Home News శబరిమలలో సమస్య ఏమిటి?

శబరిమలలో సమస్య ఏమిటి?

0
SHARE

కేరళలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించ వచ్చనే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత  హిందూ సంప్రదాయాల రక్షణకోసం ,వేలాదిమంది మహిళలు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసారు. సమానత్వం, హక్కుల పేరుతో  శబరిమల ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం పట్ల వీరు అభ్యంతరం తెలిపారు.

ఈ నిరసన దృష్ట్యా, 10 నుండి 50 మధ్య వయస్సు గల మహిళల ప్రవేశాలపై నిషేధం వివక్ష,  హక్కుల ఉల్లంఘనా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అది నిజంగా ఉల్లంఘన అయితే మరి వేలాదిమంది కేరళ మహిళలు ఎందుకు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు? అనే ప్రశ్న కూడా వస్తుంది.

శబరిమల – సమానత్వం

సమానత్వవాదానికి  మూలం పశ్చిమదేశాలలో ఉంది.  అక్కడ అబ్రహామిక్ మత సంస్కృతిలోని ప్రబలమైన అసమానతలకు ప్రతిస్పందనగా సమానత్వ సిద్దాంతం వచ్చింది.  పాశ్చాత్య సమస్యకు వచ్చిన పాశ్చాత్య పరిష్కారం కనుక ఈ సమానత్వ సిద్దాంతం పూర్తిగా అబ్రహామీ ధోరణిలోనే ఉంటుంది. దీని కిలక భావనలు, సూత్రాలు అబ్రహాం మత దృక్పధం నుండే వచ్చాయి. అయితే ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలు చేసినప్పుడు అది భిన్నత్వాన్ని నాశనం చేసి `ఏకరూపత’ను సాధించే ప్రయత్నంగా పరిణమిస్తుంది. ఇది సామరస్యం, భిన్నత్వం, ఆధ్యాత్మికత వంటివి ప్రధానంగా కలిగిన హిందూత్వం వంటి  అబ్రహామేతర సంస్కృతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

శబరిమల భక్తుల ప్రవేశానికి ప్రత్యేక ప్రమాణాలు, ప్రత్యేకమైన లక్షణాలను కలిగిన ఒక ప్రత్యేకమైన ఆలయం. అయితే కేరళలోనే అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. అనేక పండుగలు జరుగుతాయి. కొన్నిటిలో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడ పురుషులకు ప్రవేశం లేదు.  అంతేకాదు, అయ్యప్ప లేదా ధర్మశాస్తకు అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి .  కులాత్తు పూజ, ఆర్యంకావు మరియు అచంకోవిల్ లలో ఉన్న దేవాలయాల్లో  స్వామి చిన్న బాలుడిగా,  వివాహం చేసుకున్న వ్యక్తిగా, ఒక సన్యాసిలా దర్శనం ఇస్తాడు. అంతేకాదు ఈ దేవాలయాలలో దేనిలోనూ మహిళల ప్రవేశం ఫై ఏ విధమైన నిషేధాలు లేవు. ఇక శబరిమల లో కూడా ఋతుక్రమం ప్రారంభం కాని ఆడ పిల్లలకు,  మెనోపాజ్ తర్వాత మహిళలకు ఎటువంటి నిషేధం లేదు.

సంక్షిప్తంగా చెప్పాలంటే శబరిమలలో లింగ ఆధారిత వివక్షత లేదు. అలాగే  ఈ సమస్యను  సమానత్వ సిద్ధాంత చట్రంలో ఇరికించాలనుకోవడం ద్వారా సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది.

శబరిమల – ఋతుక్రమం

ఋతుక్రమం ఆధారంగా మహిళపై నిషేధాన్ని విధించడం ఏమిటని శబరిమల విషయంలో అందరూ లేవనెత్తుతున్న ప్రశ్న.

అన్ని హిందూ దేవాలయాలలోను, సాధారణంగా మహిళలు  తమ నెలవారీ రుతుకాలంలో ఆలయాలలో ప్రవేశించకూడదని భావించబడుతోంది. ఎందుకంటే , వారు ఆ  సమయంలో మానసికంగా అధికమైన ఒత్తిడితో కూడిన రాజసిక స్థితిలో ఉంటారు. అలాగే చర్చి లేదా మసీదులాగా  దేవాలయం కేవలం సామూహిక ప్రార్ధనలకు మాత్రమే పరిమితం  కాదు. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం నిర్మించబడిన ఆలయం ఒక దేవతను ఆవాహన చేసి ప్రాణ ప్రతిష్టచేసిన ఒక శక్తి కేంద్రం. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆలయం దేవత  నివాసం. అందులో దేవత నివశిస్తుంది.  ఆ ప్రాంతమంతా  ఆ దైవం యొక్క ప్రత్యేకమైన శక్తితో సంపూర్ణంగా విస్తరించి ఉంటుంది .

శబరిమల విషయంలో స్వామి , బ్రహ్మచర్య దీక్షను (లేదా బ్రహ్మచారి) నిరంతరం పాటిస్తున్న నైష్టిక బ్రహ్మచారి రూపంలో  ఉంటాడు . నైష్ఠిక బ్రహ్మచర్య నియమాల ప్రకారం, ఇది పాటించేవాడు  బ్రహ్మచర్యాన్ని పాటించడమేకాక తన ఇంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండి , ఏ విధమైన స్త్రీ సాంగత్యాన్ని కలిగి ఉండరాదు. కనుకనే  శబరిమల లోని స్వామి వ్రత నియమానుసారం, ఆయన ప్రతిజ్ఞను అనుసరిస్తూ పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలు ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధించబడ్డారు. అంతేకాకుండా,ఈ  ఆలయ శక్తి బ్రహ్మచర్య సంకల్పాన్ని ప్రోత్సహిస్తుంది కనుక ప్రత్యుత్పత్తి వయస్సు గల మహిళలు వారి నిరంతర సందర్శనల వలన వారి పునరుత్పత్తి జీవక్రియలలో అసమతుల్యత ఏర్పడవచ్చుననే అభిప్రాయంతో , వారి ప్రవేశంపై  పరిమితులు ఉంచబడ్డాయి.

సంక్షిప్తంగా, శబరిమలలో మహిళల ప్రవేశం నిషేధించటానికి వారి ఋతుక్రమమే కారణం కాదు. ఇక్కడి దేవతా  స్వరూపపు స్వభావాన్ని, దీక్షను అనుసరించి ఈ నియమం ఏర్పాటు చేయబడింది..

ప్రమాదంలో పడినదేమిటి?

హిందూమతం అనేకమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలు, పద్ధతులఫై ఆధారపడి నిర్మితమై , వివిధ స్వభావాలు మరియు సామర్థ్యాలను కలిగిన  వివిధ రకాలైన ప్రజలకు మార్గదర్శనం చేస్తోంది.. శబరిమల కూడా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాంప్రదాయ సాధనకు నిలయం. ఈ దేశ  సామరస్యపూర్వక వైవిధ్యతను నాశనం చేసి ఒకే సిద్ధాంతంలోకి అందరినీ ఇరికించాలని కోరుకుంటున్న శక్తుల వల్ల  ఈ సంప్రదాయం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. దేవాలయాల సంప్రదాయాలను, దైవీ స్వరూపాల గౌరవాన్ని మనం కాపాడుకోలేకపోతే ఈ నైష్టిక సంప్రదాయం మనం కోల్పోతాము. ఇది మన భారతీయ హిందూ జీవన సంస్కృతికే కాక అయ్యప్పస్వామిని ఆరాధించే స్త్రీ పురుష భక్తులందరికీ ఒక తీవ్రమైన నష్టంగా చెప్పవచ్చు. కనుక ఈ సంప్రదాయాన్ని మనమందరం తప్పక గౌరవిద్దాం.

-నితిన్ శ్రీధర్

అనువాదం: శ్రీమతి రాధా దేవి