Home News గ్రానైట్‌ కోసం కరీంనగర్‌ జిల్లాలోని 1300 ఏళ్లనాటి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కోటలకు ముప్పు

గ్రానైట్‌ కోసం కరీంనగర్‌ జిల్లాలోని 1300 ఏళ్లనాటి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కోటలకు ముప్పు

0
SHARE
  • చారిత్రక విధ్వంసానికి సిద్ధమవుతున్న అధికార గణం
  • గ్రానైట్‌ కోసం 1300 ఏళ్ల చరిత్రకు చరమగీతం
  • తాజాగా బయటపడిన జైనతీర్థంకరుడి విగ్రహం
  • కోట్లనర్సింహులపల్లిలో రాష్ట్రకూటుల నాటి ఆలయం, కోటలకు ముప్పు
  • కొండను గుత్తేదారుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
  • ఆగమేఘాల మీద దస్త్రాన్ని సిద్ధం చేసిన గనుల శాఖ
  • కొండను వారసత్వ సంపదగా ప్రకటించాలంటున్న స్థానికులు

అదో చారిత్రక ప్రాంతం.. అక్కడ అడుగు తీసి అడుగేస్తే ఏదో ఒక చారిత్రక సాక్ష్యం స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది.. అటువంటి అద్భుత వారసత్వ సంపద విధ్వంసానికి పథక రచన జోరుగా సాగుతోంది. 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న శతాబ్దాల నాటి చరిత్రను గ్రానైట్‌ రాళ్ల కోసం కాలగర్భంలో కలిపేందుకు గనుల శాఖలో దస్త్రం శరవేగంగా కదులుతోంది. ఇప్పటికే అక్కడ అనేక గ్రానైట్‌ కొండలు, వాటితో పాటే చరిత్రా కనుమరుగైపోయాయి. మిగిలి ఉన్న ఒకే ఒక్క కొండనూ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పేల్చివేయాలనే ఆలోచన రావడమే దారుణం. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లిలోని కొండను గ్రానైట్‌ క్వారీగా మార్చడానికి అధికార గణాలు సిద్ధమయ్యాయి. ‘ఈనాడు’ ప్రతినిధి ఆ కొండపై, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికర అంశాలను గుర్తించారు. 1300 ఏళ్లనాటి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కోట తదితరాలన్నీ భావితరాలకు పదిలపర్చడం పాలకుల కర్తవ్యం.

కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి, మల్యాల మండలాలు నాణ్యమైన గ్రానైట్‌ రాళ్లకు ప్రసిద్ధి. గ్రానైట్‌ రాయి లాభాలను ఆర్జించిపెడుతుండడంతో కొన్నేళ్లుగా పలువురి కన్ను వీటిపై పడింది. పలు గుట్టలను ఇప్పటికే మింగేశారు. గంగాధర మండలంలో ఇప్పుడు మిగిలింది రెండే కొండలు. అందులో ఒకటి జైన స్థావరంగా వర్ధిల్లిన బొమ్మలగుట్ట. దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు పోరాటాలు చేయాల్సి వచ్చింది. మిగిలింది కోట్లనర్సింహులపల్లిలో 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘దేవుని కొండ’. ఇప్పుడు కొందరు పెద్దల కన్ను దీనిపై పడింది. కొండపై పురాతన ఆలయాలతో పాటు ఇప్పటికీ ఛేదించని రహస్యాలెన్నో ఉన్నాయి. అటువంటి కొండను ఆరుగురు గుత్తేదార్లకు ధారాదత్తం చేసేందుకు గనుల శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ శాఖలో దస్త్రాలు కదిలిన తీరును పరిశీలిస్తే.. చరిత్ర ధ్వంసమైపోయినా సరే కొండను గుత్తేదార్లకు ఇచ్చేయడమే లక్ష్యమనే ధోరణి అధికారగణాల్లో కనిపిస్తోంది.

అవి రాష్ట్రకూటుల కాలం నాటివి..

తెలంగాణలోని పాత కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోని ప్రాంతాలు రాష్ట్రకూటుల (క్రీ.శ.750-973) కాలంలో ‘సపాదలక్ష’ అనే రాజ్యంలో ఉండేవి. సపాదలక్ష అంటే లక్షా పాతిక వేల గ్రామాలున్న దేశమని అర్థం. దీనికే ‘పోలవస’ అనే మరో పేరూ ఉండేది. రాష్ట్రకూటులకు సామంతులైన వేములవాడ చాళుక్యులు తెలంగాణలోని ప్రాంతాలను పరిపాలించేవారు. వీరి పాలనలోనే ప్రస్తుత కోట్లనర్సింహులపల్లి.. జైన, వైష్ణవ ఆలయాలు, కోటలతో అలరారింది. దీనికి నందికొండ అనే పేరు కూడా ఉంది. కొండపై లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అప్పట్లోనే నిర్మితమైంది. ఆలయం పైనున్న శిలపై ఎనిమిది తలలు, 16 చేతులతో చెక్కిన ఉగ్రనర్సింహుడి ప్రతిమ.. ఒక అద్భుత కళాఖండం. ప్రస్తుతం ఉగ్రనర్సింహుడి 8 తలల్లో కుడివైపునున్న మూడు తలలే కనిపిస్తున్నాయి. మిగిలి ఉన్న రూపురేఖలనైనా అపురూపంగా చూసుకోవాలంటూ భారత పురావస్తు సర్వేక్షణ(ఏఎస్‌ఐ) శాఖ ఇటీవల తేల్చింది. ఇటువంటి ఉగ్రనర్సింహుడే ఎల్లోరాలోని 15వ గుహలోనూ ఉన్నట్లు వెల్లడించింది. ఆలయం 150 ఏళ్ల క్రితం వరకు దట్టమైన అడవిలో ఉండేది. 1860లో రామడుగుకు చెందిన కల్వకోట కృష్ణయ్య దేశపాండే దీన్ని కనుగొన్న తర్వాతే ప్రజలకు తెలిసి దేవుని కొండగా ప్రచారంలోకి వచ్చింది.

జంతుజాలమే కారణం

దేవుని కొండ శిఖరంపై గల కోట వైపు ఎవరూ వెళ్లకపోవడానికి అక్కడనున్న జంతుజాలం కూడా కారణం. చుట్టుపక్కల కొండలన్నింటినీ గ్రానైట్‌ కోసం నామరూపాల్లేకుండా కొట్టిపారేయడంతో అక్కడ నివసించిన ఎలుగుబంట్లు, పాములు, కొండచిలువలు, ముళ్ల పందులు, కోతులు, కొండెంగలు, నెమళ్లు తదితరాలన్నీ దేవుని కొండపైకి చేరాయని గ్రామస్థులు చెబుతున్నారు. సమీప చిప్పకుర్తిలో ఇటీవల గొర్రెలను హతమార్చింది చిరుతపులేనని, అది ఈ కొండపై నుంచే వచ్చిందని చెబుతున్నారు. గతంలో ఇక్కడ విస్తారంగా వర్షాలు పడేవని, గుట్టలను పిండి చేసిన తర్వాత కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలు గ్రామాల వారు వాపోతున్నారు.

రెండు రోజుల్లోనే సర్వే పూర్తి

విలువైన గ్రానైట్‌తోగల దేవుని కొండను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించి కోర్టు జోక్యంతో వెనకడుగు వేసిన గుత్తేదార్లు.. మళ్లీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు కోర్టుల ప్రశ్నించిన అంశాలు పునరావృతం కాకుండా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. గుడిని విడిచిపెట్టి 46 ఎకరాల్లోని కొండను ముక్కలు చేసుకొంటామని గుత్తేదార్లు అడగడమే తరవాయి.. గనుల శాఖ సంచాలకుడి నుంచి జనవరి 3న ఒక లేఖ కరీంనగర్‌లోని ఆ శాఖ సహాయ సంచాలకుడికి చేరింది. ఆయన రెండ్రోజుల్లోనే సర్వే పూర్తి చేసి నివేదికను పంపించారు. ఆలయానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్నందున కొండను గ్రానైట్‌ కోసం ఇచ్చేయవచ్చంటూ సర్కారుకు దస్త్రం వెళ్లినట్లు తెలిసింది.

కొండ బద్దలైతే?

దేవుని కొండ ధ్వంసమైతే శతాబ్దాల చరిత్ర తాలూకు ఆనవాళ్లు, ఇంకా శోధించాల్సిన అంశాలు కాలగర్భంలో కలిసిపోతాయి. అక్కడి జంతుజాలం సమీప గ్రామాల్లోకి చొచ్చుకొస్తాయి. కొండను పేల్చేటప్పుడు ఆ ధాటికి గ్రామంలోని ఇళ్లకు, గుడికీ నష్టం కలుగుతుంది. కొండపై చెక్కిన ఉగ్రనర్సింహుడి ప్రస్తుత రూపురేఖలు కూడా అంతర్ధానమైపోయే ప్రమాదం ఉంది. ఆలయం జోలికి రాకుండానే కొండను బద్దలు చేస్తామనే గుత్తేదార్ల వాదనలు నమ్మశక్యం కానివనడానికి వెదిరలోని మల్లన్నగుట్టే నిదర్శనం. అక్కడ కొండకు ఒకవైపు ఆలయం ఉండగా వెనకవైపు నుంచి కొండమొత్తాన్ని తొలచివేస్తున్న తీరు చూస్తే విధ్వంసం ఎలా ఉంటుందో తేటతెల్లమవుతుంది. మల్లన్న ఆలయంలోని శాసనం కనిపించకుండా పైన సున్నం ఎందుకు పూశారో కూడా పరిశీలించాల్సి ఉంది. మల్లన్న కొండవద్ద ఇలా గ్రానైట్‌ రాళ్లను తొలిచే సమయంలో వెలువడే ముక్కలన్నింటినీ పక్కనే ఉన్న చెరువు వద్ద పోస్తుండడంతో అక్కడిప్పుడు కొత్త కొండ తయారైంది.

కొండా లేదు.. దేవుని పాదాలూ లేవు

గంగాధర మండలంలోని బుత్కారులో ఇటీవల వరకు ‘దేవుని పాదాలు’ గల గుట్ట.. పాదాలతో సహా కనుమరుగైపోయింది. వెదిరలోని నెమళ్ల గుహలు ఎలుగుబంట్లకు ఆవాసంగా ఉండేవి. జగిత్యాల జిల్లా వెల్గుటూరులో బుగ్గిరాజశ్వేర స్వామి గుహల వద్ద పేలుళ్ల వల్ల అక్కడి విలువైన సంపద నాశనమైపోతోంది. ప్రభుత్వం అనుమతులిస్తే నర్సింహులపల్లిలోని కొండ కూడా వీటి సరసన చేరడం ఖాయం.

బొమ్మల గుట్టను కాపాడగలిగారు

గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలగుట్ట.. ఒకప్పుడు జైనులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. అక్కడి కొండపై జైన యక్షిణి, వృషభనాథుడు, వర్ధమానవీరుడు తదితరుల విగ్రహాలున్నాయి. కొంతకాలం క్రితం ఆ కొండను కూడా పేల్చివేసే ప్రయత్నాలు జరగ్గా దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఉద్యమించారు. దీంతో సర్కారు వెనక్కి తగ్గి దాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తున్నట్లు ప్రకటించి కొన్ని మెట్లను కట్టి వదిలేసింది.

150మీటర్ల ఎత్తులో కోట ఆనవాళ్లు

ఆలయానికి కొంత దూరంలో 150 మీటర్ల ఎత్తులో గల కొండపై కోట, మరికొన్ని ఇతర ఆనవాళ్లు ఉన్నాయి. కొండపైన మెట్లతో కూడిన సన్నటి నేలమాళిగ ఉంది. కొండ దిగువన దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణం చుట్టూ ఎత్తయిన మట్టిగోడ ఉండేది. ఇప్పటికీ కొన్ని చోట్ల నాటి భారీ గోడ, కందకం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గ్రామంలో ‘సవతి నూతులు’ అనే రెండు గుండాలు పక్కపక్కనే ఉన్నాయి. ఒక దాంట్లో ఉప్పునీరు, మరో దాంట్లో తియ్యటి నీళ్లు ఉండేవని గ్రామస్థులు చెప్పారు.

గర్భగుడి నుంచి రహస్య మార్గం!

లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా 16 స్తంభాల మండపం, కొండపై రామాలయం, విశ్వనాథ ఆలయం ఉన్నాయి. నర్సింహుడి ఆలయ గర్భగుడి నుంచి కోనేరు వైపునకు ఒక సొరంగ మార్గం ఉంది. స్వామివారు రాత్రివేళ స్నానం చేయడానికి ఆ మార్గంలో వెళతారనేది భక్తుల నమ్మకం. కోనేరు దిగువ భాగంలో గుల్లగా ఉంటుందని, అక్కడ ఏదైనా మండపం ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

కొండను వారసత్వ సంపదగా ప్రకటించాలి

దేవుని కొండకు చెందిన 79 ఎకరాలనూ ప్రభుత్వం వారసత్వ సంపదగా ప్రకటించి అక్కడి ఆలయాలు, కోట, ఇతర చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి. రాష్ట్ర, కేంద్ర పురావస్తు శాఖల నిపుణులు విస్తృత పరిశోధనలు నిర్వహించాలి. కొండను గ్రానైట్‌ కోసం లీజుకివ్వాలనే గనుల శాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి.

– కల్వకోట కీర్తికుమార్‌, అనువంశిక ధర్మకర్త, లక్ష్మీనర్సింహస్వామి ఆలయం

ఇక్కడ ఉండడం మా అదృష్టం..

కోట్లనర్సింహులపల్లిలో ఎక్కడ చూసినా చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇంతటి గొప్ప ప్రాంతం కావడంతోనే ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన తర్వాత కరీంనగర్‌లో కాకుండా మా వూరిలోనే ఉంటూ ఎంతో తన్మయత్వం చెందుతున్నా. కొండను బద్దలు చేస్తే దానిపై నివాసం ఉంటున్న జంతువులన్నీ గ్రామంలోకి వచ్చే ప్రమాదం ఉంది.

-సిహెచ్‌.రమణాచారి, కోట్లనర్సింహులపల్లి

పార్శ్వనాథుడు బయటపడిన తీరు అద్భుతం..

పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా నాగలి కొక్కానికి తగిలి ఒక రాయి బయటకొచ్చింది. ట్రాక్టర్‌ను ఆపి చూస్తే అదో విగ్రహం. శాతాబ్దాల నాటి పార్శ్వనాథుడి విగ్రహమని తేలిన తర్వాత మరింత ఆశ్చర్యానికి లోనయ్యా. గ్రామస్థుల సహకారంతో విగ్రహాన్ని గ్రామకూడలిలో నెలకొల్పి చరిత్రను మరింత మందికి తెలిపేలా ప్రయత్నిస్తా.

– ఒగ్గు ఆంజనేయులు, రైతు, కోట్లనర్సింహులపల్లి

నాగలి తగిలి బయటపడిన పార్శ్వనాథుడు

కొండ దిగువన ఎక్కడ చూసినా చారిత్రక సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. రైతు ఒగ్గు ఆంజనేయులు తన పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా జైన విగ్రహం బయటపడింది. అది 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడిదిగా తేల్చారు. రాష్ట్రకూటులు తొలుత జైన మతాన్ని ప్రోత్సహించారు. వారికి సామంతులైన వేములవాడ చాళుక్యులు కూడా అప్పట్లో అనేక హిందూ ఆలయాలు, జైన బసదులు నిర్మించారు. నర్సింహులపల్లిలో ఎక్కడ తవ్వినా ఏదో ఒక చిన్న విగ్రహం లేదా రాతి పాత్రలు లభిస్తుంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. నాటి కత్తులు, బాకులు తదితర ఆయుధాలూ బయటపడుతున్నాయి. వాటిని స్థానిక బీరయ్య గుడిలో ఉంచి పూజించడం సంప్రదాయంగా మారింది.

(ఈనాడు సౌజన్యం తో)