Home News ఖంభట్ హింస: శోభాయాత్రలపై ముందస్తు కుట్ర

ఖంభట్ హింస: శోభాయాత్రలపై ముందస్తు కుట్ర

0
SHARE

శ్రీరామనవమి రోజున గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో ఖంభట్‌లో శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతోపాటు తదనంతర హింస ముందస్తు ప్రణాళికలో భాగమని స్థానిక ‘దివ్య భాస్కర్’ దినపత్రిక తెలిపింది. మౌల్వీలతో పాటుగా అరెస్టయిన 11 మందిలో ఆరుగురు కుట్రను పన్నడంలో పాలుపంచుకున్నారని దినపత్రిక ఒక వార్తా కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం ముందుగా ఏర్పాటైన ఒక స్లీపర్ సెల్ మాడ్యూల్‌కు చెందిన సభ్యులు శ్రీరామనవమికి మూడు రోజుల ముందు కలుసుకున్నారు. రాళ్ళను సేకరించారు. శోభాయాత్రకు నిర్దేశించిన మార్గంలో ముందుగానే సేకరించిన రాళ్ళను వారికి అందుబాటులో ఉంచుకున్నారు.

ఖంభట్‌లోని ఇతరుల్లో ముస్లిములకు పలుకుబడిని, భయాన్ని కలిగించడానికే హింసకు పాల్పడినట్టు పోలీసు విచారణలో నిందితులు అంగీకరించారు. తద్వారా భవిష్యత్తులో శోభాయాత్రలు చేపట్టే ధైర్యాన్ని హిందువులు చేయరని వారు తెలిపారు. ‘దివ్య భాస్కర్’ వార్తా కథనం ప్రకారం అరెస్టయిన వారి కుటుంబాలకు న్యాయ సాయం, ఆర్థిక సాయం అందించే దిశగా నగదు సేకరించడానికి ఒక ‘చాదర్’ (ముస్లింలకు చెందిన అతిపెద్దదైన సంప్రదాయ వస్త్రం) ను ఖంభట్‌లోని ముస్లిము ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిప్పారు.

యావత్ హింసకు పథక రచన చేసిన ప్రధాన నిందితుడు రజాక్ మౌల్వీ అని ఆ వార్త కథనం పేర్కొంది. కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించారు. భవిష్యత్తులో శోభాయాత్రలు చేపట్టడానికి వీల్లేకుండా హింసకు పథక రచన చేశారని జిల్లా పోలీస్ చీఫ్ అజిత్ రజియాన్ తెలిపారు. హింసకు సంబంధించి ఆరుగురు ప్రధాన నిందితులు కాగా మరో 16 మంది ప్రమేయ ఉందని ఆయన తెలిపారు. 57మందిని గుర్తించామని, వారిపై ఒక ఫిర్యాదును నమోదు చేశామని చెప్పారు.

‘దివ్య భాస్కర్’ వార్తా కథనం ప్రకారం శోభాయాత్ర సాగుతుండగా డీజే మ్యూజిక్ నిలుపుదల కోసం మౌల్వీ రజాక్ గందరగోళం సృష్టించాడు. తద్వారా పోలీసుల దృష్టిని రాళ్ళు రువ్వడం నుంచి మళ్లించేలా చేశాడు. హింసాత్మక ఘటనలకు సంబంధించి ప్రస్తుతానికైతే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లకు చెందిన భారత్ వ్యతిరేక శక్తుల ప్రమేయంపై ఎలాంటి పటిష్టమైన ఆధారం లభించలేదు. కానీ ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతున్నది.

స్థానిక దినపత్రిక ‘గుజరాత్ సమాచారం’ ప్రకారం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం అశాంతిని సృష్టించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. కానీ స్థానిక ప్రజల నుంచి తగిన మద్దతు లేని కారణంగా ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చడంలేదు. హింసకు సంబంధించిన స్క్రీన్ షాట్లు పాకిస్తాన్‌కు చెందిన సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. నేరచరిత్ర కలిగిన నిందితులు కాల్ మరియు మెస్సేజ్ రికార్డులను దర్యాప్తు చేసే పనిలో పోలీసులు ఉన్నారు.

ఖంభట్ హింస

ఆనంద్‌లోని ఖంభట్ ప్రాంతంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని అక్కడి హిందువులు శోభాయాత్రను చేపట్టారు. ఒక మసీదు మీదుగా శోబాయాత్ర వెళుతుండగా యాత్రపై దుండగులు రాళ్ళు వేశారు. ఏడు నుంచి ఎనిమిది దుకాణాలకు నిప్పుపెట్టారు. హింసాత్మక ఘటనలో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. గుజరాత్‌లోని హిమ్మత్ నగర్‌లో శోభాయాత్రపై దుండగులు రాళ్ళు విసిరారు. రాష్ట్రంలో శాంతి మరియు సౌభ్రాతృత్వాలకు భంగం కలిగించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది.

శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్నాటక, తదితర ప్రాంతాల్లో ఇదే తరహా హింసాత్మక ఘటనలు జరిగాయి.