నీరా ఆర్య
కన్నభూమికొరకు కడతేర్ఛెను పతిని
వక్షములను కోయ వణకకుండ
నిలిచినట్టి నారి నీరార్యను గనుము
వినుర భారతీయ వీర చరిత
భావము
స్వరాజ్య సమరాజ్ఞి నీరా ఆర్య నేతాజీ రెజిమెంటులొ సైనికాధికారిణిగా పనిచేశారు. ఆమె భర్త బ్రిటిష్ ప్రభుత్వంలో సీఐడీ అధికారిగా ఉండేవారు. నేతాజీ జాడ చెప్పమని భర్త హింసించడంతో, మాతృభూమి కోసం భర్త అని కూడా చూడకుండా ఆమె అతడిని పొడిచి చంపారు. బ్రిటీష్‌వారు ఆమెను కాలాపానీ జైలులో బంధించారు. ఆ సమయంలో నేతాజీ ఎక్కడున్నారని జైలరు నీరా ఆర్యను ప్రశ్నించగా, వారు నా గుండెలో ఉన్నారని ఆమె బదులిచ్చారు. అందుకు ఆగ్రహించిన జైలరు ఆమె వక్షోజాలను కోయమని ఆదేశించగా, అంతటి ఘోరమైన శిక్షను మాతృభూమి కోసం పంటి బిగువను నీరా ఆర్య భరించారు. ఆంగ్లేయులు ఎంతగా హింసించినప్పటికీ నేతాజీ జాడ చెప్పని ధీర నారి నీరా ఆర్య వీర చరిత తెలుసుకో ఓ భారతీయుడా!
దేశానికి స్వరాజ్యం సిద్ధించిన తర్వాత హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో 1998లో నీరా ఆర్య కన్నుమూశారు.
-రాంనరేష్