- దాడిని ఖండించిన బీఎంఎస్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మెడినిపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఎంఎస్ కార్యకర్తలపై టీఎంసీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బినయ్ కుమార్ సిన్హా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. బీఎంఎస్ 19 వ త్రైమాసిక సమావేశంలో ఆమోదించిన తీర్మాణం ప్రకారం… ‘సర్కార్ జాగావో, పిఎస్‌యు బచావో అనే నినాదంతో దేశవ్యాప్తంగా బీఎంఎస్ నిరసనలు జరిగాయన్నారు. అన్ని రాష్ట్రాలో శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో 300 మంది బీఎంఎస్ కార్యకర్తలు పాల్గొన్న నిరసన కార్యక్రమంలో 60మందికి పైగా టీఎంసీ గుండాలు పాల్గొని అల్లర్లు సృష్టించి దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ దాడిలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రవిశంకర్ సింగ్, జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గణేష్ మిశ్రాలతో పాటు పలువురు గాయపడగా రాష్ట్ర కోశాధికారి శివనాథ్ మహాట్‌కు తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. ఘటన జరిగిన 4 గంటల పాటు దేశాబిస్, అమిత్ అనే కార్యకర్తలు కనిపించలేదని వారి ఫోన్లను కూడా టీఎంసీ కార్యకర్తలు ఎత్తుకెళ్లిపోయారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని వారికి శిక్షలు విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కోరారు. ఈ సంఘటపై కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. - source VSK BHARATH