కర్నూల్ – శ్రీశైలం రహదారిలో వచ్చే ఆత్మకూరు అనే గ్రామం లో 1934 మే 1 న శ్రీ యమ్. డి. వై. రామమూర్తి గారు జన్మించారు. తల్లితండ్రులు మేడూరి దీక్షితుల రామయ్య, శ్రీమతి మేడూరి సుబ్బమ్మ. ఆత్మకూరులోని ‘శేతురావు బడి’ అనే ప్రైవేటు స్కూల్ లో విద్యాభ్యాసం మొదలైంది. 10 వ తరగతి కర్నూల్ లోని మునిసిపల్ హై స్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ కర్నూల్ ఉస్మానియా కళాశాల లోనూ, న్యాయవాద కోర్స్ బెళగావి లోనూ పూర్తి చేశారు. ఇంట్లో ఆయనను ‘యజ్ఞన్న’ అని పిలిచేవారు. ఆయన పూర్తి పేరు మేడూరి దీక్షితుల యజ్ఞ రామమూర్తి.
కర్నూల్ లో చదివేటప్పుడే సంఘ పరిచయమయ్యింది. ఆర్ఎస్ఎస్ లో ఎక్కువగా తిరుగుతున్నాడని ఆయనని బెళగావి పంపడం జరిగింది. అక్కడ నిక్కరు వేసుకొని రోజు సంఘ శాఖకి వెళ్ళేవారు. అక్కడ అప్పటి కర్ణాటక ప్రాంత సంఘ చాలక్ శ్రీ అప్పా సాహెబ్ గారితో పరిచయం ఏర్పడింది.
1951 లో నాగపూరు లో జరిగే నెలరోజుల OTC కి వెళ్ళాలని రామమూర్తి గారు భావించారు. వర్గ శుల్కం 75 రూపాయలు ఇవ్వమని తండ్రి గారిని అడిగారు. వారేమో డబ్బు లేదంటే లేదన్నారు. అంతలో రామమూర్తి గారికి ఎయిర్ ఫోర్సు గ్రౌండ్ టెక్నీషియన్ పోస్ట్ కి ఇంటర్వ్యూ కి రమ్మని కార్డు వచ్చింది. అది ఆయన తండ్రి చూసి,’ మిలిటరీ ఉద్యోగానికి అప్లికేషను ఎందుకు పెట్టావు?’ అని నిలదీశారు. ‘మనకి మిలిటరీ ఉద్యోగాలు ఎందుకు నాయనా’ అని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. దాంతో రామమూర్తి గారు ‘నన్ను సంఘ్ శిక్షా వర్గ కన్నా పంపండి, లేకపోతే మిలిటరీ ఉద్యోగానికైన పోనివ్వండి’ అని బెదిరించారు. దాంతో ఆయన తండ్రి OTC కి పంపడం పైన మొగ్గు చూపి డబ్బిచ్చారు.
బెళగావిలో చదివే రోజుల్లో నెలవారీ ఖర్చుల వివరాలు వ్రాసి, అందులో శాంతకు 25 రూపాయలు, లక్ష్మి కి 20 రూపాయలు అని వ్రాసి తండ్రి గారికి పంపేవారట రామమూర్తి గారు. దాంతో ఆయనకంగారు పడిపోయి ‘ఈ శాంత, లక్ష్మి ఎవరురా’ అని నిలదీశారుట. వారిని కాస్త ఉడికిద్దామని ‘వాళ్ళు అమ్మయిలు లే’ అని చెప్పడం తో ‘ఈ ఆడపిల్లల సావాసాలేమిట్రా? వాళ్ళతో నీకేంపని’ అని ఆయన తాపత్రయ పడ్డారు. అప్పుడు రామమూర్తి గారు శాంత అంటే శాంత నివాస్ హోటల్, లక్ష్మి అంటే లక్ష్మి బిల్డింగ్ అని వాస్తవం బయట పెట్టారట. దాంతో ఆయన తండ్రి కాస్త స్థిమితపడి నవ్వుతూ ‘భడవా! ఎంత భయపెట్టావురా’ అని తేలిక పడ్డారట. ఇలా ఉండేది రామమూర్తి గారి హాస్య ప్రవృత్తి.
బెళగావి లో న్యాయవాద కోర్స్ (1951-53) ను పూర్తి చేసుకున్నారాయన. 1954 లో తమ 20వ ఏట ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ అడ్వకేట్ గా గుంటూరులో నమోదు (enroll) చేసుకొన్నారు. 1956 లో హై కోర్ట్ ప్రాక్టీసు చెయ్యటానికి హైదరాబాద్ వెళ్ళినా, ఇంట్లో పరిస్థితుల కారణంగా 1960 లో తిరిగి కర్నూల్ వచ్చేశారు. అప్పటి నుండి దాదాపు 56 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తి లో కొనసాగారు. ఒకసారి ఆయన వృత్తి జీవితంలో ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. కంపమళ్ళ సుబ్బరామయ్య అనే వ్యక్తికి చెందిన కేసు ఒకటి కోర్టులో ఉంది. సుబ్బరామయ్య తరఫున రామమూర్తి గారి అన్న దీక్షితులు ఆకేసును చూస్తుండేవారు. వారి మరణం తర్వాత ఈయనకు వారసత్వంగా వచ్చిన కేసులలో అదొకటి. కానీ ఆకేసులో ఒక చమత్కారముంది. ప్రతివాదుల్లో ఒకరు శ్రీ జీ.వి. శేషఫణి గారి తమ్ముడు. శ్రీ శేషఫణి గారు సంఘ్ లో ప్రముఖ కార్యకర్త. రామమూర్తి గారికి చాలాకాలంగా ఆప్త మిత్రుడు. దానికి తోడు ఆ దస్త్రాలలో సంతకం చేసినవారు శ్రీ రాధాకృష్ణయ్య అనే సంఘ్ ప్రచారక్. రామమూర్తి గారు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. ఇది చాలా సున్నిత విషయం. అందువల్ల మరొక లాయర్ ని చూసుకోమని సుబ్బరామయ్య కు సూచించారు. ఆయనేమో ఒప్పుకోలేదు. ఇక్కడ మరొక తమాషా ఏమంటే, సంఘ కార్యం దృష్ట్యా రామమూర్తి గారు నంద్యాలకు వెళ్ళినప్పుడల్లా శ్రీ జి.వి. శేష ఫణి గారింట్లో దిగడం, భోజనం చేయడం. కర్నూలులో మాత్రం వారికి వ్యతిరేకంగా వాదించడం. అదృష్టవశాత్తు ఆ కేసుకు కోర్ట్ బయటే రాజీ పరిష్కారం లభించడంతో రామమూర్తి గారి నెత్తిన పాలు పోసినట్లయింది.
కోర్ట్ లో వ్యవహారాలు ఎలా సాగుతున్నా సంఘ తో అనుబంధం మాత్రం పెరుగుతూనే ఉంది. 1950 లో నెల్లూరులో ప్రథమ వర్ష, 1951 లో నాగపూర్ లో ద్వితీయ వర్ష పూర్తి చేశారాయన. 1984 లో తృతీయ వర్ష కు వెళ్లివచ్చారు.
1975 లో దేశం లో అత్యవసర పరిస్థితి విధించబడింది. రామమూర్తి గారిని అరెస్ట్ చేసి హైదరాబాదు లోని ముషీరాబాద్ జైలుకు తరలించారు. ఒక్కసారి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారాయన్ని. చుట్టూ బందోబస్త్ ఉంది. ఉన్నట్లుండి ఒక చేయి ఆయన వీపుని చరిచింది. “ఏం రామమూర్తి బాగున్నావా?” తో పరామర్శ విన్పించింది. ఆ చేయి ఆయన వీపుని తాకడం ఆలస్యం కాపలాగా ఉన్న సెక్యూరిటీ అదే విసురుగా ఆ చేయి విసిరి వేయడం రెప్పపాటులో జరిగాయి. వెనక్కి తిరిగి చూస్తే అ వ్యక్తి దామోదరం మునిస్వామి. మాజీ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య సోదరుని కుమారుడు. అప్పటి రాష్ట్ర మంత్రి వర్గం లో సభ్యుడు. ఆయనతో “చూశావా మునుస్వామి! నువ్వు మంత్రి అయినా నా పాటి రక్షణ నీకు లేదు. నాపై ఈగ కూడా వాలనివ్వాదు మీ కాంగ్రెస్ ప్రభుత్వo.” అంటూ పరాచికాలాడారట రామమూర్తి గారు.
రామమూర్తి గారు సంఘ పని చేస్తూనే వివిధ రంగాలలో పనులకూ ప్రాధాన్యమిచ్చారు. కర్నూలులోని సంస్కృత పాఠశాలను తమ నిర్వహణం లోకి తీసుకొని, దానిని హైస్కూల్ స్థాయికి పెంచారాయన. అదే నేటి వివేకానంద సంస్కృత పాఠశాల. అఖిల భారతీయ కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రానికి కార్యదర్శిగా బాధ్యత స్వీకరించి దానిలో జరిగిన అవకతవకలను సరిదిద్ది, సరైన దారికి తీసుకొచ్చారు. కర్నూల్ లో శంకర మందిర నిర్వహణ బాధ్యతను స్వీకరించారు. కర్నూలులో అరక్షిత శిశు మందిరం ప్రారంభింప చేశారు.
ఇలా 83 ఏళ్ల వ్యక్తిగత జీవితం లో 72 సంవత్సరాలు సంఘ్ తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తి శ్రీ యమ్.డి.వై. రామమూర్తి గారు. చివరి దశలో అనంతపురం విభాగ్ (అనంతపురం, కర్నూల్, కడప జిల్లాలు) కు విభాగ్ సంఘ్ చాలక్ గా మార్గదర్శనం చేశారు.
ఒక వ్యక్తిగా శ్రీ రామమూర్తి గారి గురించి ఎంత చెప్పినా, అయన శ్రీమతి రామలక్ష్మి గారి ప్రస్తావన లేకపోతే ఆయన సంఘ జీవితానికి నిండుదనం రాదు.
అత్యవసర పరిస్థితి సమయములో ఆయన ఇంటిపై పోలీసుల నిఘా వుండేది. అప్పటి కర్నూల్ జిల్లా ప్రచారక్ శ్రీ వై. రాఘవులు అజ్ఞాతం లో ఉంటూ సంఘ్ కార్యకలాపాలను సమన్వయ పరిచేవారు. ఒక రోజు పోలీసులు వారింట్లో ఉండగానే రాఘవులు గారు ఇంట్లోకి రాబోతున్నారు. పరిస్థితిని గమనించిన శ్రీమతి రామలక్ష్మి గారు “ఏరా రాముడు! మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తేవడానికి ఇంతసేపా? ఈమధ్య నీకు మాంద్యం చాలా ఎక్కువైంది వెధవా! ఆ సంచి అక్కడ పెట్టి, తిరిగి రా. వెనుక తలుపు దగ్గర టిఫినుంది. తిని తగలడు!” అని గట్టిగా చీవాట్లు పెట్టింది.
రాఘవులు గారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎపుడూ మర్యాదగా ఏమండీ రాఘవులు గారూ అంటూ మర్యాదగా సంబోధించే అమ్మగారు ఎందుకింత దురుసుగా మాట్లాడారో అర్థం చేసుకుని, అలాగేనంటూ చల్లగా జారుకున్నారు. అరెస్ట్ తప్పించుకున్నారు.
శ్రీ రామమూర్తి గారి కుటుంబ సభ్యులంతా సంఘ్, సేవికా సమితి కార్యకర్తలే. మొత్తం కుటుంబాన్ని కార్యకర్తలుగా తయారు చేసిన రామమూర్తి గారు 2018 సెప్టెంబర్ 13 రాత్రి 8 గంటలకు స్వర్గస్తులయ్యారు.