Home News రూపాయి పతనం కాలేదు – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

రూపాయి పతనం కాలేదు – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

0
SHARE

డాలర్ మార‌కంతో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతుంద‌నే ఆందోళన అవసరం లేదని, రూపాయి ప‌త‌నం కాలేద‌ని ఆ పరిస్థితులు కూడా లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాస్తవానికి రూపాయి తన సహజరీతిలోనే ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. మంగళవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్లో రూపాయి విలువ తగ్గడంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై నిర్మలా సీతారామన్ స్పందిచారు. రూపాయి కదలికల పై ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, భారీగా హెచ్చుతగ్గులు ఉంటేనే అవ‌స‌ర‌మున్న‌పుడు ఒడిదుడుకుల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంద‌ని తెలిపారు. అంతే త‌ప్పా రూపాయి విలువ నిర్దేశించ‌డానికి ఆర్బీఐ ప్రయత్నించడం లేదని, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువలో భారీగా హెచ్చుతగ్గులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టంచేశారు.

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువతో హెచ్చుతగ్గులు క‌నిపించిన‌ప్ప‌టికీ… ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మాత్రం రూపాయి విలువ బ‌లంగా ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వు నిర్ణయాల ప్ర‌భావాన్ని తట్టుకుని రూపాయి నిలబడిందని, రూపాయి కుప్పకూలదని తాను హామీ ఇస్తున్నానని ఆమె స్ప‌ష్టం చేశారు. విదేశీ మారకం నిల్వలపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ప్రస్తుతం మన దగ్గర 500 బిలియన్ అమెరికన్ డాలర్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఎన్ఆర్ఐలు విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయడానికి అనుమ‌తించాలన్న సభ్యుల సూచనలపై స్పందిస్తూ.. ఈ ప్రతిపాదనను ఆర్బీఐకి పంపుతామని చెప్పారు. అంతకుముందు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. రూపాయి పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసు కుంటోందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో రూపాయి విలువ ఏటా 10% నుంచి 12% తగ్గిందని, 2014 నుంచి ఈ ఎనిమిదేండ్లలో రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 4.54 శాతమే తగ్గిందని తెలిపారు.