Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

శ్రీ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జీ (డాక్టర్జీ)

సీ.
జాతి జెండ నిలప జాకుదించదలచె
గుప్త నామమునను గుబులు రేపె
పూర్ణ స్వేచ్ఛ కొరకు పూరించె శంఖంబు
కానలందునను తా కర్ర విరిచి
ధిక్కరించెన్ జూడు నొక్క శాసనమును
యురి గూడ తనకును మురిపెమనుచు
ననుభవించెను ఖైదు తను పలుమారలు
ఖేదములను దీర్చె కేశవుండు

అ.వె.
వందెమాతరమని వచియించె బాల్యాన
యువకుడయ్యి నడిపె యుద్యమములు
సంఘశక్తితోడ సంఘటనను జూపె
వినుర భారతీయ వీర చరిత

భావము

బాల్యంలో యూనియన్ జాక్ దించేసి జాతీయ జెండా ఎగురవేయాలని తన మిత్రులతో పథకం వేశారు. కొకైన్ అనే రహస్యనామంతో విప్లవ కార్యమాలు చేసి బ్రిటిషు వారికి గుబులురేపారు. నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. బ్రిటిష్ వారు అటవీ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తే, అడవిలో కట్టెలు విరిచి, అటవీ సత్యాగ్రహం చేసి, బ్రిటిష్ శాసనాన్ని ధిక్కరించి, ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక ఏర్పాటు చేసిన సమావేశంలో “స్వతంత్రం కోసం జైలుశిక్ష మాత్రమే కాదు ఉరిశిక్షను కూడా సంతోషంగా స్వాగతించాలి” అని ఉద్బోధించారు.

ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించారు. భారత జాతి కష్టాలు తీర్చడానికి కేశవుడు(డాక్టర్జీ) నిలిచారు. బాల్యంలో విక్టోరియారాణికి వందేమాతరంతో స్వాగతం పల్కిన వారు, యవ్వనంలో భారతాంబ స్వేచ్ఛ కోసం ఉద్యమాలు నడిపిన వారు, సంఘ శక్తిలోనే సంఘటనా శక్తి ఇమిడి ఉన్నదని నిరూపించిన మాననీయ శ్రీ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జీ (డాక్టర్జీ) వీర చరిత తెలుసుకో ఓ భారతీయుడా!

-రాంనరేష్