Home Telugu Articles ప్రపంచం భారత్ ను చూసి నేర్చుకోవాలి

ప్రపంచం భారత్ ను చూసి నేర్చుకోవాలి

0
SHARE

యూరోప్ దేశాలు స్థానిక జాతులను నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా హతమార్చారు. వారి సంస్కృతిని పూర్తిగా రూపుమాపారు. స్థానిక జాతుల సంరక్షణ విషయంలో ప్రపంచ దేశాలు భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

1492లో భారత్ కు సముద్ర మార్గం కనుగొనాలని బయలుదేరిన క్రిస్టోఫర్ కొలంబస్ చివరికి పడమర దీవులకు చేరాడు. తమ అన్వేషణ ఫలించిందని, తాము భారత్ కు చేరామని స్పెయిన్ నావికులు సంబరపడ్డారు. తాము చేరిన ప్రదేశానికి `ఇండియా’ అని పేరు కూడా వాళ్ళే పెట్టేశారు. అక్కడ నివసిస్తున్నవారిని ఇండియన్స్ అన్నారు. కానీ ఆ తరువాత 1498లో వాస్కోడాగామా కాలికట్ తూర్పువైపుకు చేరుకున్నప్పుడు గానీ వారి భారత అన్వేషణ పూర్తికాలేదు.

కొలంబస్ కనిపెట్టిన దీవుల్లో ప్రజలు కాస్త ఎర్ర రంగులో ఉండడంతో వారిని రెడ్ ఇండియన్స్ అన్నారు. అమెరిగో వెపుస్సీ అనే ఇటలీ నావికుడు రెండుసార్లు ఈ దీవులకు వచ్చాడు. “ఇది పూర్తిగా కొత్త ప్రపంచం. ఇక్కడ జనం తక్కువ. యూరోప్, ఆసియా, ఆఫ్రికాల్లో కంటే ఇక్కడ జంతువులు ఎక్కువ’’ అని అమెరిగో తన ఉత్తరాల్లో వ్రాశాడు. అతని ఉత్తరాల ఆధారంగా జర్మన్ లు తమ మానచిత్రపటాలలో (మ్యాప్ లు) `అమెరిగో భూమి’ అంటూ గుర్తులు పెట్టుకున్నారు. ఆ పేరే క్రమంగా మారి 1507నాటికి `అమెరికా’గా స్థిరపడింది. అదే ఇప్పుడు మనకు తెలిసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

ఏడు నౌకాలతో, 90మంది స్పెయిన్ నావికులతో బయలుదేరిన కొలంబస్ 1492 అక్టోబర్, 12న సాల్విడార్ తీరానికి చేరాడు. అక్కడ నివసించే `ఆరావక్’ గిరిజనులు వారిని సాదరంగా ఆహ్వానించి అందరికీ కానుకలు కూడా ఇచ్చారు. అప్పుడు కొలంబస్ తమ దేశపు రాజుకు రాసిన ఉత్తరంలో “ఇక్కడి ప్రజలు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. వీళ్ళు చాలా దయకలిగినవారు కూడా. ప్రపంచంలో వీరి కంటే మించిన జాతి మరొకటి లేదనిపిస్తుంది. పొరుగువారితో వీరి వ్యవహారం చాలా సున్నితంగా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడతారు. వాళ్ళు బట్టలు ధరించకపోయినా వారి ప్రవర్తన చాలా హుందాగా, గౌరవప్రదంగా ఉంది’’ అని వ్రాశాడు. అలా తమకు సాదరంగా స్వాగతం పలికిన, తమ ప్రశంసలను పొందిన జాతిని స్పెయిన్ దేశస్థులు మాత్రం వదిలిపెట్టలేదు. 50-60 సంవత్సరాలపాటు సాగించిన అమానుషమైన హింసతో స్థానిక జాతుల్ని పూర్తిగా తమ బానిసలను చేసుకున్నారు. స్పెయిన్ వాసులు సాగించిన మారణకాండ, అణచివేత, దోపిడిల గురించి అనేక చారిత్రక ఆధారాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. 1493లో కొలంబస్ మరోసారి 17 పెద్ద నౌకాలతో అక్కడికి వచ్చాడు. అతనితో పాటు 1500 మంది సైనికులు కూడా ఉన్నారు. ప్యూర్టో రికోతో సహా చుట్టుపక్కల ఉన్న అనేక దీవులను కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. స్థానికులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అనేకమందిని బానిసలుగా మార్చారు.

1506లో కొలంబస్ మరణం తరువాత మళ్ళీ 1519లో హెరనాన్ డో కొర్టేజ్ 500 మంది సైనికులతో క్యూబాకు చేరుకున్నాడు. అక్కడ స్థానిక `ఎజ్ టెక్’ గిరిజనులు వారికి స్వాగతం పలికి, బంగారం బహుమతిగా కూడా ఇచ్చారు. కానీ స్పెయిన్ దేశస్థులు మాత్రం ఎజ్ టెక్ తెగలో కొందరికి తమ నాయకుడితో ఉన్న విభేదాలను కనిపెట్టి, వాటిని పెంచి, చివరికి వారి సహాయంతోనే రాజధానిపైనే దాడి చేశారు. కేవలం బంగారంతో తిరిగివెళ్లాలనుకున్న కొర్టేజ్ ఏకంగా మెక్సికోలో స్పెయిన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ ఎజ్ టెక్ తెగవారు తిరగబడటంతో కొంతకాలానికే కొర్టేజ్ అక్కడ నుంచి పలాయనం చిత్తగించవలసి వచ్చింది. 1520లో మరిన్ని భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో విరుచుపడిన స్పెయిన్ సేనలు మెక్సికోలో మారణకాండ సృష్టించాయి. స్థానిక ఎజ్ టెక్ తెగ వారిని పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ఎజ్ టెక్ ల రాజధానిని పూర్తిగా నేలమట్టం చేసిన స్పెయిన్ సేనలు మెక్సికో నగరాన్ని కొత్త రాజధానిగా ఏర్పరచాయి.

సామ్రాజ్య విస్తరణలో భాగంగా స్పెయిన్ దురాక్రమణకారులు అమెరికాలలో సహజ వనరులను, సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారు. స్థానిక ప్రజలపై అకృత్యాలకు పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. ఈ దారుణకాండ 200 సంవత్సరాలపాటు సాగింది. 1517లో దురాక్రమణదారులు 5వేల మంది ఆఫ్రికన్ లను బానిసలను చేసి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో (ప్రస్తుతపు వెస్ట్ ఇండీస్) వెట్టి చాకిరీ చేయించారు.  1607లో “వర్జీనియా కంపెనీ ఆఫ్ లండన్” ను ప్రారంభించి 100 మంది ఇంగ్లీష్ వ్యాపారులను ఈ దీవులకు పంపారు. స్థానిక గిరిజనులు ఈ వ్యాపారులను కూడా సాదరంగా ఆహ్వానించారు. సామ్రాజ్యవాద దౌత్య విధానాన్ని అనుసరించి స్థానిక గిరిజన నాయకుడు `వాహూంసొనకుక్’ను ఆ తెగకు రాజుగా ప్రకటించారు. ప్రముఖ ఇంగ్లీష్ వ్యాపారి జాన్ రోల్ఫ్ కుమార్తెను వివాహమాడేట్లుగా  ఈ కొత్త రాజును ఒప్పించారు. అలా 1614 ఏప్రిల్ 5న ఆ వివాహం జరిగింది.

ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళు తమ ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెట్టారు. ప్రజలకు చెందిన భూముల్లో పెద్దఎత్తున పొగాకు పండించడం ప్రారంభించారు. దీనిని స్థానిక ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించి తిరగబడ్డారు. 1622 నాటికి ప్రజల తిరుగుబాటు పూర్తిస్థాయి పోరాటంగా మారింది. వందలాదిమంది బ్రిటిష్ అధికారులను హతమార్చినా చివరికి ఓటమి తప్పలేదు. బ్రిటిష్ వాళ్ళు జేమ్స్ టౌన్ అనే పేరుగల మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. 1675లో నాథానియల్ బేకన్ అనే అధికారి 1000 సైన్యంతో వర్జీనియా ప్రాంతాలపై దాడిచేశాడు. ఆ ప్రాంతంలో గిరిజనుల సంఖ్య క్రమంగా తగ్గిపోయి, తెల్లవాళ్ళ జనాభా పెరిగింది. దోపిడి, అత్యాచారాలు ఎక్కువయ్యాయి.

ఇలా అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల్లో అనేక ప్రాంతాలపై దాడులు చేసిన `నాగరిక’ సామ్రాజ్యవాదులు స్థానిక జాతులను సమూలంగా నాశనం చేశారు. ఇలా కాలగర్భంలో కలిసిపోయిన అనేక స్థానిక జాతులను గుర్తుచేసుకునేందుకు ప్రపంచ స్థానిక జాతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్ట్ 9 జరుపుతుంటారు.

స్థానిక గిరిజన జాతుల హక్కులకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించిన ఏకైక దేశం భారత్. ఆ తరువాత 55 ఏళ్ళకు ఐక్యరాజ్యసమితి ఇటీవల (2007 సెప్టెంబర్,13న 107వ ప్లీనరీ సమావేశాల్లో) స్థానిక ప్రజల హక్కులను గుర్తిస్తూ ప్రకటన చేసింది.

2007లో ఐక్యరాజ్యసమితి ప్రకటనపై సంతకం చేస్తూ భారత ప్రతినిధి `మా దేశంలో నివసించే ప్రజలందరిని `స్థానికులు’గానే పరిగణిస్తాం’అని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా, అమెరికాల్లో మాదిరిగా  బయటనుంచి వచ్చిన వారు స్థానికులను పక్కకు తోసివేసి వారి భూముల్ని ఆక్రమించుకోవడం జరగలేదు. స్థానిక జాతులను పరిరక్షించడంలో భారత్ సాధించిన విజయాన్ని, కల్పించిన రాజ్యాంగ రక్షణను ఇతర దేశాలు చూసి నేర్చుకోవాలి. భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి అనుసరించాలి.

– అతుల్ జోగ్ , వనవాసి కళ్యాణాశ్రమం అఖిల భారత కార్యదర్శి

(డైలీ పయనీర్ సౌజన్యం తో)