Home Telugu Articles బాధలను భరిస్తూనే కొడుకును ఆర్మీ అధికారిని చేసిన ఓ తల్లి స్ఫూర్తిగాధ

బాధలను భరిస్తూనే కొడుకును ఆర్మీ అధికారిని చేసిన ఓ తల్లి స్ఫూర్తిగాధ

0
SHARE

ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది చిన్ననాటి నుండి కొడుకు ఆశయం. కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. భర్త  హఠాన్మరణం కారణంగా కుటుంబ పాలనా భారమంతా ఆమెపైనే పడింది. చదువుకోలేదు.. పిల్లలు చిన్నవాళ్లు. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక ఇటుక బట్టీల్లోనూ, వ్యవసాయ పనుల్లోనూ కూలీగా పని ప్రారంభించింది. ఇన్ని కష్టాల్లోనూ తన ముగ్గురు పిల్లలకు ఏ లోటూ రాకుండా చూడాలన్నదే ఆ తల్లి తపన.

మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి చెందిన గోలే లత స్ఫూర్తిగాధ ఇది. ఆర్మీ అధికారిగా దేశానికి సేవ చేయాలన్న తన కొడుకు కలను సాకారం చేసే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుంది లత. “ఈ ప్రయత్నంలో తాను ఏ అవకాశాన్నీ వదులుకోలేదు, ప్రతి సవాలునూ స్వీకరించింది” అని గర్వంగా అంటాడు అతని కొడుకు, ఇండియన్ ఆర్మీ అకాడమీ నుండి ఇటీవలే పట్టభద్రుడైన 29 ఏళ్ల కిరణ్.

“మా తండ్రి ముంబైలోని ఓ బట్టల దుకాణంలో పనిచేసేవారు. ఆయన హఠాన్మరణంతో కుటుంబంలో ఒక్కసారిగా చీకటి అలముకుంది. ప్రపంచమంతా తలక్రిందులైనట్టు అనిపించింది. ఆ సమయంలో మా అమ్మ కుటుంబ భారాన్ని సవాలుగా స్వీకరించింది. మా ముగ్గురు పిల్లలకు తిండి పెట్టడానికి అనేక కష్టాలు అనుభవించింది” అంటూ ఉద్విఘ్నతకు గురయ్యాడు కిరణ్.

పదవ తరగతి పూర్తిచేయగానే కిరణ్ కూడా స్థానిక గ్యాస్ ఏజెన్సీలో కూలి పనికి కుదురుకున్నాడు. చదువు అంతటితో ఆపకుండా పని చేసుకుంటూనే డిగ్రీ పూర్తిచేశాడు. అనంతరం భారత ఆర్మీలో సిపాయిగా చేరిన కిరణ్ ఇంకా ఉన్నత స్థానానికి చేరాలన్న సంకల్పంతో ఆర్మీ క్యాడెట్ కాలేజ్ పరీక్షకు సన్నద్ధుడయ్యాడు.

నాన్-ఆఫీసర్స్ విభాగం వారు ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరేందుకు మొదటి మెట్టు ఆర్మీ క్యాడెట్ కాలేజ్ పరీక్ష ఉత్తీర్ణత. ఆర్మీలో ఒకవైపు సిపాయిగా పనిచేస్తూనే తీరిక సమయాల్లో ఈ పరీక్ష కోసం అహర్నిశలూ శ్రమించాడు. ఇందుకోసం అనేక నిద్రలేని రాత్రులు సైతం గడిపాడు.

“ఇప్పటి దాకా నేను పడిన బాధలన్నీ మరచిపోయాను.. నా కొడుకుని చూస్తుంటే అత్యంత గర్వంగా ఉంది. నా శ్రమకు తగిన ఫలితం ఇది. దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు” – ఇండియన్ మిలిటరీ అకాడెమీ నుండి పట్టభద్రుడైన కిరణ్ ను చూసి పులకించిపోతూ భావోద్వేగంతో అతని తల్లి చెప్పిన మాటలివి. దీన్ని ఆమె తమ శ్రమకు దేవుడు ఇచ్చిన పవిత్రమైన ప్రతిఫలంగా అభివర్ణించింది.