వి.హెచ్.పి జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపాత్ రాయ్, అతని సోదరులు భూ ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి ప్రతిష్టను కించపరిచే విధంగా ఫెస్‌బుక్‌లో పోస్టు చేసిన యూపీలోని బిజ్నోర్‌కు చెందిన జర్నలిస్ట్ వినీత్ నారాయన్ కోర్టులో క్షమాపణలు చెప్పి ఆ పోస్ట్‌ను తొలగించారు.
చంపత్ రాయ్ పై అసత్య ఆరోపణలతో పోస్ట్ పెట్టినందుకు యూపీలోని బిజ్నోర్ జిల్లా, నాగినాకు చెందిన వినీత్ నారాయణ్, అల్కా లహోటి , రజనీష్ అనే ముగ్గురు వ్యక్తులపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఐపిసి లోని 14 సెక్షన్లతో పాటు ఐటి చట్టంలోని రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ అసత్య ఆరోపణలపై చంపాత్ రాయ్ సోదరుడు సంజయ్ బన్సాల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయగా శుక్రవారం అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఫేస్‌బుక్ పోస్ట్‌ని తీవ్రంగా పరిగణించింది. ఫేస్‌బుక్ పోస్ట్‌ను ఉపసంహరించుకోవాలని జర్నలిస్టును ఆదేశించింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని వినీత్ నారాయణను కోర్టు హెచ్చరించింది. ఈ మేరకు చంపాత్ రాయ్, అతని సోదరులకు వ్యతిరేకంగా ఉన్న ఫేస్‌బుక్ పోస్ట్‌ను వినీత్ నారాయన్ తొలగించారు.