Home News యువ శక్తి ని సమాజ సేవ వైపు మరల్చుతున్న “యూత్ ఫర్ సేవ హైదరాబాద్”

యువ శక్తి ని సమాజ సేవ వైపు మరల్చుతున్న “యూత్ ఫర్ సేవ హైదరాబాద్”

0
SHARE

యువతరానికి జోష్ కావాలి.. చేసే పనిలో కిక్కుండాలి..చాలామంది యువతీయువకులు ఆలోచన ఇలాగే ఉంటుంది..కానీ సమాజసేవలో ఉండే మజాయే వేరంటున్నది హైదరాబాద్ యూత్.. ఇతరులకు సాయపడడంలో ఉన్న సంతృప్తి ఎలా ఉంటుందో రుచి చూపిస్తామంటున్నది… యూత్ ఫర్ సేవ అంటూ ముందుకు సాగుతున్న ఈ నవతరపు సేవాతరంగాల పరిచయం ఇది.

బెంగళూరులో ప్రారంభం :

వెంకటేశ్ మూర్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో పనిచేసేవారు. 14 ఏళ్ల తర్వాత తిరిగివచ్చిన ఆయన.. స్వదేశానికి ఏదైనా సేవ చేయాలనుకున్నారు. సమాజానికి తనవంతు సాయం చేయాలనుకుని, 2007లో యూత్ ఫర్ సేవ సంస్థను ప్రారంభించారు. స్నేహితుల సహకారంతో నిధులు సేకరించి.. సేవా కార్యక్రమాలను మొదలెట్టారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, పర్యావరణం అంశాలపై దృష్టి సారించారు. సంస్థ సేవలు దేశంలోని ఇతర నగరాలకూ విస్తరించారు.

హైదరాబాద్ కేంద్రంగా:

పది మందితో ప్రారంభమైన యూత్ ఫర్ సేవ.. ఇప్పుడు వేలాది మంది వలంటీర్లను కలిగి ఉన్నది. 2010లో శోభిక్ మథూర్ హైదరాబాద్‌లోనూ సంస్థ సేవల్ని ప్రారంభించారు. ప్రస్తుతం సిటీలో వెయ్యిమంది వలంటీర్లు యూత్ ఫర్ సేవ కోసం పనిచేస్తున్నారు. ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఈ సేవాకార్యక్రమాల్లో తమ సహకారాన్ని అందిస్తున్నారు.

విద్యావికాసానికి :

యూత్ ఫర్ సేవ సంస్థ విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నది. ఏటా సంస్థ తరపున నిరుపేద విద్యార్థులకు వేల సంఖ్యలో స్కూల్ కిట్లను అందజేస్తున్నది. జంటనగరాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు బ్యాగులు, పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నది. వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్ని నిర్వహిస్తున్నది. వలంటీర్లే స్వయంగా పిల్లలకు కంప్యూటర్ శిక్షణనిస్తున్నారు. చూపులేని విద్యార్థులకు అనువుగా ఉండేలా ఆడియో రికార్డింగ్ ద్వారా పాఠాలను బోధించేందుకు కృషిచేస్తున్నది యూత్ ఫర్ సేవ. వారికోసం కాలేజీల్లో, స్కూళ్లలో ప్రత్యేకమైన వర్క్‌షాపులను నిర్వహిస్తున్నది.

ఆరోగ్యానికి ప్రాధాన్యం :

బస్తీల్లో, కాలనీల్లో ఉండే జనాలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యూత్ ఫర్ సేవ టీమ్ మెంబర్స్. ప్రముఖ దవాఖానలు, వైద్యులను సంప్రదించి.. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందేలా చూస్తున్నారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ యువతరాన్ని సమాజసేవలో భాగం చేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ:

నగరంలో గుంతలు పడిన రోడ్డు ఎక్కడ కనిపించినా.. యూత్ ఫర్ సేవ వలంటీర్లు వెంటనే స్పందిస్తారు. గుంతలు పూడ్చి, తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. అంతేకాదు అపరిశుభ్రంగా మారిన ప్రాంతాలను దత్తత తీసుకుని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రోడ్లకు ఇరువైపులా గోడలపై అందమైన బొమ్మలు వేసి ప్రజల్లో శుభ్రతపై అవగాహన తీసుకొస్తున్నారు. గ్రీన్ క్లబ్స్‌ను ఏర్పాటు చేసి చెట్లపెంపకానికి కృషి చేస్తున్నారు. రంగుల విగ్రహాలను పూజించొద్దంటూ ఏటా వినాయకచవితికి ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మట్టి గణేష్ ప్రతిమలను తయారు చేయించి, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఐటీ ఉద్యోగాలే ఎక్కువ :

యూత్ ఫర్ సేవ కార్యక్రమాల్లో విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యమే ఎక్కువ. సంస్థకు వలంటీర్లుగా మారిన చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్.. వీకెండ్ ఫన్‌ను సమాజసేవలోనే వెతుక్కుంటున్నారు. అందుకే శని, ఆది వారాల్లో సంస్థ తరపున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

జిల్లాల్లోనూ విద్యాచేతన్

జిల్లాల్లోనూ విద్యాచేతన్ కార్యక్రమం ద్వారా అనాథశరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చూస్తున్నాం. సంస్థ తరపున పనిచేసేందుకు హైదరాబాద్ యూత్ ఉత్సాహంగా ముందుకు వస్తున్నది.  వెంకట్ దుసారి, సిటీ కో ఆర్డినేటర్

స్వచ్ఛ హైదరాబాద్ దిశగా

వేల మంది విద్యార్థులకు సంస్థ తరపున సహాకారాన్ని అందించాం. ఆరోగ్యంపై, పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూ స్వచ్ఛ హైదరాబాద్‌లోనూ భాగమవుతున్నాం. అనీల్, వలంటీర్

ఆనందాల చిగురు:

చిన్నారుల ఆనందం కోసం యూత్ ఫర్ సేవ నిర్వహిస్తున్న మరో కార్యక్రమం చిగురు. గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకు ఏటా యానువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నది. ఆటపాటలతో ఆనందంగా గడిపే ఏర్పాట్లు చేస్తున్నది. షేక్‌పేట్‌లోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ఒకేసారి ఐదువేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా నిరుపేద పిల్లలకు ఫన్ ఈవెంట్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్లమ్ ఏరియాల్లో ఉండే చిన్నారులను సైతం ఈ వేడుకల్లో భాగం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ స్కీమ్ ద్వారా 4 ఏళ్ల పాటు ఉపకారవేతనం అందించే ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ పరీక్షకు సిద్ధమయ్యేలా.. నిరుపేద విద్యార్థులను తీర్చిదిద్దేందుకు యూత్ ఫర్ సేవ వలంటీర్లే ట్రైనర్లుగా మారుతున్నారు.

(నమస్తే తెలంగాణా సౌజన్యం తో)