వందేళ్ల తర్వాత ఒలంపిక్స్‌లో అథ్లెటిక్ విభాగంలో భారత్కు స్వర్ణం దక్కింది. భారత యువ ఆటగాడు నీరజ్ చోప్రా భారత్ ఈ ఘనతను సాధించి పెట్టాడు. టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్‌లో జావెలిన్ త్రో ఆటలో నీరజ్ చోప్రా అత్యున్నత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుని భారత కీర్తిపతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడించేలా చేశాడు. అందరి కన్నా మెరుగ్గా ఆడుతూ… ఈటను 87.58 మీటర్ల దూరం విసిరి కొత్త చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించాడు.
తొలి ప్రయత్నంలో అతను 87.03 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక రెండో సారి అతను మరింత పదునుగా త్రో చేశాడు. ఈ సారి 87.58 మీటర్ల దూరం విసిరి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. నిజానికి క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఫస్ట్ త్రోతోనే అందరికీ షాకిచ్చాడు నీరజ్. అతని పర్సనల్ బెస్ట్ 88.07 మీటర్లు. దానికి తగినట్లే నీరజ్ టోక్యోలో తన ట్యాలెంట్ చూపించాడు. ముందు నుంచి ఫెవరేట్‌గా ఉన్న నీరజ్.. అనుకున్నట్లే భారత్ కు ఓ స్వర్ణాన్ని అందించాడు.
ప్రతి అటెంప్ట్‌లోనూ నీరజ్ నిప్పులు చెరిగే రీతిలో జావెలిన్ త్రో చేశాడు. ప్రతి త్రోలోనూ అతను మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఆరంభం నుంచి లీడింగ్‌లో ఉన్న చోప్రా.. ఇండియాకు అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించాడు. మూడవ త్రోలో నీరజ్ కేవలం 76.79 మీటర్ల దూరం మాత్రమే జావెలిన్‌ను విసిరాడు. తొలి మూడు రౌండ్లలో లీడింగ్‌లో ఉన్న నీరజ్.. నాలుగవ, అయిదో రౌండ్‌లో ఫౌల్ చేశాడు. రెండవ, మూడవ స్థానాల్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు నిలిచారు.
అయితే తన గోల్డ్ మెడల్‌ను భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్‌కు అంకితమిస్తున్నానని నీరజ్ ప్రకటించాడు. గోల్స్ మెడల్ గెలిచిన అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. ‘దిగ్గజం మిల్కా సింగ్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినాలనుకున్నారు. ఆయన కల నెరవేరింది. కానీ మిల్కా సింగ్ ఇప్పుడు మనతో లేరు.. కనుక తాను ఒలింపిక్స్ లో సాధించిన పసిడి పతకాన్ని మిల్కా సింగ్ కు అంకితం ఇస్తున్నానని తెలిపాడు. అంతేకాదు మిల్కా సింగ్ ఎక్కడ ఉన్నా.. తనను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు అనుభూతి చెందుతున్నట్లు చెప్పాడు.
బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయనాయుడితో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అభినందించారు. తొలిసారి ఒలంపిక్స్‌లో పాల్గొని స్వర్ణం సాధించడం దేశ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన బజరంగ్ పునియా
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం సొంతమైంది. 65 కేజీల పురుషుల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత రెజ్లర్ బజరంగ్ పునియా కాంస్య పతకంతో మెరిశాడు. కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్ నియాజ్‌బెకోవ్‌తో జరిగిన పోరులో తిరుగులేని ప్రదర్శనతో మట్టికరిపించాడు. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 8-0తో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 6కు చేరుకుంది. కాగా, నిన్న జరిగిన సెమీస్‌లో అజర్‌బైజన్‌కు చెందిన అలియేవ్ చేతిలో బజరంగ్ 5-12తో ఓటమి పాలయ్యాడు.