కనకలతా బారువా
రక్షక నిలయమున రణ జెండ నుంచగ
గుండు దిగిన పోలె గుండె దిటవు
కన్న భూమి బిడ్డ కనకలతా బార్వ
వినుర భారతీయ వీర చరిత
భావము:
క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. అస్సాంలో కనకలతా బారువా అనే 17సంవత్సరాల యువతి జాతీయ పతాకాన్ని బ్రిటీష్ పోలీస్ స్టేషన్‌పై ఎగురవేయాలని నిర్ణయించింది. ఆ ప్రయత్నంలో తెల్లదొరల తూటాలకు నేలకొరిగింది. పతాకం నేలను తాకకుండా జాతీయ జెండాను తన అనుచరులకు అప్పగించింది. జాతీయ పతాకం కోసం ప్రాణ త్యాగం చేసింది. ఇలా చివరి క్షణంలో సైతం మాతృభూమి విముక్తి కోసం, పతాకం గౌరవం కోసం తపించి చిన్న వయసులోనే దేశమాత స్వేచ్చ కోసం అసువులు బాసిన వీరాంగణ చరిత విను ఓ భారతీయుడా!
– రాంనరేష్