Home Telugu Articles విషవలయంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు

విషవలయంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు

0
SHARE

అగాధాల సృస్టే అక్కడి సిలబస్‌

తెలంగాణలోని గురుకుల పాఠశాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏమిటి? అక్కడి విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా బయటకు వచ్చే అవకాశం ఎంత? ఆ పాఠశాలల అన్ని వ్యవహారాలలోను తల దూరుస్తున్న ‘ స్వేరోస్‌ ‘ అనే సంస్థ పాత్ర ఏమిటి? ఈ సంస్థ నాయకుడు ఆ పాఠశాలకు చెందిన ఎస్‌సి బాలిక మీద అత్యాచారం చేసినట్టు పోలీసు కేసు నమోదైనా వారి ఆధిపత్యం ఇంకా అక్కడ యథేచ్ఛగా ఎలా కొనసాగుతోంది? ఇలాంటి ప్రశ్నలు సంధించిన వారందరి మీద స్వేరోస్‌ విజృంభిస్తోంది. షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం మీద ఇటీవల సోమాజీగూడ (హైదరాబాద్‌) ప్రెస్‌క్లబ్‌లో సాక్షాత్తు మీడియా ముందే జరిగిన భౌతికదాడి సరిగ్గా ఇందుకు సంబంధించినదే. ఇలా నిలదీసినందుకు జరిగినదే. అడ్డం వచ్చిన ఒక మహిళా జర్నలిస్టు మీద కూడా దాడి జరిగింది. ఇదంతా పత్రికలలో వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అలెగ్జాండర్‌ అనే వ్యక్తి దాడికి నాయకత్వం వహించాడు. ఇది కూడా పత్రికలు వెల్లడించాయి. ఇంత జరిగినా, జరుగుతున్నా మేధావులు, టీవీ చానెల్‌ పులులు ఎవరూ నోరెత్తలేదు.

తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ‘స్వేరోస్‌’ సంస్థ యువకులు చేస్తున్న ఆగడాలపై మే నెల 20న రాష్ట్ర గవర్నరుకు నరసింహన్‌కు శ్రీశైలం నాయకత్వం లోని బృందం ఒక విజ్ఞాపన పత్రం అందజేసింది. అందుకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయటానికి 21న సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్బులో శ్రీశైలం, మిత్రులు వచ్చారు. ప్రెస్‌ క్లబ్బులో, పత్రికా విలేకరుల సమక్షంలో శ్రీశైలంపై అలెగ్జాండర్‌ నాయకత్వంలోని 50మంది యువకులు భౌతిక దాడిచేశారు. అడ్డుకోబోయిన మహిళా విలేకరిపైన చేయిచేసుకున్నారు. 22న శ్రీశైలం సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో మళ్లీ విలేకరుల సమావేశం నిర్వ హించారు. దళిత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తాను ఆశ్రమ పాఠశాలలను అంకిత భావంతో నిర్వహిస్తున్నానని ఆశ్రమ పాఠశాలల సొసైటీ కార్యదర్శి శ్రీ పి.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌, (ఐ.పి.ఎస్‌.) పత్రికా ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, శ్రీవైలం అందించిన వినతిపత్రంలోని అంశాలు ఎంతో తీవ్రమైనవిగా కనిపిస్తున్నాయనడం అతిశ యోక్తికాదు. కాబట్టి తెలంగాణ ఆశ్రమ పాఠశాలల్లో వాస్తవంగా జరుగుతున్నదేమిటో ప్రజానీకం తెలుసుకోవటం అవసరం. షెడ్యూల్డు కులాల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ ఎస్‌.సి., పరిరక్షణ సమితి. దీని అధ్యక్షులు కర్నె శ్రీశైలం.

శతాబ్దాలుగా చదువుకు దూరంగాఉన్న షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన కులాల విద్యార్థినీ, విద్యార్ధులకు అన్ని రాష్ట్రాలు అనేక సంవత్సరాలుగా వసతిగృహాలను నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో వసతిగృహాల స్థానంలో పెద్దఎత్తున ఆశ్రమ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అంకితభావం కలిగిన ఉపాధ్యాయులున్నచోట ఇవి మెరుగైన విద్యను అందిస్తున్న మాట నిజం. గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి పి.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ పోలీసు విభాగం నుండి తప్పుకుని తెలంగాణ గురుకుల పాఠశాలలకు కార్యదర్శిగా గత తొమ్మి దేళ్లుగా పనిచేస్తున్నారు. అనేక మంచి ప్రయోగాలు చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని చర్యలు, విధానాల కారణంగా విమర్శలకు కూడా ఎదుర్కొంటున్నారు.

‘ స్వేరోస్‌ ‘ విధ్వంసక పాత్ర

‘ స్వేరోస్‌ ‘ అంటే ఏమిటి? ఇందులోని సభ్యులు అడుగడుగునా గురుకులాల వ్యవహారాలలో కలగ చేసుకుంటున్నారు. ఇంతకీ వీరు విద్యా సేవకులా? అక్రమాలను సమర్ధించే ప్రైవేటు సైన్యమా? ఇదే ఇప్పుడు అంతా వేసుకుంటున్న ప్రశ్న.

గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల సక్రమ నిర్వహణలో స్థానికుల సహకారం తీసుకునే లక్ష్యంతో నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామకమిటీలు, విద్యావాలంటీర్లను నియమించింది. ఇది మంచి ప్రయోగం. కానీ స్వేరోస్‌ ఇలాంటి సదుద్దేశంతో అయితే పనిచేయడం లేదు. ఇందులో సభ్యులంతా గురుకుల పాఠశాలల మాజీ విద్యార్థులు. అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు అడుగడుగునా స్వేరోస్‌ యువకుల వల్ల భయపడుతూ బతుకు తున్నారని చెప్పడానికి అనేక సంఘటనలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో విద్యార్ధినులపై అత్యాచారాలు జరిగిన దుర్ఘటనలపై రెండు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇవి వెలుగుచూడకుండా బలమైన గోడలుగా స్వేరోస్‌ సంస్థ యువకులకు బలమైన అండ లభిస్తోంది.

మత ప్రచార కేంద్రాలా?

గురుకుల పాఠశాలల్లో ప్రధానంగా హిందువులు, క్రైస్తవ విద్యార్ధినీ, విద్యార్థులు ఉంటారు. వారి వారి మతాల ఉత్సవాలను నిర్వహించుకునే స్వేచ్చ ఉంది. క్రైస్తవులకు వారి ఉత్సవాలను నిరాటంకంగా నిర్వహించుకునే స్వేచ్ఛనిస్తూ, హిందూ విద్యార్ధినీ విద్యార్ధులపై హిందూ పండగలు – సంక్రాంతి, ఉగాది, వినాయకచవితి, శ్రీరామనవమి, బతకమ్మ చేసుకోనీకుండా డా|| ప్రవీణ్‌కుమార్‌ ఆంక్షలు పెట్టారని శ్రీశైలం వినతిపత్రంలో పేర్కొన్నారు. లంబాడీల ఆరాధ్యదైవం సంత్‌ సేవాలాల్‌ ఫోటోను తొలగించారు. హిందూ పండుగల సెలవులు రద్దుచేశారు. బౌద్ధమతము స్వీకరించండంటూ బలవంతంగా గుళ్లు చేయించారు. గురుకుల పాఠశాలలు హిందూధర్మ వ్యతిరేక క్రైస్తవ అనుకూల కేంద్రాలుగా తయారయ్యాయి.

ఎందరో సామాజిక సంస్కర్తలు

విద్య ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన స్వామి వివేకానందుడు, మహాత్మా జ్యోతిబాఫూలే, డా|| బాబాసాహేబ్‌ల ప్రేరణలతో…. హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ, మచిలీపట్నంలో వేమూరి రాంజీ పంతులు, పిఠాపురంలో పిఠాపురం జమీందారు, నెల్లూరులో పొణగా కనకమ్మ, ఏనుగు పట్టాభిరామిరెడ్డి, ఖమ్మంలో రావెళ్ళ శంకరయ్య, షెడ్యూల్డు కులాల విద్యార్ధులకు వసతి గృహాలను నడిపి మెరుగైన విద్యను అందించారు. వీరందరూ స్వాతంత్య్రం రాకముందు తామే నిధులను సేకరించు కుని హాస్టళ్ళను విజయవంతంగా నడిపారు. ఈ హాస్టళ్ళల్లో చదువుకున్న అనేకమంది దళిత విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలు పొందారు. డా|| ప్రవీణ్‌ కుమార్‌గారూ! మీరు మాత్రమే దళిత విద్యార్థులకు నిర్మాణాత్మకమైన విద్యను అందించటంలో మొదటి వారు కాదు. పై విధంగా పనిచేసిన మెరుగైన విద్యను అందించిన, అందిస్తున్న అనేకమంది విద్యాదాతలు వారి పనితీరును మీరు గమనించండి.

జాతీయ నాయకుల ఫోటోలకు స్థానంలేదు

గతంలో గురుకుల పాఠశాలల్లో జాతీయ నాయకులైన గాంధీజీ, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి మహాపురుషుల ఫోటోలు ఉండేవి. కేవలం డా|| బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫోటో మాత్రమే ఉండాలని ఇతర ఫోటోలను తొలగించివేశారు. డా|| అంబేద్కర్‌, గౌతమబుద్ధుడు ఫోటోలను తప్పక ఉంచవలసిందే. మిగిలిన ఫోటోలను తీయించి వేయటం అంటే డా|| అంబేద్కర్‌ పేరుతో విద్యార్ధినీ, విద్యార్ధులలో ఒక వేర్పాటువాదాన్ని పెంచి పోషించ టమే. ఈ విధానాలవల్ల విద్యార్ధినీ, విద్యార్ధులు సమగ్ర భావాలతో ఉత్తమ పౌరులుగా ఎలా తయారవుతారు? ‘నమస్తే’ అనరాదు ‘జైభీమ్‌’ మాత్రమే అనాలని పట్టుపట్టడం ఎంతవరకు సబబు?

అంబేడ్కరిజం ముసుగులో మార్క్సిస్టులు

మార్క్సిజమే అన్ని సమస్యలకు పరిష్కారమంటూ కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఇప్పటికీ వాదిస్తు న్నారు. డా|| అంబేడ్కర్‌ జీవించి ఉండగా అసెంబ్లీ- పార్లమెంటులోను, బయట ఆయన ఆలోచనలపై పుచ్చలపల్లి సుందరయ్య, భూపేష్‌ గుప్తా విమర్శలు సంధించారు. సుదీర్ఘకాలం నక్సలైటు ఉద్యమాన్ని నడిపిన కె.జి. సత్యమూర్తి అంబేడ్కరిజాన్ని సమస్యల పరిష్కారినికి ఏకైక మార్గంగా వారి జీవిత చరమాంకంలో గుర్తించారు. 1956 అక్టోబర్‌లో నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధధర్మ సమ్మేళనంలో ‘బౌద్ధమా? మార్క్సిజమా?’ అన్న అంశంపై ప్రసంగిస్తూ, సాయుధ విప్లవపద్ధతులను డా|| అంబేద్కర్‌ వ్యతిరేకించారు. మార్క్సిజం ద్వారా సమగ్ర మార్పు, శాశ్వత మార్పు సాధ్యంకాదని పేర్కొన్నారు. అయినా కొందరు అంబేద్కరిజం, మార్క్సిజం ఒకటేనంటూ ప్రసంగించటం విడ్డూరం.

భారతీయ ‘ప్రతిజ్ఞ’కు స్థానం లేదు

ప్రతి పాఠశాలలో విద్యార్ధులకు దేశభక్తిని కల్పించటంకోసం ‘భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరు నా సోదరులు… ‘ అంటూ ప్రతిజ్ఞ చేయిస్తారు. అయితే తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఇందుకు భిన్నం. స్వేరోస్‌ ప్రతిజ్ఞ పేరుతో మరొక భిన్నమైన ప్రతిజ్ఞను చేయిస్తున్నారు. దీనిని ఏమనుకోవాలి?

ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య దళితుడు కాదు. తన మేధస్సును క్రైస్తవ మిషనరీలకు అమ్ముకుని హిందువులను క్రైస్తవులుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన జిగ్నేశ్‌ మేవానీ అంబేడ్కర్‌ ముసుగులో పనిచేస్తున్న ఒక మార్క్సిస్టు రాజకీయ నాయకుడు ఇలాంటి వారితో డా|| ప్రవీణ్‌కుమార్‌ రహస్య మంతనాలు చేయవలసిన అవసరం ఏమిటి? వీరి కామన్‌ రాజకీయ ఎజెండా ఏమిటి? డా|| ప్రవీణ్‌ కుమార్‌ ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి. రాజకీయనాయకుడు కాదు. డా|| ప్రవీణ్‌ కుమారుకు రాజకీయాలద్వారా దళితుల ఉన్నతికి పనిచేయాలని కోరిక ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామాచేసి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అభ్యంతరం ఏముంది? కానీ ఉద్యోగంలో ఉంటే ప్రభుత్వ నియమాలను పాటిస్తూ గురుకులాలను నిర్వహించటం వారి బాధ్యత. రాజకీయ భావాలను గురుకులాల నిర్వహణలో చొప్పించటం ‘లక్ష్మణరేఖ’ దాటటమే.

అర్బన్‌నక్సలైట్లకు మద్దతుదారులా?

200 సం||ల క్రితం ఆంగ్లేయ సైనికుల విజయ సంఘటనను ఆసరాతీసుకుని అర్బన్‌ నక్సలైట్లు, తదితర వేర్పాటుశక్తులు, పూనా వద్ద భీమా- కోరేఁగావ్‌ కార్యక్రమాన్ని 2సం||ల క్రితం నిర్వహిం చారు. ఈ సంఘటనను దళితులు – పీష్వాల ఘర్షణగా చిత్రీకరించి దళితుల ‘విజయదినంగా’ పేర్కొన్నారు. దీనిని ‘స్వేరోస్‌’ డైరీ సమర్ధించింది. దీని అర్ధం ఏమిటి? స్వాతంత్య్రం వచ్చినవెంటనే 1947 డిశెంబరులో జమ్మూప్రాంతంపై పాకిస్థాన్‌ సేనలు ఆక్రమణ చేశాయి. ఆ సమయంలో డా|| అంబేద్కర్‌ న్యాయశాఖా మంత్రి. డా|| అంబేద్కర్‌ సూచనతో పాకిస్థాన్‌ దురాక్రమణను నిలువరించ టానికి మహర్‌ బెటాలియన్‌ రంగంలోకి దిగింది. ఎంతో విజయవంతంగా పాకిస్థాన్‌ దురాక్రమణను నిలువరించింది. ఈ చారిత్రాత్మక విజయంలో కీలక సూత్రధారులయిన మహర్‌ బెటాలియన్‌కు చెందిన అనేకమంది సైనికులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందజేసింది. ఈ పోరాటం మహర్‌ బెటాలియన్‌ విజయ పోరాటం. దీనిని గుర్తించటానికి సన్నద్ధం కాని మన అర్బన్‌ నక్సలైట్లు 200 సం|| క్రితం పీష్వాలపై బ్రిటీష్‌వారి గెలుపును దళితుల విజయంగా పేర్కొనటం ఏం సబబు.

దాడి చేస్తారా? సమర్ధిస్తారా?

కర్నె శ్రీశైలం గురుకులాల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై బహిరంగంగా రాష్ట్రగవర్నరుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. పత్రికా సమావేశంలో వినతి పత్రంలోని అంశాలను వెల్లడించటానికి ప్రెస్‌క్లబ్బుకు వెళ్ళారు. స్వేరోస్‌ ముసుగులో పనిచేస్తున్న అలెజ్జాండర్‌ నాయకత్వం లోని మనుషులు శ్రీశైలంపై, అడ్డుకున్న విలేఖరులపై గూండాయిజాన్ని ఏ రకంగా ప్రదర్శించిందీ టి.వి చానళ్లు ప్రసారం చేశాయి. డా|| అంబేద్కర్‌ గొప్ప ప్రజాస్వామ్యవాది. యువకులు కొందరు ఉద్రేకంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. నాయకులు వారిని అదుపులో ఉంచుకోవాలి. డా|| ప్రవీణ్‌కుమార్‌కాని, స్వేరోస్‌ నాయకులుకాని ఆవేశంలో పొరపాటు పడ్డామని ఒక బహిరంగ ప్రకటన చేయలేక పోయారు. ఆపైగా సమర్దించుకోవడం సిగ్గుచేటు.

ఇప్పటికైనా డా|| ప్రవీణ్‌కుమార్‌ గురుకులాల నిర్వహణలో దారి తప్పిన తన విధానాలను ఉపసంహరించుకోవాలి. రాజకీయ భావాలే ముఖ్యమని భావిస్తే రాజకీయ రంగప్రవేశం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.ఇన్ని జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండటం తగదు. దళితుల ఉన్నతికోరుకునే వారు సైతం అంబేడ్కరిజం ముసుగులో దళిత విద్యార్ధుల్లో వేర్పాటు బీజాలను వేస్తున్న విధానాలను సరిచేయటంలో ప్రజలూ ముందుకు రావాలి.

– డా|| కడియం రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్‌.సి., ఎస్‌.టి., హక్కుల సంక్షేమ వేదిక, తెలంగాణ

Source: Jagriti Weekly