Home News రోహింగ్యాల భారం మనకెందుకు?

రోహింగ్యాల భారం మనకెందుకు?

0
SHARE

చూస్తుంటే మన మేధావులు, స్వేచ్ఛావాదులు రోహింగ్యా ముస్లింలకు భారత్‌లో అన్ని రకాల వసతి సౌకర్యాలకు తప్ప మరి దేనికీ ఒప్పుకునేట్టు లేరు. ఒకవేళ వారనుకున్నదే జరిగితే మయన్మార్‌నుండి భారత్‌లోకి రోహింగ్యాల వలసలకోసం ఎర్రతివాచీ పరిచినట్టే అవుతుంది. రోహింగ్యా ముస్లింల విషయంలో ప్రపంచంలోని 193 దేశాలలో ఎవరికీ లేని బాధ ఒక్క భారత్‌కే ఎందుకు? రోహింగ్యాల పోషణ రక్షణ భారాన్ని భుజాల కెత్తుకోవాల్సిన బాధ్యత భారత్‌కే ఎందుకు?

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య (యుఎన్‌హెచ్‌ఆర్‌సి)కి హైకమిషనర్‌గా వున్న జెయిద్ బిన్ రాద్ జెయిద్ అల్ హుస్సేన్ తమ భూభాగాలనుండి రోహింగ్యాలను ఖాళీ చేయించాలని భారత్ భావిస్తుండడాన్ని తప్పుబట్టారు. ఆయన స్పందన భారతీయులందరినీ ఆందోళనకు గురి చేసింది. బహుశా అల్ హుస్సేన్‌కి అక్రమ చొరబాటుదారుల గురించి గానీ, భారత్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారివల్ల భారత్ సమగ్రత, భద్రతకు వాటిల్లుతున్న ముప్పు గురించి గానీ అవగాహన ఉండకపోవచ్చు. రోహింగ్యాల విషయంలో ఆయన వైఖరి ఎలా ఉన్నా ‘అంతర్జాతీయ మేధావుల పరిశ్రమ’కి అనుగుణంగా పనిచేసే దేశీయ పండితుల తీరు మాత్రం చాలా ప్రమాదకరమైనది.

ప్రపంచంలో నేడు ఇస్లాం రెండవ పెద్ద మతం. 193 దేశాలలో ముస్లిం మెజారిటీ దేశాలు 50 ఉన్నాయి. వీటిలో చాలా దేశాలలో ఇస్లాం మత సూత్రాలను అనుసరించి పరిపాలన, న్యాయ వ్యవస్థలు నడుస్తాయి. ఇటీవల సిరియాలో సంభవించిన సివిల్ వార్, దాని ఫలితంగా తలెత్తిన శరణార్ధుల సంక్షోభం ప్రపంచాన్ని కుదిపివేయడం మనకి తెలిసిందే.

సిరియా ఒక ముస్లిం దేశం. ముస్లిం దేశాలన్నింటికీ కేంద్రస్థానంలో ఉంటుంది. దీని చుట్టు ముస్లిం దేశాలే ఉంటాయి. సిరియా సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు ఐరోపా దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. వీళ్లకి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఐరోపా మరియు ప్రపంచంలోని పలు దేశాలపై వత్తిడి వచ్చింది కూడా. అనంతరం పలు దేశాల్లో సిరియా శరణార్ధులనుండి ఉత్పన్నమైన సమస్యల సంక్షోభాన్ని ప్రపంచం ఇంకా మరిచిపోలేదు. కొత్తగా వలసలు వెళ్లిన ఐరోపా దేశాల జన జీవనంలో సిరియన్ ముస్లింలు అంత త్వరగా కలవలేకపోయారు. ఐరోపా దేశాల సంప్రదాయాలతో కలవలేని సిరియన్ ముస్లింలు క్రియాశీల ఉగ్రవాదులుగా మారిపోయారు. జర్మన్, స్కాండినేవియాలలో స్ర్తిలపై అత్యాచారాలు మొదలుపెట్టారు.

ఈ శరణార్ధి ఉన్మాదులకు వ్యతిరేకంగా జర్మనీ తదితర దేశాలలో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలను జాత్యాహంకారాన్ని, నాజీయిజాన్ని ప్రదర్శిస్తున్నాయని కొన్ని దేశాలు పెద్దఎత్తున విమర్శలు చేసాయి కూడా. అయితే ఇలా విమర్శించిన వారెవరు సిరియా శరణార్ధులను తమ దేశాలలోకి అనుమతించలేదు. తాజాగా ఇప్పుడు ఐరోపా దేశాలతోపాటు మిగిలిన దేశాలేవీ కూడా మానవత్వం నెపంతో రోహింగ్యాలను తమ భూభాగంలోకి అనుమతించడంలేదు.

వౌలికంగా రోహింగ్యాలు తూర్పుబెంగాల్ (నేటి బంగ్లాదేశ్)కు చెందినవారు. శతాబ్దాల క్రితమే వారు మయన్మార్‌కి వలస వెళ్లారు. మయన్మార్‌లో వారి ధోరణి ఎప్పుడూ అనుమానాస్పదంగానే వుంటోంది. 1947లో భారత విభజన జరిగిన నాటినుండి మయన్మార్ నుంచి వేరుపడేందుకు వారు ప్రయత్నాలు చేస్తునే వున్నారు. అందులో భాగంగానే వాళ్లు మయన్మార్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తమపై తిరుగుబాటు చేస్తున్న రోహింగ్యా ముస్లింలపై ఇప్పుడిప్పుడే మయన్మార్ బౌద్ధులు ప్రతిస్పందించి ఎదురు దాడులు చేస్తుండడంతో విషయం ప్రపంచ దేశాల దృష్టికి వచ్చింది. మయన్మార్ బౌద్ధుల ఎదురుదాడికి నిలువలేక పారిపోతున్న రోహింగ్యా ముస్లింలకి శరణార్ధులుగా ఆశ్రయం ఇవ్వడానికి బంగ్లాదేశ్ సుముఖత చూపలేదు. తమ దేశంలోని జనాభా ఒత్తిడులను, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఇందుకు కారణాలుగా బంగ్లాదేశ్ చెప్తోంది. అంతేకాదు రోహింగ్యాలు తమదేశంలోకి ప్రవేశిస్తే దేశభద్రత దృష్ట్యా కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయని బంగ్లాదేశ్ భావిస్తోంది. రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించే విషయంలో బంగ్లాదేశ్ చెప్తున్న కారణాలు సహేతుకమైనవే. ప్రపంచ ముస్లింల సోదరభావం గురించి చెప్తుంది ఇస్లాం. ప్రపంచంలో మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి సంపన్న ముస్లిం దేశాలున్నాయి. అలాంటప్పుడు రోహింగ్యా ముస్లింలకు ఈ సంపన్న దేశాలలో ఎందుకు ఆశ్రయం లభించడంలేదు?

1947 మతప్రాతిపదికగా భారతదేశం విభజించబడింది. ముస్లింల కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పడింది. ఈ వ్యవహారంలో అత్యధికంగా నష్టపోయింది హిందువులే. ఒక క్రమ పద్ధతిలో ఆ దేశంలో హిందు, సిక్కు జనాభా తగ్గిపోయింది. ఇందుకు కారణం అక్కడ వారిపై నిరంతరం జరిగిన అత్యాచారాలే. తరువాత పాకిస్తాన్‌నుండి వేరేదేశంగా ఏర్పడ్డ బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. అక్కడున్న హిందువులకు రెండే అవకాశాలు ఇవ్వబడ్డాయి. ముస్లింలుగా మతం మారడమో లేదా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడమో. నేడు హిందువులకు గల ఒకే ఒక దిక్కు భారతదేశమే! తన సంతతి వారే అయినా బంగ్లాదేశ్ హిందువులకు ఆశ్రయం కల్పించడంలో భారత్ ఎందుకు సంకోచించాలి?

నిజానికి రోహింగ్యా ముస్లింలు కరుడుగట్టిన మతోన్మాదులు. వారికి అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. అంతేకాదు వారు భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్నారు కూడా. వారినుండి మన దేశ భద్రతకు ఎప్పటికీ ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటిది రోహింగ్యా ముస్లింలను దేశంనుండి వెళ్లగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మన దేశీయ మీడియా, బతకలేక బంగ్లాదేశ్‌నుండి శరణార్ధులుగా వస్తున్న హిందువుల విషయంలో నోరు మెదపదేమి?

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య, ప్రపంచంలోని ఇతర మానవహక్కుల సంఘాలకు నిజంగా రోహింగ్యా ముస్లింలపై శ్రద్ధ ఉన్నట్టయితే వారికి సంపన్న ముస్లిం దేశాల్లో వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ రోహింగ్యా ముస్లింలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ మొసలి కన్నీరు కారుస్తు భారత్‌పై ఆక్రోశం వెళ్లగక్కడం వారి పక్షపాత వైఖరిని తెలియజేస్తోంది. ఏది ఏమైనా రోహింగ్యాలను బయటకి పంపే విషయంలో భారతదేశ స్పష్టమైన వైఖరి స్వాగతించదగ్గది.

-దుగ్గిరాల రాజకిశోర్

(ఆంధ్రభూమి సౌజన్యం తో)