మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్‌లో అడుగుపెట్టడం అతి పురాతన చరిత్రకు వినూతన శ్రీకారం. భారత ఇజ్రాయిల్ సహజ స్నేహపథంలో విప్లవ శుభారంభం! ‘ఆప్ కా స్వాగత్ హై మేరే దోస్త్’-మిత్రుడా మీకు స్వాగతం- అని భారతీయ భాషలో నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హైందవ జాతీయ పద్ధతిలో చేతులు జోడించి నమస్కరించడం ద్వైపాక్షిక మైత్రీలతకు మరో మారాకు.. ‘శలోమ్’ అని ‘హిబ్రూ’ భాషలో ప్రతి నమస్కారం చేసిన మోదీ ‘ఇజ్రాయిల్‌కు రావడం అత్యంత ఆనందదాయకం..’ అని అదే భాషలో తన మనసులోని మాట ఆవిష్కరించడం దౌత్యానికి ఆత్మీయ భావపు వెలుగుల మెరుగు! భారత, ఇజ్రాయిల్ దేశాల మధ్య బుధవారం ఏడు ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం, నీటిపారుదల,అంతరిక్ష పరిశోధన రంగంలోను కుదిరిన ఒప్పందాలు ప్రధానమైనవి! ఈ ఒప్పందాలు కుదరడం ప్రధానం కాదు! ఏడు దశాబ్దుల క్రితం మళ్లీ ప్రాణం పోసుకున్న స్వతంత్ర ఇజ్రాయిల్ దేశాన్ని ఏడు దశాబ్దుల క్రితం బ్రిటన్ దాస్య విముక్తమైన భారతదేశపు ప్రభుత్వాధినేత సందర్శించడం అవని ప్రజలు ఆసక్తితో తిలకించిన అత్యద్భుత ఆవిష్కరణ! టెల్ అవీవ్ సమీపంలో ‘బెన్ గురు ఇవాన్’ విమానాశ్రయంలో మోదీ కాలు మోపగనే ‘డెబ్బయి ఏళ్లుగా మీ ఆగమనం కోసం వేచి ఉన్నాము…’ అని నెతన్యాహు నరేంద్ర మోదీకి తెలియజేసిన క్షణం- చారిత్రక స్మృతుల సమాహారం! ఈ స్మృతుల సరంలో భారతీయు ల ఆత్మీయ ఆతిథ్యం తో తరతరాలుగా ‘ప్రహర్ష పరిప్లుత’మైన యూదు ప్రజల హృ దయ సుమాలు ఉ న్నాయి, వివిధ బీ భత్స జాతుల వికృత పైశాచిక కాండకు స హస్రాబ్దులుగా బలైపోయిన యూదుల విషాద గాథలు ఇమిడి ఉన్నాయి! భారతదేశం రెండు వేల ఏళ్లపాటు యూదులకు మరో మాతృదేశం! ఈ రెండు వేల ఏళ్లపాటు వివిధ విదేశాలలో యూదులు దమనకాండకు గురి కావడం చారిత్రక వాస్తవం! అందువల్లనే ఇజ్రాయిల్‌లో మోదీ అడుగుపెట్టడం హర్షవిషాద స్మృతుల సంగమం. 1948లో ఇజ్రాయిల్ అవతరించినప్పటికీ భారత ప్రధానమంత్రి ఆ దేశాన్ని సందర్శించడానికి డెబ్బయి ఏళ్లు పట్టడం విచిత్రమైన విషాదం.. మోదీ సందర్శనం అందువల్లనే ద్వైపాక్షిక ప్రస్థానంలో ప్రమోద ఘట్టం.. అంతర్జాతీయ దౌత్య చరిత్రను మరో మలుపు తిప్పిన శుభంకర దృశ్యం..
ఇలా ఉభయ దేశాల మధ్య ఏడు దశాబ్దులపాటు అంటీ ముట్టని సంబంధాలు కొనసాగడం అద్వితీయమైన అపవాదం! ఎందుకంటే ఉభయ దేశాల మధ్య చారిత్రక, స్వభావ సమానత్వం రెండు వేల ఏళ్లకు పైగా నెలకొని ఉంది! సహిష్ణుత, సమన్వయం ఉభయ జాతుల మధ్య ప్రధానమైన సమానత్వం! ఇతరుల ఉనికిని సహించలేని తనం, ఇతరుల భావాలను, మాటలను, జీవన పద్ధతులను, మతాలను, భాషలను సహించలేని తనం వ్యక్తులను మృగాలుగా మార్చింది, మార్చుతోంది, ‘జాతు’లను బీభత్స రాక్షస సముదాయాలుగా మార్చింది, మార్చుతోంది! ఈ వైవిధ్య విధ్వంసక బీభత్సకాండకు హిందూ జాతి, యూదు జాతి సమానంగా గురి కావడం చరిత్ర.. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది నుంచి ఇలా బీభత్సకాండకు గురి అయిన హిందూ జాతి వెయ్యేళ్లకు పైగా విదేశీయ ‘పాలన’లో దమనకాండకు గురి అయింది! యూదులను తమ అనాది మాతృభూమి ‘పాలస్తీనా’ నుంచి రోమన్లు నిర్మూలించారు. రెండు వేల ఏళ్లపాటు యూదు జాతికి దేశం లేదు, ‘హిబ్రూ’ మాతృభాష అయిన యూదులు ప్రపంచమంతటా చెల్లాచెదరయిపోయారు. 1948లో యూదులకు ఇజ్రాయిల్ దేశం ఏర్పడే వరకు యూదులను ఇస్లాం జిహాదీలు, క్రైస్తవ దేశాల ప్రభుత్వాలు, జర్మనీలోని నాజీలు, రష్యాలోని కమ్యూనిస్టులు శతాబ్దుల తరబడి దమనకాండకు గురి చేయడం చరిత్ర! ఈ దమనకాండను హిందూ జాతి వలె యూదు జాతి కూడ శతాబ్దుల తరబడి ప్రతిఘటించింది! ఈ సంఘర్షణ శీల స్వభావం భారత,ఇజ్రాయిల్ దేశాల మధ్య మరో సామ్యం!
యూదులకు, దేశం లేని యూదులకు రెండు వేల ఏళ్లపాటు భారతదేశంలో మాత్రం ఆత్మీయమైన ఆశ్రయం లభించడం అంతర్జాతీయ సమాజం అంగీకరించిన వాస్తవం! భారతీయుల సహిష్ణుత, సర్వమత సమభావం, విశ్వహితం కోరే జాతీయతత్త్వం ఇందుకు కారణం! ఇదీ ఇజ్రాయిల్‌కు మనతో ఉన్న అవినాభావ మైత్రికి ప్రధాన ప్రాతిపదిక! భారతదేశపు నివాసం వల్ల యూదులలో సైతం పరమత సహనం పెంపొందింది. అందువల్లనే 1948 నుంచి ఇజ్రాయిల్‌లో అధిక సంఖ్యాకులైన యూదులతో సమానంగా అల్ప సంఖ్యాకులైన పాలస్తీనా ముస్లింలు కూడ అన్ని హక్కులతో హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ‘సహిష్ణుత’ ఇలా ఇజ్రాయిల్ భారతదేశం నుంచి అలవరుచుకున్న స్వభావం! ఈ సమానత్వాలతోపాటు భారత్, ఇజ్రాయిల్ ప్రజాస్వామ్య దేశా లు కావడం సహజ ద్వైపాక్షిక మైత్రికి మరో ప్రాతిపదిక! ఇ లాంటి దేశాల మధ్య ఏళ్ల తరబడి దౌత్య సంబంధాలు, వాణి జ్య సంబంధాలు ఏ ర్పడకపోవడానికి, 1990వ దశకంలో ‘సంబంధాలు’ ప్రారంభమయినప్పటికీ మన ప్రధాని ఇజ్రాయిల్‌ను దర్శించే స్థాయికి మైత్రి ఎదగడానికి ఇనే్నళ్లు కావడం చారిత్రక వైపరీత్యం!
ఇజ్రాయిల్ ఏర్పడగానే దాని చుట్టూ ఉన్న ఇస్లాం మతరాజ్యాలు ఆ దేశాన్ని ధ్వంసం చేయడానికి నడుం బిగించాయి! ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడానికై 1948-1973 సంవత్సరాల మధ్య నాలుగు యుద్ధాలు చేసాయి, నాలుగు యుద్ధాలలోను ఇజ్రాయిల్ జయించింది, నానాటికీ బలపడింది. పశ్చిమ ఆసియాలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. కానీ మన దేశానికి 1947 నుంచి కూడ పశ్చిమాసియాలోని అరబ్, ఇస్లామీ మతరాజ్యాలతో మైత్రిని ఏర్పాటు చేసుకోవాలన్న తపన, తహతహ ఏర్పడి ఉన్నాయి. అందువల్ల అరబ్బుల మనోభావాలు గాయపడతాయన్న భయంతో 1990 దశకం వరకు సహజ మిత్రదేశమైన ఇజ్రాయిల్‌ను మన ప్రభుత్వం దూరంగా ఉంచింది! కానీ ఒక దేశంతో మైత్రి మరో దేశం మైత్రికి అడ్డు కారాదన్న విచక్షణ ఆ తరువాత మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులలో అంకురించింది. ఈ అంకురం పల్లవిస్తోందనడానికి, పరిమళిస్తోందనడానికి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ యాత్ర సరికొత్త నిదర్శనం.. ఉభయ దేశాల స్నేహం ప్రపంచ శాంతికి, ప్రగతికి దోహదం చేయగలదన్న మోదీ, నెతన్యాహు సంయుక్త ప్రకటన నిజానికి ‘అద్దం’.
(ఆంధ్రభూమి సౌజన్యం తో)