అనిల్ గారితో భేటీ 2006లో జరిగింది. నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. అప్పట్లో నేను జీవ ఇంధనంతో పని చేసే కొన్ని సంస్థలతో పనిచేసేవాడిని. ఈ జీవ ఇంధనం కోసం పొన్గామియా అనే తైలగింజలను అత్యధిక పరిమాణంలో చేకూర్చుకోవాల్సివస్తుందనే విషయం విదితమయ్యింది. అప్పుడు ఒక ఆలోచన తట్టింది – వనవాసీ కుటుంబాలచే ఈ పొన్గామియా గింజల సాగు చేయిస్తే ఎకరానికి ₹.24,000/- చొప్పున ఖచ్చితమైన రాబడి వస్తుంది. తద్వారా దారిద్య రేఖకు కింద బ్రతుకుతున్న కుటుంబాలకు మంచి రాబడి ఉంటుంది కదా అని.
ఒక 5000 కుటుంబాలతో 5000 ఎకరాలలో ఈ గింజల సాగు చేయించాలని ఒక సంకల్పం కలిగింది. అందుకుగాను ఒక రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచెయ్యాలని నిర్ణయం తీసుకున్నాము. అప్పుడు నాకు అనిల్ దవే గారు మనసులో మెదిలారు. అప్పుడు వారు బీజేపీ కార్యదర్శిగా ఉండేవారు. మధ్యప్రదేశలో బీజేపీ విజయం వారి నేతృత్వంలోనే జరిగింది. మేధావుల సమావేశాలలో వారిని ప్రతి సంవత్సరం కలుస్తూండే వాడిని. వారి తెలివితేటలు, మధ్య మధ్యలో వారు వేసే చాలా నిగూఢ ప్రశ్నలు నన్ను చాలా ఆకట్టుకునేవి.
వారితో ఈ సంకల్పం గురించి మాట్లాడాను. ఒక్కమాటలో జవాబు తెలిపారు – “భోపాల్‌కి రండి. ఏమి చెయ్యగలమో చూద్దాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిసి ఇలాంటి పనుల గురించి పనిచేయడం అదే మొదటిసారి. అందువలన నా భయాలు, ఇబ్బంది నాకు ఉన్నవి.
ఏది ఏమయినా భోపాల్ చేరుకున్నాను. అనిల్ గారు హృదయపూర్వకంగా కలిసారు. కొన్ని అనివార్య కార్యక్రమాలను ముగించుకొని నన్ను కలవడానికి సమయం కేటాయించారు. నన్ను వారితో పాటు రమ్మన్నారు. వారితో గడిపిన ఆ తరువాయి కొద్ది గంటల్లోనే వారు ప్రభుత్వంలో ఏ హోదా లేకపోయినా చాకచక్యంగా పనులను సాగిస్తున్న తీరును చూసాను. చకితుడనయ్యాను. యావత్తు మధ్యప్రదేశ్ రాజ్యంలోని నీటివనరుల పరిరక్షణ విషయమే గాని, లేక మూతబడిన ఒక కర్మాగారాన్ని యాజమాన్యాన్ని కార్మికులకు మార్చి దాన్ని మళ్ళీ నడిపించిన తీరు గానీ చూస్తే ఎంత సహజంగా విషయబద్ధతో పనిచేయగలుగుతున్నారో తెలుస్తుంది.
ఎట్టకేలకి అపరాహ్నవేళకి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చేరుకున్నాము. నేను ఆ సంకల్పవివరాలను వారి ముందుంచాను. ఆ ప్రాజెక్ట్ గురించిన అన్ని ప్రశ్నలకి సమాధానాలిచ్చాను. అప్పుడు సెక్రెటరీ నన్ను ఆ ప్రాజెక్ట్ చేపట్టినందుకు గల ఉద్దేశాలను తెలుసుకోవడానికి ఎన్నో ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగారు.
సెక్రెటరీః “5000 ఎకరాల భూమిని మీ సంస్థకు ఇవ్వాలా?”
నేనుః “కాదు. ఆ భూమి సాక్షాత్తు 5000 వనవాసీ కుటుంబాలకే కేటాయించెదరు.”
సెక్రెటరీః “అయితే మీకు ఆ మొక్కలకి సబ్సిడీ కావాలా?”
నేనుః “కాదు. ఆ కుటుంబాలకే”
సెక్రెటరీః “ఆ మొక్కలను వాళ్ళకి మీరు అమ్ముతారా?”
నేనుః “కాదు. మేము కేవలము మార్గదర్శనం చేస్తాము.”
సెక్రెటరీః “అయితే వాళ్ళు మీకు పూర్వ నిర్ధారిత ధరకే ఆ గింజలను అమ్మాలి కదా?”
నేనుః “కాదు. అంగడిలో ఉన్న ధరకే. మేము కనీస మూలధరకి అమ్మగలిగేలా చూస్తాము.”
సెక్రెటరీః “కానీ వాళ్ళు మీకే అమ్మాలి కదా?”
నేనుః “కాదు. వాళ్ళు ఎవ్వరికయినా అమ్మవచ్చు. మేము కనీస ధరకు అమ్మగలిగేలా చూస్తాము.”
సెక్రెటరీః “అయితే ఇందులో మీకు చేకూరే లాభమేమిటి? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు?”
“మీకు ఒరిగేదేముంది ఇందులో. అది లేకుండా ఎవ్వడూ రాడు.” అన్నది అతని ముఖాన కొట్టొచ్చినట్టు కనబడుతూన్నది. నేను ఏ స్వంతలాభం కోసమనీ పని చెయ్యటం లేదని ఆయనకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. నేను పని చేసే కంపెనీ, నా హోదా, నా యాజమాన్య సామాజిక బాధ్యతా (CSR) పనుల గురించి చెప్పాలా అనుకుంటుండంగా అనిల్ గారే సమాధానమిచ్చారు. నన్ను చూసి సెక్రెటరీతో “స్వయంసేవక్ హై” అన్నారు. ఎంత విశ్వాసంతో ఆ రెండు ముక్కలన్నారో నేను అవాక్కయిపోయాను. ఏ స్వలాభమూ ఆశించకుండా పనిచేయడం ఒక సంఘ స్వయంసేవకునికి ఎంత సహజమో, అందులో విడ్డూరమీమీ లేదు అన్న భావాన్ని “స్వయంసేవక్ హై” అన్న రెండు పదాలతో మరో ప్రశ్నకు తావులేకుండా సమాధానమిచ్చారు.
నేను చిన్నప్పటినుండి స్వయంసేవక్నే. కానీ ఆ క్షణంలో వారన్న ఆ రెండు మాటలూ నా మీద ఎంత విశ్వాసం, బాధ్యతను ఉంచాయో ఆ విలువ, భారం అప్పుడే తెలిసింది.
మా తిరుగు ప్రయాణంలో అనిల్ గారు ఇలా అన్నారు. “గోవింద గారు, మనం మన కార్యాలయానికి వెళదాం. మీకు మంచి రుచికరమైన పోహాని ఇప్పిస్తాను.” పార్టీ కార్యాలయానికి వెళ్ళే దారిపొడుగునా ఎన్నో ఫోన్లు. మంత్రులనుండి కూడా సలహాల/మంథనాల గురించి. ప్రతీ సంభాషణా వారు ఎంతటి నిజాయితీ పరుడో, సమర్థవంతుడో ప్రదర్శించేవే. అలాంటి వారి సమయాన్ని ఎక్కువ వాడుకున్నానేమో అనే చిన్న భావన నాలో చొరబడింది కూడా.
పార్టీ కార్యాలయం చేరుకున్నాక వారి గదిలో కూర్చోమన్నారు. వారికి విడిగా వేరే గది ఉండి ఉంటుంది అనుకొని వారి వెంట వెళ్ళాను. 12 * 12 అడుగుల ఒక గది. అందులో ఒక చిన్న మంచం, ఒక కుర్చీ, బల్ల, పుస్తకాలతో నిండిన మూడు అలమారాలు మాత్రమే ఉన్న గది అది. అప్పుడు స్ఫురించింది – 5000 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పించి, మధ్యప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రం యొక్క రాజకీయ కార్యకలాపాలను వెనుకుండి నడిపించే ఇతను ఒక చిన్న గదిలో తన చిన్న సామగ్రితో ఉంటున్నారు. అదీ 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటూ.
నేను అంతగా విస్మయం చెందలేదు. ఎందుకంటే అనిల్ మాధవ దవే గారు “స్వయంసేవక్ హై.”
లైసెన్స్ అయిపోవడం వలన తను రేడియో కూడా వినలేకపోయారని పండిత దీనదయాల్ ఉపాధ్యాయ వంటి పూర్వతరం నాయకుల గురించి మనము వినే ఉన్నాము. అటువంటి మహానుభావులను దేవుడు ఇకపైన పుట్టించడం లేదేమో అని అనుకుంటూంటాము. కానీ అనిల్ గారితో ఈ భేటీ మరోసారి జ్ఞప్తి కలిగించింది – అటువంటి ఎందరో వేలకొలది త్రికరణశుద్ధి కలిగిన ఉన్నత వ్యక్తులను సంఘం ఇంకా నిర్మిస్తూనే ఉంది అని. అలాంటి వారు నిత్య జీవితంలో రాజకీయంతో పాటు వివిధ రంగాలలో నేతృత్వం వహిస్తూ ఉన్ణారు. “స్వయంసేవక్ హై” అనేదే వారి గుర్తింపు, జీవిత లక్ష్యం కూడా. అటువంటి వారి గురించి విన్నాను, చదివాను. కానీ ఇలా తారసపడినప్పుడు మాత్రమే మనస్సులో చిరస్థాయిగా ముద్రింపబడుతుంది.
అనిల్ మాధవ దవే కళాశాల రోజుల నుండి సామాజిక కార్యకర్తగా ఉండే వారు. సంఘంతో ముడిపడి యావత్ జీవితాన్ని సంఘకార్యానికే అంకితం చేసారు. వారు విభాగ ప్రచారక్‌గా ఉండేవారు. తరువాత వారికి మధ్యప్రదేశ్ బీజేపీ కార్య బాధ్యతలను అప్పచెప్పారు. వారు 2009 లో పార్లమెంటు సదస్యులయ్యారు. 2016లో పర్యావరణ విభాగానికి కేంద్ర రాజ్యమంత్రి బాధ్యతను చేపట్టారు. నర్మదా పరిరక్షణ కార్యంలో చాలా పని చేసారు. పర్యావరణ వారికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. వారి పేరు గూగుల్‌లో ఎక్కువగా కనిపించక పోవచ్చు ఎందుకంటే సంఘం మినహా వారికి వేరే వైయక్తిక జీవితం పెద్ద లేదు. అంతే కాకుండా 40 ఏళ్ళ సంఘ జీవితంలో వారు చేసిన ఎన్నో బృహత్ కార్యాలకు వారి పేరును ఎక్కడా తగిలించుకోలేదు. “స్వయంసేవక్ హై” అన్న భావాన తోనే తన చివరి శ్వాస మే 18, 2017న వదలినంత వరకూ పని చేసారు. తన వీలునామాలో తనకంటూ ఏ విధమైనటువంటి స్మారకమూ నెలకొల్పవద్దని వ్రాసి వెళ్ళిపోయారు.
నన్ను అభిమానిస్తే కొన్ని చెట్లను నాటండి. నీటిని రక్షించండి” అని అన్నారు. కానీ అది చేస్తున్నప్పుడు నా పేరు లేకుండా చెయ్యండి అని మాత్రం చెప్పారు.
అటువంటి రాజకీయ నాయకుణ్ణి, ఓ మంత్రిని ఈ విధంగా తనకంటూ ఏమీ వద్దని కోరుకుంటూన్న వ్యక్తిని ఊహించగలరా? నాకు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అటువంటి అనిల్ మాధవ దవేని చూసాను. “స్వయంసేవక్ హై.” అతను ఒక స్వయంసేవకుడు
గోవింద సావళే
జ్యూరిక్
20.5.2017