా పేట్రేగిపోతున్న  ఇస్లామిక్ ఉగ్రవాదం,  మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోరాడుతున్నారు. ఇస్లామిక్ అతివాదం పట్ల సాటి ముస్లింలకు అవగాహన కలిగిస్తున్నారు.