సమాజంలో ప్రతీ ఒక్కరూ కలిసి కట్టుగా పోరాడితేనే కరోనాను నియంత్రించగలమని ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ జీ అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఆర్.ఎస్.ఎస్ నివాళులర్పిస్తోందని ఆయన తెలిపారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తి దేశంలోని అనేక రాష్ట్రాల్లో విపరీత పరిణామాలకు దారి తీస్తోందని, ఈ సమయంలోనే కరోనాను కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నవైద్య సిబ్బందికి, పోలీసు, భద్రతా సిబ్బందికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొవడానికి భారతీయ సమాజానికి ధృడమైన బలం ఉందని మరచిపోకూడదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
కరోనా కష్ట కాలంలో ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవకులు దేశవ్యాప్తంగా చేస్తున్న సేవల గురించి ఆయన వివరించారు. దేశంలో ఎటువంటి సమస్య వచ్చిన స్పందించే రాష్ట్రీయ స్వయం సేవక్, సేవా భారతి, అనేక ఇతర సంస్థలు కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు స్వయం సేవకులు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని తెలిపారు. సంఘ్ చొరవతో దేశవ్యాప్తంగా 12 రకాల సహాయక చర్యల్లో స్వయం సేవకులు నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు.
అనుమానిత కోవిడ్ రోగుల కోసం ఐసోలేషన్ కేంద్రాలు, కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల కోసం కోవిడ్ కేర్ కేంద్రాలు, ప్రభుత్వ నిర్వహణ కోవిడ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో స్వయం సేవకుల సహాయం, హెల్ప్‌లైన్ కేంద్రాలు, రక్తదానం, ప్లాస్మా దానం, కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించడంలో సహాయం, ఆయుర్వేద కషాయం పంపిణీ, రోగులకు కౌన్సెలింగ్, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్ సేవలు, ఆహారం, రేషన్, మాస్కుల పంపిణీ, టీకాపై అవగాహాన కార్యక్రమాలు… ఇలా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని స్వయం సేవకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఇందుకు స్థానిక పరిపాలన యంత్రాంగాలు కూడా సహాకరిస్తున్నాయని, అందరూ కలిసి పోరాడితేనే ఈ మహామ్మారిని తరిమికొట్టగమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్.ఎస్.ఎస్ చోరవతో ఇండోర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు రాధస్వామి సత్సంగ్ సహాకారంతో ఒక పెద్ద కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇది ప్రభుత్వం, సమాజ సమన్వయానికి అద్భుత ఉదాహరణగా నిలిచిందని ఆయన అన్నారు.
దేశ వ్యాప్తంగా 43 ప్రధాన నగరాల్లో కోవిడ్ సేవా కేంద్రాలను ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవకులు నిర్వహిస్తున్నారని, మరో 219 కోవిడ్ ఆస్పత్రులలో వైద్య సిబ్బందికి స్వయం సేవకులు తమ సహాకారాన్ని అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవకులు 10 వేలకు పైగా ప్రదేశాలలో టీకాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇప్పటివరకు 2442 టీకా కేంద్రాలు ప్రారంభించబడ్డాయని ఆయన తెలిపారు.
పూణేలో 600 ప్లాస్మా యూనిట్లను స్వయం సేవకులు అందుబాటులో ఉంచారని, ఇది 1500 మంది ప్రాణాలను రక్షించడానికి సహాయపడిందని ఆయన తెలిపారు. ప్లాస్మా దాతలు, దానం చేయడానికి సిద్ధంగా ఉన్నవారి జాబితాను ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్ర, స్థానిక స్థాయిలో తయారు చేయబడుతోంది ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి : దేశవ్యాప్తంగా కోవిడ్ సహాయక చర్యల్లో ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవకులు
ఇటువంటి ఆపత్కాలంలో ఎవరూ లేని వృద్ధులకు, అనాథలకు ఆర్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఉచితంగా భోజన వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఇంతటి విపత్కర పరిస్థితులను అధిగమించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని ప్రభుత్వాలకు, వైద్య సిబ్బందికి, భద్రతా సిబ్బందికి అందించి అండగా నిలిస్తేనే కరోనా పై చేస్తున్నయుద్ధంలో మనం విజయం సాధించవచ్చని ఆయన అన్నారు.