Home News జైలు నుంచి 8 మంది సిమి కార్యకర్తలు పరారీ.. కాల్పుల్లో హతం

జైలు నుంచి 8 మంది సిమి కార్యకర్తలు పరారీ.. కాల్పుల్లో హతం

0
SHARE

భోపాల్‌ జైలు నుంచి పరారైన 8 మంది సిమి కార్యకర్తలు

ఎదురు కాల్పుల్లో మృతి

గార్డును చంపి దుప్పట్ల సాయంతో గోడదూకిన నిందితులు

గంటల వ్యవధిలోనే గుర్తించి చుట్టుముట్టిన పోలీసులు

న్యాయవిచారణకు విపక్షాల డిమాండ్‌

ఓట్ల రాజకీయాలని భాజపా విమర్శ

simi1

జైలు నుంచి పోరిపోయిన 8 మంది స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి) కార్యకర్తలు.. గంటల వ్యవధిలో పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే భోపాల్‌ కేంద్ర కారాగారంలో భద్రతా విధుల్లో ఉన్న గార్డును గొంతుకోసి చంపి ఎనిమిది మంది సిమి కార్యకర్తలు పారిపోగా, వారికోసం పోలీసులు వేట కొనసాగించారు. భోపాల్‌ నగర శివార్లలో ఇరువర్గాల మధ్య సాగిన ఎదురుకాల్పుల్లో ఖైదీలు హతమయ్యారు. ఈ ఘటనపై విపక్షాలు పలు సందేహాల్ని లేవనెత్తుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక సోమవారం తెల్లవారు జామున 2 నుంచి 3 గంటల మధ్యలో సిమి కార్యకర్తలు గార్డును చంపి, దుప్పట్ల సాయంతో జైలు గోడలు దూకి పారిపోయారని భోపాల్‌ డీఐజీ రమణ్‌సింగ్‌ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఖైదీలు మలిఖేడా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి చుట్టుముట్టగా, పోలీసులపైకి ఎదురుదాడికి దిగడంతో హతమార్చినట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఖైదీల్ని అమ్జాద్‌, జకీర్‌ హుస్సేన్‌ సాదిఖ్‌, మొహ్మద్‌ సాలిక్‌, ముజీబ్‌ షేక్‌, మెహబూద్‌ గుడ్డు, మొహమ్మద్‌ ఖాలిద్‌ అహ్మద్‌, అకీల్‌, మాజిద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జైలులో హెడ్‌కానిస్టేబుల్‌ రామశంకర్‌ను చంపి, మరో గార్డు చందన్‌ను చంపేందుకు యత్నించి జైలు నుంచి పారిపోయిన తర్వాత ఈంట్‌ఖేడి గ్రామం సమీపంలో మణిఖేడా పథర్‌ వద్ద పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించినట్లు పోలీసు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఖైదీల పరారీ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదికను కోరారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేపట్టనుంది. భోపాల్‌ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత ప్రకటించారు.

భోపాల్‌ శివార్లలోని మలిఖేడా వద్ద 8 మంది సిమి కార్యకర్తలు హతమైనట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి భూపేంద్రసింగ్‌ తెలిపారు. ఖైదీలు జైలు నుంచి తీసుకెళ్లిన చెంచాలు, పళ్లేల్ని భద్రతా సిబ్బందిపై దాడి చేసేందుకు ఉపయోగించినట్లు పేర్కొన్నారు. టీవీ దృశ్యాల్లో ఎదురు కాల్పుల ఘటనకు విరుద్ధంగా కనిపిస్తోందంటూ అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ… ఇవి ముమ్మాటికీ ఎదురుకాల్పులేననీ వారిని హతమార్చడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని వివరించారు. నకిలీ ఎన్‌కౌంటర్‌ అనే ఆరోపణల్ని పోలీసులు ఖండించారు. ఎదురు కాల్పుల ఘటన తర్వాత నాలుగు నాటు తుపాకులు, పదునైన ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పారిపోయిన సిమి కార్యకర్తల వద్ద ఆయుధాలు ఉన్నాయనీ, పోలీసులపై కాల్పులకు దిగారనీ, ప్రతిగా పోలీసులూ కాల్పులు చేపట్టారని ఐజీ యోగేష్‌చౌధరి తెలిపారు. సిమి కార్యకర్తల వైపు నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయనీ, ఎదురు కాల్పుల్లోనే వారు మరణించారనీ, పదునైన ఆయుధాల వల్ల ముగ్గురు పోలీసులకూ గాయాలయ్యాయని వెల్లడించారు. మరణించిన వారు ప్రమాదకరమైన నేరగాళ్లని పేర్కొన్నారు. ఐజీ ప్రకటన హోంమంత్రి ప్రకటనకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంగా భావిస్తున్న ప్రాంతానికి సంబంధించి టీవీ ఛానళ్లలో చూపిన దృశ్యాల్లో.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్లాస్టిక్‌ సంచీలో నుంచి కత్తిలాంటి దానిని, తీసి, తిరిగి పెడుతున్నట్లుగా కనిపించింది. తర్వాత ఓ పోలీసు ఓ వ్యక్తి శరీరంలోకి సమీపం నుంచి బుల్లెట్లు కురిపిస్తున్నట్లుగా ఉంది. సదరు వీడియోను పరీక్షిస్తామని ఐజీ పేర్కొన్నారు. పరారీ ఘటన తర్వాత రాష్ట్రప్రభుత్వం సిమి కార్యకర్తల చిత్రాల్ని విడుదల చేసింది. జైళ్ల డీఐజీ సహా నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసింది. ఖైదీలపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది.

simi2

సిమి అంతర్జాతీయ సంబంధాలపై దర్యాప్తు: చౌహాన్‌

ఎదురు కాల్పుల ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌చౌహాన్‌ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. పరారీ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందన్నారు. సిమి కార్యకర్తల అంతర్జాతీయ సంబంధాలపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతుందన్నారు. ఈ మొత్తం ఘటనను తీవ్రంగా తీసుకున్నామనీ, మాజీ డీజీపీ నందన్‌దూబేతో దర్యాప్తు జరిపించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే విధుల నుంచి డిస్మిస్‌ చేస్తామన్నారు. ఇది రాష్ట్రాలనికి సంబంధించిన కేసు మాత్రమే కాదనీ, దీనివెనకున్న మొత్తం సంబంధాల్ని బయటపెట్టేందుకు ఎన్‌ఐఏ దర్యాప్తు అవసరమని హోంమంత్రి రాజ్‌నాథ్‌ అంగీకరించారన్నారు.

* గత మూడేళ్లలో సిమి కార్యకర్తలు జైలు నుంచి పారిపోయిన ఘటనల్లో ఇది మూడోది. 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఏడుగురు తప్పించుకోవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అందులో నలుగురు మూడేళ్ల తర్వాత అరెస్టయ్యారు. పరారీలో ఉన్నప్పుడు పలు ఉగ్రవాద ఘటనలు, బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. పారిపోయిన ఉగ్రవాదులు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, యూపీ వంటి పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిమిని 2001లో ప్రభుత్వం నిషేధించింది.

* భోపాల్‌ ఘటనలో మృతిచెందినవారిలో నలుగురు సిమి కార్యకర్తలు యూపీ బిజ్నౌర్‌లో బాంబుల తయారీని నేర్చుకున్నట్లు తెలుస్తోంది. 2014లో బిజ్నౌర్‌ జాటాన్‌ కాలనీ పేలుడు ఘటన జరగడంతో అక్కడి నుంచి ఆరుగురు తప్పించుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వారిలో ఇద్దరు 2015, ఏప్రిల్‌లో తెలంగాణలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు. పరారీలో ఉన్నప్పుడు సిమి కార్యకర్తలు ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2014, ఫిబ్రవరిలో తెలంగాణ కరీంనగర్‌లో బ్యాంకు దోపిడీకి పాల్పడినట్లు చెబుతున్నారు. చెన్నైసెంట్రల్‌ స్టేషన్‌లో రైలులో పేలుడుకు, పుణెలో పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది.

simi3

విచారణకు విపక్షాల డిమాండ్‌

సిమి కార్యకర్తల ఎదురుకాల్పుల ఘటనపై కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు న్యాయవిచారణకు డిమాండు చేయగా, అది భద్రతా బలగాల నైతికస్థైర్యాన్ని బలహీనపరుస్తుందని భాజపా ఆరోపించింది. ప్రజలకు నిజాలేమిటో తెలిసేందుకు న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్‌, సీపీఎం కోరాయి. కాంగ్రెస్‌ సిమి కార్యకర్తలకు మద్దతుగా మాట్లాడటం ద్వారా ఈ ఘటనను రాజకీయం చేయాలని చూస్తోందని భాజపా ఆరోపించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ స్పందిస్తూ.. ఎలాంటి పరిస్థితుల్లో వారు తప్పించుకున్నారో ప్రభుత్వం తెలుసుకునేందుకు న్యాయవిచారణ జరగాలని డిమాండు చేస్తున్నానన్నారు. భాజపా అధికారప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గతంలో లష్కరేతోయిబా ఉగ్రవాదుల్ని వెనకేసుకొచ్చిన తరహాలోనే సిమి కార్యకర్తల తరఫున మాట్లాడుతోందని ఆరోపించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మెరుపుదాడుల్ని ప్రశ్నించినట్లుగానే ఇప్పుడూ చేస్తోందన్నారు. భోపాల్‌ జైలు నుంచి సిమి కార్యకర్తల పరారీపై అధికార ప్రకటనల్లో వ్యత్యాసాలున్నాయనీ, ఆరోపణలపై అన్ని నిజాలు బయటపడేందుకు సుప్రీంకోర్టుతో దర్యాప్తు చేయించాలని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండు చేశారు. హోంమంత్రి, పోలీసులు చెబుతున్న అంశాల్లో చాలా తేడాలు ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు దర్యాప్తే అన్ని నిజాల్ని బయటికి తెస్తుందన్నారు. ఎన్‌కౌంటర్‌ మృతులు చేతి గడియారాలు, బూట్లు, బెల్టులు ఎలా ధరిస్తారనీ, వీటిని ధరించేందుకు విచారణ ఖైదీలను అనుమతించరని పేర్కొన్నారు.

 

సిమి.. అలీగఢ్‌ నుంచి అంచెలంచెలుగా..

సిమిగా పిలిచే స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఎంఐ)ను చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం,1967 కింద.. ఇస్లామిక్‌ మతతత్వ సంస్థగా గుర్తించారు. భారత్‌ను ఇస్లామిక్‌ భూభాగంగా మార్చడం ద్వారా విముక్తి కలిగిస్తామంటూ ఈ సంస్థ ప్రచారం చేస్తుంది. తీవ్ర భావజాలంతో నిండిన యువ విద్యార్థులతో కూడిన ఈ సంస్థ భారత్‌పై జిహాద్‌ను ప్రకటించింది. ప్రతి ఒక్కరినీ బలవంతంగా మతం మార్చడం ద్వారాగానీ, హింసతోగానీ భారత్‌లో ఇస్లాం ప్రదేశాన్ని స్థాపించడమే దీని లక్ష్యం. 1977, ఏప్రిల్‌ 25న ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌లో బీజం పోసుకుంది. పశ్చిమ ఇలినాయిస్‌ విశ్వవిద్యాలయంలో జర్నలిజం, ప్రజాసంబంధాల విభాగం ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ అహ్మదుల్లా సిద్దిఖీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేశారు. జమాతే ఇస్లామీ హింద్‌(జేఐహెచ్‌)కు విద్యార్థి విభాగంలా అవతరించింది. పాలస్తీనా విమోచన సంస్థ నేత యాసర్‌ అరాఫత్‌ను జేఐహెచ్‌ సమర్థించగా సిమిలోని విద్యార్థి నేతలు తిరస్కరించారు. 1981లో అరాఫత్‌ భారత్‌ను సందర్శించగా, నిరసన తెలిపారు. జేఐహెచ్‌ సిమిని రద్దు చేసి సూడెంట్స్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌ఐవో) పేరిట మరో సంస్థను ఏర్పాటు చేసింది.

* 9/11 దాడుల నేపథ్యంలో 2001లో సిమిని తొలిసారిగా నిషేధించారు. 2003 దాకా నిషేధం కొనసాగింది. ఆ సమయంలో సంస్థ సభ్యులపై పలుచట్టాల కింద కేసులు మోపారు.

* మరోసారి 2003 సెప్టెంబరు 27న విధించిన నిషేధం 2005 సెప్టెంబరు దాకా కొనసాగింది.

* మూడోసారి 2006 ఫిబ్రవరి 8న నిషేధం విధించారు. 2012లో నిషేధాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. 2014లో మరో ఐదేళ్లపాటు నిషేధాన్ని పొడిగించింది.

* 2007, ఫిబ్రవరి 15న సిమిని సుప్రీంకోర్టు వేర్పాటువాద ఉద్యమంగా అభివర్ణించింది.

* 2008 మార్చి 27న సిమి మాజీ ప్రధాన కార్యదర్శి సఫ్దర్‌ నగోరి, అమిల్‌ పర్వేజ్‌లతోపాటు మరో పది మందిని ఇండోర్‌లో అరెస్టు చేశారు.

* 2015, ఏప్రిల్‌ 1: ఇద్దరు సిమి కార్యకర్తలు ఐజాజుద్దీన్‌, అస్లాం సూర్యాపేట బస్టాండులో పోలీసు బృందంపైకి కాల్పులు జరిపారు. కానిస్టేబుల్‌, హోంగార్డు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల తుపాకీతో పారిపోయారు.

* 2015, ఏప్రిల్‌ 4: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సిమి కార్యకర్తలు, ఓ పోలీసు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.

* 2015, ఏప్రిల్‌ 7: సిమి కార్యకర్తలలతో జరిగిన కాల్పులతో ఎస్‌ సిద్దయ్య తీవ్రంగా గాయపడి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

* 2015, ఏప్రిల్‌7: వరంగల్‌, నల్గొండ సరిహద్దుల్లో వికారుద్దీన్‌ అహ్మద్‌ సహా ఐదుగురు కార్యకర్తలు పోలీసు కాల్పుల్లో హతమయ్యారు.

* 2016, అక్టోబరు 31: భోపాల్‌ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమి కార్యకర్తలు, పోలీసు కాల్పుల్లో హతమయ్యారు.

* నిషేధం వల్ల కొత్త పేర్లతో కార్యకలాపాలు సాగిస్తుంటుంది.

* యూపీ వంటి కొన్ని రాష్ట్రాల్లో చాలా బలంగా వేళ్లూనుకుంది. యూపీలో జిల్లాకో పేరుతో చలామణీ అవుతోంది.

* ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) అనేది సిమికి ఉగ్రవిభాగమని కొంతమంది విశ్లేషకుల భావన.

(ఈనాడు సౌజన్యం తో)