Home Telugu Articles సూడో సెక్యులరిస్టుల వింత చేష్టలు.. వికృతరాతలు..!!

సూడో సెక్యులరిస్టుల వింత చేష్టలు.. వికృతరాతలు..!!

0
SHARE

ఇటీవల ఓ చోట స్వామివివేకానందుల విగ్రహావిష్కరణ జరిగింది. దానికి అక్కడి స్థానిక శాసన సభ్యుడు కూడా వచ్చాడు. ఆయన రొటీన్‌గా స్వామివివాకానందుల గొప్పతనాన్ని గూర్చి రెండు మాటలు చెప్పి వెంటనే “మన దేశంలో కులాలు మతాలు లేవు అందరూ ఒక్కటే” అన్నాడు. ఆ వేదికపై రామకృష్ణ మఠానికి చెందిన స్వామి కూడా ఉన్నాడు. తర్వాత నా ఉపన్యాసంలో అది శుద్ధ తప్పని చెప్పాను. ఎమ్మెల్యేగారికి తెలియదని నేను అనుకోను. కానీ హిందువులలో ఓ కరడుగట్టిన ఆలోచన ఏమిటంటే  నేను హిందువును అన్నా, హిందూమతం ఉనికి ఉందన్నా అదేదో చాలా తప్పుడు విషయం అన్నట్లు భ్రమ పడుతుంటారు. కులాలు, మతాలు లేవనే ఆ ఎమ్మెల్యే పేరుకు మూడక్షరాల ‘కులం తోక’ ఉంది. హిందువులను ఏమి అన్నా వారి మత పరిజ్ఞానం గురించి ప్రశ్నించినా ఆవేదన చెందవద్దనే సిద్ధాంతం తయారు చేసి పెట్టారు.

“మానవజాతి భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఇంతవరకు కారణాలయినటువంటివి, ఇక మీద కారణాలు కానున్నట్టివి అయిన మూలశక్తుల్లో మత రూపంలో కనపడే దాన్ని మించింది మరొకటి లేదు” అని స్వామి వివేకానందులే స్వయంగా ‘మతావకశ్యత’ అనే అంశంపై లండన్‌లో ప్రసంగం చేస్తూ చెప్పారు. కాబట్టి మతం మానవజీవన  పవిత్రతకు, ఆముష్మిక లక్ష్యానికి, వ్యక్తుల సంఘటనా శక్తికి హేతుభూతమైంది. కానీ ఈ దేశంలో సూడోసెక్యులర్ గ్యాంగ్ హిందువులను మత దృష్టిలో సున్నితంగా చేయడంలో ముందుంటారు. అందుకే హిందువుల్లోని న్యూట్రల్ ఫోర్స్‌ను ఎప్పుడూ సుప్తచేతనావస్థలో ఉంచుతారు. హిందుమతాభిమాని కులం గురించి మాట్లాడగానే సెక్యులర్ వకాల్తా పుచ్చుకున్న వాళ్లంతా తాతల కాలం నాటి వర్ణవ్యవస్థను ముందుకు తెస్తారు. కులం అమానుషం, అది నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థ నుండి వచ్చిందని ఉపన్యాసాలు దంచేస్తారు.

హిందువులలో కులవ్యవస్థ తీవ్రత ఎక్కువ అని దబాయిస్తారు. నిజానికి కమ్యూనిష్టులకు, సూడోసెక్యులర్ గ్యాంగుకే కులస్పృహ ఎక్కువ. భారతదేశంలో సెక్యులర్ వ్రతాన్ని ఎక్కువగా నిష్ఠతో ఆచరిస్తామనే వారంతా కులం పునాదులపైనే తమ రాజ్యాధికారాన్ని నిలుపుకున్నారన్నది చారిత్రక సత్యం. అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు దాదాపుగా కులం బలంపైనే మనుగడ సాగిస్తున్నమాట మనకు అనుభవం ఉన్న విషయమే!

అంతెందుకు ఇటీవల కత్తి మహేశ్ వ్యాఖ్యల తర్వాత పరిణామాలు మనం గమనిస్తే ఇంకెన్నో విషయాలు బోధపడతాయి. రాముడి జీవితం కేవలం పాత్రకాదని కొందరంటున్నారు. కొందరు రామాయణం కల్పితం అంటారు. శంభూకవధ నిజమంటారు. తిట్టడానికి రామాయణం ఉపయోగించుకుంటారు. పాఠ్య పుస్తకాల్లో పెడదాం అంటే మత గ్రంథం అంటారు. ఇదే ద్వంద్వ వైఖరి. వాళ్లకు రామాయణంలోని మంచి విషయాలను స్వీకరించే ధైర్యం లేదు.

పురాణాలు, ఇతిహాసాలు అన్ని ‘ట్రాష్’ అనే వారే అందులోని పాత్రలు కొన్ని తప్పు చేసాయని చెప్తుంటారు. శంభూకవధ రాముడు చేసాడని చెప్పేవారే శ్రీరాముణ్ణి దోషిగా నిలబెడుతారు. సీతను తీసుకెళ్ళిన రావణుడు మంచివాడని ఆసిఫా అత్యాచారాన్ని మతం దృష్టితో చూసి విమర్శించినవారే గగ్గోలు పెడతారు. శంభూక వధ గురించి తలా తోక తెలియని వారు, రామాయణాన్ని ఎన్నడూ తెరచి చూడనివారు దానిపై వ్యాఖ్యానం చేస్తారు. రామాయణం మొత్తం వరుసబెట్టి చదివితే మనం ఎక్కడ రామభక్తులమై పోతామో అని కూడా వారి భయం. వాల్మీకి రచించిన ఆరుకాండల్లో ఇది లేదన్న స్పృహ కూడా వాళ్ళకు లేదు! ఇంకొందరు స్వయం ప్రకటిత మేధావులు. హిందువులకు సుద్దులు చెప్పే రాతలు రాస్తారు. కులం, మతం లేని దేశంకోసం ఎదురుచూస్తున్నాం అంటూ బకాయిస్తారు. దానికి డెమక్రటిక్, సెక్యులర్ అనే ముసుగు తగిలిస్తారు.

హిందువుల దేవుళ్ళపై చేసే వ్యాఖ్యలకు అంతతీవ్రత ఎందుకు అంటూ మన మనసుల్ని తేలికపరుస్తారు. మరి ఇతర మతాలపై చర్చకాదు కదా! వ్యాఖ్యచేయగలరా! మార్క్స్ మతం మందు అన్నాడని, ఆ మందు మత్తులో తూగుతున్న ఈ లిబరల్ గుంపు ఈ సిద్ధాంతం మనకు వర్తిస్తుందా అని ఒక్కసారి ఆలోచించరు. పాశ్యాత్య దేశాల్లో క్రైస్తవ చర్చిలు ఆ రోజుల్లో చేసిన దురాగతాలను చదివి కారల్‌మార్క్స్ ఈ మాట చెప్పి ఉండవచ్చు. కమ్యూనిష్టు సిద్ధాంతాలతో తులతూగిన ఎన్నో చిన్నచిన్న దేశాలు ఇవాళ ఎవరి చేతుల్లో ఉన్నాయి. భారతదేశ విభజనకు, ముస్లీం లీగ్‌కు సహకరించిన కమ్యూనిష్టు పార్టీ పాకిస్తాన్‌లో నామమాత్రంగానైనా ఉందా? పోని బౌద్ధ సంస్కృతి పరిఢవిల్లిన ఏ దేశంలోనైన దాని స్వరూపం ఈ రోజుకు అలాగే ఉందా? బామియన్‌లో బౌద్ధ విగ్రహాలను ఎవరు ధ్వంసం చేసారు? అవేమీ అయోధ్యలోని రామమందిరం కూల్చి బాబ్రీమసీదులా నిర్మించినవి కావే? శ్రీలంకలోని బౌద్ధతత్వాన్ని ధ్వంసం చేస్తున్నది ఎవరు? మయన్మార్‌లో వందలాది హిందువులను చంపి గుంతలో పూడ్చుతున్న రోహింగ్యాలు ఎవరు? హిందువులకు ఇంటికో దేవుడుండడం బహుళ సంస్కృతికి నిదర్శనం కాదా? ఎనభైకోట్ల మందికి ముప్పుమైడు కోట్ల దేవుళ్ళంటే తప్పెలా అవుతుంది? వ్యక్తి మానసిక పరిపక్వత బట్టి దేవతారాధన స్థాయి పెంచడం హిందూతత్వ శాస్త్రంలో ముఖ్యమైన అంశం.

ఐదేళ్ళ పిల్లవాడికి, ఇరవై ఏళ్ళ యువకుడికి, ఎనభై ఏళ్ళ వృద్ధునికి ఒకే చొక్కా తొడిగించి ‘భేష్’ అనడం పిడివాదం కాదా? ఇవి డెమొక్రటిక్ మతాలా! కావా! అని మతిలేని గతి తార్కికభౌతికవాదులు చెప్పాలి. ఒకే గ్రంథం, ఒకే ప్రవక్త ఉండడం ప్రజాస్వామ్యమా! బహుళత్వంలో ఏకత్వం దర్శించడం ప్రజాస్వామ్యమా! ఇంకొందరు మేధావులు కత్తి మహేశ్ పోతే ఇంకొందరు వస్తారు. అప్పుడేం చేస్తారు? అని బెదిరిస్తున్నారు?! అంటే మొన్న కంచఐలయ్య, గోగినేని బాబు, నిన్న కత్తి మహేశ్.. ఇలా ఎందరిని తయారు చేసారు  ఈ సమాజంపైకి వదలడానికి? ఇటీవల జరిగిన పరిణామాల్లో అగ్రకులానికి చెందిన గోగినేని బాబును తప్పించి కత్తి మహేశ్‌ను ఇరికించిన ఛానల్‌పై ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఎందుకు నోరు మెదపరు! ప్రతి దానికి  కులం ముసుగువేసి దారి మళ్ళించడం ఓ వికృత క్రీడ.

అలాగే ఎవరు ఏది చెప్పినా డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ముందుకు తెస్తున్నారు. డా॥ బాబా సాహిబ్ రచనలన్నీ పైపైన ప్రచారం కోసం రాసినవి కావు. లోతైన సమాచారం ఆ రోజుల్లో ఆయనకు దొరికినదంతా ఉపయోగించి పరిశోధన కొనసాగించారు. ఆయన బౌద్ధం 14 అక్టోబర్ 1956 న స్వీకరించారు. 6 డిసెంబర్ 1956 మరణించారు. పోరాటరూపంగా, హిందువుల్లోని కులఛాందసులకు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి మత మార్పిడి చేసుకున్నారు. ఆయన గొప్ప విద్వాంసుడైనా, మేధవిగా ఎన్నో గ్రంథాలు చదివినా, రాసినా, కుల నిర్మూలనకు ఆ జన్మాంతం పోరాడినా ఇస్లాం, క్రైస్త్రవంలోకి ఎందుకు చేరలేదు అనే విషయంపై పత్రికా వ్యాసాలు రాసే పేపర్ పులుల దగ్గర సమాధానం ఉండదు! ఇటీవల బుద్ధుని పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న మేధోప్రబుద్ధులు మేకపిల్ల ప్రాణం కోసం తన ప్రాణం అర్పించడానికి సిద్ధపడ్డ బుద్ధుని గురించి పన్నెత్తి మాట్లాడరు? వీళ్ళే గోవులను కోసి ‘బీఫ్‌ఫెస్టివల్స్’ నిర్వహిస్తారు!? చిన్న మేకపిల్ల మరణమే వద్దన్న బుద్ధుడు, ఆయనను అనుసరించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ గోహత్యలు చేయమన్నారా?

మరికొందరు హిందూశాస్త్రాలను ప్రామాణికతను నిర్ణయించి కరడుగట్టిన మతాల్లా మార్చమంటున్నారు? నా మతం మాత్రమే గొప్పది అనుకుంటూనే మతతత్వ రాజ్యాలు అభివృద్ధి సూచికలో ఎక్కడున్నాయి? హిందూమతం పుట్టుకతోనే సెక్యులర్. ఈ దేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నన్ని రోజులే సెక్యులర్ సిద్ధాంతం బ్రతికి బట్టకడుతుంది. నిజానికి వెయ్యేళ్ళ బానిసత్వం అనుభవించిన హిందువులకు స్వాతంత్య్రం వచ్చిందా?  ఈ దేశ హిందువులు కమ్యూనిజం వల్ల సెక్యులర్స్‌గా మారలేదు. ఈ దేశంలో సనాతన సంస్కృతి వారికి హృదయాన్ని ఇచ్చింది. కాశ్మీర్  రాష్ట్రమే దానికి ఉదాహరణ. అన్ని మతాలకు సరైన స్థానం, గౌరవం ఇవ్వగలిగిన పెద్ద మనసు హిందువులది. అందుకే యోగా డే లో ముస్లింలు కూడా పాల్గొని దానికి మద్దతివ్వాలని ప్రముఖ ఇస్లామిక్ సామాజిక, రాజకీయ పరిశోధకుడు తారేఖ్‌ఫతే చెబుతున్నారు.

నిజానికి మహ్మద్ ప్రవక్త జీవించిన కాలంలో ఆయన జన్మస్థానంలో నిర్మించిన మొదటి మసీదు తర్వాత ప్రపంచంలోనే రెండవ మసీదు కేరళలోని మలబారు తీరంలో క్రీ.శ. 629లో ఓ  హిందూ రాజు సర్వదర్శన సంగ్రహంలో స్థానం ఇచ్చారు. ఇటీవల నాస్తికుల పేరుతో జన అజ్ఞానవేదికలు నిర్వహిస్తున్నారు. అది సైన్సు ప్రమోట్ చేసే సంఘమో, దేవుడు లేడనే నాస్తికవాదమో, ప్రశ్నించే హేతువాదమో, దుర్వ్యాఖ్యలు చేసే దారి తప్పిన మేధావితనమో అర్థం కాదు. నిజంగా నాస్తికులైతే అన్ని మతాల ఆస్తికత్వాన్ని ప్రశ్నించాలి. కానీ వాళ్ళ టార్గెట్ హిందుత్వమే! బార్కాస్‌లో కామెర్ల చెట్టు మందులోని మెడికల్ వాల్యూస్ వీళ్ళకు పట్టవు. కానీ ఏడాదికోసారి మృగశిరకార్తె నాడు హైదారాబాద్‌లో బత్తిన సోదరులు ఇచ్చే చేపమందు వీళ్ళ దృష్టిలో దేశద్రోహం! కానీ ఏ మతం వాళ్ళు మందు ఇచ్చినా హిందువులు సమదృష్టితోనే ఉంటారు.

ఇప్పుడెవరు మతతత్వవాదులు!? అంతెందుకు! నాస్తికుడైన జాబాలిని శ్రీరాముడు తన ప్రక్కనే పెట్టుకొన్నాడు. చార్వాకమతాన్ని హిందుత్వం అంగీకరించింది. కణాదుని వైశేషిక దర్శనాన్ని, కపిలుడి సాంఖ్యదర్శనాన్ని హిందుత్వం ఎంత గొప్పగా చూసిందో పతంజలి యోగదర్శనాన్ని అంతే గొప్పగా చూసింది. అదే హిందుధర్మంలోని ప్రజాస్వామ్య దృష్టి. ఇన్నాళ్ళు అన్ని అణచివేతలను, అవమానాలను భరించిన హిందువులు ఇటీవల తిరగబడడం సత్యం.  దీనిని భరించలేనివారే అసహనంతో రగిలిపోతున్నారు. కొన్ని టీవీ ఛానళ్ళు, పత్రికల్లో మేధావులు జ్యోతిషాన్ని, దొంగబాబాలను, రంగు రాళ్ళను చూపిస్తూ అందులో జరిగే అవకతవకలే హిందూ మతం అన్నట్లు భ్రమింపజేస్తున్నారు.

వీళ్ళ అమాయకత్వానికి, అజ్ఞానానికి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు. మనకు బజార్లో ఎన్నో రకాల వస్తువులు కన్పిస్తాయి. అందులో ఏది మంచిదో ఏది చెడ్డదో గమనించకుండా కొనేస్తామా? దాని మన్నిక, నాణ్యతను గురించి ఆలోచించినట్లే సమాజం మత విషయాల్లో చైతన్యవంతంగా ఉంటుంది. ఇంత పెద్ద సమాజంలో ఎక్కడో జరిగే అరకొర సంఘటనలను సాధారణీకరణం చేయడం ఎంతవరకు సబబు? నాస్తికత్వం పేరుతో దుర్వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఆస్తికుల మనోభావాలను కూడా గౌరవించాలి కదా? అందరికీ భావ స్వేచ్ఛను రాజ్యాంగమే ప్రసాదించిదన్న సత్యం విస్మరిస్తే ఎలా. తిట్టే వాడికే భావస్వేచ్ఛ ఉండడం ఎలాంటి ప్రజాస్వామ్యం? ముఖ్యంగా మార్క్సిస్టులు, సూడోసెక్యులర్ మేధావులు ఇలాంటి దుర్భాషలకు, దుర్వ్యా ఖ్యానాలకు భావస్వేచ్ఛ ముసుగు తగిలించి దళితుల భుజంపై తుపాకి పెట్టి కాల్చుతున్నారు.

దళితులపై కపట ప్రదర్శించే వీరు అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో దళితులకు ఎందుకు రిజర్వేషన్లు లేవో నోరు తెరచి అడగగలరా? అది మైనార్టీ విశ్వవిద్యాలయం కాదని కోర్టు తీర్పులే చెప్పినపుడు దళితులకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరని ఒక్క సెక్యులర్ గొంతు గళం విప్పదు! హిందుత్వను, జాతీయతను ఈ దేశ సంప్రదాయాలను తూలనాడడమే పెద్ద పనిగా పెట్టుకొన్న స్వయం ప్రకటిత మేధావులు, ఎర్ర ఛాన ళ్ళు ప్రజల్లో భా వోద్వేగాలు రాజేస్తున్నారు. దీని వల్ల సమాజానికి ఆందోళన, రేకెత్తించేవాళ్ళకు వికృతా నందం తప్ప ఇంకేం లేవు.

డా॥ పి. భాస్కరయోగి

(విజయక్రాంతి సౌజన్యం తో)